మంచి మాట

నారాయణ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ ప్రపంచలోకి వచ్చేటప్పుడు ఏ జీవి కూడా తన వెంట ఏదీ తీసుకురాలేదు, అదే విధంగా వెళ్లేటప్పుడు కూడా ఏదీ తీసుకువెళ్లలేదు’ ఇది జీవిత సత్యం. లలాట లిఖితం అనేది అవతార మూర్తులైన శ్రీరామచంద్రుడికి, శ్రీకృష్ణపరమాత్మకు కూడా సమానంగా ఉంటుంది. ఆ బ్రహ్మలిఖించిన కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరనేది వాస్తవం. పరమశివుడైనా, మహావిష్ణువైనా, ఆఖరికి చతుర్ముఖ బ్రహ్మ అయనా సరే కర్మను అనుభవించాల్సిందే. అందుకే పంచముఖాలున్న బ్రహ్మ పరమశివుని ఆగ్రహానికి గురై చతుర్ముఖుడైనాడు. జనం మెచ్చిన జన మనోభిరాముడు అయన దశరథపుత్రుడైనా కారడవుల పాలైనాడు. సీతావియోగంతో అత్యంత దుఃఖార్తిని పొందాడు. కృష్ణుడు తన తల్లిదండ్రులను పుట్టగానే వదలి యశోదమ్మ ఒడిని చేరాడు. రాక్షసుల వల్ల ఎన్నో బాధలనుభవించాడు. భగవంతుడి ప్రతి నిర్ణయం వెనుకఒక పరమార్థం దాగి ఉంటుంది. సాక్షాత్తూ అవతార మూర్తులకే కర్మ ప్రారబ్దం తప్పనప్పుడు మానవమాత్రులమైన మనమెంత? కనుక పూర్వజన్మలోచేసిన పురాకృత పాపమో పుణ్యమో దానివలనే నేడు కష్టసుఖాలు ప్రాప్తవౌతున్నాయని అనుకోవాలి. అంతేకాని సుఖం వచ్చినపుడు పొంగిపోయ దుఃఖం వచ్చినపుడు కృంగిపోయ దీనికి కారణం మరొకరు అని నిర్ణయం చేసుకొని వారి మీద శృతిమించిన అనురాగమో, లేక ద్వేషమో పెంచుకుంటే మానవ జన్మఎత్తి కూడా వ్యర్థమవుతుంది.
భరతుడు ప్రాపంచిక వ్యవహారాలకు దూరంగా ఉండి కూడా ఒక జింకపై ప్రేమను పెంచుకుని దానివలన మరలా జన్మనెత్తాడు. విభాండక మహర్షి కుమారుడై అసలు జీవన వ్యాపారమే తెలియని మహర్షి జీవితాన్ని ప్రారంభంనుండి అనుభవిస్తూ కూడా గణికలు చూపించిన సుఖాలకు లాలసపడి శాంతకు జీవన సహచరి అయ్యాడు.
దేనిపైనా ప్రేమనో ద్వేషాన్నో పెంచుకోకూడదు. తామరాకు పై నీటి బొట్టులాగా జీవితం గడపాలి. భీష్ముని లాగా అపారవిద్యావైదుష్యాలు, పరాక్రమం ఉండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఏది చేస్తామనిఅనుకొంటామో దాన్ని మాత్రమే చేసి అది కూడా దైవ ప్రేరితం వల్ల చేస్తున్నామనే బుద్ధితో చేస్తే అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కనుక పనులు చేస్తే ఈ జనన మరణ చక్రం నుంచి విడవడవచ్చు. ఈజననమరణ చక్రం నుంచి తప్పించుకోవడానికి ముక్కుమూసుకుని చేసుకొనే తపస్సు మంచి మార్గమే కాని ఋషులు తపస్సుచేస్తూ ఋషి జీవనం గడుపుతూ కూడా మానవకల్యాణకారకమైన పనులు చేస్తుం డేవారు. నరుల్లో నారాయణుని గమనించి నారాయణ సేవ చేయమని ప్రబోధిస్తుంది భారతీయం. జనులకు సేవచేస్తూ జీవితాన్ని గడపడమే జనార్దుని సేవఅని అది జీవిత పరమార్థం అని వేదం చెబుతుంది.
సత్యం బృహదృత్‌ముగ్రం దీక్షా తపో బ్రహ్మ యజ్ఞః పృథివీం ధారయంతి
సానోభూతస్య భవ్యస్యపత్న్యురుం లోకం పృథివీ నంకృణోతు
పై పృథివీ సూక్తంవల్ల సత్యం, ఋతము, శౌర్యం, కార్యదీక్ష, తపస్సు, జ్ఞానం, యజ్ఞం అనే సప్త గుణములు భూమిని యధాతథంగా నిలుపుతున్నవి అని తెలుస్తుంది. మనో సంకల్పం ఋతం. మానవ సంకల్పం ఎప్పుడూ శౌర్యం, కార్యదీక్షతోకూడుకుని ఉండి తపస్సు మరియు యజ్ఞం ద్వారా జ్ఞానాన్ని ప్రోది చేసుకుని సత్యాన్ని శోధించి ప్రకృతితో సహవాసం చేస్తూ పది కాలాలు పృథివిని కాపాడుకోవాలని పృథివీ సూక్తం విశదపరుస్తోంది.
ఇక్కడ భువిని రక్షించమంటే కేవలం రసాయనాలు వ్యర్థాలతో సారహీనం కాకుండా భూమిని రక్షించడమే కాదు భూమిపై జీవిస్తున్న సర్వ ప్రాణికోటికి సహాయమందించాలి. సర్వ ప్రాణులకు ఉండే జీవించడమనే ప్రాధమిక హక్కుకు విఘాతం కల్గించకూడదు. చెట్టు చేమ, పురుగు పుట్రా ఏదైనా సరే దాని భూమికలో అది జీవించడానికి ఆటంకము కల్గించకూడదు. దేశమంటే మనుషులోయ్ అన్న మాటలోని నిజాన్ని గుర్తెరగాలి. అధర్వణ వేదాంతర్గతమైన ముండకోపనిషత్తులోని మంత్రంచెప్పినట్లుగా సృష్టిలోని ప్రతి వస్తువు, అవస్తువు సైతం భగవంతుడే. ఈ ఋతాన్ని గుర్తించి నదీ జలాలను, పచ్చని అడవులను, జంతు జాలాన్ని తనకు ఛేతనైనంత వరకు కాపాడాలి. ఇది ఏదో చేస్తున్నామని కాక తన కర్తవ్యంగా భావించి చేస్తే అదే భగవంతునిపూజగా గుర్తించబడుతుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ వనరులను మితంగా మరియు అర్ధవంతంగా వినియోగిస్తూ భావి తరాలకు పృథివిని పదిలంగా అందించడం మనందరి కర్తవ్యం. ఈకర్తవ్యనిర్వహణలో స్వార్థాన్ని ఇంచుక కూడా చూపించకుండా సర్వజనావళి కల్యాణానికే దోహదపడడమే నారయణుని సేవ.

- ఎస్. నాగలక్ష్మి