మంచి మాట

ప్రేమాంకురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ రెండు అక్షరాలే. కాని అప్పుడే పుట్టిన శిశువుల నుంచి చనిపోబోతున్న వారి దాకా కావాలనుకొనే బలవర్థకమైన పానీయం అది. కళ్లకు కనిపించదు. చేతులకు అందదు. మనసుకు మాత్రమే కనబడుతుంది. మనిషినే కట్టిపడేస్తుంది. అటువంటి ప్రేమ ఒక భావన అనుకొందాం.
ఈ భావన కలిగిన వారిలోను, కలిగించినవారిలోను కలిగే స్పందనలు అనేక రోగాలను సైతం దూరం చేస్తాయని శాస్ర్తియంగా చెబుతున్నారు.
ప్రేమ ఎంత మంచి దివ్యౌషధమో భగవాన్ పుటపర్తి సాయిబాబా చెబుతారు. ప్రేమలేనిదే మనిషే లేడు అనుభవజ్ఞులు అంటారు. ప్రేమ పరాకాష్ఠకు చెందితే అదే భక్తి అన్నాడు నారదుడు.
ప్రేమ భావనలో జయాపజయాలు ఉండవు. గెలుపుఓటముల ప్రసక్తే ఉండదు. రాజ్యవిస్తరణనే కాని దండయాత్రల భయమేదీ ఉండదు. నిశ్చలంగా, నిర్భయంగా, రారాజుకు మల్లె ఎక్కడైనా తిరగవచ్చు. ఈ సామ్రాజ్యంలో ఎవరికీ షరత్తులు, నియమాలు, నిబంధనలు ఉండవు. కాకపోతే ఆ ప్రేమమూర్తులు పారదర్శకత్వాన్ని చూపగలగాలి. నిజాయతీ ఉండగలగాలి. నిర్మలమనస్సును కలిగిఉండాలి.
భగవంతుణ్ణి తమ ప్రేమ సామ్రాజ్యంలోకి ఆహ్వానించినవారికి దివిభువులను ఒక్కటి చేసే శక్తివస్తుంది. భూతలానే్న స్వర్గ్ధామంగా చేయగల నేర్పరులు అవుతారు. అమరావతిలోను మణిమండలంలోను ఉండాలనుకున్న దేవతలు సైతం ఈ ప్రేమరాజ్యంలోకే వస్తామంటారు.
అట్లాంటి ప్రేమ యువతీయువకుల మధ్య ఆకర్షణతోను, ఆత్మీయతతోను అంకురిస్తే నిజాయితీ, నిబద్ధత, నిర్మలం లాంటి గుణాలను పొదువుకుంటే ఆ వారిద్దరూ గృహస్థాశ్రమానికి సారథులు అవుతారు. వారి జీవనసౌందర్యవనంలో పూచిన పూవులు భావి జాతికి ప్రగతి పథాలుగా మారుతాయి.
ఆ ప్రేమనే కనిపెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రులపై పెరిగితే ఆత్మీయతానురాగాల వెల్లువై ప్రవహిస్తుంది. తల్లిదండ్రులను మించిన దైవం లేడన్న నిజానికి రూపు కట్టి చూపుతుంది.
అన్నదమ్ముల అక్కచెళ్లెల మధ్య ఏర్పడిన ప్రేమాంకురం తోబుట్టువుల నందనవనంలో నూరువరహాల పూవై పూచి సౌభ్రాతృత్వానికి ఆకారాన్ని ఏర్పరుస్తుంది.
ఏ వయస్సు వారి మధ్యనైనా స్నేహపరిమళాలను వెదజల్లగలిగే స్నేహమనే ప్రేమ వసుధైక కుటుంబానికి నిలువెత్తు సాక్షీభూతంగా నిలుస్తుంది. ముల్లోకాలను ముంగిట నిలబడెతుంది. యముడైనా సరే ప్రేమకు బందీ కావాల్సిందే. యమసదనమైనా ప్రేమవదనంతో మసలాల్సిందే.
అటువంటి ప్రేమ నిత్యనూతనమై జీవనోత్సాహాన్ని ప్రతివారిలో కలిగిస్తుంది. అందుకే ప్రేమను పంచాలి. ప్రేమను ఆస్వాదించాలి. ప్రేమను నారునీరై పెంచాలి.
ఈ ప్రేమలోను కల్తీలు జరుగుతుంటాయి. ప్రేమాంకురాల్లో కలుపుచేరుతుంది. ఆ కలుపు చేరినపుడు అవాంఛనీయమైన ప్రేమలు అంకురిస్తాయి. అవే అనేక అనర్థాలు కలుగచేస్తాయి. కొన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి.
అనుభూతుల భాండాగారానికి అధిపతి యైన ప్రేమను ఎప్పటికప్పుడు నిర్మలమనే క్రిమి సంహారిణిని చల్లి జాగ్రత్త చేసుకోవాలి. చీడపీడల బారిన పడి కలుపుమొక్కలు పెరగకుండా చూడాలి. అపుడు మానవత్వానికి మచ్చుతునకల్లాంటి మనుష్యులు తయారు కావడానికి ప్రేమబీజాలకు కొదువ వుండదు. దానికి కేవలం ఆత్మీయతనే మడిలో ప్రేమబీజాలు చల్లాలి. అనురాగమనే దడి కట్టాలి. విశాల దృక్పథం అనే కంచెను ఏర్పాటు చేయాలి. ఆ చేను నుంచి ఇక ప్రేమపంట రాబడి ఇబ్బడి ముబ్బడియే.
ఆ కొత్త చేనిచ్చిన చేవతో సరికొత్త జీవితానికి నాందీ వాచకం పలకవచ్చు. మనిషికే సాధ్యమైన అనుభూతులను మూగజీవాలనుంచి కూడా రాబట్టుకోవచ్చు. ప్రకృతిని పరిమళింపచేసుకోవచ్చు. ప్రకృతిలోని వస్తువులనైనా అవస్తువులనైనా ప్రేమ అనే దివిటీనుంచి చూస్తే చాలు వాటిలో నూతనోత్సాహం పుట్టుకొస్తుంది. అందుకే భారతీయం చెట్టు పుట్టా , రాయ రప్పా దేనినైనా భగవంతుడే అన్నది. మొదట భయంతో భక్తి తో మొదలైనా రాను రాను అది ప్రేమగా మారి భగవంతుని ప్రేమాంబుధిలో మునకలు వేసి మానవత్వపు పరీమళాలను వెదజల్లుతుంది.

- గున్న కృష్ణమూర్తి