మంచి మాట

వేదవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సనాతన వాఙ్మయం అత్యంత మహిమాన్వితమైనది, సుందరమైనది. మానవులకు యుగయుగాలుగా సత్యయుతమైన అనుసరణ పథం ఏర్పచినది. ప్రారబ్థ, సంచిత, ఆగామిల ద్వారా వారి వారి కర్మలననుసరించి అనేక జన్మలను పొందుట తప్పదు.
పరంధాముని కృపవలన వైరాగ్యము ప్రాప్తించి బవబంధములను ఎవ్వరు త్యజింతురో ఆ జీవికి పునర్జన్మ ఉండదని మన సనాతనం తెలియజేస్తోంది. విష్ణువు యొక్క చిద్విలాస నాటకంలో అనేక పాత్రలు తమ యొక్క భక్తితత్త్వముతో మనకు మోక్షమార్గమును దృశ్యమానము చేయుచున్నవి. అదియేగాక మనకు మనోరంజకమును కలుగజేయుచున్నవి. అటువంటి సత్యయుగము నాటి పాత్రయే వేదవతి.
కుశధ్వజుడను చక్రవర్తి సాక్షాత్తు శక్తిస్వరూపిణి అయిన మహాలక్ష్మిని గూర్చి తపమాచరించి, తన భార్యయగు మాళావతి యందు లక్ష్మి అంశతో ఒక పుత్రికను పొందియున్నాడు. ఆమె జన్మించిన వెంటనే వేదమంత్రములను ఉచ్ఛరించినది. అందువలన ఆమెకు వేదవతి అను నామమును సార్థకమొనరించిరి.
వేదవతి ఒక మన్వంతరకాలము పుష్కర క్షేత్రమున తపమాచరించినది. తదుపరి గంధమాదన పర్వతమున కూడా కఠినమైన తపస్సు చేసినది. సత్యదర్శనము కొరకై తపమాచరించుచున్న వేదవతిని అదే సమయములో అచట సంచరించుచున్న రావణుడు చూచుట సంభవించినది. అత్యంత సుందరముగా ప్రకాశించుచున్న వేదవతిని పర స్ర్తి వ్యామోహితుడైన రావణుడు చెరబట్ట ప్రయత్నించెను.
పరమ సాధ్వియైన వేదవతి తన తపోబలం చేత రావణుని కాళ్ళు, చేతులు బంధించినది. అపుడు రావణుడు అశక్తుడై వేదవతిని మనసులో శక్తిరూపిణిగా స్తుతించినాడు. అంత ఆమె కరుణించి అతనిని బంధ విముక్తిని చేసి, తపములోనున్న తనను కామభావనతో స్పృశించినందున నావలన సమస్త బంధువర్గ సహితముగా నాశనమగుదువని శపించినది. వెనువెంటనే యోగాగ్నిలో ఆమె అంతమైనది. రావణుడు అత్యంత దుఃఖితుడై అచటనుండి నిష్క్రమించెను.
ఆ వేదవతియే తదుపరి జన్మలో జనకుని ఇంట సీతగాప్రత్యక్షమయినది. గత జన్మలో చేసిన తపమునకు ఫలముగా సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడే భర్తగా లభించినాడు. భగవంతుడైన శ్రీరామచంద్రునితో కూడి సమస్త మానవాళికి అన్యోన్య దాంపత్య రూపమును సాక్షాత్కరింపజేసినది. అత్యంత సుందరుడైన భర్త పొందు అనుభవించినది.
పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు వనవాసమునకు వెళ్లినపుడు సీతాపహరణ సమయము ఆసన్నమయినది. అపుడు సత్యవ్రతుడైన అగ్ని ప్రత్యక్షమై జగన్మాత సీతాదేవిని నాయందు నిక్షిప్తపరచమని కోరినాడు. సమస్త దేవగణము నన్నీ కార్యమునకు పంపినారని తెలిపినాడు.
కావున సీత బదులుగా ఛాయా సీతను స్వీకరించమని కోరగా, అత్యంత వియోగబాధతో శ్రీరామచంద్రుడు సీతను అగ్నియందుంచి ఛాయాసీతను స్వీకరించినాడు. ఈ రహస్యము సీతారాములకు తప్ప ఎవరికి తెలియదు. తదుపరి వరగర్వితుడు, స్ర్తిలోలుడైన రావణుడు ఛాయాసీతను అపహరించెను. వేదవతి శాపము మరియు శ్రీరాముని ధర్మస్థాపనా కర్తవ్యమువలన భయంకరమైన సంగ్రామములో రావణ సంహారం జరిగినది.
అశోక వనమునుండి ఛాయా సీతకు విముక్తి కలిగించిన శ్రీరామచంద్రుడు అగ్నిపరీక్షలో నిజమైన జనకపుత్రి, అయోనిజయైన సీతను అగ్నినుండి తిరిగి గైకొనెను. తిరిగి ఛాయాసీత అగ్నిలో ప్రవేశించి శ్రీరాముని ఆజ్ఞతో పుష్కర క్షేత్రమున తపమాచరించి ద్రుపదుని ఇంట యజ్ఞ వేదికలో ద్రౌపదిగా అవతరించినది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్టమ్రులో పుష్కర క్షేత్రమును దర్శించవచ్చును.
అందుకే మన పెద్దలు మంచి కర్మలు చేయమని చెబుతుంటారు. ఎంత సంపాదించినా ధనం మనం వెంటరాదు. కేవలం మంచిచెడు కర్మల తాలూకూ ఫలితాలు సంచయాలై జన్మజన్మలకు కూడా వస్తుంటాయ. ఆ జన్మల కర్మతాలూకూ ఫలితాలు పూర్తి గా వ్యయమయ్యేవరకు ఆ ఫలితం అనుభవించడానికి అవసరమైన దేహం గల జన్మలు వస్తునే ఉంటాయ. కనుక ఎవరైనా మంచి చేస్తే మంచి జన్మ కలుగుతుందనడంలోని అంతరార్థం. ఈ దేహాదులను వదిలి నిత్యమూ సత్యమూ అయన జగన్నాథుని చరణాలు కావాలంటే పుణ్యపాపఫలితాలు ఆశించవద్దు.

వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు