మంచి మాట

బతుకమ్మ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరన్నవరాత్రులలో ఆరాధించే శక్తిస్వరూపిణినే తెలంగాణలో బతుకమ్మగా భావించి పూలతో అలంకరించి పూజిస్తారు. ఈ పండుగ ప్రారంభం బొడ్డెమ్మను అలంకరించడంతో మొదలై ఆశ్వీజమాసం తొమ్మిదినాళ్లు సాగుతుంది. బొడ్డమ్మ బొడ్డమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో అంటూ స్ర్తిలందరూ పాటఅందుకోవడమే బతుకమ్మను ఆహ్వానించడం- అలా పూజించడం ప్రారంభమవుతుంది.
ప్రకృతి పరవశించి అరవిరిసిన రంగురంగుపూలను తీసుకొచ్చి అందంగా అమర్చి దానిపై పసుపుగౌరమ్మను తీర్చిడమే బతుకమ్మ అలంకరణ. సాధారణంగా వెదురుతో అల్లిన అల్లికపైన గుమ్మడి ఆకులను పరుస్తారు. దానిపై గునుగు, గుమ్మడి, తంగేడు, రుద్రాక్ష, బీర, గనే్నరు , బంతి, గోరింట , సొర ఇలాంటి పూవులన్నిటిని అందంగా ఒక వరుసపై మరొక వరుసగా పేరుస్తారు. అలా పేర్చిన పైభాగంలో పసుపు గౌరమ్మను ఉంచి అలంకరణ పూర్తిఅయిన తర్వాత దీపం వెలిగించి అగరుధూపం అమ్మకు సమర్పించి వివిధ రకాల నైవేద్యాలను అమ్మకు సమర్పించి, తమ బతుకులను చల్లగా చూడమని కోరుకుంటూ నాలుగురోడ్ల కూడలిలోనూ, లేక మైదానం వంటి ప్రాంగణాలలోను ఆ వాడ పడుచులందరూ సామూహికంగా చేరి అందరు పేర్చిన పూలమ్మలను ఒకచోట గుంపుగా పెట్టి అందరూ వలయకారంలో నిలబడి చేతులు తడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు.
బతుకునిచ్చే స్ర్తి స్వరూపిణి ని బతుకమ్మగా కొలిచేఈ బొడ్డమ్మనే ‘బొట్టె’ , ‘బొడిపె’ ‘పొట్టి’ అనే పేర్లతో కూడా అక్కడక్కడా పిలుస్తారు. ఈబొడ్డ అనే పదానికి మేడి చెట్టు , ఉదంబర చెట్టు అని అర్థమూ కూడా ఉంది. ఉదంబర వృక్షాన్ని వివాహం అయిన వారు సంతానం కలగాలని పూజిస్తారు. కన్యపిల్లలు తమకు మంచి భర్త లభించాలని అర్చిస్తారు. ఈ పూజనే బొడ్డమ్మగా రూపాంతరం చెందిందని అంటారు.
పుట్టమన్నుబొడ్డెమ్మ, బావి బొడ్డమ్మ ,పీటబొడ్డమ్మ, గుంటల బొడ్డమ్మ అని వివిధ ప్రాంతాల ప్రజలు వివిధరకాలుగా బతుకమ్మను పూజించడం కనిపిస్తుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఈ పండుగను జరిపినా అందరూ కలసి సర్వసృష్టి కర్తయైన ఆదిపరాశక్తిని పూజించడమే అంతరార్థంగా కనిపిస్తుంది. పరతత్వాన్ని పూలరూపంలో పూజించడం సగుణోపాసనగా పండితులు భావిస్తారు. అట్లానే బతుకమ్మ ఆరాధనలో విభిన్న కథనాలున్నాయ. అవి లక్ష్మీ పార్వతుల సమ్మేళన రూపమే గౌరమ్మగా కొందరు భావిస్తారు. మరికొందరు చోళ రాజైన ధర్మాంగుడికి పుత్రులు నశించినా ఆ తల్లి దయవల్లనే తిరిగి పుత్రిక పుట్టిందని తల్లి దయవలన పుట్టిన ఆ పాప పదికాలాలపాటు చల్లగా ఉండాలన్న కోరికతో అమ్మపేరిటనే బతుకమ్మ అని పెట్టుకున్నారని అంటారు
‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్వ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే’’ కనిపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీ కూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణశక్తి నుండే వచ్చింది. కనుక సర్వానికి అధికారిణి యైన అమ్మను పూలతో పూజించినా నివేదనలు సమర్పించి సేవించినా భావం మాత్రం ఒక్కటే అమ్మా మమ్ము నిరంతరం నీవే కాపాడు. విచక్షణ గల మానవులుగాజన్మనిచ్చిన నీవు మాకు తోడు నీడై మాచేత కేవలం ధర్మాచరణనే చేయంచు. మాలో సత్వగుణాన్ని మాత్రమే రగుల్కొపు. మేము సత్యానే్న ధారణ చేసేటట్టు చేయ అని వేడుకుంటారు. ఇదే అందరూ కోరుకుంటారు. అందుకే పరతత్వాన్ని అమ్మఅని పూజించినా అయ్య అని స్తుతించినా రూపం, నామం లేని పరతత్వం తన సృష్టిని తానే కాపాడుకుంటుంది.
సర్వవాప్యకమైన ఆదిపరాశక్తిని కొలుస్తూ చేసే బతుకమ్మ పండుగలో జానపదులు అత్తాకోడళ్లు, వదినామరదళ్లు, మామఅల్లుళ్లు, బావా మరదులు ఇలా వీళ్ల మధ్య ఉన్న సంబంధాలు, అనుబంధాలు, మనస్తత్వాలు, మమతల మధ్య దాగి ఉన్న సున్నితత్వాలను పాటలరూపంలో బయల్పరుస్తారు. ప్రతివారికి వారి వారి సామాజిక బాధ్యత ను గుర్తుచేస్తారు. సమాజానికి మేలు చేసిన వారిని స్మరిస్తారు. మానవుల్లో అణగారిపోతున్న మానవత్వాన్ని తట్టిలేపుతారు.
ఐక్యమత్యం, సమైక్యభావానికి, వసుధైక కుటుంబానికి ఊతమిచ్చే ఈ బతుకమ్మ పండుగ ధర్మబద్ధ జీవితానికి చిహ్నంగా నిలుస్తుంది. కనుక అందరూ ఈ పండుగను చేసుకోవాలి. ఆనందాన్ని ఆహ్వానించాలి.

- సి. విజయలక్ష్మి