మంచి మాట

అట్లతద్ది పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్ల తద్ది అంటే ఇట్లని చెప్పలేనంత సందడి. తూరుపు తెల తెలవారకముందే కనె్న పిల్లలు, కొత్త పెళ్లి కూతుళ్ల కాళ్లు పారాణితోను, గోరింటాకుతోను, నోరు తాంబూలం తోను, చెంపలు సిగ్గుతోనూ ఎర్రగా పండే పండుగ అట్టతద్దె.
కొత్త పరికిణీ, వోణీ, మువ్వల పట్టాలు ధరించి ‘అట్ల తద్దోయ్...ఆరట్లోయ్..ముద్ద పప్పోయ్..మూడట్లోయ్’ అంటూ ఆటపాటలతో ఆడపిల్లలు ఊరంతా సందడి చేస్తారు. చెట్లకు వూయలలు వేసి వూగుతూ తుళ్లింతలతో, కవ్వింతలతో పండగ వాతావరణానికి ఆహ్వానం పలుకుతుంటారు. ఇదే అశ్వయుజ బహుళ తదియ రోజున మహిళలంతా జరుపుకునే సంప్రదాయమైన పండుగ.
తదియనుంచి వచ్చిందే తద్ది. ముందురోజు మహిళలు తమ పెరట్లోంచో, ఇంటి పొరుగు ఇళ్లనుంచో గోరింటాకు తెంచుకుని మెత్తగా నూరి, అరచేతులకు, పాదాలకు అందంగా అలంకరించుకుంటారు. కనె్న పిల్లలైతే పండిన గోరింటాకుకూ-పండంటి మొగుడికీ ముడిపెట్టి మధురమైన ఊహలు అల్లేసుకుంటూ ప్రియ నేస్తాలతో ముసిముసి నవ్వులు, గుస గుస కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోతుంటారు. తెల్లవారే అట్లతద్ది...ఆడపిల్లలు తలారా స్నానం చేసి అందంగా ముస్తాబై గోంగూర పచ్చడీ, నువ్వుల పొడి గడ్డపెరుగు మొదలైన వంటకాలతో కడుపునిండా భోజనం చేసి తాంబూలంతో నోరు పండించుకుంటారు.
పొలంలోనో, పెరట్లోనో,గుడిదగ్గర్లో చెరువు వద్ద వుండే చెట్లకు ఉయ్యాలలు వేసుకుని ఊగుతుంటారు. ఆడుకుంటారు. పాడుకుంటారు. ఇంకా అలంకరణ తెమలని నేస్తాలకు రారండంటూ చప్పట్ల సందేశం పంపుతుంటారు. ఆడినంత సేపు ఆటలాడి, ఊగినంత సేపు ఊయల లూగి, అమ్మవారికి నైవేద్యాలు పెడతారు. పిమ్మట అట్లు ఆరగించి సాయంత్రం జరిగే వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవడంలో మునిగిపోతారు.
ఆ సాయంత్రం వివాహితులూ, అవివాహితులూ స్నాన పానాదులు పూర్తి చేసుకుని ఆకాశంలో తారా చంద్రులు తొంగి చూసే సమయానికి గౌరీదేవిని భక్తిగా పూజించి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తయిదువులకు అలంకారాలు చేసి అట్లు, ఫలాలు, రవికెల గుడ్డా, తాంబూలం వాయనంగా ఇస్తారు. ఆ తర్వాత అట్ల తద్ది నోము మహత్యాన్ని తెలిపే కథ చెప్పుకుని అక్షింతలు చల్లుకుంటారు. గౌరీదేవి ఐదోతనాన్ని, అష్ట భాగ్యాల్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
శివుడిని పతిగా పొందడానికి గౌరీదేవి ఈ వ్రతాన్ని చేసిందని, సాక్షాత్తు నారదుడే పురోహితుడై వ్రతాన్ని జరిపించాడని శాస్త్రోక్తి. ఈ నోములో పదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమ్మవారికి పది అట్లు వాయనంగా ఇస్తారు. ముత్తయిదువులకు కూడా పది అట్లు, పది పండ్లు వాయనంగా ఇస్తారు. వ్రతంలో పాల్గొన్న వారు సైతం పది పండ్లు తిని పదిసార్లు తాంబూలం వేసుకుంటారు. వరసగా పది సంవత్సరాలు నియమ నిష్ఠలతో ఈ వ్రతం చేస్తారు. ఆధ్యాత్మికంగా కూడా పది చాలా ప్రశస్తమైన సంఖ్య. పది దానాలతో మహర్దశ కలుగుతుందని ప్రగాఢ నమ్మకం.
నిజానికి మన పెద్దలు ఏర్పరిచిన ప్రతి సంప్రదాయం వెనకా ఎంతో అమూల్యమైన శాస్ర్తియ దృక్పథం ఉంది. అట్ల తద్ది నోములోనూ అటువంటి విశిష్ఠత దాగి ఉంది. నవగ్రహాలలో కుజునికి అట్లంటే మహా ఇష్టమని చెబుతారు. అట్లను కుజునికి నైవేద్యంగా పెడితే కుజ దోషం పరిహారమవ్వడమే కాక సంసారంలో ఎటువంటి అడ్డంకులు రావని అంటారు. రజోగుణం కల కుజుడు మహిళలకు రుతు సంబంధమైన సమస్యలను, గర్భధారణ సమస్యలను కలుగచేస్తుంటాడు. ఆయనకు అట్లు నివేదించడం వలన ఆ సమస్యలు సమసిపోతాయన్నది పెద్దల మాట.
అంతేకాక అట్లను తయారు చేయడానికి వాడే మినప పిండి, బియ్యం పిండి మిశ్రమంలో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించింది కనుక ఈ రెండూ కలిసిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల గర్భ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. మొత్తానికి ఇటువంటి పండుగలు కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే మహిళలకు మనోల్లాసాన్ని ఇస్తాయి. వాయనాలు, వ్రతాలు సామాజిక సంబంధాన్ని పటిష్టపరుస్తాయి, వాయనాలు ఇవ్వడం తాంబూలాలు పంచుకోవడంతో ఇచ్చి పుచ్చుకునే గుణాలు చిన్ననాడే అలవడుతాయ. త్యాగగుణాన్ని ప్రోది చేసుకోవడంలోను ఇవి ఉపయోగపడుతాయ.

- చోడిశెట్టి శ్రీనివాసరావు