మంచి మాట

శుకమహర్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుకుడు వ్యాసుని కుమారుడు. వేదవ్యాసునికి ఘృతాచి అనే అప్సరస కారణంగా శుకుడు జన్మించాడు. ఒకప్పుడు వ్యాసుడు పుత్రునికోసం శివునిగురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఆయన కోరిక ప్రకారం పంచభూతాలతో సమానమైన పుత్రుణ్ణి ప్రసాదించాడు. ఒకనాడు వ్యాసుడు హోమం కోసం అరణిని మధిస్తుంటే ఘృతాచి అనే అప్సరస ఆయనకు కనపడింది. ఆయన కామవశుడైనాడు. ఆమెనే తలచుకుంటూ అరణి మధిస్తున్నపుడే వీర్యస్ఖలమై అరణిలో పడింది. వెంటనే దివ్య తేజస్సు కలిగిన కుమారుడు జన్మించాడు. శుకరూపంలో వున్నందున అతనిని శుకుడు అన్నారు. శుకము అంటే చిలుక అని అర్థం.
జన్మసిద్ధంగానే ఆయనకు వేదములన్నీ వచ్చాయి. అయినా గురువు అవసరం కాబట్టి వ్యాసుడి అనుమతి తీసుకుని 5 సం.ల వయసులోనే బృహస్పతి దగ్గరకి వెళ్లి వేదవేదాంగములు, ధర్మశాస్తమ్రులు, రాజనీతి వ్యవహారములు అన్నీ నేర్చుకున్నాడు. తిరిగి వ్యాసుడి దగ్గరకు వచ్చాడు. వ్యాసుడు ఆయనకు సాంఖ్యయోగాన్ని గురించి బంధన హేతువులను గురించి ఉపదేశించాడు. ప్రాపంచిక విషయాలన్నీ తెలుసుకుని కూడా జీవన్ముక్తుడుగానే ఉన్నాడు శుకుడు.
పదహారు సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఎంతో అందంగా అందరినీ ఆకర్షించే రూపం కలవాడైనాడు. ఆయనను చూసి మోహించని స్ర్తిపురుషులు లేరట. అయినా ఆయన ఎవరినీ లెక్క చేయక యోగివలె ఉండేవాడు. మోక్ష మార్గాన్ని గురించి ఆ కాలంలో వున్న జనకరాజు దగ్గర తెలుసుకున్నాడు.
తండ్రి ఆజ్ఞ తీసుకుని భూప్రదక్షిణం చేయటానికి వెళ్లాడు. ఆవు పాలు పితకటానికి పట్టేంత సమయం మాత్రమే ఒకచోట ఉండేవాడు. ఆయనకు బాహ్యస్మృతి ఉండేది కాదు. దేహంమీద వస్త్రం గురించిన ధ్యాస ఉండేది కాదు. ఏ విషయంలోను లోలత్వం లేనివాడై తిరిగేవాడు. ఇంద్రియ నిగ్రహమే ఉత్తమమైన ధర్మమని తెలుసుకున్న శుకుడు యోగీశ్వరుడైనాడు.
పరీక్షిత్తు మహారాజుకు ఏడు రోజులలో మృత్యువు సంభవిస్తుందని ముని కుమారుని శాపం కలిగింది. ఆయనకు ఆయుర్దాయం ఏడు రోజులే ఉన్నది. ముక్తి ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. అనేకమంది పండితలు, మునుల ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాడు. చివరకు శుకమహర్షి సలహా తీసుకోవాలని అనుకున్నాడు. స్మరించినంతనే ఆయన ప్రత్యక్షమైనాడు.
‘మహర్షీ! నాకు ఏడు రోజులలో ముక్తిని పొందగలిగే మార్గం చెప్పవలసింది’ అని అడిగాడు. అందుకు ఆయన నా తండ్రి వ్యాసుడు భాగవతాన్ని రచించాడు. అందులో శ్రీహరి చరిత్ర ఉన్నది. నీకు ఆ కథలు వినిపిస్తాను. నీకు తప్పక మోక్షం కలుగుతుంది.
పూర్వం ఖట్వాంగుడు అనే రాజుకు మృత్యువు సంభవించి తన పుణ్యఫలం చేత స్వర్గానికి వెళ్లాడు. కాని అక్కడికి వెళ్లిన తరువాత ఆయనకు ఇంకా రెండు ఘడియలు ఆయుర్దాయం మిగిలి ఉన్నదని తెలిసి తిరిగి భూలోకానికి వచ్చి పురోహితులకు చెప్పి తన సర్వస్వాన్ని పరిత్యజించి హరినామ సంకీర్తన చేసి ముక్తిని పొందాడు. ఆయన కేవలం రెండు ఘడియల కాలంలోనే ఇది సాధించాడు. నీకు ఏడు రోజులు ఉన్నందున చాలా సమయం ఉన్నట్లే కాబట్టి హరి కీర్తనలు వింటూ హరినామస్మరణ చేయి అన్నాడు. ఆ విధంగా భాగవత కథలను వింటూ హరినామ స్మరణ చేస్తూ పరీక్షిత్తు ముక్తుడైనాడు.
తండ్రి అనుమతితో శుకుడు తపస్సు చేసి యోగసిద్ధిని పొందాడు. సంచారం చేస్తూ ఉండేవాడు. ఎవరూ ఎదురురాకుండా తప్పుకుని వెళ్ళేవారు. వ్యాసుడు ఆయనను వెంబడించి ‘శుకా’ అని పిలిచాడట. బదులుగా పంచభూతాలు ‘ఓ’ అని పలికాయట. అంటే ఆయన పంచభూతాలలో వ్యాపించి ఉన్నాడు. నిస్సంగుడైనాడు.
వ్యాసుడికి ఇంకా పుత్ర వ్యామోహం ఉన్నది. శివుని స్మరించగా ప్రత్యక్షమై నీ కోరిక ప్రకారమే పంచభూతాలలో సమానమైన కొడుకును ఇచ్చాను. అటువంటి కొడుకును కన్నందుకు నువ్వు ధన్యుడివి. పుత్ర వ్యామోహం విడిచిపెట్టు అని చెప్పాడు.
అనేక పురాణాలలో శుక మహర్షి గాథలు ఉన్నాయి. ఎంతో ప్రఖ్యాతి వహించిన శుకమహర్షి చరిత్ర ఎంతో పవిత్రమైనది.

- అబ్బరాజు జయలక్ష్మి