మంచి మాట

జ్ఞానభాస్కరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏకమేవ అద్వితీయ బ్రహ్మ’- సృష్టిలో బ్రహ్మం తప్ప అన్యమైనదేదీ లేదనీ సర్వం ఈశావాస్యం- సకల చరాచర సృష్టి అంతా ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీకృతమై ఉన్నదనీ భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం శ్రీ ఆదిశంకరాచార్య.
ప్రతి ఒక్కరూ దివ్యాత్మ స్వరూపులనీ, ప్రతి జీవిలోను దివ్యత్వం దాగుందనీ అంతర్గతంగా ఉన్న ఆ దివ్యత్వమును సాక్షాత్కరింపచేసుకోవడమే మానవ జీవిత ధ్యేయం కావాలనే సర్వవేదాంత సారాన్ని ప్రపంచానికి ప్రబోధించి సనాతన ధర్మాన్ని పరిరక్షించిన వివేక భాస్కరుడు స్వామి వివేకానంద.
భారతదేశ ఆధ్యాత్మిక క్షేత్రంలో కలుపుమొక్కలైన అవైదిక, నాస్తిక సిద్ధాంతాలను, మూఢాచారాలను, మత ఛాందసాలను తరిమికొట్టి సనాతన ధర్మ వృక్షాన్ని పటిష్టపరిచేందుకై అవతరించిన మహాదేవుడే ఆదిశంకరులు. పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ఆర్యాంబకు ఆదిశంకరులు ఉదయిస్తే భువనేశ్వరీ దేవికి నరేంద్రుడు జన్మించారు.
అటు ఆదిశంకరులు, ఇటు స్వామి వివేకానందులు తమ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం జరిగింది. వాళ్ళిద్దరికీ తమ తల్లిమీద అమితమైన ప్రేమానురాగాలు ఉండేవి. తమ తల్లికి ఏపాటి చిన్న కష్టం వచ్చినా, బాధ కల్గినా వీరి హృదయాలు తల్లడిల్లిపోయేవి. ఒకసారి ఆర్యాంబ స్నానమాచరించి మడి నీరు పట్టుకొచ్చేందుకై పూర్ణ నదికి వెళ్లి ఎండ తీవ్రతకు తాళలేక నది ఒడ్డుననే సొమ్మసిల్లి పడిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే శంకరులు హుటాహుటిని అక్కడికి వెళ్లి తల్లిని తన చేతులమీదుగా ఎత్తుకుని వచ్చి తామరాకులతో గాలి విసురుతూ సపర్యలు చేశారు. మున్ముందిక తల్లికి ఎలాంటి కష్టమూ కలుగకూడదన్న ధ్యేయంతో నదీమ తల్లిని ప్రార్థించి పూర్ణానది తమ ఇంటి ముంగిటగా ప్రవహించేలా ప్రవాహ గతిని మళ్లింపజేశారు. ఆయన సన్యసించడానికై వెళ్తూన్నప్పుడు శోక తప్తయైన ఆర్యాంబ ‘‘నాయనా! నువ్వెక్కడున్నా నా అవసాన సమయాన తప్పక ఇక్కడికొచ్చి నా అంతిమ సంస్కారం నువ్వే చేయాలి’’ అని కోరింది. అందుకు అంగీకరించిన శంకరులు ఆమె మరణ శయ్యను చేరిన విషయం తెలియగానే అక్కడికెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించి తల్లి కోరిక నెరవేర్చి రుణం తీర్చుకున్నారు.
సదా ఆత్మానందంలో ఓలలాడే ఆ యతీశ్వరులు పేదల కష్టాలను కలత చెంది వారి కష్టాలు తీర్చమని జగన్మాతను ప్రార్థించారంటే అది వారిలోని మానవత్వానికి ఓ గొప్ప నిదర్శనమనే చెప్పుకోవాలి.
ఆదిశంకరులు గంగానది నుండి వస్తూండగా ఓ చండాలుడు నాల్గు కుక్కలను వెంటపెట్టుకుని వస్తూ ఆయనకు ఎదురుపడ్డాడు. వారిని చూడగానే ‘పక్కకి తొలగు’ అన్నారు శంకరులు. అప్పుడతడు పకపకా నవ్వి ‘‘అయ్యా! నీవు మహాజ్ఞానివి. నువ్విప్పుడు పక్కకి తొలగమన్నది ఈ దేహాన్నా? లేక ఇందులోని ఆత్మనా? అగ్రకులస్థుడికీ, నిమ్న కులజుడికీ మధ్య భేదం దేహానికి సంబంధించిందే కానీ ఆత్మది కాదు కదా?’’ అని చెప్పేసరికి ఆ పరమేశ్వరుడే నాకు పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించేందులకై వచ్చాడన్న నిజం తెలుసుకున్న శంకరాచార్యులవారు వెంటనే చేతులు జోడించి మనీషా పంచకం ఆశువుగా చెప్పేశారు.
సర్వజీవులు సర్వ దివ్యరూపులే అనే అనుభూతి చెందిన జ్ఞాన భాస్కరులైన శంకర, వివేకానందులను సైతం అజ్ఞానమేఘం ఆవరించిందంటే సాధారణ సాధకులు మరెంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఊహించవచ్చు. సాధకులలో అనేకులు జ్ఞానమార్గం శ్రేష్ఠమా? భక్తిమార్గం శ్రేష్టమా? అనే సందేహంతో వాదనలు చేస్తూ సతమతమవుతూంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తిలేని జ్ఞానం కుంటిది. జ్ఞానం లేని భక్తి గుడ్డిది. కనుక మనం ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణతను సాధించాలి తప్ప అన్యమార్గాల్లో వెళ్ళకూడదు. పై ఇద్దరూ భక్తిపారవశ్యంతో జగన్మాతను స్తుతించడం వారి భక్తి పరాకాష్టకు ఓ చక్కటి నిదర్శనం.

-ఎం.సి.శివశంకర శాస్ర్తీ