మంచి మాట

మహావైశాఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాధవ మాసంగా పేరెన్నిక గన్న వైశాఖ మాసం మానవుల్లో ఆధ్యాత్మికోన్నతిని కలిగించడంలో ఉత్కృష్టమైనదిగా పేరుగాంచింది. కులమతాలతో జాతివైషమ్యాలతోకొట్టుకుపోయే జాతిని నిలువరించి నాలుగు దిక్కులా పీఠాలనెలకొల్పి మరుగుపడిపోయిన మానవత్వాన్ని తిరిగి ప్రజ్వలింపచేసిన ఆదిశంకరులు, మానవులంతా ఒక్కటే వారందరిలోను వెలిగే చైతన్యమే భగవంతుడు అని చాటిచెప్పుతూ భగవంతుని కొలువడానికి వారువీరనే భేదం ఏమాత్రం లేదని చెప్పిన రామానుజులు, ఇంద్రియలోలత్వాన్ని అధిగమించి కోరికలను దూరంచేసుకోవడమే సంతోషానికి దగ్గరిమార్గం అంటూ అసతోమ జ్యోతిర్గమయ అనే బుద్ధ భగవానుడు లాంటివారు ఈమాసంలోనే జన్మించారు. అంతేకాక పతిత పావని త్రిపథగామిని అయిన గంగామాత భగీరథుని సఫల యత్నంతో భువిపై అడిగిన రోజు కూడ వైశాఖ శుద్ధసప్తమి. సనాతన భారతీయ ధర్మవిశిష్టతను మరింత ప్రకాశమానం చేసిన శ్రీవిద్యారణ్యుల జన్మదినం వైశాఖశుద్ధ సప్తమినే.
దుష్టశిక్షణ, శిష్టరక్షణే భగవంతుని కర్తవ్యం అని, భక్తులను కాపాడడానికి ఏ రూపాన్నైనా అనాయాసంగాసృజించుకొనే నిరాకారుడైన దైవం నర మృగరూపాలల్లో అవతరించిన నృసింహావతారం కూడా వైశాఖ చతుర్దశినాడే.
జ్ఞానావతారుడు, దాస్యవృత్తిల్లో అగ్రగణ్యుడు, రామభక్తుడు, శివస్వరూపుడు అయిన ఆంజనేయుడు అంజనాసుతునిగా ఆవిర్భవించిందీ వైశాఖ బహుళ దశమినాడే. అందరినోళ్లల్లో నిత్యం నానే అన్నమయ్య పద కర్త వేల వేల పదాల సంకీర్తనాచార్యుడు, వాగ్గేయకారుడు వేంకటేశ్వరుని ప్రియభక్తుడు పుట్టుక ఈ మాసంలోనే.
ఈ మహానుభావులంతా మానవులల్లో నిత్యానందాన్ని కలిగిస్తూ జ్ఞానదీప్తిని వెలిగించినవారే. అందుకే వసంత ఋతువులో వచ్చే ఈ పూర్ణిమ మహాపూర్ణిమ అని మహావైశాఖి అని జ్ఞానులంతా అభివర్ణించారు. అంతేకాక స్నానజపతపాదులకు దానకార్యాలకు పేరుపెట్టిన ఈ మాసంలో పూర్ణిమ తిథినాడు చేసే దానాలకు విశేషప్రాధాన్యం ఉంటుందని శాస్తవ్రచనం. జలదానాలు, వస్త్ర, ఛత్ర, పాదుక దానాలు పూర్ణిమ నాడు చేస్తే రోగహరణం కలుగుతుంది. ఈ మాసంలో ఏ దానం చేసినా దాతలకే కాక దాన గ్రహీతలకు కూడా విశేషఫలాలు కలుగుతాయి. నానావిధ అరిష్టాలు, గ్రహదోషాలు కూడా ఈదానకార్యక్రమాలతో తొలుగుతాయని పురాణ వచనం. లక్ష్మీనారాయణులను పూజించడం, పార్వతీ పరమేశ్వరులను పూజించడం కూడా ఆనవాయతినే. సంపద్గౌరీ వ్రతాన్ని అర్థనారీశ్వర వ్రతాన్ని కూడా ఈ పూర్ణిమ నాడు విశేషంగా జరుపుతారు. ఈ వ్రతరాజాల వల్ల అఖండసౌభాగ్యాలు కలుగుతాయ. భార్యభర్తల అన్యోన్యతను, కుటుంబసౌఖ్యాన్నిచ్చే ఈ వ్రతాలను చూచిన వారికి కూడా సత్ఫలాన్ని కలుగు చేస్తాయని వైశాఖపురాణం చెబుతోంది.
గాలి, నీరు, చెట్లు ... ఈ ప్రకృతి నేర్పే త్యాగమే జీవితమనే పాఠాలను ఆకళింపు చేసుకొని మానవులంతా నిస్వార్థులై పరోపకారం మిదం శరీరం అన్నట్లుగా పరుల సంతోషానికే ఎక్కువ విలువ నివ్వాలని చెప్పేందుకే ఈ మాసంలో మహానుభావులంతా ఊపిరులు పోసుకొన్నారు.
ఆధ్యాత్మిక పరిపుష్టిని కలిగించే ఈ పూర్ణిమను గురుపూర్ణిమగాను, వ్యాసపూర్ణిమగాను సంభావిస్తారు. గురువునుమించిన దైవం లేదు కనుక మానవులకు మహోన్నత స్థితిని కలిగించిన గురువుకు వందనం చేయడం ఈమహావైశాఖిలోఅత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. లోకానికి ధర్మమేదో చెప్పిన వ్యాసుల వారిని స్మరించడం మన కనీస కర్తవ్యం.

**
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- సాయితేజ