మంచి మాట

వరలక్ష్మీవ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. అందువలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు. ఈ నెలలో శివునకు విష్ణువుకు అభిషేకాలు చేస్తే అన్ని అరిష్టాలు తొలుగుతాయనేది శాస్తవ్రచనం. శ్రావణమాసం పునిస్ర్తిలకు ఎంతో ముఖ్యమైనది. శ్రావణమాసం అనగానే మంగళగౌరీ నోములు, వరలక్ష్మీవ్రతం, శ్రావణపూర్ణిమ, రక్షాబంధనం, కృష్ణాష్టమి వంటి హిందువుల పర్వదినాలే కాక భారత స్వాతంత్య్ర దినోత్సవం కూడా జరుపుకుంటారు.
శ్రీలక్ష్మీదేవి శుద్ధ స్వాత్త్విక స్వరూపంలోనుండే జగదాంబ. ఆమె అష్టైశ్వర్య ప్రదాయిని. ఈ విశ్వం యావత్తూ లక్ష్మీదేవి క్రీగంట చూపులపైన ఆధారపడిందన్నది శాస్త్ర వచనం. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యం- ఇవన్నీ శ్రీలక్ష్మీస్వరూపాలు.
శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు శ్రీలక్ష్మిని వరలక్ష్మిగా పూజించి వ్రతమాచరిస్తారు. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు ఈ వ్రత మహత్మ్యం చెప్పాడు. అసలీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడనేది పురాణ వచనం. వరలక్ష్మీవ్రతం ఆచరించినవారందరూ సర్వ సౌభాగ్యాలు, పుత్రపౌత్రాదులతో సుఖంగా, సిరిసంపదలతో జీవిస్తారు. ఈ లక్ష్మివైభవాన్ని వేదాలు, పురాణాలు వేనోళ్ల కీర్తిస్తున్నాయ. ఈ తల్లి జగద్వ్యాపకాన్ని విష్ణుపురాణం వివరిస్తుంది. సర్వసంపదలకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, యశస్సులకు మూలకారణమైన ఈ తల్లిని శ్రావణమాసంలో పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం నాడు పూజిస్తే సర్వసౌభాగ్యాలు సమకూరుతాయని పరమశివుడు పార్వతికి చెప్పినవిధంగా కలియుగంలో స్ర్తిలందరూ వరలక్ష్మిదేవిని పూజించి ఆ తల్లఅనుగ్రహాన్ని పొందు తున్నారు.
పూర్వం మగధ దేశంలో కుండినము అనే ఒక పట్టణం ఉంది. ఆ నగరంలో చారుమతి అనే ఓమహిళ ఉండేది. చారుమతి అంటే మంచి మనసు అని అర్థం. ఉదయానే్న లేచి గృహాన్ని శుభ్రపరిచి, స్నానమాచరించి దైవపూజ చేసేది. పతికి ఇతర పెద్దలకు సేవలు చేసేది. ఆమె పట్ల లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. ఒకనాడామె కలలో కనిపించి ప్రసన్నురాలై ‘‘చారుమతీ! నేను వరలక్ష్మీదేవిని. నీయందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నీవు నన్ను పూజించావంటే నీవు కోరిన వరాలిస్తా’’నని చెప్పింది. చారుమతి స్వప్నంలోనే శ్రీవరలక్ష్మీదేవికి ప్రదక్షిణం చేసింది. తల్లీ! నీ అనుగ్రహం కలిగితే జనులు ధన్యులవుతారు. సకల విద్యలు నేర్చి విద్వాంసులవుతారు, వారు పట్టింది బంగారవౌతుంది. పుత్ర పౌత్రాది సంపద కలుగుతాయి అనుకొంది.
ఉదయం లేచి అత్తమామలకు, భర్తకు ఇతర పెద్దలకు ఈ వృత్తాంతం చెప్పి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంనాడు ఈ వరలక్ష్మీవ్రతం చేస్తానని సంకల్పం చేసుకుంది. చారుమతి ఈ స్వప్న వృత్తాంతం ఇరుగుపొరుగు ముతె్తైదువలకు చెప్పగా వారు కూడా వ్రతంలో పాలుపంచుకుంటామన్నారు.
ఆ రోజు రానే వచ్చింది. పూజాగృహసాన్ని చక్కగా అలంకరించింది. ఇంటికి మామిడాకు తోరణాలు కట్టింది. చక్కటి ముగ్గులు వేసింది. శుభఘడియలో ఇరుగు పొరుగు ముతె్తైదువలతో కలిసి శ్రీసూక్త విధానంలో షోడశోపచార పూజ చేసింది. ఆమె మొదటి ప్రదక్షిణం చేయగా ఆమెకు ఇతర స్ర్తిల కాళ్ళకు ఘల్లు ఘల్లుమని శబ్దం చేసే గజ్జెలు కడియాలు వచ్చి చేరాయి. రెండవ ప్రదక్షిణం చేయగా చేతులకు బంగారు గాజులు, రత్నఖచితమైన కంకణాలు వచ్చి చేరాయి. మూడవ ప్రదక్షిణంతో మెడలో హారాలు వచ్చాయి. శ్రీవరలక్ష్మిదేవి ప్రసన్నురాలై వారందరి కోరికలు నెరవేర్చింది. దేవాలయాల్లోను వరలక్ష్మి పూజను నిర్వహిస్తారు. సకల జీవరాశులు ఆ తల్లి సంతానమే. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది

-గుమ్మా ప్రసాదరావు