మంచి మాట

సుజలాం సుఫలాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వసృష్టిలో భూభాగ, జలభాగాల విభజనలో ముప్పాతిక పాళ్లు నీళ్లే అని భౌగోళిక శాస్త్రం తెలియజేస్తోంది. జలం కారణంగా సమస్తజగతి వృద్ధి చెందుతున్నది, శుద్ధి చేయబడుతుంది. జలమే సర్వసృష్టికి జీవం, ప్రాణికి జీవనాధారం. ఒక్కమాటలో స్పష్టం చెయ్యాలంటే.. నీరు లేకపోతే సమస్త జీవ సమాజానికి అస్థిత్వమే లేదు. అందుకే జల ప్రాశస్త్యాన్ని మహత్తరంగా ‘సుజలాం సుఫలాం’ అని మహనీయులు కీర్తించారు. జలంవల్లనే పాడి, పంట, సర్వసమృద్ధి సాధ్యమవుతుంది. విత్తు మొలకెత్తడానికి సత్తువ జలమే. పశుపక్ష్యాది సకల జంతుజాలం, మానవాళి యావత్తు దాహార్తిని తీర్చేది, పంటలను పుష్కలంగా పండించి అన్నార్తిని తీర్చేది జలమే.
జలం యొక్క లక్షణం ప్రక్షాళనం. బాహ్యశుద్ధికి నీరు కావాలి. మానవ జీవితంలో అతి ముఖ్యమైనదైన శౌచం నీటివల్లనే సాధ్యం. పరిశుభ్రతకు, పర్యావరణ భద్రతకు నీరు అత్యావశ్యకం. శారీరక దుర్గంధాన్ని నిర్మూలన చేసుకోవడానికి నీటితోస్నానమొక్కటే పరిహారం. జలం విషయానికొస్తే నదీజలం అన్నింటికన్నా పవిత్రం, ఉత్తమమైనది, తటాకంలో నీరు మధ్యమమని, బావులలో నీరు సాధారణమైనదని పురాణేతిహాసాల వివరణ. అయితే శరీరానికి మృదువుగా తోచే నీరు అప్రతిహతమైన శక్తి కలిగినదని గ్రహించాలి. జలం దుర్బేధ్యమైన పర్వతాన్ని చీల్చగలదు. ప్రకృతిలో ప్రళయాన్ని, జల విలయాన్ని సృష్టించగలదు. అందుకే దివినుంచి ఉద్భవించి భువిమీద ప్రవహించే గంగా మాతను భక్తితో ప్రార్థించాలి. వర్షానికి కారకుడైన వరుణదేవుని కరుణ కొరకు ఆరాధించాలి. వర్షం కొరకు భక్తిశ్రద్ధలతో యజ్ఞయాగాదుల్ని నిర్వహించాలి. స్థావర జంగమాత్మకమైన జీవజాలం ఉత్పత్తికి జలానికుండే శక్తే కారణం.
అష్టాదశ పురాణాలు, మహాగ్రంథాలు మహిమాన్వతమైన జలం యొక్క ప్రశస్తిని ప్రస్తావిస్తాయి. భగవదార్చనలో పూజ నిర్వహించేముందు లాంఛనంగా మార్జనం నీటితో మంత్రపూర్వకముగా చెయ్యాలి. ఉద్ధరణిలోనీటిని శిరస్సుపై ప్రోక్షించుకోవాలి. భగవత్పూజకు ఉపక్రమించే ముందు జలంతో భూశుద్ధి (్భతోచ్ఛాటనం) చేసుకోకుండా బ్రహ్మకర్మ (్భగవత్పూజ)ను ఆరంభించకూడదని పూజా సంవిధానంలో ఆచరణీయ నియమం. గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి పవిత్ర నదుల జలాన్ని ప్రస్తావిస్తూ పాత్రలో పూజకు సమకూర్చుకున్న నీటిని తాకుతూ ఆ పుణ్యనదుల జలాన్ని స్పర్శిస్తున్నట్లు ప్రార్థన చెయ్యాలి.
పరమశివుని జటాజూటం నుంచి గంగ ఉద్భవించినదని, భగీరథుని విశ్వ ప్రయత్నం వలన భూమిపైన గంగ అవతరించినదని పురాణ ఆధారాలవల్ల తెలుస్తున్నది. పంచభూతముల నుండి త్రిగుణాత్మకమైన ప్రకృతి, వౌలిక జగత్తు సృష్టింపబడ్డాయని, ఆకాశం నుంచి వాయువు, ఆ వాయువు నుంచి అగ్ని, ఆనలం (అగ్ని) నుండి సలిలం (నీరు) ఉద్భవించెనని, వీటన్నిటినుండి పృధివి (్భమి) పుట్టెనని ఉపనిష్వద్వివరణ. మహిమాన్వితమైన శ్రీసూక్తంలోని ‘ఆపః స్వజంతు స్నిగ్ధాని’ అన్న వేదోక్తిని అనుసరించి మానవునికి, సకల జీవజాలానికి ఆహార పదార్థాలను నీరే ఉత్పాదన చేస్తుంది. అమూల్య పదార్థము, అమృతప్రాయమైన క్షీరమునకు నీరే మూలధాతువు. నీరు జ్ఞానవాహికము, జ్ఞానప్రదాత. భగవద్గీత వివరణ ప్రకారం యజ్ఞ సముద్భవమైన వర్షం (నీరు) వల్లనే అన్నము లభిస్తుంది. నీటివలన పరిశుభ్రత, శారీరక పోషణ ఒనగూరుతున్నాయి. త్రాగే నీరు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. శారీరక శుద్ధి ద్వారా దేహమునకు శక్తిచేకూరును. నిత్యం ఆచరించే స్నానంవలన చర్మకాంతి పెరుగును. మానసిక ఉత్తేజం కలిగి పవిత్రత చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ ‘జలం’ విలువ తెలుసుకొని నీటి ఆవశ్యకతను గ్రహించి వృధా చెయ్యకుండా ఆదా చెయ్యగలిగితే మానవాళికి మంచి ఆరోగ్యం చేకూర్చి, దేశం సస్యశ్యామలమై సౌభాగ్యంతో విలసిల్లుతుంది.

-రాజ్‌కుమార్