మంచి మాట

ఉత్తమ శ్రోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట్లాడే వ్యక్తి వక్త, ఆలకించే వ్యక్తి శ్రోత. ఆలకించడం అందరికీ సులభమే కానీ శ్రవణం కొంతమందికే సాధ్యమగుతుంది. సృష్టిలో చెవులున్న ప్రతి పాణి వినగలుగుతుంది. కాని మనసున్నవారికే శ్రవణం సాధ్యమగుతుంది. శ్రవణం కల్పిత భావాలను దూరం చేయాలి. చెముడు లేని ప్రతి వ్యక్తి ఇంతో అంతో వినగలుగుతాడు. వినడమేమో కర్మ, ఇక శ్రవణమేమో కళ.
పుస్తకము చదవడమొక కళ. చదవడము కర్మయైననూ చదివినదానిని చక్కగా అర్థం చేసుకొని విషయాన్ని గ్రహించినట్లైతే అది కళ అగుతుంది. చదవడమన్నది అభ్యాసమగును. అవగాహన పూరితమైన చదువేమో కళ అగుతుంది. అందువల్ల అభ్యాసము కర్మ, అధ్యయనమొక కళ. అలాగే వాచకము కర్మ అగుతుంది. వక్తృత్వము కళగా పరిగణింపబడుతుంది. కర్మయను వాచకము వచనమగును. ఇక కళయైన వక్తృత్వము ప్రవచనమగును. వాచకమునకు కేవలం వాక్కుంటే చాలు, కాని వక్తృత్వానికి వైదుష్యముండాలి. వ్రాత కర్మయగును, రచనేమో కళయగును. చిల్లర మాటలు చెల్లు చీటీలు కర్మ అనబడే వ్రాత. దివ్య తేజోవిలసితమై ప్రభాసించే కాంతి పుంజాన్ని రమణీయంగా, కమనీయంగా చూపే కళయే రచన. చేతనలో స్పందన కొరవడితే అది కర్మ అగుతుంది. ఆ కర్మలో స్పందన చేరితే అది చేతనమగుతుంది.
శ్రవణము గ్రహిస్తుంది. ప్రవచనము బోధిస్తుంది. తెలిసినవాడు ప్రబోధిస్తాడు. తెలియనివాడు ప్రబోధితుడవుతాడు. ప్రబోధకుడు పలికే మాటలు వినబడుతాయి. మనం ఎన్నో విషయాలను వింటాము కాని విన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేము. శ్రోత తనను తాను అర్థం చేసుకుంటే శ్రవణము చేయడములోని లక్ష్యం తెలుస్తుంది. లక్ష్యముతో వినేవారు సమచర్య కలిగియుంటారు. లక్ష్యం లేకుండా వినేవారు ప్రతి చర్యతో కదులుతుంటారు. అయితే సమచర్యతో సదవగాహన కలుగుతుంది. ప్రతి చర్యతో దురవగాహన కలుగుతుంది. శ్రోత తనను తాను అర్థం చేసుకున్నట్లే వక్తనుకూడా అర్థం చేసికోవాలి. వక్త అర్థం కానపుడు అతడి వచనమెలా అర్థమవుతుంది? వక్తయొక్క లక్ష్యము తెలిసికొని అది తనకు ఎంతవరకు అవసరమో గుర్తించి ఆలకిస్తే ప్రతి చర్య లేకుండా నిస్సందేహంగా శ్రవణం జరుగుతుంది. వక్తను గూర్చి సరియైన అవగాహన లేక కేవలం వినికిడికి మాత్రమే పరిమితమైన అది సమచర్య లోపించి వినికిడి మాత్రమే అగును.
శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించాడు. నరుడైన అర్జునుడు విన్నాడు. ప్రతిచర్య లేక సమచర్యతో, సమ వైఖరితో ఆలకించిన అర్జున సంజయులది శ్రవణం. సమచర్య లోపించి ప్రతిచర్యతో ఆలకించిన ధృతరాష్ట్రునిది వినికిడి. శ్రేయము కలిగించేది శ్రవణము. వినాశమును కలిగించేది వినికిడి. ప్రియతమ వక్త శ్రీకృష్ణ భగవానుడు, ఉత్తమ శ్రోత అర్జునుడు. అభ్యాసమైన వినికిడి శ్రవణమనబడదు. కాని శ్రవణము అభ్యాసము ద్వారానే అభివృద్ధి చెందుతుంది. చదువుట, వ్రాయుట, మాట్లాడుట ఏ విధంగా అభ్యాసము ద్వారా పరిపుష్టి చెందునో అదేవిధంగా శ్రవణం కూడా అభ్యాసంతోనే సాధ్యమగును. సైకిలు తొక్కుట ప్రయత్నముపై ఆధారపడి యున్నట్లు శ్రవణము కూడా అభ్యాసంపై ఆధారపడి యున్నది. వక్త మాట్లాడుతాడు, శ్రోతనేమో వింటాడు. మాట్లాడవలసిన వక్త వౌనం వహించి వినవలసిన శ్రోత మాట్లాడితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో ఊహించాలి. వినికిడి పశుపక్ష్యాదులు కూడా చేస్తాయి. శ్రవణం కేవలం మనిషియే చేయగలడు. చక్కటి శ్రవణమంటే సరిగా ఆలకించి అర్థం చేసికొని దానిని స్మృతిలో నిత్యానుభూతిగా నుంచుకొనుట. ఇట్టి శ్రవణము ఉత్తములకు మాత్రమే సాధ్యమగును. అట్టి ఉత్తమ శ్రోతయే అర్జునుడు. అర్జునుడు పుణ్యపురుషుడు. ధీరుడు, ధీమంతుడు, గురుభక్త శిఖామణి, ధర్మపరాయణుడు, భగవద్భక్తుడు. అణుమాత్రం అసూయ లేని నిగర్వి. దుర్యోధనుడు పెట్టిన బాధలను సహనంతో భరించిన ఉత్తమ పురుషుడు.

-పెండెం శ్రీ్ధర్