మంచి మాట

పరమ దయాళువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శివ శివా!’ అన్నంతనే సకల పాపాలను హరింపజేయగల మహిమాన్వితుడు మహేశ్వరుడు. కేవలం కొన్ని నీళ్లను లింగంపై పోసి, ఒక్క మారేడు దళాన్ని శివలింగంపై ఉంచితే సంతోషించి కోరిన వరములను ఇచ్చే కొండంత దేవుడు. అభిషేక ప్రియుడైన పరమశివుని పంచామృతాలతో, చెరకురసంతో, వివిధ ఫలాల రసాలతో అభిషేకించటం శ్రేయోదాయకం. తుమ్మిపూలు, మల్లెలు, మందారాలు, పున్నాగ మొదలైన పువ్వులతో అర్చించటం శివునికి ప్రీతికరం. భస్మం, పసుపు, కుంకుమ, చందనం, పుష్పాలు మొదలైన వాటిని కలిపిన జలంతో అభిషేకించటంవలన కోరిన కోరికలు తీరతాయి.
మానవులకే కాదు, పశుపక్ష్యాదులకు కూడా భక్తికి తలవంచి లొంగిపోయేవాడు. పాము, ఏనుగు, సాలీడు తమ తమ శక్తికొలది భక్తితో శివుని సేవించగా మెచ్చి వాటికి ముక్తి నొసగి శాశ్వతంగా తన సాన్నిధ్యంలో నిలుపుకుని శ్రీకాళహస్తీశ్వరుడై భక్తకోటిని తరింపజేస్తున్నాడు. లోకక్షేమానికై గరళాన్ని నేరేడు పండులా చేసుకుని కంఠంలో నిలుపుకున్న లోకబాంధవుడు నీలకంఠుడు.
ఎల్లప్పుడూ శ్రీరామనామాన్ని జపిస్తూ శివకేశవులకు భేదం లేదని తెలియజెప్పిన మహిమాన్వితుడు మహేశ్వరుడు. తనను నమ్మి సేవించిన మార్కండేయుని కాపాడుటకై కాలుని సైతం కాలదన్నిన కరుణాంతరంగుడు శంకరుడు. శరీరమంతా విభూతిని పూసుకుని కపాల మాలను ధరించి, గజ చర్మాంబరధారియై శ్మశానంలో సంచరిస్తూ అసువులు బాసిన జీవులకు తోడుగా నిలిచే అభయంకరుడు. కాశిలో మరణించినవారి చెవిలో తారక మంత్రాన్ని పలికి మోక్షాన్ని ప్రసాదించే పరమ కారుణ్యమూర్తి. ‘నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని పలికిన వెంటనే పాపాలను పటాపంచలు చేయగల పరమాత్ముడు.
మామగారైన దక్షుని శాపానికి గురైన చంద్రుని అనుగ్రహించి శిరసున ధరించి చంద్రవౌళీశ్వరుడైనాడు. భగీరథుని తప్ఫఃలంగా దివినుండి భువికి దిగుతున్న గంగ వేగాన్ని భూమి భరించలేదని తన జటాజూటంలో నిలిపి గంగాధరుడైనాడు. జగన్మాత తనకు అర్థాంగి అయిన పార్వతీదేవికి తన శరీరంలో సగభాగం ఇచ్చి అర్థనారీశ్వరుడై అందరినీ అనుగ్రహిస్తున్నాడు. అసురులయినప్పటికీ వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఎన్నో వరములనొసగి ఒక్కొక్కసారి తాను చిక్కుల్లో పడ్డాడు. భస్మాసురుడు తాను ఎవరి తలపై చేతిని పెడితే వారు భస్మం కావాలని వరము పొంది తనకు వరాన్నిచ్చిన శివుని శిరసు మీదనే తన హస్తాన్నుంచి పరీక్షించాలని వెంటపడగా దిక్కుతోచక పరుగుపెట్టిన అమాయకుడు ఆశుతోషుడు. చివరికి విష్ణువే మోహినీ రూపంలో వచ్చి భస్మాసురుడు తన చేతిని తన తలపైనే ఉంచుకుని భస్మమయ్యేవిధంగా మాయ చేయవలసి వచ్చింది.
పొగిడినంతనే పొంగిపోయి వరాల జల్లులను కురిపించే చల్లని దేవుడు శశిధరుడు. గజాసురుని కోరికపై అతని ఉదరంలో నివసించటం, రావణునికి ఆత్మలింగాన్ని అనుగ్రహించటం, కైలాసగిరినే పెకలించబోగా తన కాలివేలితో నొక్కిపట్టవలసి రావటం- ఇటువంటివన్నీ కైలాసవాసుని భక్తులపై ఉండే వాత్సల్యానికి ఉదాహరణలే.
‘శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు’ అనేమాట శివుని సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞతను తెలియజేస్తుంది. ‘సర్వం శివమయం’ అని నమ్మి శివుని భక్తితో సేవించినవారు ఎందరో తరించిన సంఘటనలు మనకు అనేక పురాణాలవల్ల తెలుస్తున్నాయి.
శివమహాపురాణం, కార్తీకపురాణం, స్కాంద పురాణం, లింగపురాణం మొదలైన ఎన్నో గ్రంథాలలో శివుని యొక్క లీలలు మనకు కనిపిస్తాయి. భక్తులకు మైమరింపజేస్తాయి. భక్త్భివాన్ని పెంపొందింపజేస్తాయి. ప్రదోష సమయంలో పరమేశ్వరుని పూజించినా, స్మరించినా, ధ్యానం చేసినా సత్వరమే అనుగ్రహించి కటాక్షించగల దయామయుడు. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాటి అర్థరాత్రి లింగోద్భవమైన రోజును మహాశివరాత్రిగా అత్యంత భక్తి ప్రపత్తులతో అందరూ జరుపుకోవటం ప్రాచీన కాలంనుండి వస్తున్న సంప్రదాయం. ఆ రోజున ఉపవాస, జాగరణ, అభిషేక, అర్చనలతో ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని ప్రతి ఒక్కరూ తహతహలాడతారు.

- అబ్బరాజు జయలక్ష్మి