మంచి మాట

ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనుకటిరోజుల్లో పిల్లలకు జ్వరం వస్తే పసరుమందు త్రాగేంచేవారు. అది చాలా చేదుగా వుండేది. ఆ పసరును బెల్లంతో కలిపి త్రాగించేవారు. యిష్టంగా తినేవారు. జ్వరం కూడా తగ్గుతూ, ఆరోగ్యంగా వుండేవారు. ఈ వర్తమాన కాలంలో దైవచింతన, పారమార్థికత కూడా అంతే. రోజంతా అనేక కార్య వ్యవహారాలలో నిమగ్నమై గుడికి వెళ్ళితే దైవదర్శనం, ప్రసాదం కూడా మనిషికి ఆనందాన్ని ఇవ్వడంలేదు. అందుకే రామాయణం, భారత కథలు, పురాణ కాలక్షేపంలో చిన్న చిన్న పిట్టకథలు కలబోసి ఆధ్యాత్మికత పట్ల అభిరుచి కలిగించుతున్నారు. వర్తమాన కలికాలంలో బ్రతుకుబాటలో ప్రశాంతత, ఆనందం పొందుతున్నామని భ్రమపడేవారెక్కువగా ఉన్నారు.
తాను కోరుకున్న కార్యంలో సఫలత పొందినపుడు ఆనందం పొందేవారు కొందరు. వస్తు వైభోగాలు, ఆర్థిక స్థితిగతులు బాగున్నవారు, సంతోషంగా వుండేవారు మరికొందరు. ఇలా రకరకాలుగా జీవితాన్ని సుఖంగా వుండుటతో ఇదే నిజమైన శాశ్వత సుఖశాంతులుగా భ్రమించడం ఓ రకంగా పిచ్చిభ్రమ అని చెప్పక తప్పదు. భౌతిక సుఖాలు, శాశ్వత ఆనందాన్ని మనస్సుకు చేర్పించవు. సత్యమైన శాంతి, సత్యమైన ఆనందం కేవలం ఒక్క పారమార్థిక చింతనతోనే సుసాధ్యం. ప్రేమ, పవిత్రత, ఆత్మీయత, శాంతి.. ఇవన్నీ మన ఆత్మ యొక్క నిజస్వరూపాలు. లోతుల్లోకి తొంగిచూసినపుడు అసలైన ప్రేమానురాగాలు, ఆత్మీయతా అనుబంధాలు శాంతి సద్భావనలు అనుభూతులను ఆస్వాదించుటలో మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉండాలి.
దైనందిక జీవితాన్ని దెబ్బతినేంతగా దినమంతా అధిక సమయం అవసరం లేని ఆలోచనలతో మనకు సంబంధం లేని వారి గురించి వ్యర్థపు చింతనలతో గడపడంవల్ల మనస్సు నిశ్చలంగా, స్వచ్ఛంగా వుండదు. బుద్ధి మందగించుతుంది. కార్య వ్యవహారాల నిర్వహణలో శక్తి నిర్ణయించుటలో సన్నగిల్లుతుంది. మన మేధస్సులో శుభ సంకల్పాలకు ఎక్కువగా స్థానం కలిగించాలి. పాజిటివ్‌గా ఆలోచించడంవల్ల నిర్మలమైన మనస్సు, మన సొంతం అవుతుంది. పవిత్ర గంగానదీ జలాలు ఎలాంటి చెత్తా చెదారం లేకుండా వుండుటవల్లనే గంగామాతగా పూజింపబడుతుంది.
అలాగే మనస్సు అనేది ఆలోచనల కర్మాగారం. ఖాళీగా వుండదు. ఏదో వెనకటి రోజుల్లో జరిగిన దుర్ఘటన మనస్సును తొలుస్తుంది. గత జ్ఞాపకాలు నిన్నటి పాచిపోయిన ఆహారంతో సమానం. అలాంటి భోజనం రోగాలను తెస్తుంది. అందంకోసం ఖాళీగా మనస్సును వుండనీయకుండా సామాజిక సేవా కార్యక్రమాలవైపు మనస్సును మళ్లించాలి. భగవత్ చింతన, విలువలు ప్రబోధించే రామాయణ, మహాభారత పుస్తకాల పఠనంవైపు అభిరుచి కలిగించాలి. మనస్సు అనే భూమిలో శుభసంకల్పాల బీజాలు నాటాలి. శుభచింతన ద్వారా చేసే కర్మలు, కార్యవ్యవహారాలు సఫలీకృతంగా విజయవంతంగా అవుతాయనేది నిజం.
కొందరు ప్రతి చిన్న విషయానికి, తీవ్రమైన ఆందోళన, భయభ్రాంతులు చెందుతూ జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం మన సహజ గుణాన్ని కోల్పోయినపుడు మానసిక ప్రశాంతత కరువవుతుంది. జీవితంలో శ్రమ, ఒత్తిడి అధికమైనపుడు సమస్యలను ఎదురీదడంలో కావాల్సింది మెడిటేషన్. మెడిటేషన్ మనస్సుకు మెడిసిన్. గంట రెండు గంటలకొకసారి వౌనంగా ఓ క్షణం, ఓ నిమిషం నెగెటివ్ ఆలోచనలు చేయకుండా పరమాత్ముని విశ్వసిస్తూ పాజిటివ్ ఆలోచనలకు స్థానం కల్పించడమే మెడిటేషన్ అని అంటుంటారు ఆధ్యాత్మిక పరిశోధకులు.
..........................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-బ్రహ్మదేవర సాంబమూర్తి