మంచి మాట

ధర్మం కంటే దైవం మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం రసరమ్యం. అందులో అవసరం లేందేదీ లేదు. ప్రతిదీ తెలుసుకోవాల్సిన విషయమే. అయోధ్యకాండలో అలాంటిదే ఒక సంఘటన శ్రీరాముడిని వనవాసానికి వెళ్లమని కైక కోరడం. శ్రీరాముడిని అడవులకు పంపాలని, ఆయన స్థానంలో తన కొడుకు భరతుడికి పట్ట్భాషేకం చేయాలని కైక దశరథుడిని కోరడం, ఆ విషయాన్ని ఆయన మాటగా కైకే స్వయంగా రాముడికి తెలియచేయడం, రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి అడవులకు పోవడానికి సిద్ధపడి తల్లి కౌసల్య అనుమతి- ఆశీర్వాదం కొరకు ఆమె దగ్గరకు పోవడం, ఆ సమయంలో కౌసల్య, తమ్ముడు లక్ష్మణుడు కైకను దూషించి రాముడు అడవులకు పోవద్దని అభ్యంతరపెట్టడం నేపథ్యంలో ధర్మం, అధర్మం, నీతి, న్యాయం లాంటి విషయాలెన్నో లక్ష్మణుడికి వివరిస్తాడు రాముడు. ధర్మాన్ని మించిన దైవం వుందని అంటూ విధి చేష్ట ఎలా వుంటుందో సోదాహరణంగా తెలియజేశాడు రాముడు.
ధర్మాన్ని మించిన దైవం వున్నాడని, కైక మోసం చేసిందని ఆమె మీద కోప్పడకూడదని, అందులో ఆమె తప్పేమీ లేదని అంటాడు రాముడు. తనకు పట్ట్భాషేకం చేయాలని ప్రయత్నం చేసినవాడు దశరథుడు కాదని, విఘ్నం కలిగించింది కైక కాదని, తాను అడవుల పాలవడానికి తన దోషం ఏదీ లేదని, ఇవన్నీ కేవలం దైవకృత్యాలేనని అంటాడు. ఇంకా ఇలా అంటాడు: ‘‘ఇంత దూరాలోచన దైవ ప్రేరణ వల్లనే కలిగింది. అలా కాకపోతే తనకు ఏ అపరాధం చేయని నన్ను నిష్కారణంగా కష్టపెట్టాలని కైక మనసుకు కలగడం సాధ్యమా?
మన ముగ్గురు తల్లులలో, నా మీద ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ప్రేమ అని చెప్పడానికి, వారిలో కొంచెమైనా తారతమ్యం కనిపించడం నేను చూడలేదు. ఇదే కైకకు నిన్నటిదాకా తన కొడుకుపై ఎక్కువ ప్రేమ కాని, నామీద తక్కువ ప్రేమ కానీ, విరోధభావం కానీ లేదు. ఇదంతా ఇవ్వాళే కలగడానికి కారణం చెప్పగలమా? ఉన్నట్లుండి ఇంతటి ప్రేమ విరోధంగా మారడానికి కారణం దైవం కాకుండా మరెవరు? తన కన్న కొడుకు కంటే నాపై ఎక్కువ ప్రేమగల కైక, నిష్కారణంగా కఠినోక్తులు మాట్లాడి, అడవులకు పొమ్మని అనడం అంటే, ఇదంతా విధి చేష్ట కాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు’’.
రాముడు ఇంకా ఇలా అంటాడు: కైక సహజంగా ఆమె దుష్టురాలు కాదు. ఆమె పుట్టడంతోనే ఆమెతో గుణాలకు తోడు గౌరవం కూడా పుట్టింది. కులం కొలది గుణం అంటారు. ఆమె గొప్ప వంశంలో రాజకుమారిగా పుట్టింది. గొప్ప జాతిలో, గొప్ప వంశంలో పుట్టి, గొప్పవారి సాంగత్యంలో పెరిగినదానికి నీచగుణం సహజమని ఎలా చెప్పగలం? సాలగ్రామాల గనుల్లో గులకరాళ్లు కూడా వుంటాయి కదా? సముద్రంలో విషం పుట్టలేదా? అలా ఐతే బాల్యంనుంచే ఆమె నీచురాలై వుండాలి. అలా కాకుండా, దానానికి, దయకు స్థానంగా కీర్తిని సంపాదించింది. సహజంగా నీచురాలైతే ఆమెకు ఈ కీర్తి కలిగేదా?
తమ యోగ క్షేమాలకు హాని కలిగిస్తారేమోనని అనుమానం కలిగిన తోటి రాజులను అణచివేసే ప్రయత్నాన్ని పట్ట్భాషిక్తులైన రాజులు కూడా చేయడం లేదా? ఒకరికి ఎంతైనా దానం చేయగల కైక పరుల సొత్తును ఎందుకు ఆశించింది? ఎంతో దయాగుణం కల ఆమె ఇలాంటి క్రూరమైన పనికి ఎందుకు సాహసించింది? ఎందుకు భర్తను ఎదిరించింది? ప్రీతిపాత్రుడనైన నన్ను ఎందుకు బాధాకరమైన మాటలను అనగలిగింది? దైవం ఆవేశించకున్న ఆలా చేయగలిగేదా? సహజమైతే కొన్నాళ్లు ఎందుకు చేయలేదు? కాబట్టి ఇంత మహిమ గలది, ఊహించలేనిది, అసాధ్యమైన ప్రభావం కలదైన దైవం ఎలాంటివారికైనా అందలేనిదే. దానికి ఎదురులేదు. ఆమెకు ఆ దుర్బుద్ధి పుట్టడానికి, నాకు దారిద్య్రం రావడానికి దైవమే కారణం. ఆ దైవమే ఇంత పని చేసింది’’.
రాముడు చెప్పిన ప్రతి మాట అందరికీ అన్ని వేళలా వర్తిస్తుందనడంలో సందేహం లేదేమో!

-వనం జ్వాలా నరసింహారావు