మంచి మాట

విచక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవేశం అన్ని అనర్థాలకు మూలం. ఈ భూ ప్రపంచంలో అన్ని జీవరాశులకన్నా మనిషి చాలా తెలివిమంతుడు. మంచి చెడు విచక్షణా జ్ఞానం కలిగిన ఏకైక జీవి. అంతరిక్షానికి అవలీలగా ఎగిరిపోయాడు. అధఃపాతాళం అంతు చూశాడు. నిరంతరం ఏదో కనుగొనాలన్న తపనతో అనే్వషణ కొనసాగిస్తూనే ఉన్నాడు. అలాంటి మనిషి ఒక్కొక్కసారి తనే అన్నీ మర్చి అశాశ్వతమైన భౌతిక సుఖాలకోసం అనవసరంగా ఆవేశానికి లోనై మానవత్వం మర్చి మనిషిగా మాయమైపోతున్నాడు. మరి దీనికి పరిష్కారం లేదా!? అంటే! కచ్చితంగా వుందనే చెప్పవచ్చును. ఒక్క క్షణం మనిషిగా ఆలోచిస్తే.. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం కచ్చితంగా దొరుకుతుంది.
చరిత్రలను తరచి చూస్తే.. ఎన్నో ఉదంతాలు మనకు అవగతమవుతాయి. కలకంఠి కన్నీరు ఒలికిస్తే అక్కడ లక్ష్మీదేవి నిలువదు అన్న నానుడి. నిండు సభలో ద్రౌపదిని అవమానపర్చిన కౌరవులు ఏమయ్యారన్నది జగమెరిగిన సత్యం. దాయాదుల పోరులో ఎప్పుడు సత్యం ధర్మమే గెలుస్తాయి అనడానికి పాండవులే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. భగవంతుని చేత వరాలు పొంది అహంకారంతో విర్రవీగిన ఎందరో రాక్షసులు అదే భగవంతుని చేతిలో హతమైన ఘటనలు కోకొల్లలు. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, నరకాసురుడు, భస్మాసురుడు, కంసుడు లాంటి ఎందరో రాక్షసులు అనవసర ఆవేశాలకు లోనై భగవంతుడి చేతిలో మరణించాడు.
అదే భగవంతుని అనుగ్రహంతో ఎందరో మహాభక్తులు భక్తి పారవశ్యంతో ప్రజల గుండెల్లో ఆదర్శంగా నిలిచారు. సతీ అనసూయ త్రిమూర్తులను తన భక్తితో పసిపాపలను చేసి ఆడించి ఆనందపరవశురాలయ్యింది. సతీ సావిత్రి తన భక్తితో యముడినెదిరించి తన భర్త ప్రాణాలను కాపాడుకొంది. మార్కండేయుడు సాక్షాత్ ఆ మహాశివుని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. క్షేత్రయ్య పల్లె పదాలతో భగవంతుని అనుగ్రహం పొంది అమరుడయ్యాడు. అన్నమయ్య కలియుగ దైవం శ్రీవేంకట్వేరుని తన కీర్తనలతో అలరించాడు. త్యాగయ్య, రామదాసు, కబీరు లాంటి పరమ భక్తులు ఆ భగవంతున్ని మెప్పించిన అమరులు..
మనిషికి జీవితం చరితార్థం కావాలంటే ఎన్నో మార్గాలు. ఉదయం లేచింది మొదలు ఎన్నో పనులతో బిజీగా ఉంటాడు. కాని ఆ భగవంతుని నామస్మరణతో జీవితం ముడిపడితే జీవితం ధన్యమవుతుంది. నేను, నాది, నావాళ్ళు అన్న అహంకారం విడనాడితే మనిషి మహాత్ముడు అవుతాడు. వచ్చినపుడు మనం ఏమి తీసుకురాలేదు. పోయేవేళ కూడా ఏమీ తీసుకుపోము. అదే మానవ జీవిత రహస్యం. ఆ రహస్యం పేరే భగవంతుడు. మనిషి జీవించి ఉన్నంతకాలం మనం చేసిన మంచే మన వెంట వస్తుంది. అలా ఎందరో మహాత్ములు మనకై ఎన్నో త్యాగాలు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. పదిమందికి ఆదర్శంగా నిలవాలి. మనం మహాత్ములు కాకపోయినా ఫర్వాలేదు- మనుషులుగా జీవిస్తే చాలు. ముందు మనకు జన్మనిచ్చిన మాతాపితరులను, చదువు నేర్పిన గురువులను సదా సేవించాలి. మానవసేవయే మాధవ సేవ అన్న నానుడిని అనుసరించి అనాధలకు, అన్నార్తులకు మన వంతు సాయం చేయాలి. మంచి మనసుతో మనిషిగా జీవించాలి. అపుడే మన జీవితానికి ఓ అర్థం పరమార్థం. మనల్ని నడిపించే ఆ భగవంతున్ని సదా స్మరించుకోవాలి.
మన మహాత్ములు మనకై అష్టాదశ పురాణాలు వ్రాసి మనకందించారు. చక్కగా చదివితే ఎంతో పుణ్యం. నేడు ప్రసార మాధ్యమాలవల్ల ఎందరో మహానుభావులు మనకై ప్రవచనాల రూపంలో మనకోసం సరళమైన భాషలో మనకు విన్పిస్తున్నారు. భక్తి పూర్వకంగా మనం వింటే ఎంతో పుణ్యఫలం. పూర్వకాలంలో నాటకాలు, హరికథలు, బుర్రకథలు, యక్షగానాల రూపంలో చెప్పేవారు. మన సనాతన సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి. మన కళలను, కళాకారులను సదా సంరక్షించుకొనే బాధ్యత మనదే.

- కురువ శ్రీనివాసులు