మంచి మాట

చక్ర భ్రమణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సృష్టి అంతా (పకృతి, ప్రపంచం), జీవులు, దేవుడు అనే మూడు విషయాలపైనే నడుస్తున్నది. జీవుల్లో అతి ఉన్నతమైన జన్మ మానవజన్మ.
‘‘సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయంటారు. అందులో ఎంతో గొప్పదే మానవ జన్మ. ఒక విధంగా మానవ జన్మ ఒక వరం లాంటిది.’’ జీవుల పుణ్యం వలనే మనుష్య జన్మ దొరుకుతుంది. భగవంతుడిచ్చిన ఒక గొప్పదైన అవకాశం ఈ మనిషి జన్మ. మనిషి జన్మకు ప్రత్యేకత ఉంది. 84 లక్షల జీవరాశుల్లో లేనిది, మనిషికి ఉన్నది ఆలోచనా శక్తి.
అందుకే తన జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని పొందే అవకాశం ఈ మనుష్య జన్మలోనే సాధ్యమయ్యే వీలుంటుందని పెద్దలు, ఉపనిషత్తులు చెబుతున్న విషయాలు పరోక్షంగా పరమాత్మ ఇచ్చిన దివ్యావకాశం.
స్ర్తి,పురుషులు భార్యాభర్తలై తల్లిదండ్రులవటం, వారి ద్వారా సంతానోత్పత్తి జరగడం. ఆ పిల్లల్ని పెంచడం, వారు పెద్దయ్యాక మళ్లీ చక్రభ్రమణం మొదలై వారు తల్లిదండ్రులవ్వటం. ఇలా స్ర్తి, పురుషుల జనన-మరణ-భ్రమణం సాగుతూనే ఉంటుంది. ఈ పుట్టుక (పెరగడం), గిట్టుట (చనిపోవుట) అనేవి ఎప్పటికీ, ఎవ్వరికీ అర్థంకాని విషయాలుగానే తోస్తాయి. కేవలం ధనం, సుఖం, సంతోషాలే ప్రధానంగా భావించటం జరుగుతుంటుంది.
ధనంతోనే సుఖాలు దక్కుతాయనుకోవటంలో మూర్ఖత్వం కనిపిస్తుంది. కాని ఆ డబ్బుకోసమే, ధనంకోసమే అందరూ ప్రాకులాడడం మనం నిత్యం చూస్తుంటాము.
జీవనం గడపడానికి సంపద అవసరమే. కాని ఆ సంపద అంటే డబ్బుతోనే ప్రపంచం నడుస్తుందనుకోవటం, డబ్బుతోనే సమస్తం ముడిపడి ఉన్నదనుకోవటం మామూలు మూర్ఖత్వం.
మనిషి జీవితంలో సౌకర్యాలు, అసౌకర్యాలు ఎక్కడనో ఉండవు. ఆ వ్యక్తి పాప పుణ్యాలే. ఒక మనిషికి ఉన్న సంపద, ఆరోగ్యం, పరివారం, కుటుంబం ఆ వ్యక్తి పుణ్యఫలాలయితే. అనారోగ్యం, ఒంటరితనం, దారిద్య్రం పాప ఫలాలని పెద్దలు చెప్తారు. సంపాదన, వ్యయం, జీవనం, త్రికరణ శుద్ధిగా జరగాలి. అప్పుడే పాపాల జాబితా తయారవదు. ఏ పనిచేసినా ఆలోచన, మాట, క్రియ- ఈ మూడే త్రికరణ శుద్ధితో చేయాలి. జీవుడికి 84 లక్షల జన్మలలో చివరిగా లభించేదే మనిషి జన్మ. మనిషి జన్మలో ధర్మంగా జీవించలేకపోతే మళ్లీ చక్రభ్రమణం మొదలవుతుంది. భగవంతుని అనుగ్రహం దొరక్కపోతే మళ్లీ మళ్లీ ఇలానే జరుగుతుంది.
దుర్లభమైన మానవ జన్మను బుద్దితో, ధర్మ, అర్ధ, కామాలను తగువిధంగా ఆచరిస్తూ, కర్త, కర్మ, క్రియ అనేవి పరమాత్మకై తపించితే ఆపై మోక్షమే. మానవ జన్మ ఎత్తి ఆత్మజ్ఞానం పొందగలిగితే సరి.. లేదంటే మళ్లీ మళ్లీ జన్మలు ఎత్తవలసి ఉంటుంది.
ప్రతి పని త్రికరణ శుద్ధితో చేసేది, చేయించేది అంతా పరమాత్మ అన్న సత్యానె్నరుకతో జీవిస్తూ పరమాత్మ పాదచరణం శరణం అంటుంటే చక్రభ్రమణం నుండి విముక్తి లభించగలదు.
.................................................................
మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-శ్రీమతి గంటి కృష్ణకుమారి