రివ్యూ

కథ విడిచి సినిమా గరిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మామ మంచు అల్లుడు కంచు (బాగోలేదు)

తారాగణం:
మోహన్‌బాబు, అల్లరి నరేష్, రమ్యకృష్ణ, మీనా, అలీ, వరుణ్ సందేశ్, పూర్ణ, సోనియా, కృష్ణ్భగవాన్, జీవా, సురేఖావాణి, హృదయ తదితరులు
సంగీతం:
కోటి, అచ్చు, రఘు కుంచె
నిర్మాత: విష్ణు మంచు
దర్శకత్వం:శ్రీనివాసరెడ్డి

‘ప్రేమలోనూ, యుద్ధంలోనూ ఏంచేసినా తప్పులేదు’ (అది ఈ చిత్రంలో ఉదహరించిన డైలాగే) అంటారు. దానికి కొనసాగింపుగా సినిమా చూపడంలో కూడా ‘ఏం చేసినా తప్పులేదు’ అన్న నిర్థారణకు వచ్చేలా ‘మామ మంచు అల్లుడు కంచు’ చేసేసింది. వాస్తవానికి ఈ సినిమాకి ఉద్దండులైన నటీనటుల సామర్థ్యం, బలం ఉంది. హాస్య చిత్రాలను తనదైన శైలిలో చూపగల సత్తావున్న ప్రతిభావంతుడైన దర్శకుని నేతృత్వమూ ఉంది. లేనిదేమిటంటే చిత్రానికి ఆక్సిజన్‌లాంటి కథాంశం. అది కొరవడినందువల్లే అన్నీ ఉన్నా ‘మా మంచు..’ నిరర్థక ప్రయత్నమైపోయిందనడం బాధాకరమే! కథలోకి వెళ్తే.. పరిస్థితుల ప్రభావం (?) వలన భక్తవత్సల నాయుడు (మోహన్‌బాబు) అప్పటికే సూర్యకాంతం (మీనా)ను వివాహం చేసుకుని, ప్రియంవద (రమ్యకృష్ణ)నూ పరిణయమాడతాడు. వాళ్ళిద్దరి దాంపత్యఫలంగా సూర్యకాంతానికి జ్యోతి (పూర్ణ), ప్రియంవదకు గౌతమ్ నాయుడు (వరుణ్ సందేశ్) పుడతారు. యుక్తవయసులో వీరిద్దరూ ఫోనుద్వారా దగ్గరవుతున్నారని తెలిసి భక్తవత్సలనాయుడు గౌతమ్‌నాయుడు పాత్రలో ఇస్మాయిల్ (అలీ) సాయంతో బాలరాజు (అల్లరి నరేష్)ను ప్రవేశపెడతాడు. తర్వాత ఏమైంది అన్నది మిగతా కథ. ఈ చిన్న జిస్ట్ చెప్పగానే సినిమాలు అప్పుడప్పుడు చూసేవారు కూడా తర్వాత ఏవౌతుందో చెప్పేయగలరు. అలాగే ఇంచుమించు ఇందులో జరిగింది. అసలిలా ముందేం జరుగుతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతే ఇంక సినిమాలో పటిష్టతేముంటుంది? అలాంటి పటిష్టత కోల్పోయే చిత్రం నిరాశక్తమయమైపోయింది. అసలీ చిత్రానికి మరాఠీ చిత్రం మూలమని అన్నారుగానీ, ఆ విషయాన్ని విస్మరించినా ఈ బాపతు ఒకరిననుకొని మరొకరితో బంధాన్ని పెంచుకోవడం అన్నది అనేకానేక తెలుగు సినిమాల్లోనే చూసేశాం. ఇంకోరకంగా చూస్తే ఇది ఇరవై మూడేళ్ల క్రితం (1992)లో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘అల్లరిమొగుడు’ కొనసాగింపుగానూ అనుకోవచ్చు. ఆ విషయానికి బలం చేకూరేలా ఆ చిత్రంలోని షాట్స్‌నే భక్తవత్సలనాయుడు రెండో వివాహానికి ఉన్న ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చూపడం వంటివి ఉన్నాయి. దాదాపు ఇరవై అయిదేళ్లు ఒకరిని కూకట్‌పల్లిలోనూ, మరొకరిని జూబ్లీహిల్స్‌లోనూ ఉంచి వివాహ విషయాన్ని తెలియకుండా ఉంచడం ఏరకంగా సాధ్యమో అన్నది చిత్ర దర్శకుడే సెలవివ్వాలి. అందులోనూ భక్తవత్సలనాయుడును పెద్ద బిజినెస్‌మాన్‌గానూ చెప్పారు. ‘నాన్న బిజినెస్ మీటింగ్’ అంటూ, వాటిలో తనూ పాలుపంచుకుంటున్నట్టు యుక్తవయసొచ్చిన గౌతమ్‌నాయుడు పాత్ర ద్వారా ఒకచోట చెప్పించారు. మరి అలాంటి పరిస్థితుల్లోనూ తండ్రి చేసే వ్యాపారం వగైరాల గురించి తెలుసుకోడా అన్నది ఎంత తలపట్టుకున్నా అర్థం కాదు. ఇవన్నీ పక్కకుపెట్టి చూస్తే ముందే పేర్కొన్నట్టు పేరొందిన నటీనటులు ఎందరో ఇందులో ఉన్నారు. వాళ్ళు తమకలవాటైన నటనని అలవోకగా ఇందులో చేశారు. మోహన్‌బాబు తనదైన సంభాషణా చాతుర్యంతోపాటు, ఇంట్రొడక్షన్ సాంగ్‌లో స్టెప్స్‌ని వేసి మరీ అలరించాడు. నరేష్‌కు ఈ టైపు నటన నల్లేరుపై బండి నడకలాంటిదే! అయితే పాత్ర పరిధిని ఇంకాస్త పెంచాల్సింది. జ్యోతిగా పూర్ణ చిరునవ్వులకే పరిమితం కాగా, మీనాకన్నా ప్రియంవద పాత్రలో రమ్యకృష్ణ ఇప్పటికీ తనలో గ్లామర్ పోలేదని చెప్పేశారు. ఇస్మాయిల్ పాత్రలో అలీ ఒదిగిపోగా, కాసేపు ఉన్నా సన్యాసిరాజు పాత్రలో కృష్ణ్భగవాన్ తన ఉనికిని చక్కగా చాటుకున్నాడు. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేసినా ఏ పాటా మనసుకి పట్టేలా లేదు. కాస్తంత కోటి అందించిన నేపథ్య సంగీతమే కొన్నిచోట్ల బావుంది. శ్రీ్ధర్ సంభాషణలన్నీ పంచ్‌పరంగా సాగాయి. అన్నీ సందర్భానికి అతక్కపోయినా కొన్ని మాత్రం బాగా పేలాయి. ‘రైన్‌బో హాస్పిటల్‌కి పోనీ’ అంటే అది చిన్నపిల్లల హాస్పిటల్ కదా అన్న సందేహానికి సమాధానంగా హాస్పిటల్ పిల్లలదైనా అక్కడ డాక్టర్లు పెద్దవాళ్ళే ఉంటారు అనడం బాగాపేలింది. అలాగే రమ్యకృష్ణ భర్తగా అలీ అనుకున్న కృష్ణ్భగవాన్ భర్తకోసం పెద్దసైజు బూట్లు కొంటున్న ఆమెతో ‘బావగారు మనిషి పొట్టైనా పాదాలు పెద్దవన్నమాట..’ అనడం బాగా పేలింది. ‘ఆమెమో రుద్రాక్ష మాలేసుకుని పవిత్రంగావుంటే, నువ్వేమో క్షుద్ర పూజలు చేసేవాడిలా ఉన్నావ్’ వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. కాకలుతీరిన నటీనట సముదాయానికి విశిష్టమైన కథాసూత్రం ఆలంబనగావుంటే ‘మామ మంచు...’ అందరినీ అలరించేదేమో!

- అన్వేషి