మనలో - మనం

మనలో-మనం ఎడిటర్‌తో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్యమీ సాగర్, హైదరాబాద్
సాధారణంగా ఆర్టీసీ అన్ని బస్సు సర్వీసులలో ఎమ్మెల్యే, ఎం.పీ సీటు కేటాయిస్తారు కదా. నిజంగా మన ప్రజా ప్రతినిధులు సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణం చెయ్యగలరా... కనీసం అప్పుడైనా ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులు తెలుస్తాయి కదా... మరి వాళ్లు మన బస్సులలో ప్రయాణం చెయ్యనప్పుడు ఆ కోటా ఎందుకండీ?
వాళ్లకు కావలసిన వాళ్లని ఆ సీట్లలో కూచోబెట్టించేందుకు.

బి.చంద్రమ్మ, తిరుపతి
పుట్టలో పాలు పోస్తే, ఆ పాలన్నీ పామే తాగుతుందా? మన్ను కరిగి పుట్ట నేలమట్టమై పోతుందా?
పామూ తాగదు. పుట్టా కరగదు.

ఎం.కనకదుర్గ, తెనాలి
ఒక నెల ముందు ఇద్దరు చంద్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై కేసు నమోదు కావడం తథ్యం అనిపించింది. సడెన్‌గా సీను రివర్స్ అయ్యింది. రాజధాని శంకుస్థాపనకు కెసిఆర్‌కు ఘన స్వాగతం ఇచ్చారు. ఓటు నోటు కేసులో టిఆర్‌ఎస్ ప్రభుత్వం వౌనం వహిస్తోంది. విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించడంలో చంద్రబాబు అత్యుత్సాహం కనబరుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇద్దరు చంద్రుల మధ్య సెటిల్‌మెంట్ జరిగినట్లు అనిపిస్తోంది. నా ఊహ కరెక్టేనంటారా?
అందుకు సందేహమేల?

డొక్కా చంద్రశేఖరం, వక్కలంక
ఒక టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధి ఒకరు నేను రౌడీ షీటరునే. కానీ రౌడీని కాను అని సెలవిచ్చారు. నాకైతే తేడా తెలియలేదు, మీకేమైనా?
లీడరు అయ్యాక ‘షీటరు’ ఒక్కటే మిగులుతుంది కాబోలు

స్వచ్ఛ భారత్ విజయవంతం కావడానికి ప్రజల సహకారం, అవగాహన చాలా ముఖ్యం. అలాగే శుద్ధి కార్మికుల పనితనమున్నూ. ప్రజలకు జీతభత్యాలు ఉండవు కాని కార్మికులకు అవి ఉంటూనే ఉన్నాయి. మరి ఈ కొత్త పన్ను దేనికట?
తిండి దండగ యంత్రాంగాన్ని మేపడానికి.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
ఉగ్రవాదులను తామే పెంచి పోషించినట్లు సాక్షాత్తూ పర్వేజ్ ముషారఫ్ ‘బయాన్’ ఇచ్చాక కూడా పాకిస్తాన్‌లో భూకంపానికి మన దేశస్థుల సొమ్ము ధారాదత్తం (సాయం) చేస్తామని మోదీగారు చెప్పడాన్ని ఏమనుకోవాలి?
అదో రకం మెహర్బానీ

డి.చాంద్ బాష, కర్నూలు
పేదరికం పెరుగుతూనే ఉంది. రాజరికం తరగట్లేదు ఎందుకని?
ఇది తరగనందువల్లే అది పెరిగేది.

బోరు బావులపై మూతలేని రోత ప్రభుత్వం గురించి మీ కామెంట్?
ఆ రోతలో మనవారి బాధ్యతా రాహిత్యపు వాటా కూడా ఉంది.

గుండు రమణయ్య, పెద్దాపూర్
‘అసహన’ ధోరణులకు తెర దించాలని వ్యాఖ్యానించిన ప్రణబ్ ముఖర్జీ గారి పిలుపుపై మీ అభిప్రాయం?
పాత గూటి పలుకు

ఆదిశంకరాచార్య ‘జయంతి’ని ఆధ్యాత్మిక దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర సాంస్కృతిక శాఖ సమాయత్తమవటంపై మీ అభిప్రాయం?
మంచిదే. కాని ముందు ఆ జయంతి ఎన్నడో నిర్ధారించుకోవటం మేలు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఆదివారం అనుబంధంలో యల్లాప్రగడ సుబ్బారావుగారు పుట్టింది తూర్పుగోదావరి జిల్లా అని రాశారు. కాని ఆయన జన్మించింది పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో. 12.1.1895లో జన్మించి, 9.8.1948లో పరమపదించారు.
అయితే పొరపాటే.

బిజెపి వారి మీటింగుల్లో టిఆర్‌ఎస్ ను విమర్శించే దత్తన్న, ముఖ్యమంత్రి, ఇతరుల సమావేశాల్లో అదే పనిగా పాల్గొంటూ పొగుడుతూంటారు. ఇదేమి ద్వంద వైఖరి.
బతక నేర్చిన లౌక్యం

పెయ్యల శ్రీనివాసరావు, అలికాం
ఒకప్పుడు మన దేశంలో స్వాతంత్య్ర పోరాటాల్లో జైలుకి వెళితే పవిత్రంగా భావించేవారు. అలా కాకుండా ఏదైనా తప్పు చేసి వెళితే అవమానంగా భావించేవారు. కాని ప్రస్తుతం జైలుకి వెళ్లి రావడమంటే గర్వంగా భావిస్తున్నారు. దీనిని మీరేమంటారు? ఈ సంస్కృతిని ఏమని అనుకోవాలి? (ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో)
పోయే కాలం.

వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా
‘అసహనం’ పేరు చెప్పి సాహితీ అవార్డులను తిరిగి ఇస్తున్న కుహనా రచయితలు - మరి అదే స్థాయిలో అవార్డుతోపాటు అందుకున్న నగదు - నేటి వరకు దాని వడ్డీ మరియు వారి పుస్తకాల రాయితీని మాత్రం ఎందుకు వాపసు చేయలేదు?
అడిగేవాళ్లు లేక. అయినా ఆ సీజను అయిపోయింది.

మామెడ రాజేంద్రప్రసాద్, వౌలాలి
గణేశ్ నవరాత్రుల్లో వృధా ఖర్చు చేస్తున్నారని, దీపావళి రోజు అనవసరంగా టపాకాయలు కాల్చి వృధా ఖర్చు అలాగే పర్యావరణం పాడు చేశారని, కాలుష్యం పెంచారని గుండెలు విపరీతంగా బాదుకున్న కొన్ని ఛానల్స్ వారు మరి తొందరలో వచ్చే కొత్త సంవత్సరం రోజున ఏ విధమైన టపాకాయలు కాల్చకుండా ప్రచారం నిర్వహిస్తారా? ఆ విధంగా కాలుష్యం తగ్గింపునకు కృషి చేస్తారా?
భ్రష్ట హిందూ మేధావుల ప్రతాపమంతా కరవలేని హిందూ సమాజం మీదే...

కె.మధుసూదనరావు, నిజామాబాద్
ప్రభుత్వ ఉద్యోగులకు, హిందువుల పండుగలకు హిందువులకు, ముస్లిం పండుగలకు ఆ మతస్థులకు, క్రిస్టియన్లకు వారి పండుగకు మాత్రమే సెలవలు ఇస్తే బాగుంటుంది. జాతీయ పండుగకు అందరికీ ఇవ్వాలి. దీనిపై మీ అభిప్రాయం?
మంచిదే.

*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com