మహబూబ్‌నగర్

పాలమూరు ఎత్తిపోతతో పేటకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 17: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారానే నారాయణపేట నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని, ఈ ప్రక్రియ మరో రెండు సంవత్సరాల్లో పూర్తవుతుందని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈసందర్భంగా నారాయణపేట కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సాగునీటి సాధన బహిరంగ సభకు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రి హరీశ్‌రావు రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మాయమాటలను రైతులు, ప్రజలు నమ్మవద్దన్నారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో తమకు ఉన్న పనంతా రైతులకు సాగునీరు ఇవ్వడమేనన్నారు. కర్వెన రిజర్వాయర్ నుండి కాల్వల ద్వారా నారాయణపేటకు 1.20లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామన్నారు. త్వరలోనే కాల్వల పనులను ప్రారంభించి మరోసారి ఇదే మైదానంలో ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు చెబుతానన్నారు. వందశాతం పాలమూరు ప్రాజెక్టు ద్వారానే నారాయణపేటకు మొదటి దశలోనే కృష్ణా జలాలను ఎలా తీసుకువస్తానో చేసి చూపిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా జాయమ్మ చెరువును కూడా నింపుతామని అంతే కాకుండా కొండారెడ్డిపల్లి చెరువును కృష్ణా జలాలతో నింపి మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామన్నారు. ఇందుకుగానూ అదనంగా మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాయమ్మ చెరువుకు పదికోట్లు కేటాయిస్తామన్నారు. అంతేకాకుండా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ కెనాల్ పనుల ప్రారంభానికి 36కోట్ల నిధులను కేటాయిస్తామన్నారు. కోయిల్‌కొండ మండలంలోని వివిధ గ్రామాలకు సాగునీరు అందించేందుకు గొండ్యాల ఆనకట్ట నిర్మాణానికి 6.50కోట్ల నిధులను మంజూరు చేస్తామని, ఇప్పటికే అందుకు సంబంధించిన జిఓలను విడుదల చేసినట్లు తెలిపారు. 17 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్ ద్వారానే నారాయణపేటకు సాగునీరందిస్తే రైతులకు శాశ్వతంగా కష్టాలు తీరుతాయన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లుగా జూరాల నుండి నీరు కావాలని చెప్పే మాటల్లో వాస్తవం లేదని, తాము దూర దృష్టితో పనిచేస్తున్నామని తమ చిత్తశుద్ది ఏమిటో మరో రెండేళ్లలో తెలిసిపోతుందన్నారు. రాయలసీమకు అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను తరలించుకుపోతే అక్కడి వెళ్లి మంగళహారతి ఇచ్చిన వారు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం సిగ్గు చేటన్నారు. రాజకీయాల కంటే ప్రజల ఆకాంక్షనే తమకు ముఖ్యమని, అందుకే అన్నీ నియోజకవర్గాలను సమాన దృష్టితో సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులు రాత్రి పూట పంట పొలాల్లో ఉండకూడదని, కుటుంబ సభ్యులతో సంతోషంగా నిద్రపోవాలనే ఉద్దేశంతోనే పగటిపూట విద్యుత్ ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం చేయడం లేదని కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు 75వేలు అందించి ఆదుకుంటున్నారన్నారు. దామర్‌గిద్ద మండలంలోని లక్ష్మీపూర్ చెరువును నింపి అక్కడి నుండి కానుకుర్తి చెరువులోకి కృష్ణా జలాలను పారిస్తామన్నారు. కానుకుర్తి చెరువు మరమ్మతుకు కూడా నిధులు కేటాయిస్తామన్నారు. మరికల్ మండల కేంద్రంలో నూతనంగా మార్కెట్‌యార్డును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ బహిరంగసభలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, మార్కెట్ కమిటీ చైర్మన్లు బండి వేణుగోపాల్, నర్సింహాగౌడ్, నాయకులు నాగరాజ్ సరాఫ్, డాక్టర్ నర్సింహారెడ్డి, గందె చంద్రకాంత్, రమేశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ
- పేట ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రి హోదా
- త్వరలోనే గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు
- మంత్రి లక్ష్మారెడ్డి

నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 17: ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి చర్లకోళ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నారాయణపేటలో జరిగిన బహిరంగసభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నామన్నారు. గత పాలకులు సర్కారు దవాఖానా అంటేనే ప్రజల్లో అపోహలు సృష్టించారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దే పనిని మొదలు పెట్టామని ఆ పనులు 50శాతం పూర్తయ్యాయన్నారు. అందులో భాగంగా నారాయణపేట ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా హోదా కల్పిస్తామని, ఇందుకు సంబందించి ఇప్పటికే జిల్లా ఆసుపత్రిలో ఉండాల్సిన సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. ఆసుపత్రికి కావాల్సిన పోస్టులను సైతం మంజూరు చేశామన్నారు. గతంలో నారాయణపేట ఆసుపత్రిలో ప్రతినెలా 30 కాన్పులు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం 300 కాన్పులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో 50 మాత్రమే ఉండేదని ప్రస్తుతం ప్రతి రోజు 500 మంది ఓపి ఉందన్నారు. ఆసుపత్రుల్లో మార్పులు తీసుకురావడంతోనే వైద్యం మంచిగా అందుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజల్లో మంచి పేరు వస్తోందన్నారు. త్వరలోనే ప్రభుత్వపరంగా గ్రామగ్రామానా ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. గర్భిణీ ల సంక్షేమం కోసం 102 అంబులెన్స్‌ను ప్రవేశపెట్టామని, బాలింతలకు కేసీఆర్ కిట్‌తో చేయూత ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు నుండి భీమా కాల్వల ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గానికి ఐదువేల ఆయకట్టుకు నీరు వచ్చేదని జూరాలలో నీరు లేని కారణంగా గత డిసెంబర్‌లో అప్పటికే సాగు చేసిన ఐదు వేల ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడగా కల్వకుర్తి కెనాల్ ద్వారా పంటలను కాపాడామన్నారు. నారాయణపేట నియోజకవర్గానికి 2020 ఫిబ్రవరి నాటికి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలోని కర్వెన రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పమని, కాంగ్రెస్ వారిలా మాయమాటలు చెప్పలేమన్నారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం మంత్రులను చూశానని ఆ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, పి సుదర్శన్‌రెడ్డిలకు ప్రాజెక్టులకు అవగాహనే లేదని కాల్వలు, టనె్నళ్లు, టిఎంసిలు అంటే తెలియని వారని ఎద్దేవా చేశారు. అదే ప్రస్తుత మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాత్రింబవళ్లు ప్రాజెక్టుల వెంట తిరుగుతూ పనులను వేగవంతం చేయిస్తూ ఆయకట్టుకు సాగునీరు వచ్చేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్ట్‌లపై అవగాహన లేదన్నారు. 2014లో గవర్నర్ పాలనలో వచ్చిన 69జిఓపై రాద్ధాంతం చేస్తున్నారని, ఆ జిఓ ద్వారా నారాయణపేటకు సాగునీరు రాదని తేల్చిచెప్పారు. ఈ జిఓ ఉత్తుత్తిదని, ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టేందుకే తీసుకువచ్చిన జిఓ అని అన్నారు. భీమా ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు 20 టీఎంసీలు ఉంటే ఈ ప్రాజెక్టు కింద 2.3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ఆస్కారం ఉందన్నారు. అలాకాకుండా 69 జిఓలో కొన్ని అంశాలను పొందుపరచి టీఎంసీ ద్వారా 15వేల ఎకరాలకు స్ప్రింకర్ల ద్వారా నీరందించి సాగునీరు ఇస్తామని జిఓ తీసుకువచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకుని ప్రతిపక్షాలు చెబుతున్న అబద్దాలను నమ్మవద్దని కోరారు.

నిరుద్యోగ యువత నడ్డివిరిచిన కేసీఆర్
* నియంతృత్వ, నిరంకుశ పాలనకు ఇక చరమగీతం
* యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్

మక్తల్, ఫిబ్రవరి 17: నవసమాజ నిర్మాణానికి, సమసమాజ స్థాపనకు పునాది విద్యావ్యవస్థ.. అలాంటి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మందాడి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. నిరుద్యోగ యువతను లక్ష ఉద్యోగాల పేరుతో నడ్డివిరిచిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. ఇక రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ కేసీఆర్ పాలనకు యువత చరమగీతం పాడేందుకై ముందడుగు వేస్తుందన్నారు. శనివారం నిరుద్యోగ చైతన్య యాత్రలో భాగంగా మక్తల్ మండలంలో ప్రవేశించిన యాత్రకు మండల పరిధిలోని గుడిగండ్ల, జక్లేర్, కాచ్‌వార్, మక్తల్ పట్టణంలో వేలాది మంది యువకులు స్వాగతం పలికారు. అనంతరం మక్తల్‌లో స్థానిక నల్లజానమ్మ దేవాలయం నుండి భారీ బైకులు, కార్లతో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌కు, చిట్టెం నర్సిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో అనిల్‌కుమార్‌యాదవ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గుప్త, డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాష, జడ్పీటీసీ వాకిటి శ్రీహరి, పార్లమెంట్ నియజకవర్గ ఇన్‌చార్జీ పురషోత్తంరెడ్డి, స్నిగ్ధారెడ్డి, రజితరెడ్డిలు మాట్లాడారు. 42 నెలల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అహంకార ధోరణులతో అణచివేతలకు పాల్పడుతూ చీకటి పాలనను కొనసాగిస్తుందని వారు విమర్సించారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఉద్యమిస్తే ప్రభుత్వం వారి ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయచూసిందని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలను ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం మండలానికో ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. రాబోయో 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇప్పటికైనా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకొన్న ఖాళీలు, ఉపాధ్యాయ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, యూనివర్సిటీ లోని టీచింగ్, నాన్‌టీచింగ్ ఖాళీలన్ని భర్తీ చేయాలని, పరిశ్రమలను ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అక్కల సత్యనారాయణ, బి.నర్సిములు, రవికుమార్, కట్ట సురేష్, రవికిరణ్‌లతోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నా..
* ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
50 డబుల్ బెడ్ రూం ఇండ్లకు భూమి పూజ
అచ్చంపేట, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణ ఎన్నికల సందర్భంగా అచ్చంపేటలో నిర్వహించిన సభలో ఐదువేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పేదలకు నిర్మించి ఇస్తామని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం కేసీఆర్ 64వ జన్మదిన సందర్భంగా హాజిపూర్‌లో 50 డబుల్ బెడ్ రూం ఇండ్లకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాడానికే రాజకీయాలలో కొనసాగుతున్నానని, సంక్షేమ పథకాల అమలు, అంగన్‌వాడీ పోస్టుల విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించానన్నారు. ఈప్రాంతానికి సాగునీరు అందించేందుకు పుల్జాల వరకు ఆగిపోయిన కేఎల్‌ఐ ప్రధానకాలువను చంద్రసాగర్ చెరువువరకు పొడిగించేందుకు అనుమతులు మంజూరయ్యాయన్నారు. ఏడాది తిరిగే లోపు సీఎం కేసీఆర్‌తో కాలువలకు, పట్టణంలో డబల్ బెడ్ రూం ఇళ్లకు భూమి పూజ చేయిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అచ్చంపేటను రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రి, 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్ర ఏర్పాటు గిరిజనులకు డిగ్రీ కళాశాల, బీసీ, మైనార్టీలకు గురుకులాలు వంటి అభివృద్ధి పనులను గుర్తించి టీఆర్‌ఎస్ పార్టీని బలపరచాలని కోరారు. హజీపూర్‌లో అర్హులైన స్థానికులకే డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అనంతరం ప్రజల సమక్షంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను కేక్ కట్‌చేసి ఘనంగా జరిపారు. పనె్నండు మెట్ల కళాకారుడు మొగులయ్యను పూలమాల శాలువాతో సన్మానించి రూ.25 వేల నగదును ఇచ్చి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన ఉదారతను చాటుకున్నారు. కార్యక్రమం ఎంపీపీ పర్వతాలు, వైస్ ఎంపీపీ సేవ్యానాయక్, జడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పోకల మనోహర్, నగర పంచాయతీ చైర్మన్ తులసీరాం, వైస్ ఎంపీపీ బందం విశే్వశ్వరనాథ్, సర్పంచ్‌లు విజయలక్ష్మి, నర్సింహగౌడ్, సత్తయ్య, ఎంపీటీసీ జ్యోతి రామచారీ, రాంబాబునాయక్, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వీఆర్‌ఏకు గాయాలు
పాన్‌గల్, ఫిబ్రవరి 17: మండల పరిధిలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ రాములు గ్రామంలో భూ సర్వే కోసం ఆధార్ నంబర్లను రైతుల నుండి సేకరించేందుకు శనివారం బైకుపై వెళ్తుండగా పాఠశాల సమీపంలో అతి వేగంగా కొల్లాపూర్ నుండి వనపర్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైకుపై నుండి కిందపడి ఎడమ కాలు విరగగా, దవడకు, కుడి కాలుకు రక్త గాయాలయ్యాయి. వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ అలెగ్జాండర్, ఆర్‌ఐ బలరాం నాయక్, మండల వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు సురేశ్, వీఆర్‌ఏలు రాజు, రమేష్, వెంకటయ్య పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం తహశీల్దార్ అలెగ్జాండర్ 2వేల సహాయాన్ని అందజేశారు.

రైతు కష్టాలను తీరుస్తున్న ప్రభుత్వం
* మార్కెట్‌శాఖ మంత్రి హరీశ్‌రావు
* కానుకుర్తిలో రూ.3కోట్లతో నిర్మించిన గిడ్డంగి ప్రారంభం
దామరగిద్ద, ఫిబ్రవరి 17: ఆరుగాలం శ్రమించే రైతుల కష్టాలను తీర్చేందుకు మార్కెట్ శాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. పంట అమ్మేచోట ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నామన్నారు. శనివారం దామరగిద్ద మండల పరిధిలోని కానుకుర్తి గ్రామంలో రూ.3కోట్లతో నిర్మించిన వ్యవసాయ గోదాంను జిల్లా మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యానశాఖ ద్వారా బిందు, తుంపర సేద్యం పరికరాలను రైతులకు సక్రమంగా అందించలేదని విమర్శించారు. ప్రస్తుతం ఆ పొరపాట్లను సరిదిద్ది అన్ని సంక్షేమ పథకాల ఫలాలను రైతుల వద్దకు చేరుస్తున్నామన్నారు. ఇక్కడ శీతాకాల గిడ్డంగిలో ధాన్యాన్ని నిలువ చేసుకునే వీలు కల్పించడంతో పాటు వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వెసలుబాటు ఉందని అన్నారు. రైతుల ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం సాటిరాదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం పెట్టుబడి నిమిత్తం ఎకరాకు రూ.4వేలు అందిస్తున్న ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదటిదని అన్నారు. సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు భీంరెడ్డి, వెంకట్‌రెడ్డి, కిషన్‌రావు, దామోదర్‌రెడ్డి, కనకప్ప, రాఘవేందర్, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య శాఖపై ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ
* త్వరలోనే వైద్యుల భర్తీ
* వైద్య విధాన పరిషత్ కమిషనర్ శివప్రసాద్

జడ్చర్ల, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అందులో భాగంగానే ఎంతోకాలంగా ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బంది భర్తీ ప్రక్రియకానున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ శివప్రసాద్ వెల్లడించారు. శనివారం జడ్చర్లలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్‌తో సమావేశమమై ఆసుపత్రిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నూతనంగా 13 డాక్టర్ పోస్టులను, 7 స్ట్ఫా నర్సు పోస్టులను మంజూరైనట్లు తెలిపారు. రెండు నెలల్లోఅందుకు సంబంధించిన వ్యవహారం పూర్తవుతుందన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో వంద పడకల ఆసుపత్రికి అన్ని అనుమతులు తీసుకు న్నామని పేర్కొన్నారు. వంద పడకల ఆసుపత్రికి కేవలం స్థల సమస్యతోనే ఆగిపోయింది. అనువైన స్థలం దొరికితే ఆసుపత్రి ఏర్పాటు పూర్తవుతుందన్నారు. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చాలా పెరిగాయని, సుమారు 50శాతం డెలివరీలు పెరగడం సంతోషకరమన్నారు. వైద్యుల కొరత సూపరింటెండెంట్ తనదృష్టికి తీసుకువచ్చారని, చర్యలు తీసుకొని వైద్యుల సమస్య తీరస్తామని ఆయన తెలిపారు. ముగ్గురు గైనాకాలజిస్టులు, మత్తు డాక్టర్, చిన్న పిల్లల డాక్టర్, ఫోరన్సిక్ డాక్టర్‌లను ఈ 13 పోస్టులలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఉన్నదాని కంటే మూడింతలు బడ్జెట్‌ను వైద్య శాఖకు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు టీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, నాయకులు శంకర్ నాయక్, ఇమ్ము, మనోహార్, హాఫీజ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు..
- మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి

నర్వ, ఫిబ్రవరి 17: తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, ఊహాగానాలు నమ్మవద్దని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిష్ఠానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానన్నారు. గ్రామ స్థాయిలో టీడీపీ కేడర్‌ను బలోపేతం చేస్తు జెండాతో అజెండాతో ముందు వెళ్దామన్నారు. రాబోయే రోజులో రాష్ట్ర రాజకీయాలు సమీకరణలు మార్పు రావచ్చని, పరిస్థితులను బట్టి నడుచుకోవాలని కార్యకర్తలు సూచించారు. కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని దయాకర్‌రెడ్డి తెలపగా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు వాదించగా మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి జ్యోకం చేసుకుని వారిని సముదాయించారు. ముందుగా గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు సమష్టిగా ఉండాలని, తదుపరి నిర్ణయం ఆయనకే వదివేయాలని సూచించారు. సమావేశంలో జదబీరాంరెడ్డి, జగమ్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, కురమ్మ రెడ్డి, శ్రీనివాస్ రావు, రఫీ పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వీఆర్‌ఏకు గాయాలు
పాన్‌గల్, ఫిబ్రవరి 17: మండల పరిధిలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ రాములు గ్రామంలో భూ సర్వే కోసం ఆధార్ నంబర్లను రైతుల నుండి సేకరించేందుకు శనివారం బైకుపై వెళ్తుండగా పాఠశాల సమీపంలో అతి వేగంగా కొల్లాపూర్ నుండి వనపర్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైకుపై నుండి కిందపడి ఎడమ కాలు విరగగా, దవడకు, కుడి కాలుకు రక్త గాయాలయ్యాయి. వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ అలెగ్జాండర్, ఆర్‌ఐ బలరాం నాయక్, మండల వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు సురేశ్, వీఆర్‌ఏలు రాజు, రమేష్, వెంకటయ్య పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం తహశీల్దార్ అలెగ్జాండర్ 2వేల సహాయాన్ని అందజేశారు.

గుడ్డు తెచ్చిన తంటా
* ఒక ఉపాధ్యాయుడు సస్పెండ్
* మరో ఉపాధ్యాయుడు బదిలీ
వనపర్తి, ఫిబ్రవరి 17: మండలంలోని రాజనగరం ప్రభుత్వ పాఠశాలలో గత 20 రోజుల క్రితం కోడి గుడ్డును ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణ బాక్స్‌లో ఉంచి ఇంటికి తీసుకెళ్తున్నదని ఫొటో తీసి వాట్సాప్‌లో మరో ఉపాధ్యాయుడికి పంపిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ వ్యవహారంలో ఆ ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌తోపాటు మరో ఉపాధ్యాయుని బదిలీకి దారి తీసింది. 20 రోజుల క్రితం పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇచ్చిన గుడ్డును ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణ బాక్స్‌లో ఉంచుకోగా దాన్ని అదే పాఠశాలలో పనిచేస్తున్న లతీఫ్ ఫొటో తీసి ఎస్‌ఎంసీ చైర్మన్‌కు భాస్కర్‌కు పంపారు. వారం రోజుల తరువాత దానిని ఎస్‌ఎంసీ చైర్మన్ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. దానిని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు అరుణ రూరల్ పోలీసు స్టేషన్‌లో లతీఫ్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు రవిందర్ గౌడ్‌పై ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న డీఈఓ సుశీందర్‌రావు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక పంపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లతీఫ్‌ను సస్పెండ్ చేసినట్లు, రవిందర్ గౌడ్‌ను అక్కడి నుండి బదిలీ చేస్తున్న డీఈఓ సుశీందర్‌రావు తెలిపారు.

మిషన్ భగీరథ పనుల్లో అపశృతి
* క్రేన్ ఢీకొని కూలీ దుర్మరణం
హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 17: హుజూరాబాద్ మండలంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో శనివారం క్రేన్ ఢీకొని ఓ కూలీ మరణించాడు. మిషన్ భగీరథ పైపులను సిర్సపల్లి నుండి రాంపూర్‌కు క్రేన్‌తో తరలిస్తుండగా రాంపూర్ వద్ద క్రేన్ ఢీకొని ఇరగవిండ్ల రాములు (25) అనే కూలీ దుర్మరణం పాలయ్యాడు. మరణించిన రాములు మిషన్ భగీరథ పనుల్లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఇనుకాలపల్లి ఇతని స్వగ్రామం. క్రేన్ నడిపే డ్రైవర్ అజాగ్రత్తవల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కూలీ రాములు మరణిచండంతో తోటి కూలీలు హుజూరాబాద్ - జమ్మికుంట రహదారిపై ఆందోళనకు దిగి రాస్తారోకో చేసారు. మృతుడు అవివాహితుడని, ఇతనికి తల్లి ఉందని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కూలీలు డిమాండ్ చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పంటలను సంరక్షించేందుకు చర్యలు
* కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి, ఫిబ్రవరి 17: జిల్లాలో రైతులు వేసిన పంటలను సంరక్షించేలా వ్యవసాయశాఖ, ఎస్సారెస్పీ అధికారులు సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం చివరి ఆయకట్టు రైతులకు నీరందించాలన్నారు. నాల్గవ విడత నీటి విడుదలతో జిల్లాకు చేరిన నీటి వివరాలపై అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. జిల్లా పరిథిలోని ఎస్సారెస్పీ 31 ఓటీల వద్ద నిరంతరంగా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడం, కాలువలలో చెత్త చెదారం తీసివేయడం, గండ్లు పడకుండా తగు చర్యలు తీసుకోవడం వలన నాల్గవ విడుతలో ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామానికి 90శాతం చివరి ఆయకట్టు వరకు నీరందిచగలిగామని కలెక్టర్‌కు వివరించారు. రైతులకు భరోసా కల్పించి నీటిచౌర్యం జరగకుండా పోలీస్ బందోబస్తూ తీసుకోవడం వంటి చర్యల వల్ల లక్ష్యం మేరకు నీటి సరఫరా జరిగిందని, ఇదేవిధంగా 5,6 విడుతలలో నీటిని చివరి ఆయకట్టు వరకు చేర్చాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు భూగర్బ జలాల శాతం మెరుగుపర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇంకుడు గుంతల ప్రాముఖ్యంపై రైతులకు వివరించి, పిడి డి ఆర్డీ ఏ శాఖ సమన్వయంతో రైతులు ఇంకుడు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో పద్మయ్య, పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి తిరుమల్ ప్రసాద్, వ్యవసాయ అధికారులు, జిల్లాలోని తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గోన్నారు.