మహబూబ్‌నగర్

రైతులను నట్టేట ముంచిన దళారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దమందడి, మార్చి 22: మండల పరిధిలోని అల్వాల గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న కంపెనీ నిర్మాణంలో రైతులను నట్టేట ముంచి దళారులు కోట్లకు పడగెత్తిన ఉదాంతం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బాధితులు లబోదిబోమంటు తమకు న్యాయం చేయాలని సోలర్ కంపెనీ ముందు గురువారం ఆందోళన చేపట్టారు. రైతులు చేస్తున్న ఆందోళనకు వనపర్తి ఎమ్మెల్యే జీ చిన్నారెడ్డి, కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి భీరం హర్షవర్దన్‌రెడ్డిలు మద్దతు ప్రకటించారు. మండలంలోని మద్దిగట్ల, పెద్దమందడి, అల్వాల, అమ్మపల్లి గ్రామాల శివారులోగల 280 ఎకరాల్లో సోలార్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. రైతుల దగ్గర నుండి భూముల పొందిన దళారులు వారికి ఎకరాకు రూ.50వేలు మొదలు కొని రూ.3లక్షల వరకు మాత్రమే చెల్లించి కంపెనీ దగ్గర ఎకరాకు రూ.6లక్షల25వేలకు ఒప్పందం కుదుర్చుకొని రైతులను నట్టేట ముంచారు. అదేవిధంగా ఈనెల 25 వరకు రైతులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డితో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలని, అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని సూచించారు. ఆందోళనలో నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటస్వామి, చెన్నయ్య, కురుమూర్తి, బుచ్చిలింగం ఉన్నారు.

నేడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- ఉమ్మడి జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు
- అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కు నోచాన్స్
- శాసన సభ్యత్వం రద్దుతో ఓటింగ్‌కు దూరం
మహబూబ్‌నగర్, మార్చి 22: రాష్ట్రంలో ఖాళీలుగా ఏర్పడ్డ మూడు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు హైదరాబాద్‌లో జరగునున్నాయి. ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పొలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల్లో గెలిచినవారిని ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుగా ఉండగా అందులో ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఉన్నారు. కాంగ్రెస్‌కు ఐదుగురు ఉండగా ఒకరిపై అసెంబ్లీ స్పీకర్ వేటు వేయగా నలుగురికి మాత్రమే రాజ్యసభ ఎన్నికల్లో పొలింగ్‌లో పాల్గొన్ని ఓటు వేయడానికి అవకాశం ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ శాసన సభ్యత్వ రద్దుతో ఆయన రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటు హక్కును కోల్పోయారు. కోర్టుకు వెళ్లినా ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో సంపత్‌కుమార్‌కు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం లేదు. కాగా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌లు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందగా, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ రాజకీయ పరిణామాల దృష్ట్యా వారిద్దరు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదిగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వనపర్తి ఎమ్మెల్యే జీ చిన్నారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం నలుగురు ఉన్నారు. కానీ అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఈ ఎన్నికల్లో ఓటు లేకపోవడం కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ అభ్యర్థి బలరాం నాయక్‌కు ఎన్నికలు జరగకముందే ఈ జిల్లాలో ఒక ఓటు కోల్పోయినట్లు అయంది. మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 13 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే రాజ్యసభ ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్ని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది.