మహబూబ్‌నగర్

కలుషిత ఆహారం తిని 200మందికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 2: కలుషిత ఆహారం తిని దాదాపు 200మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన అమ్మాయితో ఇదే మండలం దూసకల్ గ్రామానికి చెందిన అబ్బాయితో షాద్‌నగర్ పట్టణంలోని ఎస్‌ఎస్ గార్డెన్‌లో ఈనెల 29వ తేదిన వివాహం అయింది. ఈ వివాహానికి ఎలికట్ట, దూసకల్ గ్రామాలకు చెందిన బందువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పెళ్లిలో ఏర్పాటు చేసిన విందుభోజనం చేశారు. విందు భోజనం చేసిన మరుసటి రోజు నుండే గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు ఎక్కువయ్యాయని ఎలికట్ట సర్పంచ్ భర్త యాదయ్య వివరించారు. ఎస్‌ఎస్ గార్డెన్‌లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, పాత్రలు శుభ్రంగా ఉండకపోవడం, నీరు సక్రమంగా లేకపోవడం వంటి కారణాల వల్లే ఆహారం కలుషితమై వాంతులు, విరేచనాలు అయ్యాయని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఎలికట్ట, దూసకల్ రెండు గ్రామాలలో దాదాపు 200మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారని వివరించారు. దూసకల్ గ్రామానికి చెందిన కొంతమంది ఇప్పటికే షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు చేయించుకున్నారని వైద్యులు తెలిపారు. మరికొంతమంది ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్సలు చేయించుకునేందుకు వెళ్లారని వారు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ ఎలికట్ట గ్రామానికి హుటాహుటిని చేరుకుని పరిస్థితికి గల కారణాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ వివాహా వేడుకల్లో విందు భోజనం చేయడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి సక్రమంగానే ఉందని, ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని అన్నారు. వాంతులు, విరేచనాలు తగ్గే వరకు గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుందని వివరించారు. అనంతరం షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఎలికట్ట గ్రామానికి చేరుకుని ప్రజల అస్వస్థతకు గల కారణాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్ చందునాయక్‌ను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం బాధితుల పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పరామర్శించిన వారిలో టిఆర్‌ఎస్ నేతలు నరేందర్, అందె బాబయ్య, ఎంఎస్ నటరాజ్, లక్ష్మీనర్సింహ్మరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కట్టా వెంకటేష్‌గౌడ్, జంగ నర్సింహ్మ, శ్రీనివాస్ యాదవ్, గంగనమోని సత్తయ్య తదితరులు ఉన్నారు.

కరవు సహాయంలో ప్రభుత్వం విఫలం
మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి
మహబూబ్‌నగర్ టౌన్, మే 2: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నుండి ప్రజలను కాపడడంలో, కరువు నివారణ సహయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నుండి ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం రూ. 791కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వినియోగించి ప్రజలను ఆదుకోవడం లేదని అన్నారు. కరువు భారీన పడిన రాష్ట్రంలోని ప్రజానికం తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఒకవైపు ప్రజలు కరువు భారిన పడి కకవికలం అవుతుంటే టి ఆర్ ఎస్ పార్టీ ఆదినాయకత్వం మాత్రం ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ పబ్బం గడుపుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న టి ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి చేసింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. బంగారు తెలంగాణగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ, కరువు తెలంగాణగా మార్చివేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరువు ప్రభావం కేవలం మనుషులపైనే కాక పశుపక్షాదులపై కూడా పడిందని పశుగ్రాసం కోరత కారణంగా కబేలాలకు తరలుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు సహయక చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రజలను, పశువులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకోసం రూ.5కోట్ల చోప్పున ప్రతి మండలానికి తాగునీటి సరఫరా కోసం మంజూరు చేయాలని, కరువు బారిన పడి మృత్యువాత పడిన ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని, పశుగ్రాసాన్ని ఉచితంగా మంజూరు చేయాలని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామంటున్న కేవలం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని అన్నారు. గోదావరి, కృష్ణానదులను అనుసంధానం చేస్తేనే జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆయన పెర్కోన్నారు. ఈ కార్యక్రమంలో పడాకుల బాలరాజు, రాంచంద్రయ్య, రామకళ, పద్మ, బాలిశ్వరి, గడ్డం గోపాల్, మహేష్, బుడ్డన్న పాల్గొన్నారు.

ఈదురు గాలులతో కూడిన వర్షం
షాద్‌నగర్ రూరల్, మే 2: ఈదురు గాలులతో కూడి వర్షం కురవడంతో పరిగి రోడ్డుపై భారీ వృక్షాలు కిందపడ్డాయి. సోమవారం సాయంత్రం షాద్‌నగర్ పట్టణ సమీపంలోని పరిగి రోడ్డులో ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో రోడ్డు పక్కన ఉన్న చెట్లు కూలి రోడ్డుపై పడిపోయినందున పరిగి-షాద్‌నగర్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే కొందుర్గు మండలం మహదేవ్‌పూర్ గ్రామంలో వెంకటయ్య, నక్క జంగయ్యలకు చెందిన ఇళ్ల పై కప్పులు ఎగిరిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే అదే గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి ఇంటి స్లాబ్ ఈదురు గాలులకు కూలిపోయింది. దీంతో ఏమి చేయాలో తెలియక వారు బిక్కుబిక్కుమంటు రోదించారు.

కరవు కాటేస్తోంది
కోయిలకొండ, మే 2: పాతికేళ్లుగా వదలని కరువు ఈ ప్రాంత ప్రజలనుకాటేస్తుంది..ప్రజలు కడుపునిండాతిండితినే పరిస్థితి గ్రామాల్లో కనబడటం లేదు..500 ఫీట్లు బొర్లుతవ్వినా జలం బైటికి రావడం లేదు. తాగునీటి కష్టాలు మండలంలో వర్ణనాతీతం.. భానుడి తాపానికి గ్రామాల్లో ప్రజలు, పశుపక్షాదులు కుదేలవుతున్నాయి.. పూట గడువక చేతినిండా పనులు లేక మండలంలోని స్వంత గ్రామాలను వదిలి ఇప్పటికే వేల సంఖ్యలో జనం వలసలు వెళ్తున్నారు. నోరులేని మూగజీవాలు కనుమరుగై పోయాయి, పశుపక్షాదుల పోషణ గుడిబండలా మారడంతో అవి ఖాళీ అయ్యాయి.. జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని కోయిలకొండ మండలంలో కరువుకాటుకు జనం ఆందోళన చెందుతున్నారు. 65 వేల జనాభా గల మండలంలో 25 గ్రామపంచాయితీలు, 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండంలోని 10 నోటిఫైడ్ చెరువులు, 60 కి పైగా కుంటలు ఉన్నాయి. మండలంలో గత 25 సంవత్సరాలుగా సాధారణ వర్షపాతం నమోదుకాకపోవడం విశేషం. ఆరువేల హెక్టార్ల తరి, 45 వేల హేక్టార్ల మాగాణి ఉన్నా ఫలితం లేకుండా పోయింది. నాణ్యమైన భూములు ముళ్లపొదలతో నిండిపోయాయి. వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. మండలంలో వేల సంఖ్యలో బోరుబావులు ఉన్నాయి. వర్షాలు లేక భూగర్భ జలాలు పాతాళానికి పోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వర్షాధార వ్యవసాయం అంటేనే రైతులు భయపడుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వర్షాలు కురవక రైతులు అప్పులు చేశామని వ్యవసాయం వద్దు ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీపని చేయడం ఉత్తమం అని వేల కుటుంబాలు కర్ణాటక, మహరాష్ణ్ర,తమిళనాడు, హైదరాబాద్‌కు వలస వెళ్లడం జరుగుతుంది. మండలంలోని గిరిజన తాండాల్లో పదుల సంఖ్యలో ప్రజలు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. భూగర్బజలాలు అడుగంటి గ్రామాల్లో తాగునీటికొసం ప్రజలు అల్లాడిపోతున్నారు. అధికారులు ట్యాంకర్లు పెట్టినా పలితం లేకుండా పోతుంది. గ్రామాల్లో రైతులు తమ పశువులను పోషణ భారమై కబేళాలకు తరలించడం జరుగుతుంది. గడ్డి ప్రాజెక్టుల కింద ట్రాక్టరు 15 వేల వరకు ఉండటంతో రైతులు దానిని కొనడానికి భయపడుతున్నారు. ప్రభుత్వం గడ్డి రాయితీతో సరఫరా చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఎక్కడా సరఫరాకాలేదు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఉపాది హమీ పథకం మండలంలో పూర్తి స్థాయిలో నీరుగారిందనే విమర్శలు ఉన్నాయి. ఉపాధి లో పని చేస్తున్న సిబ్బంది తమకు లాభాలు వచ్చే పనులకు పరిమితం కావడంతో గ్రామాల్లోని ప్రజలకు చేతిలో పని,డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తాయని, తమ కష్టాలు తీరుతాయని కోటి ఆశలతో ఎదురు చుస్తున్నారు. జిల్లా అధికారులు మండల అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రైతుల్లో మనోధైర్యం నింపడానికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

క్రీడల్లో జిల్లా ఖ్యాతిని పెంచాలి
కలెక్టర్ టికె శ్రీదేవి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మే 2: క్రీడల్లో జిల్లా ఖ్యాతిని పెంచాలని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని, విద్యార్థులను మళ్లించేందుకు ప్రభుత్వం వేసవికాలంలో వేసవి క్రీడా శిభిరాలను ఏర్పాటు చేస్తుందని ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని స్టేడియం మైధానంలో జిల్లా క్రీడాభివృద్ది సంస్థ ద్వారా నిర్వహించిన వివిధ క్రీడల వేసవి శిబిరాన్ని కలెక్టర్ టికె శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నిధులకు ఇబ్బంది ఉన్నప్పటికిని జిల్లాలో ఉన్నటువంటి వనరుల వల్ల, కొందరు దాతల కారణంగా క్రీడలు జిల్లాలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. చదువులతల్లికి నిరాజనం తెలుపుతూనే విద్యార్థులు క్రీడా స్పూర్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. సాధన ఉంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదని, మనిషికి చదువు ఒక్కటే ముఖ్యం కాదని ముఖ్యంగా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపట్ల మరింత ఆసక్తి కనబరుస్తారని అందుకే ప్రతి విద్యార్థి చదువుతో పాటు ధైర్యంతో క్రీడల వైపు దృష్టి పెట్టి ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిభిరాలను టైం పాస్‌గా కాకుండా జీవితంలో క్రీడల ద్వారా లబ్దిపొందుతామనే భావనతో సాధన చేయాలన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా క్రీడలు కూడా అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణకు బాటలు పడినట్లు అన్నారు. అందుకు విద్యార్థులంతా ముందుకు వస్తారని బంగారు తెలంగాణ నిర్మాణం ఎవరి చేతిలో ఉందని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించారు. ఇందుకు విద్యార్థులు కూడా బంగారు తెలంగాణ నిర్మాణం తమ చేతుల్లో ఉందని వెల్లడించారు. దింతో కలెక్టర్ వారిని అభినందించారు. అదేవిధంగా వర్షం కురియాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకోవాలంటూ వాన దేవుడికి చప్పట్లతో స్వాగతం పలకాలంటూ కలెక్టర్ సూచించడంతో విద్యార్థులు కలెక్టర్ సూచన మేరకు జిల్లాలో వరుణుడు కరుణించాలంటూ విద్యార్థుల కరతాల ద్వనులతో స్టేడియం మైదానంలో మారుమ్రోగించారు. డిఎస్‌డిఓ సత్యవాణి మాట్లాడుతూ జిల్లాలో క్రీడలకు మంచి ప్రాంతమని క్రీడలు అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్న జిల్లా అని ఈ జిల్లాలో తాను పనిచేయడం చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. జిల్లా కలెక్టర్ చొరవతో వందలాది మంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చి దిద్దడానికి వేసవి శిభిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. జిల్లా మైదానంలో కొన్ని పనులు కొనసాగుతున్నాయని ఇందుకు కలెక్టర్‌తో పాటు వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్ సభ్యులు సంపూర్ణ సహకారం అందించాలని తెలిపారు. మంచినీటి సమస్య బాగా ఉందని సమస్యను అధిగమించేందుకు వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. జిల్లాలో మహిళ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువస్తామని వేసవి శిభిరాలలో ఆడ పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో హజరు కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రస్తుతం అన్ని క్రీడల్లో వేసవి శిబిరాలు దాదాపు 4 వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని ఇది తెలంగాణ పది జిల్లాలో మహబూబ్‌నగర్ జిల్లానే మొదటిస్థానంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్‌కుమార్, రాజేంద్రప్రసాద్, సునీల్, అబ్దుల్లా, ఖలీల్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మే 2: ఇళ్లు లేని నిరుపేదలకు, అర్హులైన లబ్దిదారులందరికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిష్టియన్‌పల్లి సమీపంలో గల ఆదర్శనగర్ కాలనీలో జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా అర్భన్ ప్రాంతంలో మహబూబ్‌నగర్ పట్టణంలోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించతలపెట్టిన తొలి జిల్లా అని ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్మించే ఈ ఇళ్లు జిల్లాకే ఆదర్శంగా ఉండేలా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని రాష్ట్రంలో కూడా అన్ని హంగులతో మహబూబ్‌నగర్ డబుల్ బెడ్‌రూంలనే నిర్మించాలనే అందరు వచ్చి ఇక్కడ చూసే పరిస్థితి కల్పించాలన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో చాలా మంది పేద ప్రజలు ఉన్నందున కొందరికి ఇప్పటి వరకు ఇళ్లు లేని కారణంగా కిరాయి ఇళ్లల్లోనే ఉండడం వారి బ్రతుకులను ఆగం చేస్తుందన్నారు. పగలంతా కష్టపడి చివరగా ఇళ్ల కిరాయిలతో పాటు ఖర్చులు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దినిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కెసి ఆర్ గత సంవత్సరం మహబూబ్‌నగర్ పట్టణంలోని మురికివాడలైన పాతపాలమూరు, పాతతోట, వీరన్నపేటలో పర్యటించారని తెలిపారు. ఆ సమయంలోనే మురికివాడల ప్రజలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి హమీ ఇచ్చారని అందులో బాగంగానే 2300 ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. దినిని దృష్టిలో ఉంచుకుని క్రిష్టియన్‌కాలనీ ఆదర్శనగర్‌లో ప్రభుత్వ భూమిలోనే ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇక్కడ దాదాపు 500 డబుల్ బెడ్‌రూంల ఇళ్లను నిర్మించడానికి వీలు పడుతుందన్నారు. ఓ పక్క సంక్షేమ పథకాలు వేగవంతంగా ఆమలు అవుతుండగా మరోపక్క విద్వంసానికి గురైన చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం మీషన్‌కాకతీయతో కోట్లాది రుపాయల నిధులను ఖర్చు చేస్తుందన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో మహబూబ్‌నగర్ పెద్ద చెరువును ఆంధ్ర పాలకులు విస్మరించారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా రూపాంతరం చెందిందని తెలిపారు. ఈ చెరువు అభివృద్ధికై ఇప్పటికే దాదాపు రూ.10కోట్ల నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. మరో రూ.30కోట్ల ప్రతిపాధనలు పంపించామని ఎమ్మెల్యే వెల్లడించారు. జిల్లా రైతులు సాగునీరులేక వలసలు వెళ్తున్నారని జిల్లాకు పట్టిన దరిద్య్రం వదలాలంటే పాలమూరు ఎత్తిపోతల ఎంతో అవసరమన్నారు. అందుకే అత్యంత ప్రాధాన్యతగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కెసి ఆర్ తీసుకుని ఇటివల మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా వాటర్ గ్రీడ్‌తో ఏడాదిలోపు ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీటిని అందిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ టికె శ్రీదే మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పారదర్శకంగా ఉంటుందని ఎక్కడ కూడా పొరపాట్లకు తావు ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాంకిషన్, మున్సిపల్ కమీషనర్ దేవ్‌సింగ్‌నాయక్, తెరాస నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, ఆనంద్‌కుమార్, శివకుమార్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.