మహబూబ్‌నగర్

కొల్లాపూర్ కోటపై కాంగ్రెస్ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 11: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం ఒకే అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. మంగళవారం శాసనసభా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓటర్లు పట్టం కట్టారు. ఆయనకు 80617 ఓట్లు వేశారు. దాంతో కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 12546 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. మంత్రి జూపల్లికి 68071 ఓట్లురాగా హర్షవర్థన్‌కు 80617 ఓట్లు రావడంతో జూపల్లి ఓటమి చెందారు. దింతో జూపల్లికి హర్షవర్థన్‌రెడ్డి చెక్ పెట్టారు. మంత్రి జూపల్లి కృష్ణారావు 1999నుండి 2014 వరకు వరుసగా కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. జిల్లాలో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైంది. అయినప్పటికిని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి హర్షవర్థన్‌రెడ్డి గెలుపొందారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానంలో మాత్రం హర్షవర్థన్‌రెడ్డి గెలుపొందారు. జిల్లాలో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలు కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కొల్లాపూర్‌లో 2014 ఎన్నికల్లో హర్షవర్థన్‌రెడ్డి జూపల్లి కృష్ణారావుపై అప్పట్లో ఓటమి చెందారు. దాంతో ఆయన మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నిలబడి జూపల్లిని ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి ఓటర్లు తీర్పును ఇచ్చారు.

ప్రజాతీర్పును శిరసావహిస్తా
* మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, డిసెంబర్ 11: కొల్లాపూర్ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ది చేసినప్పటికి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన ఓటమికి కొంతమంది బయటివ్యక్తులు కుట్రలు చేశారని ఆరోపించారు. ఏది ఏమైనా ప్రజాసేవలో తనవంతు పాత్ర నిర్వహిస్తానని జూపల్లి కృష్ణారావు అన్నారు.

రాజకీయాల్లో గెలుపు ఓటములు సమానం
- ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటా
- ఎన్నికల తీరుపై పలు అనుమానాలు - మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ
గద్వాల, డిసెంబర్ 11: రాజకీయాల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తామని ఓటమి నుండే రాజకీయ జీవితాన్ని ఆరంభించానని తాను ఎన్నటికి ప్రజల సమస్యలపై పోరాడుతానని మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ తరువాత డీకే సత్యారెడ్డి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజావ్యతిరేకత, సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందకపోవడం, ఎక్కడికి వెళ్లినా తెరాసపై ఉన్న ప్రజాఆగ్రహం ఎన్నికల్లో కనిపించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కెసిఆర్ కుమారుడు కెటిఆర్ ఐటి మంత్రిగా ఉండి ఇవిఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్న తీరుపై విచారణ జరగాల్సి ఉందన్నారు. అదేవిధంగా మొదటి నుంచి కెసిఆర్, కెటిఆర్‌లు వంద స్థానాలు గెలుచుకుంటామని చెప్పడంతో పాటు కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేతలు ఓడిపోతున్నారని ప్రచారం చేయడం, ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీని చెప్పడం వంటివి నిజం కావడంతో అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్య పడకుండా ఉండాలని, భవిష్యత్తులో అందరికి మంచి రోజులు వస్తాయన్నారు. కార్యకర్తలపై, ప్రజలపై ఏవైనా దౌర్జన్యాలు జరిగితే సహించేది లేదని, ఏ చిన్న సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. కొందరు కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తారని వారి కవ్వింపు చర్యలకు మీరు వౌనంగా ఉండి ప్రజలచేత వారిని చీ కొట్టించాలని హితవుపలికారు. రాష్టవ్య్రాప్తంగా వచ్చిన ఫలితాలు ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా వచ్చినట్లు తాము బావిస్తున్నామని మరోసారి రాష్ట్ర ప్రజలు నియంతపాలనలో ఉండాల్సి వచ్చిందన్నారు.

ప్రజాకూటమికి భంగపాటు

* జిల్లాలో కాంగ్రెస్‌కు ఘోరపరాజయం * పంచర్ అయిన సైకిల్
* కాంగ్రెస్, టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ * మాజీ మంత్రులు డికె అరుణ, నాగం, చిన్నారెడ్డిల ఓటమి
* సంపత్, మల్లురవి, వంశీచంద్‌రెడ్డిల పరాభవం * ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు చుక్కెదురు

మహబూబ్‌నగర్, డిసెంబర్ 11: శాసనసభా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాకూటమిగా అవిర్భావించిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలు చెదు అనుభవాన్ని నింపింది. ప్రజాకూటమికి మహబూబ్‌నగర్ జిల్లాలో భంగపాటు తప్పలేదు. కారుస్పీడ్‌కు కాంగ్రెస్ చెతికిల పడిపోయింది. రాజకీయ ఉద్దండులుగా పెరోందిన మాజీ మంత్రి డికె అరుణ, నాగం జనార్థన్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, మల్లురవిలు ఘోరపరాజయానికి గురయ్యారు. ఈ ఎన్నికలు వారికి రాజకీయ భవిష్యత్తుకు జీవం పోసేలా ఉండేవి. కానీ ఓటర్లు వారి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారు. చాలా మంది వేసుకున్న అంచనాలను ఓటర్లు తలకిందులు చేశారు. గద్వాలలో మాజీ మంత్రి డికె అరుణ కృష్ణమోహన్‌రెడ్డిపై 28249 ఓట్ల తేడాతో ఓటమిపాలు అయ్యారు. డికె అరుణకు 72155 ఓట్లురాగా గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణమోహన్‌రెడ్డికి 100404 ఓట్లు పోల్ అయ్యాయి. అదేవిధంగా నాగర్‌కర్నూల్ మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డిని ఓటర్లు పక్కన పెట్టారు. మర్రిజనార్థన్‌రెడ్డిపై ఘోరపరాభవాన్ని చెవి చూశారు. నాగంను ఓటర్లు తిరస్కరించారు. ఆయన ఏకంగా 54354 ఓట్లతో ఘోరంగా ఓడిపోయారు. ఇకపోతే వనపర్తిలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి చిన్నారెడ్డి సైతం ఓటమి చెందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతిలో 51466 ఓట్ల తెడాతో ఓటమి చెందారు. దింతో వనపర్తి కాంగ్రెస్ శ్రేణులు ఖంగుతిన్నారు. ఏ ఐసీసీ కార్యదర్శిగా ఇటివల నియమితులై మహరాష్టక్రు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. తెరాస అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అబ్రహం చేతిలో ఏకంగా ఆయన 44677 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. మాజీ ఎంపీ మల్లురవి మరోసారి జడ్చర్ల నియోజకవర్గంలో పోటీ చేసి ఖంగుతిన్నారు. ఆయనను ఇక్కడి ఓటర్లు అంగికరించలేదు. మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో 45104 ఓట్ల తెడాతో మల్లురవి ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీచంద్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు ఓటమి పాలు చేశారు. ఏకంగా ఆయనను మూడవస్థానంలో నిలబెట్టారు. ఇకపోతే ప్రజాకూటమిలో బాగస్వామ్యం అయిన టీడీపీ అభ్యర్థులు ఇద్దరు ఓటమి చెందారు. మహబూబ్‌నగర్‌లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎర్రశేఖర్ ఓటమి చెందారు. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చేతిలో హోరపరాభవానికి గురయ్యారు. ఎర్రశేఖర్‌కు కేవలం 28047 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈయన 57326 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. అంతేకాకుండా మక్తల్ నియోజకవర్గంలో పోటీ చేసిన దయాకర్‌రెడ్డి సైతం ఓటమి చెందారు. ఇక్కడి ఓటర్లు ఆయనను మూడవస్థానంలో నిలిచేలా ఉంచారు. ఈయనకు 26141ఓట్లతో మాత్రమే సరిపెట్టి సైకిల్‌ను పంచర్ చేశారు. దింతో ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రజాకూటమి పటాపంచలు అయ్యింది. వారి అంచనాలను ఓటర్లు తలకిందులు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అందించిన మెజారిటీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి రౌండ్‌లో ఓట్ల లెక్కింపు సందర్భంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చెందిన వారిలో ఒక్కరౌండ్‌లో కూడా ముందంజలో రాకపోవడం హస్యాస్పదం. కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు ఐదారు రౌండ్ల ఓట్ల లెక్కింపు సందర్భంలోనే కౌంటింగ్ కేంద్రాల నుండి నిష్క్రమించారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
గద్వాల, డిసెంబర్ 11: గద్వాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను భారీ మెజారిటితో గెలిపించినందుకు ప్రజా తీర్పును శిరసావహించి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని గద్వాల టీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండలం కొండేరు వద్ద గల కొట్టం తులసిరెడ్డి కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. గద్వాల నియోజకవర్గం మొత్తం 2,26,613 ఓటర్లుకుగాను 1,89,013 ఓట్లు పోలుకాగ గద్వాల టీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 1,00,057 ఓట్లు పోలుకాగ, కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణకు 71,612 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి 28,445 ఓట్లతో గెలుపొందారు. టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందడంతో ఈ సందర్భంగా కౌంటింగ్ హల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశాయని తెలిపారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని, ప్రాంత అభివృద్దికి కృషి చేయని నాయకులకు ప్రజలే తీర్పు ఇచ్చారని, ప్రజా తీర్పే శిరసావహిస్తానని అన్నారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా అభివృద్ధి చేయలేక పోయారని, మొదటి సారి ఆశీర్వదించి గెలిపించినందుకు ప్రజా సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలంటూ గ్రామీణ ప్రాంత ప్రజలు అన్ని విధాల నా గెలుపునకు కృషి చేసినందుకు వారికి రుణపడి ఉంటానన్నారు. ఎడారి ప్రాంతంలో గట్టు ఎత్తిపోతల పథకం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. అక్షరాస్యతలో వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అక్షరాస్యత పెంపొంచేందుకు శాయ శక్తుల కృషి చేస్తానన్నారు. నాకు అండగా ఉన్న కార్యకర్తల రుణం తీర్చుకోలేదని, వారికి ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని హమీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చిన నేరుగా సంప్రదించాలని సూచించారు.
ప్రశాంతంగా ముగిసిన ఓట్ల లెక్కింపు

మహబూబ్‌నగర్, డిసెంబర్ 11: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం ఓట్ల లెక్కింపుతో ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు అయ్యింది. మహబూబ్‌నగర్‌లోని జెపిఎన్‌సిఇ కళాశాల ఆవరణలో ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ముగిసింది. నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి 19రౌండ్లలో ఓట్ల లెక్కింపును నిర్వహించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించి 19రౌండ్లలలో ఓట్ల లెక్కింపు చేశారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 18రౌండ్లలలో ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. అదేవిధంగా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి 20రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20రౌండ్లలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిచేశారు. ఇకపోతే ఉదయం 8గంటలకు ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం 4గంటల వరకు తుది ఫలితాలను విడుదల చేశారు. ముందుగా 8గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ముందుగా నియోజకర్గాల వారిగా బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవిఎంల ద్వారా అరగంట వ్యవధిలో రౌండ్ల వారిగా ఫలితాలను వెల్లడించారు. భారీ పోలీసుబందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎన్నికల పరిశీలకులు ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపును దగ్గరుండి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రౌండ్లవారిగా ఈవిఎంలను తీసుకువచ్చేవారిపై కూడా నిఘా ఉంచారు. మీడియాకు కౌంటింగ్ కేంద్రం అవరణలో ఓ గ్యాలరిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
కేసీఆర్ వెంటే పాలమూరు ప్రజలు
* టీడీపీ నేతల చెంప చెల్లుమనే తీర్పునిచ్చారు
* మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్, డిసెంబర్ 11: కేసీఆర్ వెంటే పాలమూరు ప్రజానికం నిలిచారని ఈ విజయంతో తమపై ఇంకా మరింత భాద్యత పెరిగిందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇద్దరు కలిసి అలింగనం చేసుకుని విజయసంకేతాన్ని చూయించారు. అనంతరం మిడియా సెంటర్‌లో విలేఖరులతో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాకు సాగునీరు అందాలంటే టీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలో ఉండాలని కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు నిండుమనస్సుతో దీవించారని అన్నారు. ఉమ్మడి పాత మహబూబ్‌నగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు ఇచ్చారని ఇది ఘనమైన విజయమని అన్నారు. కొందరు ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు రాబట్టుకోవాలని చూశారని కానీ వారి ఆటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోలైదని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోయారని అలాంటి పార్టీ మహబూబ్‌నగర్‌లో పోటీ చేస్తే వారి చెంప చెల్లుమనే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. టీఆర్‌ఎస్ పాలనలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు కేసీఆర్ నాయకత్వంలో చేయాల్సి ఉందని అన్నారు.
‘పేట’లో కారు ‘షికారు’
-తొలి రౌండ్ నుండే టీఆర్‌ఎస్‌కు కొనసాగిన ఆధిక్యం -డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, స్వతంత్రులు
నారాయణపేటటౌన్, డిసెంబర్ 11: నారాయణపేట నియోజకవర్గంలో కారు జోరు సాగింది. 19రౌండ్ల పాటు కొనసాగిన కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుండే టిఆర్‌ఎస్ తన అధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం లక్షా 61వేల 178ఓట్లు పోల్‌కాగా 732పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అందులో 156ఓట్లను తిరస్కరించగా నోటాకు 1944ఓట్లు పోలయ్యాయి. అందులో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి 68633 ఓట్లు ఇవిఎంలో పోల్ కాగా పోస్టల్ బ్యాలట్‌లో 134ఓట్లు రావడంతో ఆయనకు 68వేల 767ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి బిఎల్‌పి తరఫున బరిలో నిలిచిన కుంభం శివకుమార్‌రెడ్డి 53307ఓట్లు ఇవిఎంలలో పోల్ కాగా పోస్టల్ బ్యాలట్‌లు 273పోల్ కావడంతో ఆయనకు 53580ఓట్లు వచ్చాయి. దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి 15వేల 187ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా బిజెపి అభ్యర్థి కొత్తకాపు రతంగ్‌పాండురెడ్డి 19969ఓట్లు ఇవిఎంలలో పోల్ కాగా పోస్టల్ బ్యాలట్‌లో 142ఓట్లు పోల్ కావడంతో ఆయనకు 20వేల 111ఓట్లు, కాంగ్రెస్ సంకీర్ణ ప్రజాకూటమి తరఫున బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సరాఫ్ కృష్ణకు 6322ఓట్లు ఇవిఎంలో పోల్ కాగా పోస్టల్ బ్యాలట్‌లో 22ఓట్లతో కలిపి 6344ఓట్లు పోలయ్యాయి. కాగా బిఎస్‌పి తరఫున బరిలో నిలిచిన బి.శ్రీనివాసులు 881ఓట్లు, తెలంగాణ ఇంటిపార్టీ అభ్యర్థి జె.నవితకు 3636ఓట్లు, ఆప్ అభ్యర్థి కె.రాజుకు 825ఓట్లు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.సంజీవరెడ్డి 3989ఓట్లు పోలవగా, స్వతంత్ర అభ్యర్థులు కిష్టారెడ్డికి 1011ఓట్లు, పటేల్ రాంచంద్రారెడ్డికి 661ఓట్లు పోలయ్యాయి. వీరితో పాటు నోటాకు సైతం 1944ఓట్లు పోలవడం గమనార్హం.