మహబూబ్‌నగర్

కురిసిన వర్షం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 2: జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో గురువారం తెల్లవారుజామున ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లబడిపోయింది. జిల్లాను మేఘాలు దండిగా కమ్ముకున్నాయి. రోహిణి కార్తిలో సమృద్దిగా వర్షాలు కురిస్తే వర్షాధార విత్తనాలు విత్తుకుంటే పంటలు అధిక దిగుబడి వస్తాయని రైతుల నమ్మకం. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 32మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్ విత్తనాలను తమ పంట పొలాల్లో నాటేందుకు సిద్దం చేసుకుంటున్నారు. నేడో రేపో ఓ భారీ వర్షం కురిస్తే జిల్లా రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో వర్షాధార పంటలకు సంబంధించి దాదాపు 4.5లక్షల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలను సాగుచేయనున్నారు. ఈ ఏడాది కూడా రైతులు అంతకన్నా ఎక్కువ స్థాయిలో వర్షాధార పంటలను సాగుచేసుకునే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఖరీఫ్‌లో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో వేసిన పంటలు నేలపాలు కావడంతో ఆ సీజన్ మొత్తం రైతులను తీవ్రంగా కృంగదీసింది. ఈ ఏడాదైన వరుణుడు కరుణించి మంచి పంటలు దిగుబడి వచ్చేలా రైతులు కోరుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికి వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయానికి సర్వం సిద్దమయ్యారు. జిల్లాను మేఘాలు కమ్ముకుని ఉండడంతో భారీ వర్షాలు కురిసే అవకాశమే ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. గత వారం రోజుల క్రితం కురిసిన వర్షం జిల్లాలో వివిధ మండలాల్లో చిన్న చిన్న కుంటలు, చెరువుల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం మరో భారీ వర్షం కురిస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు భావిస్తున్నారు.