మెదక్

ఐదు కిలోమీటర్లకో కొనుగోలు కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, అక్టోబర్ 27: రైతులకు గిట్టుబాటు ధరి కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మెదక్ మండలం రాజ్‌పల్లి, హవేళీఘణాపూర్ మండలం లింగసాన్‌పల్లి గ్రామాల్లో ఐకెపి ద్వారా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ సురేశ్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దళారుల బెడద నుండి తప్పించి గిట్టుబాటు ధర ఇప్పించి, దండెకొట్టకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి విక్రయించిన వెంటనే డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేవుడి దయతో అధిక వర్షాలు కురవడం వల్ల ఈసారి యాసంగి కూడా బాగా నాట్లు వేయనున్నారన్నారు. ప్రభుత్వం కూడా రైతులకు 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి సిద్దంగా ఉందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు ముందస్తుగా ప్రణాళిక రచించి విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సురేశ్‌బాబు, ఎంపిపి లక్ష్మీకిష్టయ్య, జడ్‌పిటిసి లావణ్యారెడ్డి, ఎఎంసి చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్, వైస్ చైర్మన్ అశోక్, తహశీల్దార్‌లు అమీనుద్దిన్, రవికుమార్, ఐకెపి ఎసి జైసింగ్, ఎపిఎం ఇందిర, సర్పంచ్‌లు నర్సారెడ్డి, సాంబశివరావు, ఎఎంసి డైరెక్టర్ బిక్షపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మార్గం యాదగిరి, మార్గం శ్రీనివాస్, మార్గం నాగరాజు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి ధాన్యం పరిశీలించి, తేమను చూశారు.

పోచారం ప్రాజెక్టుకు
పర్యాటక హంగులు
రెండు బోట్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం
డిప్యూటీ స్పీకర్ పద్మ, కలెక్టర్‌ల సందర్శన
మెదక్ రూరల్, అక్టోబర్ 27: పోచారం ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు అన్నిరకాల హంగులు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. త్వరలో రెండు బోట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల పర్యాటకులు సొంతంగా ఎయిర్ బోట్లతో జలవిహారం చేసిన విషయాన్ని గుర్తుచేస్తు బోట్ల ఏర్పాటువల్ల పర్యాటకులను అమితంగా ఆకర్షించవచ్చన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భారతిహొళ్లికేరి, జాయింట్ కలెక్టర్ సురేశ్‌బాబుతోకలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఇప్పటికే అక్కడ రోడ్డుపై వేసి మొరం, కంకర చిప్స్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద గల అతిథిగృహం వరకు వేసిన రోడ్డుతోపాటు గుట్టపై ఉన్న గెస్ట్ హౌస్ వరకు రోడ్డు పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ ఇఇ వెంకటేశ్వర్లును ఆదేశించారు. ప్రాజెక్టు వద్దకు వచ్చే పర్యాటకులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, రెస్టారెంట్ ఏర్పాటుతోపాటు తాగునీటి సౌకర్యం, బసచేయడానికి వీలుగా అతిథిగృహానికి మరమ్మత్తులు చేయించనున్నట్లు వెల్లడించారు. గుట్టపైన ఉన్న అతిథిగృహం ఆధునీకరణకు 40 లక్షల రూపాయలు ఇప్పటికే మంత్రి హరీష్‌రావు మంజూరు చేశారని గుర్తుచేశారు. ప్రాజెక్టులో బోట్లను ఏర్పాటుచేసే చోట అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఒడ్డున పర్యాటకులు జారీపడకుండా పిట్టగోడ నిర్మాణం చేయాలన్నారు. దీపావళి తర్వాత బోట్ల ఏర్పాటుతో మరింత పర్యాటక శోభ సంతరించుకోనుందన్నారు. ప్రైవేటు సంస్థకు నిర్వాహణ బాధ్యతలు అప్పగిస్తామని కలెక్టర్ భారతి హొళ్లికేరి తెలిపారు. రికార్డు పరంగా పోచారం ప్రాజెక్టు శివారు మెదక్ జిల్లాకే వర్తిస్తుందన్నారు. వీరి వెంట డిఆర్‌ఓ నగేశ్, మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లిఖార్జున్‌గౌడ్, ఎఎంసి చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పిఆర్ ఇఇ వెంకటేశ్వర్లు, డిఇ జగదీశ్వర్, తహశీల్దార్ అమీనుద్దిన్, పిఆర్‌ఓ జీవన్‌రావు తదితరులున్నారు.

మిషన్ కాకతీయ పనులతో మేలు
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
చేగుంట, అక్టోబర్ 27: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం చేగుంట మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు అభివృద్దికి చేయూతనివ్వాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఖరీప్ సీజన్ చివరి దశలో వర్షాలు సమృద్దిగా కురిశాయని, వరుణుడు కరుణించడం వల్ల చెరువులు, కుంటలు నిండి రైతులకు ఆనందం కలిగించాయన్నారు. మిషన్ కాకతీయ పనులతో మేలు చేకూరిందని ఆయన పేర్కొన్నారు. కస్తుర్భా గాంధీ పాఠశాల విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. కస్తుర్భా పాఠశాలలో విద్యార్థులకు బెడ్లు, మంచాలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని సహకార కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరిగిందని, అలాగే ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి ఫలితంగా దుబ్బాక నియోజకవర్గంలో ఎంతో అభివృద్ది జరుగుతుందన్నారు. చేగుంట మండలంలోని నార్సింగి కొత్త మండలంగా ఏర్పడిందని, కొంతకాలం ఇంచార్జీ అధికారులు ఉంటారని, పనులు సత్వరంగా జరుగుతాయని, సందేహపడవలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ మంత్రి సహకారంత నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని, కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మెదక్, సిద్దిపేట జిల్లాలపై దృష్టి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు నార్సింగిలో ఫారాబైల్డ్ రైస్‌మిల్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే బి.కొండాపూర్ గ్రామంలో తెరాస ప్రతినిధి పురుషోత్తం తండ్రి ఇటీవల మరణించినందున ఆ కుటుంభాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డితో మంత్రి పరమార్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటరాంరెడ్డి, తహశీల్దార్ నిర్మల, ఎఓ గంగాభాయ్, వ్యవసాయ అధికారి చైతన్య, ఎంపిపి రమ, వైస్ ఎంపిపి మల్లేశంగౌడ్, జడ్పిటిసి శోభరాణి పాండు, మాజీ ఎంపిపి కె.పాండు, మార్కెట్ కమిటి చైర్మన్ గడ్డమీది సుజాత రఘుపతి, వైస్ చైర్మన్ మంచికట్ల శ్రీనివాస్, సొసైటి చైర్మన్లు నారాయణరెడ్డి, వెంగళరావు, వెంకటేశం, తౌర్యనాయక్, కస్తుర్భా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, తెరాస నాయకులు అంజాగౌడ్, వడ్డెపల్లి నర్సింలు, నర్సింహ్మాచారి, శ్రీపతిరావు, కుమ్మరి బాబు, సర్పంచ్‌లు తానేషా, డి.అంజమ్మ, ప్రవీన రాజిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన విద్యనందించడమే లక్ష్యం
మైనార్టీ గురుకుల పాఠశాలల చైర్మన్ ఏకే ఖాన్
గజ్వేల్, అక్టోబర్ 27: మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయగా, నాణ్యతతోకూడిన బోజనం, మెరుగైన విద్యనందించటమే తమ లక్ష్యమని మైనార్టీ గురుకుల పాఠశాలల చైర్మన్ ఎకే ఖాన్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి గజ్వేల్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఏసిపి శివకుమార్‌తో కలిసి తనిఖీ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. కార్పోరేట్ స్థాయిలో విద్య నందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 71 మైనార్టీ గురుకులాలను ఏర్పాటుచేయగా, మెరుగైన వసతులు, భవన నిర్మాణాల కోసం రూ. 1400 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి గురుకుల పాఠశాలను 5 ఎకరాల విస్థీర్ణంలో ఏర్పాటు చేయనుండగా, ప్రతి యేటా ప్రతి విద్యార్థిపై రూ. 80వేల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా విద్యతోనే చక్కటి భవిష్యత్తు ఉంటుందనే లక్ష్యంతో విద్య పట్ల ఆసక్తి పెంచడం, నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్ మీడియంతో విద్యాబోదన, సిబ్బంది నియామకం, వౌళిక వసతుల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. అయితే విది నిర్వాహణలో నిర్లక్ష్యం చేసినా, నాణ్యమైన, పోషక విలువలతోకూడిన బోజనం అందించని పక్షంలో చర్యలు తప్పవని అన్నారు.

శీతాకాల సమావేశంలో
ఎస్సీ వర్గీకరణను ప్రవేశపెట్టాలి
ఎంఅర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌కుమార్
తూప్రాన్, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వం వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఎస్సి వర్గీకరనకు చట్టబద్దత కల్పించాలని తెలంగాణ ఎంఅర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఎస్సి వర్గీకరనపై చేపట్టిన మాదిగ దర్మయుద్ద రతయాత్ర తూప్రాన్‌కు చేరుకున్న సందర్బంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18న మాదిగ దర్మయుద్ద రథయాత్ర జగదేవ్‌పూర్ నుండి ప్రారంభమైనట్లు చెప్పారు. ఆగస్ట్ 10న డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఎంఅర్‌పిఎస్ మహా దర్నాలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు ధర్నాకు చేరుకొని వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెడతానని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలన్నారు.
ముఖ్యమంత్రి కెసిఅర్ ఎస్సి వర్గీకరనపై అఖిలపక్షాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. ఎస్సి వర్గీకరనపై నవంబర్ 20న పరేడ్ గ్రౌండ్‌లో మహా సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. విలేఖరుల సమావేశంలో జాతీయ ఉపాద్యక్షుడు యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇస్లాండియొద్దీన్, గజ్జెల భిక్షపతి, ప్రధాన కార్యదర్శి రాములు, నాయకులు సత్తయ్య, నాగులు, యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలను నిర్లక్ష్యం చేయొద్దు
* నాటిన మొక్కల లెక్క తేల్చాల్సిందే * ఎండితే మళ్లీ నాటించాలి
* అధికారుల్లో అలజడి * సరికొత్త పంథాలో సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి, అక్టోబర్ 27: మొక్కే కదా నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని రెండవ విడత హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల లెక్కలను తేల్చాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్ అధికారులను ఒక పట్టు పడుతున్నారు. నాటిన ప్రతి మొక్క వివరాలను సమగ్రంగా అందించాలని ఆదేశించడంతో ఆయా శాఖల అధికారుల్లో అలజడి మొదలైంది. సంగారెడ్డి జిల్లాలో శాఖల వారిగా హరితహారం మొక్కల వివరాలను తెప్పించుకోవడమే కాకుండా ఎండిపోయిన మొక్కల స్థానంలో మరో మొక్కలను నాటించారా లేదా, మొక్కల జీవన స్థితిగతులు ఏమిటో స్పష్టం చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసారు. దీంతో రెవెన్యూ, వ్యవసాయం, ఉద్యానవనం, ఎక్సైజ్, విద్యా, వైద్యం, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో మొక్కల వివరాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. మున్సిపల్ పట్టణాల్లో అధికారికంగా నాటించిన మొక్కలతో పాటు ప్రజలు పెంచిపోషించడానికి పంపిణీ చేసిన వివరాలను సైతం సేకరిస్తున్నారు. పాత జిల్లా మెదక్‌లో రెండవ విడత హరితహారంలో 3.54 కోట్ల మొక్కలను నాటేందుకు అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లెక్కన సంగారెడ్డి జిల్లాలో అత్యధిక మండలాలు, భౌగోళిక నైసర్గిం కూడా పెద్దగానే ఉండగా, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన సంగారెడ్డి జిల్లాలో కోటికిపైగానే మొక్కలను నాటినట్లు స్పష్టమవుతోంది. మొక్కను నాటించి దత్తత తీసుకున్న వారు సదరు మొక్కను ఏ విధంగా పరిరక్షిస్తున్నారన్న వివరాలను కూడా సేకరిస్తున్నారు. నీడ నిచ్చే చెట్లు, పండ్ల మొక్కల వివరాలన్ని తీసుకుని ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు నివేధికలు సమర్పించడంలో శ్రమిస్తున్నారు. గ్రామాల్లో మొక్కలను పరిరక్షించడానికి నియమించిన కమిటీల పనితీరుపై కూడా అధికారులు అద్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. హరితహారం కార్యక్రమంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్ తీసుకుంటున్న శ్రద్దతో జిల్లాలో పచ్చదనం పరడవిల్లుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ జిల్లాలో అటవి ప్రాంతం తక్కువగా ఉండటంతో గుట్టలపై మొక్కలను పెంచిపోషించడం వల్ల అటవి ప్రాంతం పెరిగే అవకాశం లేకపోలేదని పర్యావరణ పరిరక్షణ నిపుణుల్లో ఆశలు చిగురిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో వందల సంఖ్యలో పరిశ్రమలు ఉండగా, రసాయన కాలుష్యాన్ని వెదజల్లె పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో కాలుష్యం భారీ నుంచి కాపాడేందుకు హరితహారం కార్యక్రమంలో నాటించిన మొక్కలు ఎంతో దోహదపడుతాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు 65వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా మార్చే పనులు ప్రారంభానికి ముందు రహదారికి ఇరువైపుల ఉన్న వందలాది మొక్కలను అడ్డంగా నరికివేయడంతో జాతీయ రహదారి ఇరుప్రక్కల బోసిపోయి దర్శనమిస్తోంది. రానున్న మూడవ విడత హరితహారం కార్యక్రమంలోగా 65వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు దాదాపుగా పూర్తికానున్నాయి. మూడవ విడతలో ఈ జాతీయ రహదారికి ఇరుప్రక్కల నీడనివ్వడంతో మానులుగా ఎదిగే మర్రి, రావి, తుమ్మ, వేప తదితర మొక్కలను నాటించడానికి రహదారుల శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈత మొక్కలను కూడా లక్షల సంఖ్యలో నాటించారు. పుష్కళంగా వర్షాలు కురియడంతో జళాశయాలన్ని కళకళాడుతుండగా ఈత వనాలకు మేలు చేకూరుతుందని గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయడంలో కొత్త కలెక్టర్ మానిక్యరాజ్ తనదైన శైలీలో చర్యలు చేపట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

విద్యాభివృద్ధికి కృషి
నారాయణఖేడ్ అక్టోబర్ 27: వెనుక బడిన ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్య రంగంలో ముందుకు తెచ్చేందుకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తూ నూతన భవనాలను నిర్మిస్తునట్లు మంత్రి హరీస్‌రావు తెలిపారు. గురువారంనాడు సిర్గాపూర్ మండల కేంద్రంలో నూతన నిర్మించిన బాలుర గురుకుల పాఠశాల భవనం, రైతుల మేలు సోయాభీన్ కొనుగోలు కేంద్రంను కల్హేర్ మండల కేంద్రంలో అయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ బాలుర విద్యార్థులకు విద్యను అందు బాటులో ఉన్నతా చదువులు చదవుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఅర్ కృషి చేస్తున్నారని అయన అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఉన్న అధ్యాపకులు సక్రమంగా విద్యార్థులకు విద్యను నేర్పించి ప్రైవేటు విద్యా సంస్థలతో పాటి పడాలన్నారు. ప్రభుత్వం కోట్ల రుపాయలు వెచ్చించి భవనాలను, గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని అందుగాను ప్రభుత్వం చేపడుతున్న ఏ పనులైన వృథా కాకుండా ఉండాలంటే అధికారుల పాత్ర ముఖ్యమన్నారు. పేద విద్యార్థులను విద్యను సక్రమంగా నేర్పించి వచ్చే సంవత్సరంలో సిర్గాపూర్ గురుకుల పాఠశాల జిల్లాలో మొదటి స్థానం సాదించాలన్నారు. ఇందులో ఎమ్మెల్యే ఎం, భూపాల్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ రాజమణి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మోయిదిఖాన్, అప్పారావుశెట్కార్, హన్మంతు. తదితరులు పాల్గొన్నారు.
రైల్వేలైన్ బాధితులకు అన్యాయం జరగనివ్వం
గజ్వేల్: రైల్వేలైన్ బాదిత రైతులకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కొడకండ్ల సర్పంచ్ మహేందర్‌రెడ్డి, టిఅర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిది రవీందర్‌రావుల నేతృత్వంలో 100 మందికి పైగా రైతులు మంత్రి హరీశ్‌రావును కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. గతంలో రైల్వేలైన్ కోసం సర్వే చేయగా ఓ విత్తన సంస్త మద్యలో నుండి వెల్లగా, అయితే ఆ విత్తన సంస్త యాజమాన్యం వత్తడితో రైల్వేలైన్ సర్వేను తిరిగి చేపట్టడంతో చిన్నచిన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మంత్రి హరీశ్‌రావు రైల్వేలైన్ సర్వేను సక్రమంగా జరిగేలా చూస్తానని, చిన్న రైతులకు అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. ముఖ్యంగా యేండ్ల తరబడిగా ఎదురుచూస్తున్న రైల్వేలైన్ వస్తుండడాన్ని అందరూ స్వాగతించాలని ఆకాంక్షించారు.