మెదక్

పేటకు లాంగ్‌రూట్ సర్వీసులు మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 8 : సిద్దిపేట డిపో లాభాల బాట పట్టేందుకు లాంగ్ రూట్ సర్వీసులు ప్రవేశపెట్టాలని మంత్రి హరీష్‌రావు ఆర్డీసీ చైర్మన్‌కు సోమారపు సత్యనారాయణకు సూచించారు. సిద్దిపేట డిపో నుండి తిరుపతి, షీర్డీతో దూర ప్రాంతాలకు సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ డిపోలకు ప్రత్యేక క్లీనిక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసి సంస్థకు ఆదాయాన్ని సమకూర్చేందుకు పాత బస్టాండ్‌ను తరలించి, మల్లిఫ్లెక్స్,షాపింగ్ మాల్ నిర్మించేందుకు పరిశీలించాలన్నారు. సిద్దిపేట డిపోకు నాలుగు సిటీ బస్సులు మంజూరు చేశారని, అదనంగా మరిన్ని బస్సులు మంజూరు చేయాలన్నారు. డిపోలో ఖాళీగా ఉన్న కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో 55లక్షలు వెచ్చించి సాప్ట్‌ఫేర్‌ను మార్చి క్యాష్‌లెస్ విధానం ప్రవేశపెట్టామని, సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత కండక్టర్లదే అన్నారు. ఇక్కడ విజయవంతమైతే భవిష్యత్తులో రాష్టమ్రంత అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సంస్థ మనందరిదని, సంస్థ పరిరక్షణకు కృషిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలు ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైందని, ప్రైవేటువాహనాలకు బదులుగా బస్సులో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఆనంతరం కండక్టర్లకు స్వైఫ్ మిషన్లు అందచేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ సంస్థ ఈడి నాగరాజు, జెడి వెంకట్‌రావు, జెసి హన్మంత్‌రావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డివిఎం సంజీవరెడ్డి, డిఎం సురేష్‌బాబు, కౌన్సిలర్లు వెంకట్‌గౌడ్, బర్లమల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

వైకుంఠపురానికి పోటెత్తిన భక్తులు

సంగారెడ్డి, జనవరి 8: అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకల సందర్భంగా వైష్ణవ ఆలయాలన్ని గోవింద నామ స్మరణతో మారుమ్రోగాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఏకాదశి ప్రవేశించగా రాత్రి 2 గంటల నుంచే ఆలయాల వద్ద భక్తులు క్యూ కట్టారు. తిరుమలను తలపించే విధంగా దినదిన ప్రవర్తమానంగా భక్తులను ఆకర్షిస్తున్న సంగారెడ్డిలోని వైకుంఠపురం వద్ద రాత్రి 2 గంటల నుంచే క్యూలైన్‌లో నిల్చున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెల్లవారు జామున 4 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. భారీ పోలీసు బందోబస్తు మద్య వేడుకలు కొనసాగాయి. గత యేడాదికి భిన్నంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో భక్తులు రెండు గంటల వ్యవధిలోనే సాధారణ దర్శనాలతో సంతృప్తిగా వెళ్లిపోయారు. వంద మీటర్ల పొడవు, 30 వరసలతో కూడిన క్యూలైన్లకు భారీకెడ్లను ఏర్పాటు చేసినప్పటికీ బారికేడ్లకు దూరంగా భక్తులు భారులు తీరారు. తెల్లవారుజామునే స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా పద్మిణీ దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి, జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో వాహనాలు నిండిపోగా రోడ్డుకు ఇరువైపు కిలోమీటర్ మేరకు వాహనాలను పార్కింగ్ చేసారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి వైకుంఠపురం వరకు ఆర్టీసి అధికారులు ప్రత్యేక బస్సులను నడిపించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించారు. సాధారణ దర్శనంతో పాటుగా రూ.100, రూ.500 టికెట్ల ద్వారా ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేసారు. సప్తద్వారాలను ఏర్పాటు చేసి భక్తులను దర్శనానికి అనుమతించడంతో తన్మయత్వానికి గురిచేసింది. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్లారు. ఆలయ ప్రాంగణంతో పాటు లడ్డూ, పులిహోరా కౌంటర్ల వద్ద కూడా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒక్క సంగారెడ్డి పట్టణానికే పరిమితం కాకుండా సదాశివపేట, పటన్‌చెరు, రామచంద్రాపూర్, జోగిపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సదాశివపేట నుంచి 30 మంది భక్తులు 20 కిలోమీటర్లు పాదయాత్రతో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులను అలరింపజేయడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా భక్తిరస గీతాలను ఆలపించారు. చిన్నారులు చేసిన భరత నాట్యం, కూచిపూడి, ఇతర నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుమారు 500 మంది స్వచ్చంద కార్యకర్తలు భక్తులకు అవసరమైన సేవలను అందించారు. క్యూలైన్లో నిల్చున్న వారికి మంచినీటి ప్యాకెట్లను అందజేసారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 11న రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న బాలజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే బారులు తీరడంతో ఒక్కొక్కరికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. సిద్దిపేటలోని పురాతన వెంకటేశ్వర ఆలయం, ఇతర వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మెదక్‌లోని కోదండరామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం కూచాద్రి వెంకటేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

వైభవంగా వైకుంఠ ఏకాదశి
ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, గోదారంగనాథ స్వామి పల్లకి మోసిన ఉపసభాపతి, స్వామివారిని దర్శించుకున్న అశేష భక్తులు

మెదక్, జనవరి 8: మెదక్ శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం రోజు అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం పురష్కరించుకొని ఉత్తర ద్వార దర్శనంలో అశేష భక్తులు పాల్గొన్నారు. తెల్లవారుజాము 4:30 గంటలకు ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉససభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, డిఆర్‌ఓ మెంచు నగేష్, జడ్పిటిసి లావణ్యరెడ్డి, ఆ వార్డు కౌన్సిలర్ మాయ మల్లేశం పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనం ఉదయం 4:30 గంటల నుండి మద్యాహ్నాం ఒంటి గంట వరకు కొనసాగింది. కోదండ రామాలయంలో గోదారంగనాథ స్వామి వారి పల్లకి సేవలో కూడా ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సుమారు గంట పాటు కోదండ రామాలయంలో ఆమె ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆర్‌కె.శ్రీనివాస్, అరునార్తి వెంకటరమణ, చంద్రకళ, పిఆర్‌ఓ జీవన్‌రావు, ఎయంసీ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. శ్రీ కోదండ రామాలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురష్కరించుకొని ఉత్తర ద్వార దర్శనంలో ప్రధాన పూజారులు భాష్యం మధుసూదనాచార్యులు, వైద్య శ్రీనివాస్‌శర్మ, కృష్ణమూర్తి, రంగాచార్యులు, ప్రసాద్‌పంతులు, శేషాచారి పాల్గొన్నగా ఆలయ కమిటి అధ్యక్షులు కొండ నరేందర్, బద్రినాథ్, బాలరాజు, వీరేశం, పురుషోత్తంలు భక్తులకు సేవలందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా డిఎస్పీ నాగరాజు, సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకొని భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

నాలుగవ రోజు కొనసాగిన యాగం

సంగారెడ్డి, జనవరి 8: లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న శ్రీ సహస్చ్ర చండీ మహా యాగ కార్యక్రమం నాలుగవ రోజైన ఆదివారం ఘనంగా కొనసాగింది. ఉదయం నుంచే రుత్విక్కులు యాగాన్ని ప్రారంభించడంతో భవాని మాత మందిరం వేదమంత్రాలతో దద్దరిల్లింది. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి కావడంతో వైకుంఠపురానికి వెళ్లి స్వామిని దర్శించుకున్న భక్తులు యాగాన్ని దర్శించుకోవడానికి రావడంతో భవాని మాత మందిరం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 8.30 గంటలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కుటుంబ సభ్యులు యాగం వద్దకు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజు వారి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ప్రారంభించగా మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో వేద పండితులు సూచించినట్లుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి రోజైన సోమవారం నాడు పూర్ణాహుతి కార్యక్రమానంతరం తొగుట పీఠాధిపతి మాదవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణంతో యాగం పరిసమాప్తి కానుంది. ఐదు రోజులుగా నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కన్నుల పండువగా ముక్కోటి ఏకాదశి
సిద్దిపేట, జనవరి 8 : ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరాలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి సిద్దిపేట జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది భక్తులు దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగుకుండ ఉండేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఐదు క్యూలైన్లు వేంకటేశ్వరాలయం నుండి గాంధీ చౌక్, కోర్టు వరకు ఏర్పాటు చేశారు. వివిఐపి, ఆలయ అభివృద్ధికి కృషిచేసిన దాతలు, వికలాంగులు, పిల్లలకు, వృద్ధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గాంధీ చౌక్, మున్సిప్ కోర్టు, మున్సిపల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ రూట్లో బారి కేడ్లు ఏర్పాటు చేసి పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వైకుంఠ నాథున్ని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామున 3 గంటల నుండి బారులు తీరారు. మూక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలోని మూల విరాట్‌లైన వేంకటేశ్వరాలయం, గోదాదేవి,రంగనాధుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారు జామున 5గంటలకు వేద పండితుల ఘోషల మధ్య, గోవిందా నామస్మరణల మధ్య స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో రంగనాథస్వామి, గోధాదేవిల ఉత్సవ విగ్రహాలను ఊరేగించి, ఆనంతరం భక్తుల సందర్శనార్ధం ధ్యాన మందిరంలో ఉంచారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి మూల విరాట్‌తో పాటు, ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, పోలీసు కమిషనర్ శివకుమార్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ పక్షాన వారిని ఘనంగా సన్మానించారు. మధ్యాహ్నాం తర్వాత గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికంగా రావటంతో రద్దీ మరింత ఎక్కువైంది. భక్తుల సందర్శనార్ధం రాత్రి 10 గంటలకు అనుమతించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించారు. సుమారు 50వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా వేస్తున్నారు. ఈ యేడాది ఆలయ కమిటీ పక్షాన ఏర్పాట్లు పకడ్బందిగా చేయటంతో పలువురు ప్రశంసించారు. ఆలయ ప్రాంగణాల్లో సిపి శివకుమార్, ఎసిపి నర్సింహారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, పాత వెంకటేశ్వరాలయం, సత్యనారాయణ స్వామి ఆలయం, రావిచెట్టు హనుమాన్ దేవాలయం, గణేశ్‌నగర్ ప్రసన్నంజనేయ ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు నిర్వహించారు.
మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణాలను సందర్శించిన ఉపసభాపతి
మెదక్, జనవరి 8: పట్టణంలో మిషన్ భగీరథ పనులలో భాగంగా పైప్‌లైన్ నిర్మిస్తున్న ప్రాంతాలను ఆదివారం ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. మెదక్ పట్టణం ధ్యాన్‌చంద్ విగ్రహం ఆవరణలో పైప్‌లైన్ పనులను ఆమె పరిశీలించారు. ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల వైపున జరుగుతున్న పైప్‌లైన్ పనులను వెంటనే రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడమే కాకుండా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావును కూడా ఆదేశించారు. అలాగే తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల వైపు మిషన్ భగీరథ పైప్‌లైన్లను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ఆ ప్రాంతాలన్నింటిని కూడా పద్మాదేవేందర్‌రెడ్డి పాదయాత్ర చేస్తూ పైప్‌లైన్లను పరిశీలించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, డిఆర్‌ఓ నగేష్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జడ్పిటిసి లావణ్యరెడ్డి, వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు, గంగాధర్, జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పల్లె వెలుగు బస్సులను ప్రారంభించిన ఉపసభాపతి
* మల్లంపేట వరకు టికెట్ తీసుకొని ప్రయాణించిన ఉపసభాపతి
మెదక్, జనవరి 8: మెదక్ నుండి నారాయణఖేడ్ వయా మల్లంపేట, చీకోడ్, జహిరాబాద్ వయా రాయిపల్లి, అదునూర్, మెటల్‌కుంట పల్లె వెలుగు బస్సులను ఆదివారం ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. మెదక్ నుండి నారాయణఖేడ్‌కు బయలుదేరే పల్లెవెలుగు బస్సు ఉదయం 8:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు మెదక్ చేరుకుంటుందని మెదక్ ఆర్టీసి డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. బస్సులను ప్రారంభించిన ఉపసభాపతి మల్లంపేట బస్సులో ప్రయాణించి అదే బస్సులు టిఫిన్లు ఆరగించి తిరిగి మెదక్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జడ్పిటిసి లావణ్యరెడ్డి, డిపో మేనేజర్ శ్రీనివాస్, టిఎంయు నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఎంఆర్‌కె.రావు తదితరులు పాల్గొన్నారు.