మెదక్

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ పట్టణాలకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 13: ఉమ్మడిగా ఉండి మూడు జిల్లాలుగా ఏర్పడిన సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కేంద్రాలకు మహార్దశ పట్టిందని చెప్పవచ్చు. మూడు జిల్లా కేంద్రాల పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపించారు. ప్రభుత్వం పరిశీలించి నిధులను మంజూరు చేయడమే తరువాయిగా రింగు రోడ్ల నిర్మాణం ప్రారంభం కావడం తథ్యమని చెప్పవచ్చు. ఈ మేరకు సోమవారం ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ రాధాక్రిష్ణ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణాలు, రోడ్ల వెడల్పు పనులపై వివరించారు. రెండున్నర సంవత్సరాల కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,232 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఆర్ అండ్ బి పరిధిలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న రోడ్ల మరమ్మతులు, నిర్మాణాల పనులను చేపట్టినట్లు స్పష్టం చేసారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో మొత్తం 394 పనులకు మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. ఈ పనుల ద్వారా 1,184 కిలోమీటర్ల రోడ్లను వెడల్పు, మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అదే విధంగా 71 వంతెనలు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో 175 పనులకు సంబంధించి 122 కిలోమీటర్ల మేరకు 928 కోట్లను ఖర్చు చేసి పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. 16 వంతెనల నిర్మాణం పూర్తికాగా 73 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. మరమ్మతులకు సంబంధించి 21 పనులకు 799 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తి చేయగా 388 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. రోడ్డు వెడల్పులకుగాను 28 పనులకు మంజూరు ఇవ్వగా 422 కిలోమీటర్లకు 497 కోట్లతో పనులను పూర్తి చేసినట్లు స్పష్టం చేసారు. సంగారెడ్డి పట్టణంతో పాటు మరికొన్ని గ్రామాలు, పట్టణాలను కలుపుకుని నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుకు 200 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. మొత్తం 45 కిలోమీటర్ల మేరకు ఈ రింగ్ రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. మెదక్ పట్టణం చుట్టూ 26 కిలోమీటర్ల రింగ్ రోడ్డును నిర్మించడానికి రూ.110 కోట్ల నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణం చుట్టూ 80 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి 300 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు పూర్తి ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని ఎస్‌ఈ రాధాక్రిష్ణ పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఈఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్‌పై భిన్నస్వరాలు

సంగారెడ్డి, మార్చి 13: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌పై సంగారెడ్డి జిల్లాలో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అంకెల గారడితో కూడిన బడ్జెట్‌గా అభివర్ణిస్తుండగా, అధికార పక్షం మాత్రం మెరుగైన బడ్జెట్‌గా సమర్థించుకుంటున్నారు. కుల వృత్తులకు చేదోడు వాదోడుగా నిలిచే విధంగా ప్రధానంగా వృత్తినే నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్న నాయిబ్రాహ్మణులు, రజక వృత్తిదారుల సంక్షేమానికి 500 కోట్లు కేటాయించడంతో ఆ వర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోంది. చేనేత రంగం కోసం 1200 కోట్ల కేటాయింపులను చేనేత వర్గం స్వాగతిస్తుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఇతర కుల వృత్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అధికార పార్టీ నేతలు భరోసాను వ్యక్తం చేస్తున్నారు. కేవలం బడ్జెట్‌లో నిధులు కేటాయించినంత మాత్రాన కుల వృత్తులు అభివృద్ధి చెందినట్లు కాదని, కేటాయించిన నిధులను చిత్తశుద్దితో ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. విద్యారంగానికి కేటాయించిన నిధుల్లో సగానికిపైగా ఉపాధ్యాయుల వేతనాలకే వెళ్లిపోతుందని మిగిలిన కాస్తన్ని నిధులతో ఏరకంగా అభివృద్ధి చేస్తారన్న ప్రశ్నలను ప్రతిపక్ష కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కుల వృత్తుల పేరిట రాష్ట్రంలో కులాలను విభజించి లబ్దిపొందేందుకు ప్రభుత్వం ఎత్తుగడలో ఇదోభాగంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రాజెక్టుల కోసం నిధులను కేటాయించినట్లు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించారు? గత ప్రభుత్వాలు నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల సంగతేమిటనే ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఎవరేమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.
రాష్ట్రంలో క్షామం పోయి క్షేమం వస్తోంది
కుల వృత్తులకు ఊరట
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కుల వృత్తిపై ఆధారపడి జీవించే సగటు మనిషి వృత్తిని మానేస్తే కలిగే అనర్థాలను గుర్తించిన ఓ మహాకవి కుల విద్య మానకురా గువ్వల చెన్నా అంటూ చేసిన హెచ్చరికలోని వాస్తవికతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్నా భిన్నమైన కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. గ్రామాలు, పట్టణాల్లో కుల వృత్తులనే నమ్ముకుని నేటికి జీవనం సాగిస్తున్న నాయిబ్రాహ్మణ, రజక, కుమ్మరి, వడ్రంగి, చేనేత, గీత, కంసాలు, కమ్మరి, గొల్లకుర్మలు తదితర అనేక కులాలకు న్యాయం చేకూర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉంది. మహిళా సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, విద్యార్థుల సంక్షేమం, పుట్టిన శిశువుల సంక్షేమం, ప్రాజెక్టుల నిర్మాణం, పింఛన్లు, రేషన్ బియ్యం, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆయా కులాల నుంచి ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పుట్టుకుంది. ఇందుకుగాను ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కుల వృత్తులు చిన్నాభిన్నమై చేతులు విరిగినట్లుగా గ్రామాలను వదిలి పట్టణాలకు వలసలు వెళ్లిన వారంతా తిరిగి స్వగ్రామాలకు వచ్చే విధంగా ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తుంది. భవిషత్తులో వలసలు అనేవి కనిపించని విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.
వృత్తుల పరిరక్షణకు కాదు కులాల విభజనకు
మభ్యపెట్టే బడ్జెట్‌ను ప్రజలు విశ్వసించరు
మాజీ మంత్రి సునితారెడ్డి
కుల వృత్తుల పరిరక్షణ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల విభజనకు శ్రీకారం చుట్టిందని, భవిషత్తులో ఇది మంచి పరిణామం కాదు. కులానికి ఇంత అంటూ ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించిన ప్రభుత్వం బిసి సబ్ ప్లాన్‌ను ఎందుకు ప్రకటించడం లేదు. బిసి సబ్ ప్లాన్ వేసి చట్ట బద్దత కల్పిస్తే కుల పక్షపాతం లేకుండా అన్ని కులాలకు సమప్రాధాన్యత లభిస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులంటూ చెప్పారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టం చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు నిధులను ఎందుకు కేటాయించలేదు. మీరు నిర్మించేవి మాత్రమే ప్రాజెక్టులా? రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో అప్పుల కుప్పగా మార్చారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే ఈ బడ్జెట్ పనికొస్తుంది. మోసపూరిత అంకెన గారడి బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదు. కెజి టూ పిజి అని ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టినా ఆ ఊసెత్తకపోవడం దురదృష్టకరం. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా ప్రభుత్వ నిర్ణయం కనిపిస్తోంది. నాయిబ్రాహ్మణ, రజక, చేనేత కులాల కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయించడాన్ని స్వాగతిస్తున్నా వాటిని పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తేనే న్యాయం చేకూరుతుంది. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు మంజూరు చేసిన నిధులను ఇతర ప్రయోజనాలకు దారి మళ్లించారు. అలాకాకుండా సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించాల్సి ఉంది. ఈటెల వార్షిక బడ్జెట్ నమ్మశక్యంగా కనిపించడం లేదు.
పన్నులు పెంచడానికే బడ్జెట్
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం
2017-18 సంవత్సరానికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిగా ఉంది. 1.30 లక్షల కోట్ల నుండి 1.49 లక్షల కోట్ల పైచీలుకు బడ్జెట్‌లో 26096 కోట్ల ద్రవ్యలోటు పన్నులు పెంచడానికేనని స్పష్టమవుతోంది. గడచిన బడ్జెట్‌లో కూడా అంచనాలతో ఆదాయానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఒకవైపు అమ్మకం పన్ను ఆదాయం, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని చెబుతూనే మరోవైపు బడ్జెట్‌ను అమాంతం 19 వేల కోట్లు పెంచారు. ఆదాయం తగ్గినా అప్పులు రాకున్నా కోతపడేది సంక్షేమరంగానికేనన్నది అక్షరసత్యం. రాష్ట్రం వీడిపోయినప్పుడు 63 వేల కోట్లుగా ఉన్న అప్పు ప్రస్తుతం 1,40,523 కోట్లకు పెరిగింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 185 శాతం, రాష్ట్రంలో తలసరి ఆదాయం 40,149 మాత్రమే. డబుల్ బెడ్ రూం ఇళ్లకు వెయ్యి కోట్లు కేటాయించారంటే 2.50 లక్షల ఇండ్లు పూర్తికావాలంటే 18 సంవత్సరాలు పడుతుంది. ఎంబిసి కులాలకు వెయ్యి కోట్లు కేటాయిస్తే అభివృద్ధికి ఏమేరకు దోహదపడుతుంది. రైతుల ఆత్మహత్యల నివారణకు బడ్జెట్‌లో నిర్ధిష్ట చర్యలు లేవు. మైనార్టీల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించలేదు. విత్తన చట్టానికి తగిన చర్యలు లేకపోవడం ప్రభుత్వానికి రైతాంగంపై ఉన్న చిత్తశుద్ది ఏమిటో స్పష్టం చేస్తుంది.