మెదక్

ఎన్నాళ్లకు గుర్తొచ్చామే వాన..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, ఏప్రిల్ 9: భానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరవుతున్న స్థానికులకు శనివారం కురిసిన వర్షం ఊరటకలిగించింది. వరుణుడి కరుణతో స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. సుమారు గంటపాటు ఒక మోస్తరుగా ఈదురుగాలులతో కూడిన వర్షంకురిసింది. ఈదురు గాలులవల్ల అక్కడక్కడ చెట్లు విరిగిపోగా కరెంటు తీగలు తెగిపడ్డాయి. శుభకార్యాలకు వేసిన టెంట్లు, షామియానాలు కూలిపోయాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. చెరుకు పంటలతోపాటు ఇతర పంటలకు కూడా మేలు జరిగినట్లు రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మామిడి రైతులకు కొద్దిపాటి నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో కురిసిన కొద్దిపాటి వర్షంకే రోడ్లన్నీ జలమయమయ్యాయి. జాతీయ రహదారిపై బాగారెడ్డి విగ్రహంతోపాటు పలు ప్రంతాల్లో నీటి మడుగులు దర్శనమిచ్చాయి. ఏదైమైనా జహీరాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షం రైతుల్లో ఆనందాన్ని నింపింది.

ప్రజాప్రతినిధులు వెళితే..
కాంగ్రెస్‌కు నష్టం లేదు
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ టిఆర్‌ఎస్‌లో చేరి
నాకు లాభమే చేకూర్చారు
కాంగ్రెస్ సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది
తెరాస కుట్ర రాజకీయాలను తిప్పికొడతాం
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఏప్రిల్ 9: రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుంటుందని, దీంతో కాంగ్రెస్ పార్టీకి, తనకు ఎంత మాత్రం నష్టం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. 2014లో జరిగిన మున్సిపల్, జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, మూడు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించిందన్నారు. అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కేందమైన సంగారెడ్డి మున్సిపాలిటీ, మండలంలో పట్టులేదన్న అపవాదును తొలగించుకోవడానికి ప్రజాప్రతినిధులను లాక్కుంటుందన్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకుని గులాబి జెండాను ఎగుర వేసిందన్నారు. కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండల పరిషత్తుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే పాలకవర్గాన్ని నిర్వర్తిస్తున్నారన్నారు. శనివారం సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు కొంత మంది కౌన్సిలర్లు టిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారని, వారు కాంగ్రెస్ పార్టీని వీడటం వల్ల తనకు, తన పార్టీకి మంచి ప్రయోజనం కలుగుతుందేకానీ ఎంత మాత్రం నష్టం కాదన్నారు. వ్యక్తిగతం తాను ఎవరిని విమర్శించుకోదల్చుకోలేదన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపించిన ప్రజాప్రతినిధులు వెళ్లినంత మాత్రాన కార్యకర్తలు వెళ్లిపోతారనుకోవద్దన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులందరిని నా స్వశక్తితో గెలిపించానని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వంద శాతం బలంగా ఉందన్నారు. బిజెపిలో ఉన్నప్పటి నుంచి 2014లో జరిగిన సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వరకు తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే ఓటర్లు పట్టం కట్టారని గుర్తు చేసారు. ప్రజామద్దతు ఉన్నన్ని రోజులు రాజకీయంగా తనను ఎవరు ఏమి చేయలేరన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురడం ఖాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడలేదని ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడంతో ఆ వర్గం ఓట్లు వేసిందని, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌తో ఆ వర్గం ఓట్లు లబ్దిపొందారని, ఇంటికో ఉద్యోగం హామితో నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు టిఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపారని, డబుల్ బెడ్ రూం హామితో ఇల్లు లేని పేదవారంతా ఆశలతో ఓట్లు వేసారని, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు, లక్ష రుణమాఫీతో రైతులంతా టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందలేదన్నారు. సిఎం కెసిఆర్ మాయమాటలను నమ్మి మోసపోయామని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. 2019 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ పతనం ఖాయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. స్వంత పార్టీ వారికే న్యాయం చేయలేని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఏం ఒరగబెడుతుందో చెప్పాలని డిమాండ్ చేసారు. ఇతర పార్టీల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం కాదని వచ్చే ఎన్నికల్లో వారిని గెలిపించుకుని సత్తాను నిరూపించాలని సవాల్ చేసారు. అప్పుడు ఎవరి బలం ఏమిటో బయటపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిషత్ రాజకీయాలను తప్పకుండా శాసిస్తుందని, మంచి క్యాడర్, ఓటు బ్యాంకు తమ పార్టీకే ఉందని గుర్తించి కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని వివరించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది కౌన్సిలర్లు ఉంటే ఐదుగురు మాత్రమే పార్టీని వీడారని మరో ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారన్నారు. చైర్ పర్సన్ విజయలక్ష్మి భర్త బొంగుల రవిని ముందుగా టిఆర్‌ఎస్ పార్టీలో చేర్పించిన అనంతరం తాను వెళ్లబోతున్నట్లు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. బొంగుల రవి తనకంటే పెద్ద నాయకుడు కాదని, అంతటి అసమర్థతత తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన గత్యంతరం తనకు ఎంత మాత్రం లేదని జగ్గారెడ్డి ఊహాజనిత వార్తలకు తెరదించారు.

మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
సిద్దిపేట, ఏప్రిల్ 9 : తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధికప్రాధాన్యత కల్పిస్త్తూ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తుందని ఎసిబి డిజీ ఎకె.ఖాన్ అన్నారు. విద్యలో వెనుకబడి ఉన్న మైనార్టీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 120 మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం జూన్ నుంచి 71 పాఠశాలలు ప్రారంభించనున్నట్లు ఎ.కె.ఖాన్ వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్ అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనార్టీలకు రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తుందన్నారు. మైనార్టీలకు రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఆంగ్ల మీడియంలో బోధించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 నుండి 12 రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాల 5నుంచి 6 ఎకరాల స్థలంలో విశాలంగా అన్ని వౌలిక సదుపాయాలతో రూ.20 కోట్ల తో నిర్మించనున్నట్లు చెప్పారు. పాఠశాల భవనంతోపాటు, హాస్టల్, ఉపాధ్యాయులకు క్వార్టర్స్, ప్లేగ్రౌండ్‌తో కార్పొరేట్ స్థాయికి మించి అన్ని వసతులూ కల్పించనున్నట్లు తెలిపారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధించనున్నట్లు తెలిపారు. ప్రతి తరగతి రెండు సెక్షన్లు, ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు గరిష్టంగా ఉంటారన్నారు. ప్రతి పాఠశాలల్లో సగటున 640 విద్యార్థులు చదువుకుంటారన్నారు. ప్రతి యేటా ఈ మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో 78వేల విద్యార్థులు విద్యను అభ్యసిస్తారన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు వెచ్చించనున్నట్లు తెలిపారు. 75 శాతం మైనార్టీలకు, 25 శాతం ఇతర కమ్యూనిటీలకు ఈ పాఠశాలల్లో అడ్మిషన్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారు సమిష్టిగా కలసి ఉండాలనే లక్ష్యంతో ఇతర వర్గాలకు సైతం అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసంవత్సరం అందుబాటులో ఉన్న భవనాల్లో పాఠశాలల్లో కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మరో మూడేండ్లలో పర్మినెంట్‌గా విశాలంగా పక్క భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 11 పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు బాలురు, ఐదు బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట, సదాశివపేట, ఆందోల్, నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్, గజ్వేల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, మెదక్, జహిరబాద్ నియోజక వర్గాల్లో రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థలం అందుబాటులో ఉన్న నియోజక వర్గాల్లో రెండేళ్లలో పర్మినెంట్‌గా పక్క్భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు 5,6,7 తరగతిల్లో అడ్మిషన్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆహ్లదరకమైన వాతావరణంలో రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు విద్యార్థులపై సూపర్‌విజన్ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల ఆదాయం గలవారు, పట్టణ ప్రంతాల్లో 2లక్షల ఆదాయం ఉన్నవారు ఈ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్టేట్ సిలబస్‌ను ఆంగ్ల మీడియంలో బోధించనున్నట్లు తెలిపారు. ద్వితీయ భాషగా తెలుగు, హిందీ, ఉర్దు తీసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. మైనార్టీ విద్య అభివృద్ధి కోసం రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. జూన్ 15 ఈ విద్యాసంవత్సరం నుండి పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ కోసం వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం గూర్చి సమాచారం అందుకున్న బీహార్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తుందన్నారు. మంచి సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయన్నారు. మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలను ఈప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు ఎసిబి డిజీ ఎకె ఖాన్, మైనార్టీ వేల్పేర్ కార్యదర్శి జలీల్, షఫియుల్లా, జిల్లా కలెక్టర్‌ను ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ సన్మానించారు. ఈసమావేశంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జలీల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, టిఎంఆర్‌ఇఐఎస్ కార్యదర్శి ఫఫియుల్లా, తంజీమ్ సిద్దిపేట అధ్యక్షుడు గౌస్‌మోహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కారెక్కిన సంగారెడ్డి బల్దియా పాలకవర్గం!

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఏప్రిల్ 9: రాష్ట్రంలో అధికారం, జిల్లాలో ఆధిపత్యం కొనసాగిస్తున్న టిఆర్‌ఎస్ పార్టీకి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ హస్తం ఆధీనంలో ఉండటంతో కొరకరాని కొయ్యగా మారింది. గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో రెండు మున్సిపల్ పట్టణాలు, మూడు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నాటకీయ పరిణామాల్లో సదాశివపేట పురపాలకసంఘం, సదాశివపేట ఎంపిపి, కొండాపూర్, సంగారెడ్డి మండల పరిషత్తుల్లో గులాబి జెండాను ఎగురవేసి పరువు నిలబెట్టుకున్నారు. అనివార్య కారణాలతో సదాశివపేట మండల పరిషత్ పాలకవర్గంలో 2015 జూలై మాసంలో రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. అప్పట్లో కొంత మంది కాంగ్రెస్, టిడిపి, స్వతంత్ర ఎంపిటిసి సభ్యులు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం వల్ల టిఆర్‌ఎస్ పార్టీ పాలకవర్గాన్ని విస్తరించింది. ఆ పార్టీలో చేరిన ఎంపిటిసి సభ్యులు తిరిగి కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లడంతో జూలై నెలలో కాంగ్రెస్ పార్టీ తన పరువును నిలబెట్టుకుంది. ఇదిలావుండగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సుమారు రెండు సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నాలు చేసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పుష్కర కాలంగా నమ్మిన బంటుగా ఉన్న చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి భర్త బొంగుల రవి ఇటీవల కాలంలో మున్సిపాలిటీలో వివాదస్పదంలో ఇరుక్కుపోయారు. అధికార పార్టీ అండదండలు లేకపోవడంతో పాలకవర్గం అధికారులపై అజమాయిషిని ప్రదర్శించకపోతుండటంతో పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారన్న ప్రచారం కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అనుచరులు బొంగుల రవిపై వత్తిడి తీసుకురావడంతో పాటు మున్సిపల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అవుతుందన్న ఆలోచనలు కల్పించిన మేరకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, మరికొంత మంది కౌన్సిలర్లు తుది నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు శనివారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో గులాబి కండువా ధరించి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సంగారెడ్డిలోని ఐబి నుంచి బయలుదేరిన చైర్ పర్సన్ పాతబస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తన అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న విషయం తనకు తెలుసునని త్వరలోనే సంగారెడ్డిలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రజాప్రతినిధులకు హామి ఇచ్చారు. అధికారంలో ఉన్నామన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను కొంత అభద్రతాభావానికి గురి చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెంటనే స్పందించి నేతల పార్టీ మారిన తీరును ఖండించారు. అధికార పార్టీ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్ శ్రేణులు ఎంత మాత్రం బయపడబోవన్నారు. ఓటు బ్యాంకు, వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సత్తాను వచ్చే ఎన్నికల ద్వారా చూపిస్తామంటూ శ్రేణుల్లో ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేసారు. కాగా టిఆర్‌ఎస్ పార్టీకి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టు లభించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కల్పిస్తోంది. ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ వ్యూహరచనలకు చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయకులు తలొగ్గడం గమనార్హం. సిఎం పర్యటిస్తే పట్టణాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరైతే అనేక సమస్యలు తొలగిపోతాయని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. రెండేళ్ల కాలంగా రసవత్తర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన సంగారెడ్డి నియోజకవర్గంలో మరోమారు నాటకీయ పరిణామాలతో రాజకీయాలు కొనసాగాయని చెప్పవచ్చు. ఎమ్మెల్యే స్వంత పట్టణం, మండలమైన సదాశివపేట ఎంపిపి అధ్యక్ష పీఠాన్ని ఖాళీ చేయించేందుకు చాపకింద నీరులా ఆయన అనుచరులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోమారు పేట ఎంపిపి పీఠంపై లుకలుకలు ప్రారంభమైనా ఆశ్చర్యపోనక్కర లేదు.

డిప్యూటీ స్పీకర్ పద్మ సుడిగాలి పర్యటన

* సబ్‌స్టేషన్ ప్రారంభం...మరోదానికి శంకుస్థాపన
* మిషన్ కాకతీయ, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం
మెదక్ రూరల్, ఏప్రిల్ 9: మండలంలో డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఎండను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 గంటల నుండే కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ కాకతీయ-2లో గంగాపూర్ ఊరచెర్వుకు 40.50 లక్షల రూపాయలతో, షమ్నాపూర్ కోమటి చెర్వుకు 22 లక్షలతో చేపట్టే పనులకు శంఖుస్థాపనగావించారు. షమ్నాపూర్‌లో 5 లక్షలతో నిర్మించే మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 13 లక్షలతో పాతూర్ పంచాయతీ కార్యాలయానికి, పంచాయతీ పరిధిలోని చీపురుదుబ్బ తండాలో 5 లక్షల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ర్యాలమడుగు వద్ద కోటి 59 లక్షల 78 వేల రూపాయలతో నిర్మించే ససబ్‌స్టేషన్, 50 లక్షతలతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణానికి, మాచవరంలో 5 లక్షలతో నిర్మించే మహిళా భవనానికి, హవేళీఘణాపూర్‌లో 13 లక్షలతో నిర్మించే పంచాయతీ కార్యాలయానికి, 6 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణానికి పద్మాదేవేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. హవేళీఘణాపూర్‌లో కోటి 41 లక్షలతో వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను, 14 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల ప్రహారీగోడ, 15.90 లక్షలతో నిర్మించిన పాఠశాల అధనపు తరగతి గదులను పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. కాగా పాతూర్ పంచాయతీ పరిధిలోని చీపురుదుబ్బ తండాకు రోడ్డు వేయిస్తానని పద్మాదేవేందర్‌రెడ్డి గిరిజనులకు హామినిచ్చారు. అంతకుముందు గిరిజనులు తమ సాంప్రదాయపద్ధతిలో స్వాగతించారు. హవేళీఘణాపూర్ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. హవేళీఘణాపూర్‌లో బిసి కమ్యూనిటీ హాల్ పూర్తికి నిధులు అందజేస్తానన్నారు.
మీ ఇండికేట్ ప్రారంభం
పిల్లికొట్టాల్‌కు చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు ‘మీ ఇండికేట్’ అనే వెబ్‌సైట్‌ను తయారుచేయగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి హవేళీఘణాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ అన్ని రకాల సమాచారం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని అభనందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మీ, జడ్‌పిటిసి లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ అశోక్, ఆర్‌డిఓ నగేశ్, తహశీల్దార్ నజీమొద్దిన్, పంచాయతీరాజ్ ఇఇ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు సజావుగా
జరిగేందుకు సహకరించాలి
* అభ్యర్థులు, ఏజెంట్లకు ఎన్నికల అధికారి
రమణాచారి సూచన
* మొత్తం మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడతాయని వెల్లడి
సిద్దిపేట, ఏప్రిల్ 9: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమీషనర్, ఎన్నికల అధికారి రమణాచారి తెలిపారు. స్థానిక ఇందూర్ కళాశాలలో 11న ఉదయం 8గం.కు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. శనివారం ఇందూర్ కళాశాలలో అధికారులకు కౌంటింగ్ పై అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు వార్డుల, పోలింగ్ బూత్‌ల వారీగా నిర్వహిస్తామన్నారు. 10టేబుళ్లు వేసి కౌంటింగ్ చేస్తారన్నారు. మొదటి రౌండ్‌లో 10టేబుళ్లు, పదివార్డుల ఫలితాలు, 2రౌండ్‌లో 11వార్డునుంచి 10వార్డుల లెక్కింపు చేస్తారన్నారు. మొత్తం మున్సిపాల్టీలో 34వార్డులు ఉండగా 6వార్డులు ఏకగ్రీవమైనాయని, 28వార్డులకు ఓటింగ్ నిర్వహించామన్నారు. ఓట్ల లెక్కింపు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలకులుగా పిడి సత్యనారాయణరెడ్డిని నియమించారన్నారు. వారు 10 టేబుళ్లలో లెక్కించిన ఓట్ల వివరాలను ఏదైనా ఒక టేబుల్‌ను రాండమ్‌గా పరిశీలిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు రోజు పోటీలోని అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ఓట్ల లెక్కింపు ఏజెంట్ వారికి కేటాయించిన వార్డు సంబంధిత టేబుల్ మీద నిర్వహిస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించవచ్చన్నారు. 11న ఉదయం 6గం.కు ఓట్ల లెక్కింపు సిబ్బంది ఏ టేబుల్ ఎవరికి కేటాయించబడునో కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలో రాండమ్ చేసి ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. ఓట్ల లెక్కింపు మొదట 10వార్డులు జరుపుతారని, అ వార్డులకు సంబంధించిన వారినే లోపలికి అనుమతిస్తారని, అనంతరం మిగతావార్డులకు సంబంధించిన వారిని అనుమతిస్తారన్నారు.

అనిశా డీజీ ఉపాధ్యాయుడైన వేళ...!
గజ్వేల్, ఏప్రిల్ 9: రాష్ట్ర అవినీతి నిరోదక శాఖ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ శనివారం గజ్వేల్ పట్టణ శివారులోని సంఘాపూర్ మధర్సాలో కొంత సేపు ఉపాధ్యాయుడుగా అవతారం ఎత్తారు. మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన అనంతరం సమీపంలో ఉన్న మధర్సాను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టగా, అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా విద్యార్థులు భావి భారత పౌరులుగా తయారు అవ్వాలని ఆకాంక్షించారు. అలాగే మదర్సాలో నెలకొన్న సమస్యలను ఆయన చైర్మన్ హైదర్ పటేల్ నుండి అడిగి తెలుసుకోగా తన సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ స్పందిస్తూ మదర్సా విద్యార్థుల ఇబ్బందులు పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కోన్నారు. ఆయన వెంట మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఉమర్ జలీల్, షఫియుల్లా, గఢా అధికారి హన్మంతరావు, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరో రైతు ఆత్మహత్య
మిరుదొడ్డి, ఏప్రిల్ 9; అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లిలో శనివారంనాడు జరిగింది. కుటుంబీకుల, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. గ్రామానికి చెందిన పంజా సత్తయ్య(45) 2 ఎకరాల భూమిలో వ్యవసాయం సాగుచేయడానికి, బోర్లు వేయడాకిని, పెట్టుబడి కోసం సమారు రూ.4 లక్షలు అప్పులు చేశాడని కుటుంబీకులు తెలిపారు. అదేవిధంగా వేసిన పంట కళ్ల ముందే ఎండిపోవడంతో నెల రోజుల క్రితం బోరు వేయడంతో నీరు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు తీవ్రంగా అలోచిస్తు అప్పులు తీర్చే పరిస్థితి కనిపించకపోవడంతో శనివారంనాడు వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ బావి వద్ద పక్కన రైతులు చూసి ఉరిని తొలిగించి అసుపత్రికి తరిలించే లోపే మృతి చెందాడని తెలిపారు. మృతునికి కుమార్తె భార్గవి, కుమారుడు నరేశ్, భార్య వెంకటలక్ష్మివున్నారు. భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దగాపడుతున్న తెలంగాణపై రాష్ట్ర ‘మేథోమధన సదస్సు’

* తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు
వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, ఏప్రిల్ 9: దగాపడుతున్న తెలంగాణ అంశంపై రాష్ట్ర తొలి మేధోమదన సదస్సు ఆదివారం గజ్వేల్ పట్టణంలోని టివైఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 20 నెలలు దాటుతున్నా ఆంధ్ర వలసవాదుల వారసత్వ భావజాలంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో జరిగిన విధంగానే అనచివేత, దోపిడి కోనసాగుతుండగా యువత, కార్మికులు, నిరుద్యోగులు నిరాశా నిస్పూృహలతో కొట్టు మిట్టాడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలు తీవ్ర రూపం దాల్చగా ఆత్మహత్యల నివారణలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలతో రూ.లక్షకోట్లు ప్రజాదనం దుర్వినియోగం అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఉద్యమ కారులను వాడుకొని వదిలేసిన క్రమంలో అన్ని వర్గాలు అన్యాయానికి గురవుతున్న సందర్భంగా ప్రజలను చైతన్యం చేసేందుకు సిఎం కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుండి మేధోమధన సదస్సులు ఆరంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా జస్టీస్ చంద్రకుమార్, గాదె ఇన్నయ్య, డాక్టర్ జి.లచ్చయ్య, గడీల సుధాకర్‌రెడ్డి, శ్రీశైల్ రెడ్డి, నైనాల గోవర్థన్, కందిమళ్ళ నాగప్రసాద్ గౌడ్, నీరటి రాజన్న, ముత్తన్న గారి రాజేందర్‌రెడ్డి, ఊకే రామకృష్ణ, వెనె్నల విక్రమ్ తదితర వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో నేతలు బొల్లారం ఎల్లయ్య, విరాసత్ అలీ, ఆర్‌కె శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, హన్మంతరెడ్డి, మల్యాల భద్రయ్య, కైలాస మహిపాల్, పరచూరి రాజు పాల్గొన్నారు.