మెదక్

గజ్వేల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూన్ 19: గజ్వేల్ నియోజకవర్గాన్ని సిఎం కెసిఆర్ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతుండగా, ఇక్కడి ప్రజలు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉండాలని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాములపర్తి, వర్గల్, ములుగు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్‌లలో అంగన్‌వాడీ కేంద్రాలు, పశువుల ఆసుపత్రి, వివిద పెన్షన్‌లు, మైనార్టీ గురుకుల పాఠశాలతోపాటు వివిద అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన సందర్బంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని దాహార్తిని దృష్టిలో పెట్టుకొని మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుండగా, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటల అభివృద్దితో సాగు భూములు సస్యశ్యామలమైనట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్లు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతుండగా, ప్రతి గ్రామంలో మురికి కాలువల నిర్మాణం, సిసిరోడ్లు, వైకుంఠధామాలు, బస్‌షెల్టర్‌లు, అర్హులైన పేదలందరికి డబల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో రూపురేఖలే మారిపోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే కులవృత్తులు ప్రోత్సహిస్తూ యాదవులకు గొర్రెల పంపిణి, ముదిరాజ్, గంగపుత్రుల అభివృద్దికి చేపల పెంపకం, మైనార్టీల అభ్యున్నతికి కార్పోరేషన్‌లతో రుణ సదుపాయం, షాదీముభారక్‌తో ఆర్థికంగా చేయూతనివ్వడం, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బిసి, మైనార్టీ విద్యార్థులకు కార్పోరేట్ తరహాలో హాస్టల్ వసతులతో కూడిన గురుకుల విద్య, విద్యాభివృద్దికి ప్రతి మండలకేంద్రం లో ఇంటర్, డిగ్రీ వరకు ఉచిత విద్యా వసతులు కల్పిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న ఘనత కెసిఆర్‌కే దక్కిందని తెలిపారు. అంతేగాకుండా గజ్వేల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి, ఎడ్యుకేషన్‌హబ్, ఆడిటోరియం, మినీ ట్యాంక్‌బండ్‌గా పాండవుల చెరువు, వైకుంఠధామం, సమీకృత ప్రభుత్వ భవనాల ఏర్పాటు, సిఎం క్యాంపు కార్యాలయం వంటి అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టి దేశ ప్రజలు గజ్వేల్ వైపు చూసే విదంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీసి చైర్మెన్ తూంకుంట నర్సారెడ్డి, ఫుడ్ సొసైటీ చైర్మెన్ ఎలక్షన్‌రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యులు పోచయ్య, ఎంపిపి అధ్యక్షులు కళావతి విద్యాకుమార్, చిన్నమల్లయ్య, నేతలు కనకయ్య, గోపాల్‌రెడ్డి, నర్సింగరావు, సుబాష్‌చంద్రబోస్, జకియొద్దీన్, వసీంఖాన్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

నేడు గొర్రెల పంపిణీ పథకానికి అంకురార్పణ
సిద్దిపేట, జూన్ 19: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా గొర్రెల కాపర్లకు సంక్షేమం, ఉపాధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో ఈనెల 20న సిఎం కెసిఆర్ అంకురార్పణ చేయనున్నారు. గొర్రెకాపర్ల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం 75శాతం సబ్సిడి పై పంపిణి చేయనున్న గొర్లపంపిణికి సిఎం సొంత నియోజకవర్గంలోని కొండపాకలో మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. గొల్లకుర్మల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ సర్కార్ అర్హులైన గొర్లకాపర్లందరికి ఉపాధి కల్పించేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాలో అధికారయంత్రాంగంచే సర్వే పకడ్బంధీగా చేపట్టి లబ్దిదారులను గుర్తించింది. 18ఏండ్లు నిండిన గొర్లకాపర్లను గొర్లసహకార సంఘంలో సభ్యులుగా సభ్యత్వం తీసుకోవాలని సూచించింది. ప్రతి గొర్లకాపరికి 20గొర్రెలు, ఒక పొట్టేలు లబ్దిదారులకు అందించనున్నారు. యూనిట్ విలువ 1.25లక్షలు నిర్దారించారు. 93,750రూ. ప్రభుత్వం సబ్సిడి భరిస్తుండగా మిగతా 31,250రూ. లబ్దిదారుడువాటాగా చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 402సొసైటీలకు 33,419లబ్దిదారులు జిల్లా అధికార యంత్రాంగం సర్వే చేపట్టి గుర్తించారు. గొర్లకాపర్లకు పంపిణి చేసే గొర్రెలను ఏపిలోని కర్నూలు జిల్లా నుంచి తెప్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన బిసి సంక్షేమాధికారి రాంరెడ్డి, ఎస్సీసంక్షేమాధికారి చరణ్‌దాస్,పరిశ్రమల అధికారి నవీన్, సహకార శాఖ అ ధికారి సుధాకర్ నేతృత్వంలో 20 మందికి పైగా పశుసంవర్దక అధికారు లు పశుసంవర్దకశాఖ అధికారులు కర్నూలుకు పోయి గొర్రెలను పరిశీలిం చి నాణ్యమైన గొర్రెలు ఎంపిక చేశా రు. ఈ గొర్రెలకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయించి అందించనుంది. జిల్లాలో 33419లబ్దిదారుల్లో మొదటివిడత 50శాతం 16,824మందికి పంపిణి చేయనున్నారు. రెండో విడత 16,595మందికి పంపిణి చేయనున్నారు. లబ్దిదారులను అధికారులు పారదర్శకంగా గ్రామసభలో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లాలోని కొండపాకలో గొర్లపంపిణికి శ్రీకారం చుట్టారు. మండలంలోని 825మందికి లబ్దిదారులకు అందించనున్నారు. సిఎం కెసిఆర్ ప్రారంభిస్తున్న ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సిఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన డిఐజి, కలెక్టర్, సిపి
సిఎం కెసిఆర్ కొండపాక నియోజకవర్గంలో గొర్లపంపిణి పథకానికి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అధికారయంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. డిఐజి శివశంకర్, కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, సిపి శివకుమార్ ఆధ్వర్యంలో సోమవారం సిఎం బహిరంగ సభ నిర్వహించే ఏర్పాట్లను పరిశీలించారు. కొండపాక మండలం వేద ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం 8ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేశారు. సుమారు 10వేలకు పైగా గొర్లకాపర్లను సభకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలమైనందున వాటర్‌ప్రూఫ్ వేదిక, పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సిఎం దిగే హెలీప్యాడ్ కోసం కొండపాక రూట్‌లో స్థలాన్ని సిద్దం చేశారు. పోలీసులు సభస్థలిలో తనిఖీలు చేస్తున్నారు. సిఎం పర్యటన కోసం అధికారికంగా పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాను ముంచెత్తిన వాన
* పొంగిపొర్లుతున్న వాగులు
* జలాశయాలకు జల కళ
* చురుకుగా కొనసాగుతున్న ఖరీఫ్ పనులు

సంగారెడ్డి, జూన్ 19: వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లుగానే ఈ యేడాది తొలకరిలో ఆశించిన వానలు కురుస్తుండటంతో వ్యవసాయదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సోమవారం తెల్లవారు జామునుంచి సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, మునిపల్లి, కొండాపూర్, కోహీర్, న్యాల్‌కల్, ఝరాసంగం, రాయికోడ్, మనూర్, కంగ్టి, నారాయణఖేడ్, రేగోడు, పుల్‌కల్, అందోల్ తదితర మండలాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి పట్టణంలో తెల్లవారు జాము ప్రారంభమైన వాన 11 గంటల వరకు కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. గత యేడాది జూన్, జూలై మాసాల్లో వర్షాలు లేకపోగా సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో అన్ని జలాశయాలకు జల కళ వచ్చింది. ఈ సారి అందుకు భిన్నంగా జూన్ నెలలోనే భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన వానలకు మంజీర నది ఆయువు పట్టుగా ఉండే నారింజ వాగు పొంగి ప్రవహిస్తోంది. జహీరాబాద్ మండలంలో ఈ వాగుపై నిర్మించిన ప్రాజెక్టు నిండుకోవడంతో రెండు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన కర్నాటకలో ఉన్న మంజీర నదిలోకి వదిలిపెడుతున్నారు. కర్నాటకలోని కారింజ ప్రాజెక్టు నిండుకుంటే మిగులు జలాలను దిగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టులోకి వదిలివేస్తారు. ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు కురియడం ఆరంభం కావడంతో సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 17 టిఎంసిల నీటి నిల్వ ఉండగా మరో 11 టిఎంసిలు నీరు చేరితే పూర్తిస్థాయిలో నిండుకుంటుంది.
ఝరాసంగం మండలంలోని కుప్పనగర్ చెరువు పూర్తి స్థాయిలో నిండుకోగా జీర్లపల్లి చెరువు అలుగు పొంగి ప్రవహిస్తోంది. గత యేడాది కురిసిన భారీ వర్షానికి ఝరాసంగం, జీర్లపల్లి గ్రామాలను అనుసందానం చేసే వంతెన కొట్టుకుపోయింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించి కొట్టుకుపోయిన వంతెనను యుద్ద ప్రాతిపధికన మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించినా పనులు పూర్తికాకముందే మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆది, సోమవారాల్లో కురిసిన భారీ వర్షానికి వాగు పొంగి ప్రవహించి అలుగు పై నుంచి క్రిందకు ప్రవహిస్తోంది. వంతెన మరమ్మతుల నిమిత్తం తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు నాణ్యత కొరవడటంతో వరద నీటికి కోతకు గురవుతోంది. మరిన్ని వర్షాలు కురిస్తేతాత్కాలిక రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని జీర్లపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల పరిస్థితి ఇదే విధంగా ఉంటే గత యేడాది మాదిరిగానే మండల కేంద్రమైన ఝరాసంగానికి చేరుకోవడానికి జీర్లపల్లి గ్రామస్తులు ఇబ్బందులు గురి కావల్సి వస్తోంది. సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ గ్రామ శివారులో మంజీర నదిపై నిర్మించిన బ్యారేజ్‌లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభమయ్యే గంగకత్వ వాగు నిండుకుని పొంగి ప్రవహిస్తోంది. దీంతో మంజీర బ్యారేజ్‌లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకున్న రైతన్నలు ఉత్సాహంతో ఖరీఫ్ పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఆయా రకాల విత్తనాలను కొంత మంది రైతులు విత్తుకోగా మొలకలెత్తాయి. మరికొంత మంది రైతులు విత్తనాలను విత్తడంలో నిమగ్నమయ్యారు. కాగా మెదక్, సిద్దిపేట జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి. ఖరీఫ్ ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో ఎవరిలోను ఏలాంటి ఆందోళన కనిపించడం లేదు. వరి పంటను సాగు చేసే రైతులు నారు పోసుకుని పొలాలను నాట్లకు సిద్దం చేసుకుంటున్నారు. మొత్తంమీద సంగారెడ్డి జిల్లాలోని జలాశయాలకు రెండు వానలతో జల కళతో సంతరించుకుంది.

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
* ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
సంగారెడ్డి టౌన్, జూన్ 19: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డిలోని బాలాజీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతాయన్నారు. ప్రభుత్వం తరపున ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందును ఇవ్వండం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని విధాల పాటుపడుతుందన్నారు. ముస్లిం విద్యార్థులకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం పేద ముస్లింలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని మతాలు, పండుగలను గౌరవిస్తూ, ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికి ఇఫ్తార్ విందును ఇస్తూ, పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ చేస్తూ సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతుందన్నారు. కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్ మాట్లాడుతూ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసమన్నారు. ఉపవాస దీక్ష చేపట్టడం, అందరూ ఒకే దగ్గర కూర్చోని ప్రార్థనలు చేయడం, చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషించదగిన విషయమన్నారు. ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ కొండల్‌రెడ్డి, నాయకులు జలాలోద్దీన్‌బాబా, ముస్లిం మత పెద్దలు, పట్టణానికి చెంది న ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా....
మైనార్టీలకు పలు సంక్షేమ పథకాలు
* భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
గజ్వేల్, జూన్ 19: దేశంలో ఎక్కడా లేని విదంగా మైనార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో వివిద సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి గజ్వేల్‌లోని మదీన మజీద్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని ఆయన ప్రసంగించారు. మైనార్టీ అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని 12శాతం రిజర్వేషన్ అమలుకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్‌కు పంపించినట్లు తెలిపారు. అయితే ప్రధాని నరేంద్రమోడీపై వత్తడి తెచ్చి బిల్లు ఆమోదానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేగాకుండా మైనార్టీ విద్యకు పెద్దపీట వేస్తూ ప్రతి నియోజకవర్గంలో మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి కార్పోరేట్ తరహాలో విద్యాబోదన అందిస్తున్నట్లు చెప్పారు. అయితే పక్కా భవన నిర్మాణాల కోసం ఇప్పటికే స్థల సేకరణ పూర్తి చేయగా, త్వరలోనే పనులు ప్రారంబం కానున్నట్లు చెప్పారు. కాగా షాదీముభారక్ పథకంతో పేద ముస్లింలకు వివాహ సమయంలో రూ. 75వేల ఆర్థిక సహాయం అందజేస్తుండగా, ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్, డిల్లీలలో ఈ పథకాన్ని వర్తింపజేయబడడంలేదని అన్నారు. ముఖ్యంగా మైనార్టీలకు కార్పోరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తుండగా, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో షాదీఖానాల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిదులు కెటాయిస్తున్నట్లు పే ర్కొన్నారు. అయితే పేద విద్యార్థులకు విదేశి విద్య కోసం రూ. 20 లక్షల ఆరి థక సహాయం అందజేస్తుండగా, గజ్వేల్‌లో రూ.కోటి వ్యయంతో శాధీఖాన నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు. అంతేగాకుండా పేద మైనార్టీ మహిళలకు ఇప్పటికే 400 కుట్టుమిషన్‌లు అందజేయగా, మరో 500 అందజేస్తామని చెప్పారు. ఐఏఎస్, ఐపిఎస్, సివిల్ సర్వీసుల కోసం మైనార్టీ విద్యార్థులకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, మున్సిపల్ చైర్మెన్ ల భాస్కర్, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ చైర్మెన్ భూంరెడ్డి, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మజీద్ కమిటీ అధ్యక్షులుహైదర్‌ఎక్బాల్ పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం:హరీష్‌రావు
* మంత్రి హరీష్‌రావు
నంగునూరు, జూన్ 19: రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క రైతు పంపుసెట్ కాలిన దాఖలాలు లేవని, నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని తిమ్మాయిపల్లిలో 33/11కెవి సబ్‌స్టేషన్‌కు శంఖుస్థాపన చేసి మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ అందించడం వల్లే భూమికి భారమైన పంటలు పండాయన్నారు. వ్యవసాయానికి 24గం. కరంట్ అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. త్వరలో తిమ్మాయిపల్లి సబ్‌స్టేషన్ ప్రారంభించి తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి గ్రామాలకు విద్యుత్ అందిస్తామన్నారు. రైతు సమసగ్ర సర్వే పూర్తికాగానే గ్రామ, మండల, జిల్లా రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తారన్నారు. గ్రామంలో కల్యాణలక్ష్మి కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందించారు. అనంతరం పెద్దమ్మగుడి విగ్రహ ప్రతిష్టోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ సారయ్య, ఎంపిపి శ్రీకాంత్‌రెడ్డి, తహశీల్దార్ విజయభాస్కర్, ఏఎంసి చైర్మన్లు వెంకట్‌రెడ్డి, పురేందర్, సొసైటి చైర్మన్లు రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, సర్పంచు నర్సింలు, అధికారులు కరుణాకర్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి, రియాజ్ అహ్మద్, మోహన్, నేతలు నర్సింలు, నారాయణ, కనకయ్య, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
యువనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
గజ్వేల్, జూన్ 19: గజ్వేల్ పట్టణంలో సోమవారం కాంగ్రెస్ శ్రేణులు యువనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్‌ఖాన్, నియోజవకర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షులు రామరాజశర్మ, ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షులు గాలెంక నర్సింలు, మాజీ జెడ్‌పిటిసిలు నర్సింహాచారి, గుంటుకు మల్లేషం, డిసిసిబి మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, నేతలు ఎక్బాల్, గుంటుకు శ్రీనివాస్, ప్రేంకుమార్, అజ్గర్, చంద్రంగౌడ్, శివకుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ రామరాజశర్మలు మాట్లాడుతూ 125కు పైగా సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఒడి దొడుకులు సహజమేనని, పార్టీ శ్రేణులు శ్రమించి పూర్వ వైభవానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువనేత రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా శ్రమించాలని వివరించారు.

మండుతున్న కూరగాయల ధరలు
* పేదలకు అందుబాటులో లేని కూరగాయలు
మెదక్, జూన్ 19: మెదక్ కూరగాయల మార్కెట్‌లో ధరలు భగ్గుమంటున్నాయి. ఒకేసారి టమాట ధర కిలో 10 నుండి 50 రుపాయలకు పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. టమాట నాణ్యమైనది కిలో 50 రుపాయలు, కొంత చిన్నగా ఉన్నటువంటిది 40 రుపాయలకు అమ్మకాలు జరుపుతున్నారు. ఇకపోతే పచ్చిమిర్చి కిలో 120 రుపాయలకు అమ్మకాలు జరుపుతున్నారు. పావుకిలో 30 రుపాయల వంతున అమ్ముతున్నారు. ఎండుమిర్చి కిలో 50 నుండి 60 రుపాయలకు ధర తగ్గింది. ఆలుగడ్డ మాత్రం కిలో 20 రుపాయలకు అమ్మకం జరుపుతున్నారు. వంకాయ, బెండకాయ, బీరకాయలు కిలో 40 రుపాయలకు అమ్మకాలు జరుపుతున్నారు. జిఎస్‌టి జూలై 1 నుండి అమలులోకి వస్తున్నందున పప్పు ధరలు యధావిధిగా కొనసాగుతున్నాయి. జూలై 1 నుండి జిఎస్‌టి అమలులోకి వస్తే కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు తగ్గుతాయని ప్రజలు ఎదురచూస్తున్నారు. జిఎస్‌టి అమలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. కానీ ఎరువుల ధరలు జిఎస్‌టి ద్వారా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వమే చెబుతుంది. ఈ ఎరువులపై జిఎస్‌టిని తొలగించాలని మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జిఎస్‌టిని ఎరువులపై తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. కాగా రైతులు, ప్రజలు దృష్టిలో పెట్టుకొని జిఎస్‌టి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది.
28, 29న అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానం
* అథ్లెటిక్స్ అకాడమీ ఖమ్మం, వనపర్తి, వరంగల్‌లో అడ్మిషన్లు
* జిల్లా యువజన క్రీడల అధికారి రామానుజాచారి
మెదక్, జూన్ 19: 2017-18కిగాను స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ రాష్ట్రం ఆవరణలో రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ వరంగల్ అథ్లెటిక్ అకాడమి, ఖమ్మం హకీ అకాడమి, వనపర్తి నందు అడ్మిషన్లు ఈ నెల 28,29న జరుగుతున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి, డిప్యూటి కలెక్టర్ పి.రామానుజాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌ఎస్‌హెచ్ వరంగల్ అర్బన్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యండ్‌బాల్, సైక్లింగ్, వ్రెస్లింగ్ అకాడమి, సైక్లింగ్ పెలోడ్రాం, అథ్లెటిక్స్ అకాడమి ఖమ్మం, హాకీ అకాడమీ వనపర్తిలో జరుగునని ఆయన తెలిపారు. రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ కొరకు బాలికలు 10 సంవత్సరాలు 31.08.2017 వరకు పుట్టిన వారై ఉండాలి, వీరికి బ్యాటరీ టెస్ట్‌ల ద్వారా సెలక్ట్ చేయడం జరుగుతుందన్నారు. అకాడమి కోరకు 16 సంవత్సరాలలోపు ఉండి 31.08.2017 వరకు జన్మించి ఉండాలి, దీనిలో సైక్లింగ్, హాకీ, వ్రెస్లింగ్ నందు అడ్మిషన్లు జరుగునని తెలిపారు. వీరందరు వయస్సు, చదువుతున్న దృవపత్రం, ఇప్పుడు చదువుతున్న పాఠశాల నుండి తేవాలని, పుట్టిన దృవపత్రం తహశీల్దార్, పంచాయితీ, మున్సిపల్, కార్పరేషన్ నుండి తీసుకురావాలని, 10 ఫొటోలు తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. మిగతా వివరాలకు జిల్లా యువజన క్రీడల అధికారి ఖమ్మం, వరంగల్, వనపర్తిలలో ఉన్న వారిని సంప్రదించాలని ఆయన తెలిపారు.

రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేద్దాం
* తెలంగాణ ఇచ్చిన సోనియాను ప్రజలు మరువరు
* కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పనిసరిగా గుర్తింపు
* మెదక్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి
గజ్వేల్, జూన్ 19: యువనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం ప్రజ్ఞాపూర్ ఆశాజ్యోతి ఏయిడ్స్ అండ్ సపోర్ట్ కేర్ సెంటర్‌లో ఏయిడ్స్ బాదిత చిన్నారుల మద్య రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఇక్కడి ప్రజలు ఎన్నడూ మరిచిపోరని, ప్రధాని పదవిని తృణప్రాయంగా వదిలిన సోనియా, దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించిన కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఒడిదొడుకులు సహజమేనని, ప్రజల అండతో పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీల అమలుకు ప్రజా చైతన్యంతో వెంటాడుతూనే ఉంటామని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టిఆర్‌ఎస్, బిజెపిలకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉండగా, ప్రజలను మభ్య పెట్టడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్, ప్రధాని నరేంద్రమోడిలు పోటీ పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనను ప్రోత్సహిస్తూ అవినీతి, అక్రమాలకు పెద్దపీట వేయగా, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఏ పార్టీలు మనజాలలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి భానుప్రకాశ్ రావు, నేతలు లక్ష్మారెడ్డి, గుంటుకు శ్రీనివాస్, పవన్ కుమార్, లక్ష్మణ్, కృష్ణారెడ్డి, ప్రేంకుమార్, మహిపాల్‌రెడ్డి, రాజు, కిష్టారెడ్డి, ఐలయ్య, నర్సింలు, శంకర్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో బిజెపికే భవిషత్తు
* కాంగ్రెస్‌కు కాలం చెల్లింది * యువతకు ప్రాధాన్యత * రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సదాశివపేట, జూన్ 19: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డియే ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడానికి దోహపడుతున్నాయని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కె.లక్ష్మన్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన సుమారు 200 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపిలో చేరేందుకు సోమవారం హైదరాబాద్ తరలి వెళ్లారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు కోడూరి శరత్ గుప్త ఆధ్వర్యంలో యువకులు బిజెపిలో చేరేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా యువకులను కాషాయం కండువాలతో లక్ష్మన్ పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయిందని విమర్శించారు. యువత మొత్తం బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో బిజెపి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ప్రదాని నరేంద్ర మోడి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా యువతకు అధిక ప్రాధాన్యతను కల్పించనున్నట్లు వెల్లడించారు. యువత ఎటువైపు మొగ్గుచూపితే ఫలితం కూడా అటే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పటన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణుమాధవ్, కౌన్సిలర్ మానిక్‌రావు పాల్గొన్నారు.

యోగా...ఆరోగ్య భోగం
* రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి
* 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం
మెదక్ రూరల్, జూన్ 19: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు...వ్యాపారులు నిత్యం మానసిక ఒత్తిడి నుండి తట్టుకోవడానికి, తాము చేస్తున్న పనుల్లో చురుకుదనం కోసం ఉదయం నడక, వ్యాయామం, యోగ వైపు దృష్టిసారిస్తున్నారు. 40 యేళ్ల వయసుపైబడినవారు అధికంగా యోగాకు ప్రాధాన్యతనివ్వడం కనిపిస్తుంది. నగరాలు, పట్టణాల్లో ఐతే యోగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే. ఓ ఇరవై యేళ్ల క్రితం సిద్దిసమాజ యోగ, మట్టపల్లి కేంద్రంగా పనిచేస్తున్న బిక్షమయ్య గురూజీ ఎంఎంవై శిబిరాలు ఏర్పాటుచేస్తే పదుల సంఖ్యలో ప్రజలువస్తే గొప్ప. కానీ మారిన పరిస్థితులు, వాతావరణంలో ఏర్పడుతున్న కాలుష్యం, ఉద్యోగులైతే పై అధికారుల ఒత్తిడికావచ్చు, వ్యాపారంలో స్థిరంగా ఉండడానికి, నిత్య జీవితంలో ఒత్తిడిలేని, మానసిక ఆందోళనకు గురికాకుండా, నిత్యం యవ్వనంగా ఉండేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ యోగ సాధన వైపు దృష్టిమళ్లిస్తున్నారు. మెదక్ పట్టణం, మండలంలోని మాచవరం తదితర గ్రామాల్లో ప్రతి రోజు ఉదయం యోగ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మెదక్‌లో ఓ ఫంక్షన్ హాల్‌లో పురుషులకు, మరో ఫంక్షన్ హాల్‌లో మహిళలకు సంబంధించిన యోగా ఆసనాలు వేయడం జరుగుతుంది. సుమారు ఐదు వందల మంది వరకు యోగా సాధనలో పాల్గొంటున్నారు. సాధనకు ముందు తర్వాత ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంటున్నారు. మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి సైతం స్వయంగా యోగ సాధకురాలు. ఆమెతోపాటు భర్త దేవేందర్‌రెడ్డి సైతం నిత్యం యోగా చేయనిదే ఉండరు.
* ఎందుకు యోగా చేయాలి
యోగ సాధన చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. నిత్య యవ్వనవంతులుగా, శక్తివంతులుగా ఉండేందుకు, శరీరం నాజూకుగా, మృదువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. యోగాతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసకిశక్తి, శాంతి పొందడంలాంటి ఉపయోగాలున్నాయి. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం, దురలవాట్లకు దూరంగా ఉండడం, ఆధునిక యుగంలో జీవిత సమస్యలు, ఒత్తిడిలు, బాధల నుండి దూరమయ్యే ఆస్కారం కలదు. ప్రతి రోజు క్రమం తప్పకుండా యోగా సాధనతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
* 21న మెదక్‌లో యోగా
దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న మెదక్‌లో వేడుకలు నిర్వహించేందుకు శ్రీ వశిష్ఠ యోగా కేంద్రం సిద్దమవుతోంది. స్థానిక వైస్‌రాయ్ గార్డెన్‌లో ఉదయం 6 నుండి 7 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు రాగి రమేశ్, కార్యదర్శి పూన రవి, యోగ శిక్షకులు ఎ.రవి, బి.దేవేందర్‌రెడ్డిలు తెలిపారు. పట్టణ, గ్రామాల ప్రజలు పెద్దయెత్తున తరలిరావాలని కోరారు.
* 1994 నుండి యోగా చేస్తున్నా:
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
తాను 1994లో సిద్దిసమాజ యోగ ద్వారా సాధన మొదలుపెట్టినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సాధనతో అనేక ఉపయోగాలున్నాయన్నారు. ప్రతి రోజు ఉదయం ప్రాణాయామం, కపాలభారతి, సూర్యనమస్కారాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ధ్యానంతో మానసిక స్థితి మెరుగుపడి మెదడు ఏకాగ్రతగా పనిచేస్తుంది. శరీర ధృఢత్వం, అనారోగ్య సమస్యలు లేకుండా, బిపి, మధుమేహం దరిచేరవన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత బిజీగా ఉన్నా, పనులు చేసినా అలసట కనిపించదు. సుమారు 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నట్లు తెలిపారు.
* సాధన లేకుంటే అనారోగ్యం పాలయ్యేది: అధ్యక్షుడు రమేశ్
నిత్యం 12 గంటలపాటు పనిచేయడానికి యోగ సాధన ఎంతో ఉపయోగపడుతుంది. సాధన చేయకుంటే ఇప్పటికే అనారోగ్యం పాలయ్యేవాళ్లం. గత పదేళ్లుగా ఉదయం నడక, వ్యాయామంతోపాటు యోగ చేయడం వల్ల ఆరోగ్యంగా, ఉల్లాసంగా, వ్యాపారంలో సైతం ఒత్తిడిలేకుండా పనిచేయగలుగుతున్నామని ప్రముఖ హోటల్ చంద్రభవన్ అధినేత రాగి రమేశ్ పేర్కొన్నారు. యోగ సాధనకు నిమిషం ఆలస్యం కాకుండా పాల్గొంటాం. ప్రతి ఒక్కరూ యోగ సాధనకు ముందుకు రావాలి. యోగాతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నారు. ప్రధానంగా మారుతున్న పరిస్థితుల్లో ఒత్తిడి నుండి బయటపడడానికి ఇదో చక్కటి మార్గమంటారు.
పట్టపగలే రెండిళ్లలో చోరీ
* 3.50 లక్షల నగలు, 30వేల నగదు అపహరణ
* వరుస చోరీలతో భయాందోళన చెందుతున్న ప్రజలు
సిద్దిపేట అర్బన్, జూన్ 19: పట్టపగలు రెండు ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేసిన సంఘటన సిద్దిపేటలో సంచలనం రేపింది. స్థానిక హౌజింగ్‌బోర్డులో పట్టపగలు గుర్తు తెలియని దొంగలు తాళాలు వేసిన ఇంట్లో చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. చిలుముల మురళీధర్, శ్రీమతిలు ఇంటికి తాళం వేసి టీచర్ విధుల నిమిత్తం పాఠశాలకు పోయారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోపలికి పోయి చూడగా 10తులాల బంగారు నగలు, 30వేల నగదు చోరీకి గురైంది. అలాగే పక్కనే ఉన్న సామలేటి భూమయ్య ఇంట్లో భార్య తాళం వేసి పక్కన జరుగుతున్న హనుమాన్ ఉత్సవాలకు పోయింది. వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోపలికి పోయి చూడగా వస్తువులు చిందరవందరగా పడేసి బీరువాలోని తులంన్నర ఉంగరం, కమ్మల జత, మరో ఉంగరం చోరీకి గురైంది. ఈ సంఘటనల్లో సుమారు 12తులాల బంగారం, 30వేల నగదు చోరీకి గురైనాయి. చోరికి పాల్పడ్డ దొంగలు పగులగొట్టిన తాళాలు కూడా వెంట తీసుకపోవడం గమనార్హం. నెలరోజుల్లోనే 4ఇండ్లలో చోరీలు జరుగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏదేమైనా పట్టపగలే చోరీలు జరగడం పట్ల ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సిఐ నందీశ్వర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీం దొంగలను పట్టుకొనే పనిలో నిమగ్నమైనారు. హౌజింగ్‌బోర్డులో చోరీలు జరగడం పట్ల కాలనీవాసులు ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు.

అందుగులపల్లి గ్రామైఖ్య సంఘం నగదు రూ.1.60 లక్షలు స్వాహా
*మహిళల ఆందోళన
వెల్దుర్తి, జూన్ 19: మండలంలోని అందుగులపల్లి గ్రామసమైఖ్య సంఘ సభ్యులనుండి బ్యాంకుల్లో డిపాజిటు చేయకుండానే చేసినట్లు బ్యాంకు ఓచర్లను చూపి మహిళలను మబ్యపెట్టి బొరడికొట్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం నాడు అందుగుల పల్లి గ్రామానికి చెందిన సూమారు వంద మంది మహిళలు వెల్దుర్తిలోని వెలుగు కార్యాలయం ముందు అందోళన చేశారు. గ్రామానికి చెందిన మహిళాసంఘాల సభ్యులనుండి డబ్బులు కట్టాలని విఎలకు ఇవ్వగా డబ్బులను తిసుకొని బ్యాంకు ఓచర్లపై డబ్బులు రాసి దానిపై బ్యాంకు కు సంబందించిన స్టాంప్ లేకపోవడాన్ని అధికారులు గుర్తించి డబ్బులను విఎలే మోసం చేశారని వారు మహిళలకు తెలుపగా అందుకు మహిళలు అక్కడే ఉన్న సంజీవ్ అనే వ్యక్తిపై మండి పడ్డారు. ఎఓ కిషన్ మాట్లాడుతూ డబ్బులను గ్రామంలో విఎలు చేసిన పనేనని వారి వద్ద నుండి వస్సులు చేస్తామని లేని యేడల చట్టరిత్య తగు చర్యలు తిసుకుంటామని వారు తెలిపారు. అలాగే ఎన్‌పిఎం ద్వారా మొక్కజొన్న గింజలను తిసే యంత్రం తో పాటు కుట్టుమిషన్‌నుకూడా అమ్ముకున్నారని వాటిని అమ్ముకున్న వారిపై తగుచర్యలు తిసుకొవాలని మహిళలు ఇడమాండ్‌చేశారు.