వరంగల్

చిన్న తరహా పరిశ్రమలకు బ్యాంకర్లు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 22: చిన్న, మధ్య తరహా పరిశ్రమల పునరుద్ధరణకు బ్యాంకర్లు సహకరించాలని ఆర్‌బీఐ లీడ్ బ్యాంక్ అధికారి ఫణిరాజు తెలిపారు. గురువారం సూక్ష్మ, చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక ప్రతినిధులు, బ్యాంకర్లతో జిల్లా స్థాయి టౌన్‌హాల్ మీటింగ్‌ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎంఎస్‌ఎం ఈసిక్ యూనిట్లకు సహకారం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పునరుద్ధరణకు తీసుకోవలసిన చర్యల, స్టాండప్, ముద్ర రుణాల పంపిణీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్‌ఎం ఈ సిక్ యూనిట్ల సమస్యలను పరిష్కరించి సంక్షోభంలో ఉన్న యూనిట్లను కాపాడేందుకు, యూనిట్లను పునరుద్ధరించేందుకు జిల్లా స్థాయి టౌన్ హాల్ మీటింగ్‌ను నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని ఇటువంటి పరిశ్రమలకు అండగా నిలవాలని బ్యాంకర్లను కోరారు. చిన్న, మధ్య తరహాపరిశ్రమల పునరుద్ధరణలో భాగంగా పరిశ్రమలకు వౌలిక సదుపాయాలు కల్పన, కావల్సిన పాక్షిక పెట్టుబడులు, మార్కెటింగ్‌పై పరిశ్రమల నిర్వాహకులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. నష్టాల్లో ఉండి వాయిదాలు చెల్లించలేని పరిశ్రమలను పునరుద్ధరిస్తామన్నారు. ఈ సమావేశంలో వరంగల్ రూరల్ ఎల్‌డియం జీవీబీవో హరిప్రసాద్, వరంగల్ అర్బన్ ఎల్‌డీఎం ఫణిరాజు, యస్‌బిఐ చీఫ్ మేనేజర్స్ ఇతర బ్యాంక్ మేనేజర్లు, సిక్ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.

కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ
* పార్టీ నేత జంగా రాఘవరెడ్డి
రాయపర్తి, పిబ్రవరి 22: కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెను ఎక్కిన తెరాస ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగలేదని.. అమరుల త్యాగాలకు గుర్తుగా కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జంగా రాఘవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కొండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జంగా రాఘవరెడ్డి హాజరై మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అకాంక్ష మేరకు అమరుల త్యాగాలను చలించిన సోనియాగాంధీ తన పుట్టన రోజు కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. కాని ఎన్నికలలో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు వేయించుకుని గద్దెను ఎక్కిన తెరాస ప్రభుత్వం కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని తన గుపిట్లో పెట్టుకుని రాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తుందని అన్నారు. కేసీఆర్ చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన మాటలతో ప్రజలు విసుగుచెందుతున్నారని అన్నారు, రాబోయో ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యాంగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని 30 మంది కార్యకర్తలు జంగా రాఘవరెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు అమ్యా నాయక్, శ్రీనివాస్ రెడ్డి, రత్నకర్ రెడ్డి, ఎల్లయ్య, రాజేందర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ కోటిరెడ్డి మాస్టారు!

* నిరుద్యోగులకు పోలీస్ బాస్ (జీవిత) పాఠాలు
మహబూబాబాద్, ఫిబ్రవరి 22: నిత్యం విధి నిర్వహణలో క్షణం తీరికలేకుండా ఉండే మహబూబాబాద్ జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి గురువారం అధ్యాపకుడి అవతారం ఎత్తారు. నిరుద్యోగ యువతకు పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని సందిర్శించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తానే స్వయంగా అధ్యాపకునిగా మారి భూగోళశాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలను బోధించారు. బోర్డుపై అనేక అంశాలను రాస్తూ వాటికి సంబంధించిన వివరాలను సోదాహారణంగా వివరించి నిరుద్యోగ యువతను ఉత్సాహపరిచారు. పోటీ పరీక్షల్లో వచ్చే అనేక అంశాలకు సంబందించిన విషయాలను ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగులను ప్రశ్నల రూపంలో అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. జీవితం నిరంతరం పోరాటం వంటిదని అందులో విజయం సాధించాలంటే నిరంతరం శ్రమ అవసరం అన్నారు. లక్ష్యం లేని జీవితం పట్టుదల లేని వ్యక్తి ఎప్పుడు పైకి రాడని తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్‌కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షల కోసం ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇదే శిక్షణను కార్పోరేట్ కళాశాలల్లో తీసుకోవాలంటే ఒక్కొక్కరికీ రూ. 20 వేలకు పైగా ఖర్చు వస్తుందన్నారు. నిరుపేద మధ్య తరగతి విద్యార్థులకు ఆర్థిక భారం కాకుండా అందుబాటులోనే శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి విజయావకాశాలను మెరుగపరిచే సంకల్పంతో ఈ శిభిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైద్రాబాద్‌లోని భాగ్యకిరణ్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఈ శిబిరం నిర్వహణకు ఆర్ధికంగా సహకారం అందించిన గాయత్రి గ్రానైట్స్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్, తొర్రూరు సబ్‌డివిజన్ పరిధిలో మొత్తం 500మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణా తరగతులకు హాజరైన నిరుద్యోగ యువత రానున్న పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించినట్లైతే తమ శ్రమకు ఫలితం దక్కిందని సంతృప్తి పొందుతామని జిల్లా ఎస్పీ అన్నారు. నిరుద్యోగ యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని, విజయం సాధించేదాకా అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉండాలన్నారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షనే కాకుండా నిరుద్యోగ యువతకు అత్యంత విలువైన ఉచిత శిక్షణా శిభిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగానికి, శిబిరానికి హాజరైన నిరుద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సారథ్యంలో ఒక గొప్ప అవకాశాన్ని తమకు కల్పించారని కచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించి చూపుతామని అనేకమంది యువతియువకులు తెలిపారు. సమాజహితం కోసం చైతన్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువతను క్రమశిక్షణలో పెడుతూ జీవితపాఠాలు బోధిస్తున్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని, పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటామని, తాము ఉన్నత స్థితికి చేరితే ఇలాంటి మంచి కార్యక్రమాలు శక్తిమేరకు నిర్వహిస్తామని వారు ఎస్పీ మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్, ట్రాఫిక్ ఎస్సై అశోక్, భాగ్యకిరణ్ ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దు చేయాలి
* పాత పెన్షన్ విధానానే్న కొనసాగించాలి
* పీఆర్‌టీయూ ధర్నాలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట, ఫిబ్రవరి 22: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానానే్న కొనసాగించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్‌టియూ రాష్టవ్య్రాప్త ఆందోళనలో భాగంగా గురువారం నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట మండల కేంద్రాల్లో పీఆర్‌టియూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రిలే నిరాహారదీక్షా శిబిరాలను ఎమ్మెల్యే దొంతి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంభాలకు జీవన భద్రత లేకుండా పోయిందని అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరించడం సరి కాదన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ సర్కార్ చరిత్రలో నిలబడలేదనే విషయాన్ని కేసీఆర్ సర్కార్ గమనించాలన్నారు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ అయిన సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానానే్న అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో వారికి ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. కాగా ఉపాధ్యాయుల దీక్షా శిబిరాన్ని తహశీల్దార్ లావుడ్యా పూల్‌సింగ్ చౌహాన్, ఎంపీడీవో తుమికి రమాదేవి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్, ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, చెన్నారావుపేట ఎంపీపీ జక్క అశోక్, జడ్పీటీసీలు ఎడ్ల జగన్మోహన్‌రెడ్డి, అజ్మీరా పద్మా మేఘ్యానాయక్, జూన్నూతుల రాంరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పెండెం రామానంద్ పాల్గొన్నారు.

ఆదిలాబాద్ మున్సిపల్
డీఈ ఆస్తులు పది కోట్లు పైనే..
ఆంద్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 22: ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీ అధికారిపై ఏసీబీ అధికారులు గురి పెట్టారు. మున్సిపల్ డిఈగా పనిచేస్తున్న కొండల్‌రావుపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపద్యంలో ఏసిబి అధికారులు ఒక పథకం ప్రకారం దాడులు చేపట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొన్నటి వరకు డీఈగా పనిచేసి, ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో డిఈగా పనిచేస్తున్నా కొండల్‌రావు ఇంట్లో గురువారం ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జిల్లాలో ఏక కాలంలో దాడులు నిర్వహించి దాదాపు 10 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఏసిబి డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ గౌడ్ వెల్లడించారు. డిఈ కొండల్ రావు గతంలో గ్రేటర్ వరంగల్ డిఈగా పనిచేసి అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కూడా అయ్యాడు. తిరిగి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో డిఈగా పనిచేస్తున్నాడు. ఇతని పై ఏసిబి అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు మూడు జిల్లాలో ఏక కాలంలో వరంగల్‌లో ఉండే ఆయన నివాసంతో పాటు కొత్తగూడెం , ఆదిలాబాద్ జిల్లాలోని ఆయన బందువుల ఇళ్లలోకూడా దాడులు జరిపారు. ఈ సందర్భంగా దాదాపు 10 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు వెల్లడించారు. ఇంకా పూర్తి సమాచారం రావల్సింది ఉందని బ్యాంక్ లాకర్‌లో 10లక్షల నగదుతో పాటు కిలోన్నర బంగారం ఉన్నట్లు గుర్తించినట్లు ఏసిబి డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ గౌడ్ వెల్లడించారు. నేడు శుక్రవారం కూడా తనిఖీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ దాడులల్లో ఏసిబి డిఎస్పీ సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగం కావాలి

* సమీక్షలో మంత్రి చందూలాల్

ములుగుటౌన్, ఫిబ్రవరి 22 : ములుగు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి అజ్మీర చందూలాల్ గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత సబ్‌కలెక్టర్ వీపీ.గౌతమ్, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావుతో పనుల పురోగతిపై చర్చించారు. నియోజకవర్గానికి మొదటి విడతలో 1400ల డబుల్ బెడ్ రూంలు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. కొన్ని గ్రామాల్లో భూసమస్య, లబ్ధిదారుల ఎంపిక పూర్తికాకపోవడం తదితర సమస్యలున్నా మల్లూరు, కాటాపూర్, చిన్నగుంటూరుపల్లి, పాపయ్యపల్లి, తాడ్వాయి, తదితర గ్రామాల్లో చేపట్టిన నిర్మాణాలు పూర్తిదశకు చేరుకున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. వెంటనే వాటికి దీన్‌దయాల్ యోజన పథకంతో విద్యుత్ కనెక్షన్ ఇప్పించి గృహప్రవేశాలకు సిద్ధంచేయాలని, మిగిలిన ఇళ్లను సైతం త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ములుగు మండల కేంద్రంలో ఒకేచోట వంద ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధంచేయాలని సూచించారు. ఐటీడీఏ, ఈజీఎస్ విభాగాల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ, గోదాముల నిర్మాణాలను నాణ్యతగా చేపట్టాలన్నారు. నియోజకవర్గానికి మంజూరైన స్పోర్ట్స్ స్కూల్‌ను ములుగులో లేదా ఏటూరునాగారంలో నిర్మించేందుకు పరిశీలిస్తామని స్పష్టంచేశారు. కోటి రూపాయలతో మినీ స్టేడియం, అవసరమైన ఆటవస్తువులను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఇందుకు కావాల్సిన 5 ఎకరాల స్థలాన్ని సేకరించాలని పీవోను ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు రంగులద్దడంతోపాటు పూర్తిస్థాయిలో ఫర్నీచర్‌ను సమకూర్చాలన్నారు. అన్ని బాలికల వసతిగృహాల వద్ద ఏ ఎన్ ఎంలు, నైట్‌వాచ్‌మెన్‌లను నియమిస్తామని, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో సరిగా పనిచేయని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవన్నారు. ఆర్ అండ్‌బీ ఆధ్వర్యంలో రాజుపేట-దేవనగరం మధ్య అంకన్నగూడెం బొగ్గులవాగు, ముత్తాపూర్ వద్ద దయ్యాలవాగులపై బ్రిడ్జి నిర్మాణాలను వర్షాకాలం ప్రారంభంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా ములుగు సమీపంలోని గట్టమ్మ పరిసరాల్లో నిర్మించతలపెట్టిన గిరిజన యూనివర్సిటీ స్థలాన్ని మంత్రి చందూలాల్ అధికారులతో కలిసి పరిశీలించారు.

మహిళా సంఘాలకు రుణాలివ్వాలి

పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి

పరకాల, ఫిబ్రవరి 22: మహిళ సంఘాలకు రుణాలు అందించాలని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇనగాల వెంకట్రాంరెడ్డి బ్యాంకు అధికారులను కోరారు. లోన్ పూర్తి అయిన మహిళ సంఘాలకు బ్యాంకు అధికారులు తిరిగి రుణాలు అందించడం లేదని మహిళ సంఘాల సభ్యులు ఇనగాల దృష్టికి తీసుక వచ్చారు. లోన్ పూర్తి అయి సంవత్సరాలు గడుస్తున్న కూడా తిరిగి మహిళ సంఘాలకు బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడం లేదని మహిళ సంఘాల సభ్యులు ఇనగాల దృష్టికి తీసుక వెళ్లడంతో ఇనగాల పరకాలలోని ఎస్‌బిఐ బ్యాంకుకు వెళ్లి అధికారులను కలిశారు. అర్హులైన మహిళ సంఘాలకు రుణాలు అందించాలని, లోన్ పూర్తి అయిన మహిళ సంఘాలకు తక్షణమే తిరిగి రుణాలు అందించాలని ఆయన కోరారు. రుణాలు చెల్లించిన వారికి త్వరతగతిని రుణాలు అందించాలని ఆయన బ్యాంకు అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పరకాల నుండి కాంగ్రెస్ జెండా ఎగుర వేయడం ఖాయమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మహిళలకు రూ. 10 లక్షలు వడ్డి లేని రుణం అందించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

రానున్నది
ఇందిరమ్మ రాజ్యమే..
* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, ఫిబ్రవరి 22: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలకు ఇందిరమ్మ పాలన అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెప్పారు. చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన 50 మంది టీడీపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే దొంతి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం నాటి నుండి కృషి చేసిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ పార్టీలో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చాయని, ఎన్నికల హామీలను అమలు చేయకుండా వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. నాడు అడిగిన పేదవారందరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి మూడు దశల్లో బిల్లులు చెల్లించామని, నేడు ఏ ఒక్క గ్రామాంలో డబుల్ బెడ్ రూంలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అదే విధంగా దళితులకు మూడు ఎకరాల సాగుభూమి, కేజీ టూ పీజి విద్య, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ తదితర ఎన్నికల హామీలపై అధికార పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. ప్రజలంతా ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, చెన్నారావుపేట ఎంపీపీ జక్క అశోక్, జడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్‌రెడ్డి, నాయకులు పెండెం రామానంద్, వైనాల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.