మెదక్

హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 13: హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని నిరసిస్తూ బీజేపీ, విశ్వహిందూ, భజరంగ్‌ధళ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై చేపట్టిన ఆందోళనతో ట్రాఫిక్ స్థబించిపోవడంతో గంట పాటు ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజేప్పిన వినకపోవడంతో అరెస్ట్ చేసి కంది మండలం ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచికత్తుపై విడుదల చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఎంఐఎం పార్టీతో కుమ్మక్కై హిందుత్వ కార్యకాలాపాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. స్వామి పరిపూర్ణనంద నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేసి ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, రాబోయే ఎన్నికల్లో హిందూవులంతా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ నాయకులు మందుల నాగరాజు, ద్వారక రవి, వాసు, విష్ణువర్ధన్ తదితరులు ఉన్నారు.
నేడు సంగారెడ్డి బంద్‌కు పిలుపు
హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడటం, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈ నెల 14న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి తెలిపారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

దేశానికే గర్వకారణం ‘కంటివెలుగు’
* మంత్రి హరీష్‌రావు
తూప్రాన్, ఆగస్టు 13: దేశంలో మొట్టమొదటిసారిగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మల్కాపూర్ గ్రామానికి రావడం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ నెల 15న మల్కాపూర్ గ్రామానికి వస్తున్న సందర్భంగా ఆయన గ్రామంలో పర్యటించిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా మల్కాపూర్ గ్రామస్థులు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని కంటి వెలుగు పథకం ద్వారా జాతీయ స్థాయిలో నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా 15న మధ్యాహ్నం 2 గంటలకు మల్కాపూర్‌కు చేరుకుంటారని అక్కడి నుండి రాక్‌గార్డెన్‌లో మొక్కను నాటి గ్రామంలో పర్యటించి సభాస్థలికి చేరుకుంటారన్నారు. కంటివెలుగు కార్యక్రమం, బీసీలకు సబ్సీడీ రుణాల పంపిణీ, గేదెల పంపిణీలను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడే ప్రారంభిస్తారని చెప్పారు. గ్రామస్థులతోనే ముఖ్యమంత్రి సమావేశమవుతారని ఇతర గ్రామాల ప్రజలు సభకు అనుమతి లేదని, రాజకీయ నాయకులకు కూడా అనుమతి లేదని కేవలం గ్రామస్తులతోటే సమావేశం జరుగుతుందని అందుకు రేయిన్ ప్రూఫ్ టెంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి హరీష్‌రావు ఎలీప్యాడ్ స్థలాన్ని, డంప్‌యార్డును సబావేదికను రాక్‌గార్డెన్‌ను సందర్శించి గ్రామంలో పర్యటించారు. ఇంటి ముందుగల దానిమ్మ, కరివేపాకు, మామిడి చెట్లను చూసి మంత్రి కుటుంబీకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్‌పీ చందనాదీప్తి, గడా అధికారి హన్మంతరావు, స్పెషల్ అధికారి సీతారామారావు, ఆర్డీఓ మదు, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, ఏఎస్‌పీ నాగరాజు, డీఎస్పీ రాంగోపాల్‌రావు, సీఐ లింగేశ్వర్‌రావులు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే లక్ష్య సాధన
*కంటివెలుగు సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
పటన్‌చెరు, ఆగస్టు13: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే నిర్దేశిత లక్ష్యాలను సాధించగలదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. భారతావనిలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాని ఆలోచన మన సీఎం కేసీఆర్‌కు వచ్చిందని, ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆయన నిర్ణయించడం ప్రాంత ప్రజలను అమిత సంతోషానికి గురి చేసిందన్నారు. పట్టణ శివారులోని జిఎంఆర్ ఫంక్షన్‌హాలులో సోమవారం జరిగిన కంటివెలుగు సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఏకమై తెలంగాణ సాధించిన విధంగా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రభుత్వ అధికారులతోనే కార్యక్రమ లక్ష్యం పూర్తి కాదని, గ్రామస్థులు సైతం సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. పటన్‌చెరు నియోజకవర్గంలో సుమారు 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సైతం విజయవంతం చేయడంలో సఫలీకృతులవుతున్నారన్నారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి కళ్ల అద్దాలు సైతం అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పలు పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పటన్‌చెరు ఎమ్మెల్యే మహీపాల్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎంపిపిలు శ్రీశైలంయాదవ్, యాదగిరి యాదవ్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.