మెదక్

కీర్తి కంటే కర్తవ్యమే గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 8: కర్తవ్య దీక్షతో పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వాటంతట అవే వస్తాయని, ఇందుకు సమిష్టిగా కృషి చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుందని ఎస్పీ సుమతి స్పష్టం చేసారు. స్మార్ట్ పోలిసింగ్ వ్యవస్థ క్రింద హైదరాబాద్ పోలీసులను ఫిక్కీ అవార్డుకు ఎంపిక చేయగా మెదక్ ఎస్పీకి వ్యక్తిగతం స్పెషల్ జ్యూరీ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆంధ్రభూమితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫిక్కీ అవార్డు వస్తుందని ఊహించలేకపోయానని, వ్యక్తిగతంగా జాతీయ స్థాయిలో ఇలాంటి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. శాఖాపరంగా గతంలో అనేక అవార్డులు, రివార్డులు వచ్చినా ఈ తరహా అవార్డు రావడంతో తొలిసారి ఆనందాన్నిచ్చింది. అచేతనులైన వారి కోసం ఏర్పాటు చేసిన చేతన కౌన్సిలింగ్ కేంద్రాలు సత్ఫలితాలను ఇచ్చిందని, మొదటల్లో ఈ ప్రయోగం ఎంత వరకు ఫలిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమైనా విశ్రాంత ఉపాధ్యాయుల కృషి ఫలితంగా చేతన కౌన్సిలింగ్ కేంద్రాలు విజయాల బాటలో ముందుకు నడుస్తున్నాయని సంతృప్తిని వ్యక్తం చేసారు. పట్టణాల్లో ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టపర్చేందుకు ఆరు పట్టణాలను ఎంపిక చేసి ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 20 వేల ఆటోలను డిజిటలైజేషన్ చేసినట్లుగానే పాఠశాలల బస్సులను కూడా డిజిటలైజ్ చేయడం ద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా డ్రైవర్‌ను సులభంగా గుర్తించడం మళ్లీ మళ్లీ ప్రమాదాలకు గురైతే సదరు డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళల వేధింపులను నివారించడానికి షీటీం బృందాలను బలోపేతం చేసేందుకు తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా కాలేజీ అమ్మాయిలకు అవగాహన కల్పించడానికి త్వరలోనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు పేర్కొన్నారు. మేలుకొలుపు కార్యక్రమానికి గ్రామాల్లో మంచి స్పందన లభిస్తుందని, ప్రధానంగా యువతలో చైతన్యం ఏర్పడి మద్యం తాగి వాహనాలను నడిపించకుండా తగిన జాగ్రత పడుతున్నారంటే తాము చేట్టిన కార్యక్రమానికి ఫలితం వచ్చినట్లేనన్నారు. మేలుకొలుపు ద్వారా మూడ విశ్వాసాలను రూపుమాపేందుకు కళాజాత ప్రదర్శనలు సత్ఫలితాన్ని సాధిస్తున్నాయన్నారు. వివాహిత మహిళలను వరకట్నం వేధింపులకు గురి చేసే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందంటే అందుకు మేలుకొలుపు కార్యక్రమం ముఖ్య భూమిక పోషించిందన్నారు. సిబ్బంది కొరత వల్ల అనేక సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొన్నది వాస్తవం అన్నారు. జాతీయ రహదారులు, విఐపిల పర్యటనలతో సిబ్బందిపై వత్తిడి తీసుకువచ్చి కొంత వరకు ఇబ్బంది కల్గించినా శాంతి భద్రతల పర్యవేక్షణలో ఇలాంటివి తప్పనిసరిగా పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన 10 కోట్ల నిధులతో నారాయణఖేడ్, దౌల్తాబాద్, తొగుట, చేగుంట తదితర పోలీసు స్టేషన్లను నిర్మించబోతున్నట్లు స్పష్టం చేసారు. రామచంద్రాపూర్‌లో ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయిస్తున్నట్లు వివరించారు. రామచంద్రాపూర్ పోలీస్ స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్తుతున్నట్లు చెప్పారు. కొత్త సిబ్బంది వస్తే పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వడం సాధ్యపడుతుందన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అందరి సహాకారం ఉందని, రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అధికారుల వరకు సాంకేతిక పరమైన శిక్షణ ఇవ్వడం ద్వారానే పోలీసు వ్యవస్థ మరింత పటిష్టమవుతుందన్నారు. గ్రామాల్లో పోలీసులు తరుచుగా సందర్శించడం వల్ల శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని, ఆ దిశలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహాకారం లేనిదే నేరాలను అదుపు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రజల వద్దకు పోలీసులను పంపించి వారితో మమేకం చేయడమే స్నేహపూర్వక పోలీసులకు సంకేతమన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతోనే చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తయ్యాయని, అందుకు ఫిక్కీ అవార్డు లభించడం జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. సహకరించిన అన్ని వర్గాల వారికి ఎస్పీ సుమతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.