మెదక్

11లోగా నీటి పారుదల ప్రణాళికలు సమర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 3: జిల్లా నీటి పారుదల ప్రణాళికలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఈ నెల 11లోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించారు. బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో నీటి పారుదల ప్రణాళికలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన కింద జిల్లాలో నీటి పారుదల సౌకర్యం విస్తరించేందుకు, వాస్తవ ఆయాకట్టుకు నీరు అందించేందుకు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు చేపట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖలను సమన్వయం చేస్తూ జిల్లా నీటి పారుదల ప్రణాళికలను రూపొందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, గత యేడాది డిసెంబర్ 31లోగా ప్రణాళికలు తయారు కావాల్సి ఉన్నప్పటికి ఇంకా సిద్ధం కాలేదని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 11లోగా ప్రణాళికలు సమర్పించాలని జిల్లా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వారి ప్రతిపాదనలు ఎమైన ఉంటే చేర్చాలని సూచించారు. నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్‌కె జోషి, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సెక్రటరి సి.పార్థసారధి ప్రణాళికలు రూపొందించడంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ముసాయిదా ప్రణాళిక గత వారమే సిద్ధం చేశామన్నారు. మండలాల వారిగా వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఉపాధి హామీ, నీటి పారుదల శాఖలను సమన్వయం చేసి ప్రణాళికలకు తుదిరూపు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులకు తెలియజేసి ప్రణాళికలను సమర్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖలతో సమావేశమై ప్రణాళికలను త్వరగా కచ్చితంగా సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సిఈఓ వర్షిణి, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ బాపురావు, అసిస్టెంట్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మెదక్, ఫిబ్రవరి 3: మార్చి 22 నుండి ఏప్రిల్ 10 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా వంద శాతం ఫలితాలు సాధించడానికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధ్దమవుతున్న 43 వేల 118 మంది విద్యార్థులు ఎవరు కూడా తక్కువ మార్కులతో ఉండకూడదనే లక్ష్యంతో జిల్లాలో వంద శాతం ఫలితాలు సాధించడానికి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట నిపుణులైన ఉపాధ్యాయులతో ట్యూషన్లు ఏర్పాటు చేశారు. ఈ ట్యూషన్ల సమయంలో విద్యార్థులకు అల్పహారం కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో విద్యార్థులను పరీక్షలకు సిద్ద్ధం చేస్తున్నారు. ఎస్‌ఎస్‌సి పరీక్షలకు 43 వేల 118 మంది ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్లు డిఈఓ నజిమోద్దీన్ తెలిపారు. 2014-15 10వ తరగతి పరీక్షల్లో 87 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు.

8న కలెక్టరేట్ ముందు ధర్నా
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 3: పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్టీలను పెంచాలని, పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. 9,10 తరగతి విద్యార్థుల మెస్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 8న జరిగే ధర్నాలో మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

ఖేడే రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు ఖాయం
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 3: గిరిజన, దళిత, వెనుకబడిన, మైనార్టీ సామాజిక వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడైనా విప్లవాత్మక మార్పులు రావచ్చని, తద్వార కుటుంబ పాలనకు తెరపడవచ్చని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.విజయపాల్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు. ఉప ఎన్నికల సందర్భంగా ఆంధ్రభూమికి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మాటకారితనానికి మారుపేరుగా నిలిచే ఈ ప్రాంతంలో టిఆర్‌ఎస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధి 20 నెలల్లో చేసామని గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఒక ఎమ్మెల్యే చనిపోయిన దురదృష్టకరమైన సంఘటనను ఆసరగా చేసుకున్న టిఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారులను, ప్రజాప్రతినిధులను, నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. కొంత మంది ప్రజాప్రతినిధులకు ధరావతు నిర్ణయించి కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. వరుసగా పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాతినిథ్యం వహించి దివంగతులైన ఎమ్మెల్యేలంతా చేతనైన అభివృద్ధి చేసారని, ఎవరిని విమర్శించినా ప్రయోజనం లేదన్న విషయాన్ని విస్మరించిన టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డిపై విమర్శలకు దిగడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజికి చేరుకోగానే నీటి సరఫరా నిలిపివేయాల్సిన బాధ్యతను మరిచిపోయి సింగూర్ ప్రాజెక్టులో ఉన్న నీరు అంతా ఖాళీ చేయించడంతో ఎగువన నారాయణఖేడ్ నియోజకవర్గానికి సరఫరా చేసే తాగునీటి పథకాలన్ని అడుగంటిపోయి నీటి కటకటకు కారకులయ్యారని ఎండగట్టారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను కర్నాటక, మహారాష్టల్ల్రో 361 (1) ఆర్టికల్ ప్రకారంగా ప్రత్యేక హోదాను కల్పించి అభివృద్ధి చేస్తున్నట్లుగానే తెలంగాణాలో వెనుకబడిన ఖేడ్‌ను 371 (డి) ఆర్టికల్ ప్రకారంగా ప్రత్యేక హోదా, ప్యాకేజి కల్పించాలని డిమాండ్ చేసారు. సిద్దిపేటను జిల్లాగా చేస్తున్నట్లుగానే వెనుకబడిన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు మరో చుట్టుప్రక్కల ఉన్న మరో 13 మండలాలను కలుపుకుని ఖేడ్ జిల్లాగా మారిస్తే గణనీయమైన అభివృద్ది సాధిస్తుందన్నారు. నారాయణఖేడ్ ప్రాంతం పూర్తిగా వెనుకబాటుకు వనరులు లేకపోవడం, పరిశ్రమలు రాకపోవడం వల్లనే వలసలు కొనసాగుతున్నాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వందల కోట్ల నిధులు అభివృద్ధికి తీసుకువచ్చినట్లు వివరించారు. ఖేడ్ ప్రాంతం వెనుకుబాటుతనానికి కారణాన్ని నిపుణులు ఎప్పుడో గుర్తించి నివేధికల్లో సబ్ సహారాగా పేర్కొన్నారన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమికాదని, ఎత్తుపల్లాలతో కూడినదని, నీటి వనరులు అంతంతగా ఉన్నాయన్నారు. అప్పట్లో చక్కర పరిశ్రమను తీసుకువచ్చేందుకు అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రంనాయుడు ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు అందజేయగా ప్రభుత్వం మారడంతో తన ప్రయత్నం ఫలించలేదన్నారు. సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్‌రావు చేస్తున్న హామీని తాను స్వాగతిస్తానని వెనుకబడిన నారాయణఖేడ్ కూడా అదే తరహాలో అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమన్నారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక జిల్లా, హోదా, ఫ్యాకేజి ఈ మూడు కల్పిస్తే రాజకీయ పరమైన పోటీయే తనకు అవసరం లేదని, చెప్పే అభివృద్ధి చేస్తే తాను ఏ త్యాగానికైనా సిద్దమన్నారు. నగరానికి చేరువలో ఉన్న గజ్వేల్‌కు గడ అథారిటిని ఏర్పాటు చేసిన కెసిఆర్ వెనుకబడిన నారాయణఖేడ్‌కు నాడా ఇవ్వలేకపోవడం శోచనీయమన్నారు. ఉన్న సింగూర్ నీటిని పరిరక్షించలేని ప్రభుత్వం ప్రతిసారి గోదావరి జలాల పేరు చెబుతూ వెక్కిరింపు దోరణిని అవలంభిస్తుందని విమర్శించారు. హరీష్‌రావు చెప్పే ప్రతి మాట అబద్దమని, ఇన్ని అబద్దాలు చెప్పే నాయకున్ని ఎక్కడ చూడలేదన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్న మాట వాస్తవమే అయినా ప్రజాభిష్టం మేరకు ఇక్కడ ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉందని రానున్న రోజుల్లో ఖేడ్ నియోజకవర్గంలో గణనీయమైన మార్పు రావడం ఖాయమన్నారు. రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఖేడ్ నియోజకవర్గంలో కూడా అలాంటి మార్పు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళలకు రాజకీయ పరమైన గుర్తింపును ఇచ్చిన ఘనత టిడిపిదే అన్నారు. నియోజకవర్గంలో టిడిపి లేదని మాటలు చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్‌కు తమ శ్రేణులు తగిన గుణపాఠం చెబుతాయన్నారు. తన తండ్రి వెంకట్‌రెడ్డి నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజాసేవ అందించాడని టిడిపి వచ్చినప్పటి నుంచి తన తండ్రి, ఆయన సూచనల మేరకు తాను నమ్ముకున్న పార్టీ శ్రేణులకు అండగా ఉంటున్నామన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

టిఆర్‌ఎస్ ప్రోద్బలంతోనే ఎంఐఎం దాడి
* దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
* ఎస్పీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 3: టిఆర్‌ఎస్ పార్టీ ప్రోద్బలంతోనే ఎంఐఎం దాడులకు పాల్పడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వి.సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలపై ఎంఐఎం దాడిని వ్యతిరేఖిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు భైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఐఎం, టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు. అనంతరం అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడిన ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ మద్దతుతో ప్రతిపక్షాలపై ఎంఐఎం చేసిన దాడి అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు బెదిరే ప్రసక్తిలేదని, మజ్లిస్ గూండాయిజాన్ని సహించేది లేదని హెచ్చరించారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఎస్పీ బి.సుమతికి వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్‌డిఎస్‌ఎల్ లే ఆఫ్‌ను ఎత్తివేయాలి
మెదక్ రూరల్, ఫిబ్రవరి 3: బోధన్, మంబోజిపల్లి, మెట్‌పల్లి నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాల లే ఆఫ్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ మూడు యూనిట్‌ల కార్మిక నాయకులు పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను కలిసి విజ్ఞప్తి చేశారు. లే ఆఫ్ ఎత్తివేతతోపాటు మూడు నెలల బకాయిపడిన వేతనాలు ఇప్పించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరినట్లు ఐఎన్‌టియుసి కార్మిక సంఘం నాయకులు పల్లె సిద్దిరాములుగౌడ్ బుధవారంనాడు తెలిపారు.
ఈమేరకు మూడు యూనిట్‌ల కర్మాగారం నాయకులు ఈ నెల 2న రాత్రి హైదరాబాద్‌లో పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపి కవితను కలిసి ఎన్‌డిఎస్‌ఎల్ మూసివేత, కార్మికుల సమస్యలపై విజ్ఞాపనపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. లే ఆఫ్ ఎత్తివేతపై, వేతనాలు చెల్లించడంపై పక్షం రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు హామినిచ్చినట్లు తెలిపారు. వేతనాల చెల్లింపు విషయంలో ఆర్థికశాక కార్యదర్శి ప్రదీప్‌చంద్ర అడ్డుపడుతున్నట్లు చెప్పారన్నారు. ప్రభుత్వం చెల్లిస్తే యాజమాన్యం అసలే పట్టించుకోదని చెప్పారని వివరించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తగు న్యాయం చేయాలని, వేతనాలు ఇప్పించి ఆదుకోవాలని కోరామన్నారు. పక్షం రోజులవరకు వేచి చూస్తామని, తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని సిద్దిరాములు చెప్పారు. కలిసినవారిలో కార్మిక సంఘం నాయకులు బాపురెడ్డి, ధర్మేంద్ర, శంభుప్రసాద్, ముక్తార్, కృష్ణారెడ్డితోపాటు బోధన్, మెట్‌పల్లి కర్మాగారాల యూనిట్‌ల కార్మిక సంఘాల నాయకులున్నారు.

ఒగ్గు కళాకారులకు పెన్షన్, గుర్తింపు కార్డులు కోరుతూ
10న కలెక్టరేట్ ముందు ధర్నా
సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 3: ఒగ్గు కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఒగ్గు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బాల్‌రాజ్ తెలిపారు. బుధవారం సంగారెడ్డిలో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వెయ్యికి పైగా ఒగ్గు కళాకారులు వృత్తిపై ఆదారపడి జీవిస్తున్నారన్నారు. కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు కళాకారులందరికి గుర్తింపు కార్డులు, పెన్షన్, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10న జరిగే ధర్నాలో కళాకారులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బిసి సబ్‌ప్లాన్ జిల్లా కార్యదర్శి జయరాజ్, ఎ.మల్లేశం, బిక్షపతి, వెంకట్‌రాములు, మల్లయ్య, రాములు తదితరులు ఉన్నారు.

కాలం చెల్లిన ఎంప్లాయ్‌మెంట్ కార్డుల పునరుద్ద్ధరణ
సంగారెడ్డి కలెక్టరేట్, పిబ్రవరి 3: గడువుతీరిన ఎంప్లాయిమెంట్ కార్డుల పునరుద్ధ్దరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఉపాధి కల్పణాధికారి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2003 జనవరి 1నుండి 2012 డిసెంబర్ 31 మద్యకాలంలో గడువు తీరిన కార్డులను పునరుద్ద్ధరించుకోవచ్చన్నారు. అభ్యర్థులు స్వయంగా కార్డులో నమోదు చేసుకున్న అర్హత సర్ట్ఫికేట్లు, కొత్త కుల ధృవీకరణ పత్రంతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

‘10లోగా వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం’
గజ్వేల్, ఫిబ్రవరి 3: ఫిబ్రవరి 10లోగా వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ స్పష్టం చేశారు. బుధవారం గజ్వేల్ ఎంపిడిఓ కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుండగా పూర్తిస్థాయి మరుగుదొడ్ల నిర్మాణంతోనే ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ముఖ్యంగా గజ్వేల్ నియోకవర్గాన్ని రాష్టస్థ్రాయిలో ముందుంచాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలాల వారిగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణనాల వివరాలను ఆయన తెలుసుకోవడంతో పాటు విధి నిర్వహనలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యలోపం ఫలితంగా వ్యాధులు ప్రభలుతున్న దృష్ట్యా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే తాగునీరు కలుషితం కాకుండా చూడడంతో పాటు మురికి కాలువలు శుభ్రంగా ఉండేలా చూడాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సిబ్బంది స్థానికంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గఢా అధికారి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లను పరిశీలించిన కమిషనర్
గజ్వేల్, ఫిబ్రవరి 3: గజ్వేల్ పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శంకర్ మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధ్దిదారులతో మాట్లాడారు. స్వచ్ఛ గజ్వేల్ కోసం ప్రతి ఇంటివద్ద మరుగుదొడ్డి నిర్మాణం జరుగాలని, ఇందుకు ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన వెంకట కౌన్సిలర్ కళ్యాణ్‌కర్ శ్రవంతి, నేతలు నర్సింగరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్ ముగిసింది...ఖేడ్ మిగిలింది
* తరలి వస్తున్న నేతలు * పెరిగిన మాటల యుద్ధ్దం * అడుగడుగునా సోదాలు
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 3: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు వాడి వేడిగా ముగిసినట్లుగానే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోరు వేడెక్కుతోంది. నియోజకవర్గంలో ఆయా పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నేతలంతా ఖేడ్ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో తిష్టవేసి తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీని గెలిపించే పూర్తి బాధ్యతను తనపై వేసుకున్న మంత్రి హరీష్‌రావు కథనాయకుని పాత్రను పోషిస్తూ గ్రామాలను చుట్టేయడమే కాకుండా ఓటర్లను తనదైన శైలీలో మాటలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపిలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు సైతం టిఆర్‌ఎస్‌ను గెలిపించాలనే తపనతో స్వచ్చందంగా వచ్చి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
టిఆర్‌ఎస్ అభివృద్ధి మంత్ర దండాన్ని అందుకుని ప్రచార రథాన్ని ముందుకు కదలిస్తోంది. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని గెలిపించడానికి కాంగ్రెస్ పెద్దలు తమ వంతు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖేడ్‌లో మొదటి సారి పాగా వేయాలని ప్రయత్నిస్తూ టిఆర్‌ఎస్ పార్టీ వేస్తున్న ఎత్తును కాంగ్రెస్ పార్టీ చిత్తు చేసేందుకు సానుభూతి మాటతో శ్రేణులను ముందుకు కదుపుతోంది. గత పాలన, ప్రస్తుత టిఆర్‌ఎస్ పాలన అంటూ పార్టీ నేతలు పరస్పర విమర్శలకు దిగుతుండటంతో గ్రామీణ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించే విధంగా ఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ముఠా కక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కి గొడవలకు తెరలేపుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నారు. మద్యం, డబ్బుల పంపిణీని అడ్డుకునేందుకు పార్టీలు నిఘాపెట్టి కూర్చున్నాయి. చుట్టూ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసి బస్సులను సైతం పోలీసులు నిశితంగా తనిఖీ చేస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ నేతలు అధికారులను ఉపయోగించుకుని లబ్దిపొందడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్, టిడిపి పార్టీలు ఎన్నికల అధికారులకు పిర్యాదులు చేస్తున్నాయి.
ఇటీవల మంత్రి హరీష్‌రావు ఐకెపి అధికారుల ద్వారా మహిళలతో సమావేశమై డబ్బులు పంపిణీ చేసారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టిడిపి అభ్యర్థి విజయపాల్‌రెడ్డి పిర్యాదు చేసారు. కాగా కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులను పోలీసుల ద్వారా బెదిరింపులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండే కుటుంబాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, డీలర్లు, వ్యాపారులను ఎదో ఒకరకంగా దబాయించి తమవైపు తిప్పుకోవడానికి టిఆర్‌ఎస్ ఎత్తులు వేస్తున్నా తమ శ్రేణులు ఎక్కడ భయపడరని ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమైన వ్యక్తుల కదలికలతో పాటు సెల్‌ఫోన్ సంబాషణలను సైతం ట్యాపింగ్ చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఖేడ్‌కు తరలి రానుండటంతో రాజకీయం మరింత రసకందాయంలో పడే అవకాశం ఉంది. సమస్యాత్మక గ్రామాలు, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లోని పాత నేరస్తులను పోలీసులు బైండోవర్ చేస్తున్నారు.
వలస ఓటర్లను రప్పించడానికి అన్ని పార్టీలు ఎత్తులు వేస్తూ తమ అనుచరుల ద్వారా వారిని రప్పించడానికి వ్యూహరచనలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు గ్రామాల్లో మకాం వేసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో గొడవలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలతో ఖేడ్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండగా 10వ తేదీన టిఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కానున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఫలితాల్లో టిడిపికి సంతృప్తికరమైన స్థానాలు దక్కితే ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని టిడిపి నాయకులు బరోసా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సిఎల్‌పి నేత జానారెడ్డి, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో పాటు దామోదర్ రాజనర్సింహా, సునితా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సురేష్ షెట్కార్ తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
అవసరమైతే జాతీయ స్థాయి నేతలను తీసుకువచ్చి జనాకర్షణగా నిలిపే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తంమీద నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతుంది. ఓటర్లు ఏ పార్టీకి మద్దతు ఇచ్చి ఏ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారో ఎవరు కూడా స్పష్టమైన అంచనా వేయలేకపోతున్నారు.