మెదక్

మచ్చలేని మహానేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 6: ఎదుటి వ్యక్తి నమస్కరించినా, తారసపడినా జై గురు దత్తా అంటూ సంబోధించి ఆద్యంతం భగవంతుడిని స్మరిస్తూ రాజకీయ నేతగా ఎదిగిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.సదాశివరెడ్డి శనివారం సాయంత్రం దివికేగడంతో పారిశ్రామిక వాడ అయిన పటన్‌చెరులో విషాదం నెలకొంది. 1994లో పటన్‌చెరుకు చెందిన రాంరెడ్డి, అనంతమ్మ దంపతులకు జన్మించిన సదాశివరెడ్డి పాలిటెక్నిక్ విద్యాభ్యాసం చేసారు. యుక్త వయస్సులోనే రాజకీయ అరంగ్రేటం చేసిన సదాశివరెడ్డి అంచలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. చిన్న గ్రామమైన పటన్‌చెరుకు 1970 నుంచి 1981 వరకు పదకొండు సంవత్సరాల పాటు సర్పంచుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేసారు. 1981 నుంచి 86 వరకు సమితి ప్రసిడెంట్‌గా, 1986 నుండి 90 వరకు డిసిసిబి చైర్మన్‌గా పదవులను అలంకరించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.రాంచంద్రారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. ఈ ఎన్నికలో రాంచంద్రారెడ్డి చేతిలో 31266 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన సదాశివరెడ్డికి 1994 ఎన్నికలు కలిసి వచ్చాయి. అప్పట్లో ఈ నియోజకవర్గం టికెట్‌ను ఎన్టీఆర్ సదాశివపేటకు చెందిన గడీల నవాజ్‌రెడ్డికి ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేస్తూ ప్రకటించడమే తరువాయిగా ఉన్న నేపథ్యంలో లక్ష్మీపార్వతి ఆశీస్సులు పొందిన సదాశివరెడ్డి చివరి క్షణంలో టికెట్ దక్కించుకున్నారు. ఎన్టీఆర్ ప్రభంజనంతో జిల్లాలోని పదింటికి పది అసెంబ్లీ స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ స్పీకర్ హోదాలో బరిలోకి దిగిన పి.రాంచంద్రారెడ్డిపై 35721 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. సదాశివరెడ్డికి వచ్చిన మెజార్టీ ఎన్టీఆర్ మెజార్టీ తరువాత రెండవ స్థానాన్ని దక్కించుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అతి పెద్ద నియోజకవర్గాల్లో సంగారెడ్డి ఒకటి కావడం ఇంత పెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనా టిడిపి పార్టీకి చెందిన ఏ నాయకుడినికానీ, ప్రజాప్రతినిధిని కానీ ఇబ్బందులకు గురి చేసినట్లు విమర్శలు ఎదుర్కోకుండా సౌమ్యుడిగా పని చేసారు. మంచితనానికి మారుపేరుగా నిలిచిన సదాశివరెడ్డికి ఎపి ఐడిసి, ఎపి ఐఐసి డైరెక్టర్‌గా, హుడా మెంబర్‌గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపిల మద్య పొత్తు కుదరడంతో ఈ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. పార్టీలో తన వ్యతిరేక బాణి వినిపించినా పొత్తు అడ్డుగా రావడంతో మిన్నకుండినా పార్టీపై తిరుగుబాటు చేయకుండా తన రాజకీయ నీతిని చాటుకున్నారు. పైగా పొత్తులో భాగంగా పోటీ చేసిన బిజెపి అభ్యర్థికి మద్దతుగా పని చేయడం విశేషం. 2004 ఎన్నికల్లో కూడా టిడిపి-బిజెపిల మద్య పొత్తు కుదరడం ఖాయమని బావించిన సదాశివరెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టిఆర్‌ఎస్‌లో సైతం టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న సదాశివరెడ్డికి శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. సదాశివరెడ్డికి భార్య భారతమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన రాజకీయ చతురత, చమత్కారమైన మాటలు, జై గురు దత్త అంటూ తన సన్నిహితులను, అభిమానులను నవ్విస్తూ రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగించారు. పారిశ్రామిక వాడలో మచ్చలేని రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నాయకుడిని కోల్పోవడంతో పటన్‌చెరుతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా సదాశివరెడ్డి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని అందించారు.

కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి చేయలేదు
ఆస్తులు పెంచుకున్నారు

మంత్రి హరీష్‌రావు ఆరోపణ
కంగ్టి, ఫిబ్రవరి 6: నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇంత వరకు పరిపాలించిన పాలకులు వారి స్వార్థం కోసం అస్తులను పెంచుకుని ప్రజల అభివృద్ధిని మరిచారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. శనివారంనాడు మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కంగ్టి మండలం నాగన్‌పల్లి, పోట్‌పల్లి, రాజుల్‌పాడ్, చుక్కల్‌తీర్థ్, గ్రామాల్లో మంత్రి హరీష్‌రావు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎం, భూపాల్‌రెడ్డి తరపున ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పలు గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడుతూ రెండు కుటుంబాల పాలకులు పదవులను పంచుకుని ప్రజల ఓట్లు వేసుకుని ఎమ్మెల్యేలుగా.. ఎంపిలుగా గెలిచిన తరువాత స్వార్థ రాజకీయాలను చేసుకుని ఖేడ్ నియోజక వర్గాన్ని వెనుకబడేశారని అరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు చెందిన సర్పంచ్‌లు ఎంపిటిసిలు ప్రజలు తండోప తండాలుగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అభివృద్ధిని చేసి చూపిస్తామని నమ్ముతున్నారని అన్నారు. గత ఆరు నెలలుగా చేసిన అభివృద్ధి ఇందుకు నిదర్శమని, అందుకే ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ప్రతి గ్రామంలో ముందుకు వస్తున్నారని అన్నారు. గాజుల్‌పాడ్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గుండాయిజం చేస్తున్నారని తెలిసిందని అది మరిచిపోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పతనం ఖాయమని వారు మరో పది సంవత్సరాలు వరకు ఖేడ్‌ను వదిలేసి వెళ్లిపోతారని తెలిపారు. ఇచ్చిన హామీలను ఎన్నికల తరువాత తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. చెప్పింది చేసి చూపిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికలో భారీ మెజార్టీతో భూపాల్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఇందులో ఎమ్మెల్యే హన్మంతు షిండే, ఇన్‌చార్జిలు నర్సింహారెడ్డి, ఉమాకాంత్, విశ్వనాథ్, అంజనేయులు, విఠల్‌రెడ్డి, శంకర్, సర్పంచ్ సురేందర్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త పరిశ్రమలకు సత్వర అనుమతులు

అధికారులకు కలెక్టర్ ఆదేశం
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 6: పరిశ్రమ స్థాపనకు వచ్చే దరఖాస్తులను పరిశీలించి వెంటనే ఆమోదించాలని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ -ఐపాస్ విధానం ద్వారా నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తుందన్నారు. ఇండస్ట్రియల్ ఇన్‌వెస్ట్ ప్రమోషన్ పాలసీ కింద ఎస్సీ లబ్ధిదారులకు ఉపాధి కింద సమకూర్చిన వాహనాలకు 35శాతం ఇన్‌ఫుట్ సబ్సిడీని మంజూరు చేశారు. ఎస్సీ లబ్ధిదారులు తమ వాహనాలకు పొందుతున్న రోజువారీ అద్దె వివరాలు, నెలసరి సంపద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన పరిశ్రమల ప్రతినిధులకు టిఎస్- ఐపాస్ ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. సమావేశంలో డిఐసి జిఎం సురేష్‌కుమార్, టిఎస్ ఐఐసి జిఎం మాధవి, పిసిబి ఈఈ బిక్షపతి, గ్రౌండ్ వాటర్ ఎడి ప్రమీల, టౌన్‌ప్లానింగ్ అధికారి రమేష్‌బాబు, కంపెనీల ప్రతినిధులు, ఎస్సీ లబ్ధిదారులు పాల్గొన్నారు.

కమీషన్ల కోసమే కాంట్రాక్టర్‌కు టికెట్టు
రేవంత్‌రెడ్డి
నారాయణఖేడ్ ఫిబ్రవరి 6: కాంట్రాక్టర్‌గా పని చేసే వ్యక్తికి టిఆర్‌ఎస్ పార్టీ ఖేడ్ ఉప ఎన్నికలోఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చి, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పనులపై కమిషన్లు తీసుకొమ్మని చెప్పిందని టి. టిడిపి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శనివారంనాడు మనూరు మండలం నాగిల్‌గిద్దా, కరసుగుత్తి, పూసల్‌పాడ్, ఎల్గోయి, పూల్‌కూర్తి తదితర గ్రామల్లో టిడిపి అభ్యర్థి ఎం, విజయపాల్‌రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభలో అయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే వారికి టిఆర్‌ఎస్ టిక్కెట్ ఇవ్వలేదన్నారు. దొరల పాలనలో దోపిడీ చేసే వ్యక్తులకు ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇస్తే ప్రజా సేవ ఎందుకు చేస్తారని ఆ యన ప్రశ్నించారు. మొదటి నుంచి దోచుకునే అలవాటు ఉన్న వ్యక్తులు అదే తీరు కొనసాగిస్తారని సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులపై ఆయన అరోపణలు గుప్పించారు. నీతి నిజాయితీకి మారు పేరుగా ఉన్న విజయపాల్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చిందని అయన ఎల్లపుడూ ప్రజల తరపున నిలిచి పోరాటం చేస్తారని అందుకు కోసమే గత 20సంవత్సరాల నుంచి ప్రజలు అయనను అదరిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకులను గుర్తు చేసుకోవాలని మనూరు మండల ప్రజలను అభ్యర్థించారు. ఖేడ్‌ను దత్త తీసుకుని మరో సిద్దిపేట చేస్తానని మంత్రి హరీష్‌రావు మూసపూరిత మాటలు చెబుతున్నారని వారి మాటలను ఎవరూ నమ్మరాదన్నారు. మోసం చేయడం సిద్దిపేట వ్యక్తులకు వెన్నతో పెట్టిన విద్యఅని అన్నారు. ఖేడ్‌లో విజయపాల్‌రెడ్డి మంచి నాయకుడని ప్రజల సమస్యలపై పోరాటం చేసే ధైర్యం అయన ఒక్కరికే ఉందన్నారు. సింగూరు నీరు దిగువ ప్రాంతాలకు వదిలేసి ఖేడ్ నియోజకవర్గం ప్రజలకు తాగునీరు లేకుండా చేసిన ఘనత మంత్రి హరీష్‌రావుదేనని అరోపించారు. కెసిఆర్ సిఎం రుణ మాఫీలో రైతులను మోసం చేశారని అన్నారు. ఒకే విడతగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మూడు విడతలుగా చేయడంతో బ్యాంకులో వడ్డికే సరి పోతుందని దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికలో హామీ ఇచ్చి ఇంత వరకు ఆ విషయంలో మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఖేడ్‌లో దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణించిన రోజు వచ్చి ఇప్పటి వరకు రాలేదని ఇప్పుడు శవాలపై ఓట్లు అడిగేందుకు టిఅర్‌ఎస్ నాయకులు వస్తున్నారని వారిగి తగిన గుణపాఠం చెప్పి కరెంట్ షాక్ ఇస్తే నారాయణఖేడ్ పేరు జీవితంలో జ్ఞాపకం రాదన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో సిద్దిపేటకు చెందిన వ్యక్తులను రప్పించి గ్రామాల్లో డీలర్లకు, సర్పంచ్‌లకు, అంగన్‌వాడీ టీచర్లకు, ఇతర నాయకులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఎవరూ భయపడకుండా ఎదరు తిరిగాలని రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు. మంత్రి హరీస్‌రావు జిమ్మిక్కులకు ఎవరూ భయపడరని రేవంత్‌రెడ్డి అండగా ఉన్నారని గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. అభ్యర్థి విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా నాయకునిగా గుర్తించి తనను ఈ ఎన్నికలో గెలిపిప్తే అన్ని సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో జిల్లా టిడిపి అధ్యక్షులు శశికళయాదవ్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, శ్యామ్‌సుందర్, నర్వోత్తం, మారుతిరెడ్డి, మోహన్‌రెడ్డి, తెలుగుయువత ఉపాధ్యక్షుడు ఇంతియాజ్, కార్యదర్శి అంజయ్య, విశ్వనాథం, సంగారెడ్డి, గణపతినాయక్, జగన్‌లాల్, రాజేష్, పండరి,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలు, తండాల్లో వౌలిక వసతులు
* రూపొందుతున్న ప్రణాళికలు
* జడ్పీ సిఇఒ వర్షిణి వెల్లడి
సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 6: జిల్లాలో ఇప్పటికి కనీసం రోడ్లు లేని గ్రామాలు, తండాలు ఉన్నాయని వీటికి వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా పరిషత్ సిఇఒ వర్షిణి వెల్లడించారు. శనివారం జిల్లా పరిషత్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంపై దృష్టి సారించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నారాయణఖేడ్ ప్రాంతంలో ఇప్పటికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని సేకరించుకుంటున్నారని, అలాగే 20కిలో మీటర్లకు పైగా పాఠశాలల కోసం విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లలను ఆసరా చేసుకొని రద్దీ ప్రాంతాల్లో యాచకవృత్తిని ఎంచుకొని చిన్నారుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడిఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఖచ్చితంగా ఉండేలా ప్రజలు సహకరించాలని కోరారు.

సమాన వాటాతోనే సాధికారత
జిల్లా కేంద్రంలో మహిళల ర్యాలీ
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 6: మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సమాన వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా సాధికారత ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబి అతిధి గృహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఆర్వో దయానంద్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాదికారత నాయకురాలు పద్మిణీరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు పెంచడంలో భాగంగా సుక్ష్మ, మధ్య, చిన్నతర పరిశ్రమలను స్థాపించాలనుకుంటుందని, వీటిని మహిళలకు కేటాయించడం వల్ల నిరుద్యోగాన్ని తొలగించడంతో పాటు స్ర్తి సాధికారత సాధించవచ్చన్నారు. వివిధ కార్పోరేషన్ల ద్వారా అందిస్తున్న స్వయం ఉపాధి పథకాల్లోను మహిళలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచిత భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో భ్యూటిషన్, కుట్లు, అల్లికలు, చేనేత లాంటి కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

వెబ్‌కాస్టింగ్‌పై విద్యార్థులకు శిక్షణ
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 6: ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయాలని కలెక్టర్ రొనాల్ట్ రాస్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వెబ్‌కాస్టింగ్‌పై వివిధ శాఖల ఇంజనీరింగ్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈ నెల 13వ తేదీన జరుగుతున్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ చేయడం జరుగుతుందన్నారు. 286 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేందుకు 8 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 350మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. 5నుండి 6 మంది సభ్యులు గల ఈ బృందాలు వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొంటాయని తెలిపారు. పోలింగ్ రోజున ఉదయం 7నుండి సాయంత్రం 5గంటల వరకు ఎన్నికల సరళిపై వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్ చేయాలని సూచించారు. ఓటు వేసేది రహస్యం కాబిట్టి ఆ కాంపార్ట్‌మెంట్ తప్పా మిగిలిన ప్రాంతాన్ని వెబ్‌కాస్టింగ్ ద్వారా రికార్డ్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేందుకు దోహద పడుతుందన్నారు. వెబ్‌కాస్టింగ్‌కు నోడల్ అధికారిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తారన్నారు. ఈ నెల 12న ఉదయం 8గంటలకు నారాయణఖేడ్‌లోని ఎన్నికల పంపిణీ కేంద్రంలో శిక్షణ పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలని సూచించారు.

బాలికకు బలవంతపు పెండ్లి
* భర్త రిమాండ్
హత్నూర, ఫిబ్రవరి 6: మైనర్ బాలికను వివాహం చేసుకొని వేధింపులకు గురి చేసిన భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్ సిఐ తిరుపతిరాజు తెలిపారు. శనివారం హత్నూర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్నూర మండలం నాగారం గ్రామ పంచాయతీలో గల కొడిప్యాక గ్రామానికి చెందిన 16 సంవత్సరాల వయస్సు గల బాలికను నిజామాబాద్ జిల్లా గురుగుల గ్రామానికి చెందిన మనుదల దత్తుగౌడ్ 9వ తేదీ మార్చి 2015న వివాహం చేసుకున్నాడని తెలిపారు. అప్పటి నుండి ఆ బాలికను తరచు వేధిస్తున్నాడనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు దత్తుగౌడ్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ఎఎస్‌ఐ సుదర్శన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
టెన్త్ విద్యార్థులకు
అల్పాహారం ఆరంభం
మెదక్ రూరల్, ఫిబ్రవరి 6: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పదవ తరగతి విద్యార్థులు ఉన్నతమైన ఫలితాల సాధన కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రత్యేక తరగతుల బోధన సమయంలో విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండకుండా అల్పాహారం అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 1 నుండి అల్పాహారం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీచేశారు. శనివారం నుండి అన్ని పాఠశాలల్లో సాయంత్రం వేళ పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు. నిత్యం ఒక్కో రకమైన అల్పాహారం శనగలు, పల్లీలు, బిస్కెట్లు, బెబ్బెర్లు, అరటి పండ, బిస్కెట్లు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యాహ్నా భోజన నిర్వాహకుల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా అందజేశారు. ఈసారి 40 పనిదినాలు అల్పాహారం అందజేయనున్నారు.
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

జహీరాబాద్, ఫిబ్రవరి 6: జహీరాబాద్ శాసన సభ్యులు డాక్టర్ జె.గీతారెడ్డి శనివారం పట్టణంలోని శ్రీషిరిడీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. బాబాకు దర్శించుకుని ప్రత్యేక పూజా, అర్చన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు.
నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న గీతారెడ్డి శుక్రవారం రాత్రి జహీరాబాద్‌లోని తన నివాసానికి వచ్చారు. శనివారం ఉదయం బాబాను దర్శించుకుని తిరిగి ఎన్నిలక ప్రచారానికి తరలివెళ్లారు. బాబాను దర్శించుకున్న వారిలో కూతురు, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షురాలు మెఘనారెడ్డి, మనవరాలు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సిములు, శ్రీనివాస్‌రెడ్డి, ఇస్మాలప్ప, ఇతర నాయకులు తదితరులున్నారు.

మాజీ ఎమ్మెల్యే సదాశివుని మృతికి
పలువురు ప్రముఖుల సంతాపం

పటన్‌చెరు, ఫిబ్రవరి 6: సంగారెడ్డి మాజీ శాసనసభ్యుడు కొల్కూరి సదాశివరెడ్డి హఠాత్మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు గుండెపోటుతో మరణించిన ఆయనకు నివాళులు అర్పించిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
రాజకీయ కురువృద్ధుడి మృతి తీరనిలోటు
రాజకీయాలకు కరువుద్ధుడి లాంటి మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి మరణం తీరని లోటు అని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సంతాపం తెలిపారు. సర్పంచ్‌గా, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఎపిఐడిసి, ఎపిఐఐసి డైరెక్టరుగా, హుడా సభ్యుడిగా పదవులు అలంకరించిన సదాశివరెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. 1995వ సంవత్సరములో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారన్నారు. పార్టీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మెజారిటీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువగా సదాశివరెడ్డి రెండవ స్థానంలో నిలిచారని ఈ సందర్భంగా గుర్తుచేసారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని, కుటుంబ సభ్యులను భగవంతుడు చల్లగా చూడాలని వేడుకున్నారు.
పటన్‌చెరు అభివృద్ధికి సదాశివుని కృషి మరువలేనిది
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి పటన్‌చెరు మండల అభివృద్ధికి ఎనలేని కృషి చేసారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, పటన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొనియాడారు. ఒకవైపు అన్ని రంగాలలో పట్టణాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తూ బలహీనవర్గాల ఆర్థిక అభ్యున్నతికి సైతం ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఎపిఐఐసి డైరెక్టరుగా పనిచేసిన ఆయన పరిశ్రమల ఏర్పాటుకు ఇతోధిక సహకారం అందించారన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో జరిగిన పురోగతి అందరి దృష్టినీ ఆకర్షించేలా ఆయన చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. సమతి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన పలువురు పటన్‌చెరు సర్పంచుల ఎన్నికలలోను కీలకపాత్ర పోషించారన్నారు.
ప్రజల మదిలో శాశ్వత స్థానం
ప్రజల మదిలో శాశ్వతస్థానం సంపాదించిన సదాశివుడు చిరస్మరణీయుడని చిన్నతరహా పరిశ్రమల జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు అన్నారు. హఠాన్మరణం పొందిన సదాశివరెడ్డి పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఆయన మాట్లాడుతూ ఈ నెల రెండున జరిగిన గ్రేటర్ ఎన్నికల విషయంలోను పలువురితో చర్చించిన ఆయన అంతలోనే మృతి చెందడం ఏమాత్రం జీర్ణించుకోలేమన్నారు.
పేదల మనిషిగా సదాశివుకి పేరు
పేదల మనిషిగా మాజీ ఎమ్మెల్యే సదాశివునికి పేరు ఉందని పటన్‌చెరు తాజా కార్పొరేటర్ మెట్టు శంకర్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ మందుమూల సఫానదేవ్‌లు అన్నారు. పలువురికి రాజకీయ జీవితం ప్రసాదించిన ఆయన పటన్‌చెరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సుమారు నలబై సంవత్సరాల పాటు స్థానిక రాజకీయాలను శాసించిన సదాశివుడు శారీరకంగా దూరమైనా మానసికంగా మాతోనే ఉంటారన్నారు.

పారిశుద్ధ్య విభాగంలో..
పేరుకుపోతున్న పెండింగ్ ఫైళ్లపై కమిషనర్ ఆగ్రహం
* శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మందలింపు
మెదక్, ఫిబ్రవరి 6: మెదక్ పురపాలక సంఘంలో గుదిబండగా మారిన పెండింగ్ ఫైల్స్ విషయంలో శానిటరి ఇన్స్‌పెక్టర్ సాదిక్ అలీపైన శనివారం నాడు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ విషయంలో మీమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు మాత్రం చర్యలు తప్పవని సాదిక్ అలీని కమిషనర్ ప్రసాద్‌రావు తీవ్రంగా హెచ్చరించారు. పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులలో బర్త్ అండ్ డెత్ సమాచారాలు పూర్తి స్థాయిలో సేకరించాలని సాదిక్ అలీని కమిషనర్ ఆదేశించారు. మెదక్ సత్యసాయి సేవా సమితి పిఆర్‌ఓ శంకర్‌గౌడ్ ఇచ్చిన దరఖాస్తుకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని సాదిక్ అలీని ఆయన తీవ్రంగా మందలించారు. వెంటనే శంకర్‌గౌడ్ ఇచ్చినటువంటి దరఖాస్తుకు ఆర్డీఓకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పెండింగ్ పైల్స్ విషయంలో తానే జ్ఞాపకం చేయాలనా, మీరెందుకున్నారు. ప్రతి విషయంలో మిమ్ములను పిలుచుకొని ఆ పనెందుకు కాలేదు, ఈ పని ఎందుకు పెండింగ్‌లో ఉందని అడగాలనా, మీరు పెండింగ్‌లో ఉన్నటువంటి రికార్డులన్నీ పూర్తి చేసుకొని నావద్దకు వచ్చి సంతకాలు తీసుకోవాల్సిన మీరు ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సాదిక్ అలీకి కమిషనర్ హెచ్చరికలు చేశారు.