మెదక్

వర్సిటీల్లో మతోన్మాద చర్యలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్: ప్రజా హక్కులను కాపాడుకుందామని, మతోన్మాదం, మనువాదాన్ని ఐక్యంగా తిప్పికొడుదామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం పిలుపునిచ్చారు. హెచ్‌సియు, జెఎన్‌యులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ అండతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎటువంటి భిన్నాభిప్రాయాన్నైనా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మద్రాస్ యూనివర్సిటీలో అంబేద్కర్ పెరియార్ స్టడీసర్కిల్‌ను రద్దు చేయడంతో ప్రారంభమైన రాజకీయ జోక్యం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకునే వరకు కొనసాగిందన్నారు. ఈ ఘటన నుండి ఇంకా తేరుకోకముందే దేశంలోనే ప్రతిష్టాకరమైన జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్శిటికి అధ్యక్షుడిగా ఉన్న కన్హయ్య కుమార్‌ను దేశద్రోహ నేరం మోపి జైలుకు పంపడం అత్యంత ఆందోళన కలిగించే అంశమన్నారు. మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చి 20నెలలు అవుతున్న ఇచ్చిన హామి ఎ ఒక్కటి అమలు చేయలేదు కాని స్వదేశి, విదేశీ కార్పోరేట్లకు మాత్రం మేలు చేశారని విమర్శించారు. పిఆర్‌ఎస్‌ఎస్ జిల్లా చైర్మన్ అనంతయ్య మాట్లాడుతూ వామ పక్షాలు, అంబేద్కరిస్టులను జాతీ వ్యతిరేకులుగా ప్రచారం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సంఘ్ పరివార్ శక్తులు తెగబడ్డాయన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రాజయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మానిక్యం మాట్లాడుతూ జాతీయత గురించి మాట్లాడిన బిజెపి అన్ని రంగాల్లో ఎఫ్‌డిఐలను రప్పించి విదేశీ వస్తువులను ప్రమోట్ చేస్తూ దేశాన్ని దోచుకోమంటూ అడ్డగోలుగా ఆహ్వానిస్తుందన్నారు. ప్రజలను వౌళిక సమస్యల నుండి దారిమళ్లించేందుకే మోడీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. ధర్నాలో సహసం రాష్ట్ర అధ్యక్షులు ముప్పారం ప్రకాష్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడివయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నర్సింలు, ఐద్వా జిల్లా కార్యదర్శి మల్లేశ్వరి, సిపిఐ నాయకులు ఆనంద్, ఆవాజ్ నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.

చెరువులో రైతుల దరువు..చేనులో సారం మెరుగు!
* చకచకా మిషన్ కాకతీయ పనులు * రూ.100 కోట్లతో 885 చెరువుల మరమ్మతుల పూర్తి * రెండవ విడతలో 680 చెరువులకు రూ.100 కోట్లు మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 25: నిరాధరణకు గురైన కాకతీయుల కాలం నాటి చెరువులను తెలంగాణ ప్రభుత్వం పునరుద్దరించడానికి శ్రీకారం చుట్టి మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలోని 7972 చెరువుల మరమ్మతుకు విడతల వారిగా ఎంపిక చేస్తున్నారు. మొదటి విడతలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 1693 చెరువులను మరమ్మతు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత యేడాది నుంచి ఇప్పటి వరకు 885 చెరువులను మాత్రమే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయగా ఇందుకు వంద కోట్ల నిధులను వెచ్చించారు. వివిధ కారణాల వల్ల మిగతా చెరువుల మరమ్మతు పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. మార్చి 31 నాటికి మిగిలిన చెరువులన్నింటిని మరమ్మతులు చేయాలని, టెండర్లు దక్కినా పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లీస్టులో పెట్టి ఇతర కాంట్రాక్టర్ల ద్వారా పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. సక్రమంగా పని చేయని అధికారులను తొలగించాలని, మెమోలు జారీ చేయాలని ఇటీవల నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి సమీక్షా సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సాగునీటి పారుదల శాఖ ఎస్‌ఈని ఆదేశించిన విషయం తెలిసిందే. చెరువుల్లోని మట్టిని సైతం పరీక్షించి వ్యవసాయ పొలాలకు తీసుకువెళ్లడానికి అనుకూలంగా ఉంటే రైతుల ద్వారా తరలింపజేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం విధితమే. ఏళ్ల తరబడిగా వ్యవసాయ పొలాల్లోని సారవంతమైన మట్టి వర్షాకాలంలో వరదల ద్వారా చెరువుల్లోకి చేరుకుని పేరుకుపోయింది. సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గిపోయి రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల పంట పొలాలన్ని నిస్సారమైపోయాయి. చెరువుల్లోని సారవంతమైన మట్టిని తరలించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో పాటు తక్కువ అద్దెకు ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకురావడంతో రైతులు చెరువు మట్టిపై ఆసక్తి చూపిస్తున్నారు. నల్లరేగడి భూములతో పాటు ఎర్రనేలల్లోకి సైతం చెరువుల మట్టిని లక్షలాది ట్రాక్టర్లలో తీసుకువెళుతున్నారు. పొలాల్లోకి ట్రాక్టర్లు, టిప్పర్లు వెళ్లే అవకాశం ఉన్న రైతులు మాత్రమే ఈ మట్టిని తరలించుకుపోతుండగా ఇతర రైతులు సద్వినియోగపర్చుకోవడం లేదు. ఎకరం, రెండెకరాలు ఉండి ఆర్థికంగా వెనుకబడిన రైతులకు కూడా చెరువు మట్టిని తరలించడానికి ప్రభుత్వం హకరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలన్నింటిని నాలుగు విడతల్లో పూర్తి స్థాయిల మరమ్మతు చేస్తామని ఇరిగేషన్ ఎస్‌ఈ పద్మారావు పేర్కొన్నారు. రెండవ విడతలో ఇప్పటి వరకు 1760 చెరువులను మరమ్మతు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా 680 చెరువులకు 100.90 కోట్లతో మంజూరు లభించినట్లు ఆయన వెల్లడించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 31 నాటికి పూర్తి చేసి కొత్తగా మంజూరు లభించిన రెండవ విడత చెరువులను కూడా వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు. రెండేళ్లు నెలకొన్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లో ఉన్న నీరంతా ఎండిపోవడంతో పూడిక తీతకు దోహదపడుతుండగా పూర్తి స్థాయిలో పూడిక తీసే అవకాశం లభిస్తోంది. తాత్కాలిక మరమ్మతుల మాదిరిగా కాకుండా పెద్ద పెద్ద చెరువులు సైతం మొత్తం మరమ్మతుకు నోచుకుంటున్నాయని చెప్పడంలో సందేహం లేదు. కొంత మంది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్ శాఖలో జెఇలు, ఇతర సిబ్బంది తక్కువగా ఉండటంతో జరుగుతున్న చెరువుల అభివృద్ధి పనులకు పర్యవేక్షణ కొరవడుతోంది. కాగా ఇతర శాఖల అధికారులు కూడా చెరువులను దత్తత తీసుకుని వారి పర్యవేక్షణలో పనులు కొనసాగిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. జిల్లాలోని పెద్ద చెరువుల్లో ఒకటైన అందోల్ మండలం అన్నాసాగర్ చెరువు పనుల మరమ్మతులు వారం రోజులుగా జోరుగా కొనసాగుతున్నాయి. వందలాది ట్రాక్టర్ల ద్వారా రోజుకు వేలాది ట్రిప్పుల్లో సారవంతమైన మట్టిని రైతుల పొలాల్లోకి తరలిస్తున్నారు. చెరువుకు రెండు వైపుల ఉన్న అలుగులను సైతం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసారు. గత వర్షాకాలంలో ఆశించిన వానలు కురియకపోవడంతో ఎన్నడు లేని విధంగా చెరువు పూర్తి స్థాయిలో ఎండిపోయింది. మొత్తంమీద జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన చెరువుల మరమ్మతులు పూర్తి కావస్తుండగా రెండవ విడత పనులను త్వరలోనే ప్రారంభించడానికి అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి చెరువులకు తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోనున్నాయని చెప్పవచ్చు.

ఉల్లి రైతుకు ఊరటనివ్వని గుర్తింపు కార్డులు
* ‘రైతు’ ‘బజార్’పై అనాసక్తి * గిట్టుబాటు ధరపైనే గురి
* ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ * ఖేడ్ సెగ్మెంట్‌లో 500 మంది ఉల్లి రైతుల గుర్తింపు
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 25: గిట్టుబాటు ధర లేక గిలగిలా కొట్టుకుంటున్న ఉల్లి రైతును ఆదుకునేందుకు గుర్తింపు కార్డులు జారీ చేసి రైతు బజారులో విక్రయించుకోవాలని ప్రభుత్వం కల్పించిన అవకాశాలపై అన్నదాతలు అంతగా ఆసక్తిని కనబర్చడం లేదు. గత యేడాది ఈ సమయంలో క్వింటాళు ఉల్లికి రెండు వేల పైచీలుకు ధర పలకడంతో అధిక శాతం రైతులు ఉల్లి సాగుపై మక్కువ చూపించారు. ఒక్కో రైతు రెండెకరాలకు తగ్గకుండా సాగు చేయగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని మంచి దిగుబడిని సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉల్లి మార్కెట్‌కు సదాశివపేట పెద్ద మార్కెట్ కాగా ప్రతి రోజు టన్నుల కొద్ది ఉల్లి విక్రయానికి వస్తోంది. క్వింటాళుకు 300 రూపాయలకు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి రైతులు వెల్లబోసుకుంటున్న గోడుకు ప్రభుత్వం తనవంతుగా స్పందించి ఉపషమనం కల్గించడానికి చర్యలు చేపట్టింది. టన్నుల కొద్దికాగా రోజుకు కొంత చొప్పున హైదరాబాద్‌కు తరలించుకుపోయి కనీసం 12 రూపాయలకు తగ్గకుండా కిలోచొప్పున విక్రయించుకోవాలని ఉల్లి రైతులకు పిలుపునిచ్చింది. ఇటీవల నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిపై మంత్రి హరీష్‌రావు అధికారులతో సమీక్షిస్తున్న తరుణంలోనే ఉల్లి రైతుల దుస్థితిపై ప్రస్తావనకు వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను సమన్వయం చేసి రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి హైదరాబాద్‌లో దగ్గరలో ఉన్న రైతు బజారుల్లో విక్రయించుకునేలా చైతన్యం కల్పించాలని ఆదేశించారు. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లోని ఉల్లి రైతులను గుర్తించాలని సూచించారు. ఉద్యానవన శాఖ అధికారుల అంచనా ప్రకారం ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 500 మంది రైతులు ఉండగా జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కూడా రైతులు ఉల్లి సాగును వేలాది ఎకరాల్లో చేసారు. ప్రస్తుతానికి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన గుర్తింపు కార్డుల జారీకి రైతుల నుంచి స్పందన అంతంతగానే వస్తున్నట్లు తెలుస్తోంది. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన ఉల్లిగడ్డలను ఎన్ని రోజులంటూ తాము రైతు బజారులకు వెళ్లి విక్రయించుకోవాలని అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే గిట్టుబాటు ధరను కల్పించి ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోలు చేయిస్తే తాము కోలుకుంటామని లేని పక్షంలో రైతు బజారుకెక్కి మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోలేమని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. రైతులు ఉల్లి గడ్డను రైతు బజారుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఆర్టీసి అధికారులతో మార్కెటింగ్ శాఖ అధికారులు చర్చలు జరిపారు. బుధ, గురువారాల్లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారు వంద మంది రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసారు. సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, జహీరాబాద్ మార్కెట్లకు చెందిన కార్యదర్శులను డిప్యూటేషన్‌పై నారాయణఖేడ్‌కు తరలించారు. వీరంతా గుర్తింపు కార్డులు తీసుకుని నేరుగా రైతుల ఇళ్లు, ఉల్లి పంట పొలాల వద్దకు వెళ్లి కార్డులు అందజేస్తున్నారు. మద్దతు ధర వచ్చే వరకు ఉల్లిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఎక్కడ కూడా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో లభించిన ధరకు విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఉల్లిని విస్తారంగా సాగు చేసే ప్రాంతాల్లో కాకుండా వరి ధాన్యం ఎక్కువగా దిగుమతి అయ్యే మెదక్ పట్టణంలో అధికారులు అనాలోచితంగా నిర్మించారని ఉల్లి రైతులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మెదక్‌లో ఉన్న ఉల్లి గోదాములు నిరుపయోగంగా మారిపోయాయి. జహీరాబాద్, సదాశివపేట, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఉల్లి గోదాములను నిర్మించాలన్న డిమాండ్ ప్రతి యేటా వినిపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. స్వరాష్ట్ర సాధనలోనైనా తమకు ఉల్లి గోదాములు అందుబాటులోకి వస్తాయా రావా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎఫ్‌సిఐ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయిస్తే కానీ తాము గట్టెక్కలేమంటున్నారు. రైతు బజారులకు వెళ్లి టన్నుల కొద్ది ఉల్లిగడ్డలను అమ్ముకోవడం సాధ్యం కాదని రైతులు పెదవి విరుస్తున్నారు.

ఎంత పనిచేశావు ప్రభూ?
* అక్కన్నపేటకు రూ.10 కోట్లు
* మనోహరాబాద్‌కు రూ.20 కోట్లు
* రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా అసంతృప్తి
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 25: దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మెదక్, సిద్దిపేట ప్రాంతాల వాసులకు రైల్వే శాఖ కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. వ్యాపార, వాణిజ్య పరంగా ఎదుగుతున్న సిద్దిపేట ప్రజల చిరకాల వాంచ అయిన మనోహరాబాద్, సిద్దిపేట, కొత్తపల్లి రైలు మార్గానికి రైల్వే బోర్డు విధించిన షరతులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా పనులు ప్రారంభించడానికి అవసరమైన నిధులను కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 20 కోట్ల రూపాయలతో అధికారులు భూ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించగా రైలు మార్గాన్ని నిర్మించడానికి అవసరమైన సర్వేలు సైతం పూర్తయ్యాయి. కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించగా, అక్కన్నపేట, మెదక్ రైలు మార్గానికి కేవలం 10 కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మమా అనిపించారు. నిజామాబాద్ జిల్లా బోదన్ నుంచి నారాయణఖేడ్ మీదుగా కర్నాటకలోని జిల్లా కేంద్రమైన బీదర్ వరకు 138 కిలోమీటర్ల రైలు మార్గాన్ని పూర్తిగా విస్మరించారు. సికింద్రాబాద్ మీదుగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, సదాశివపేటల మీదుగా జహీరాబాద్ వరకు 64 కిలోమీటర్ల రైలు మార్గం మంజూరైనా నిధుల ఊసేలేకపోవడం శోచనీయం. లింగంపల్లి, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, సిద్దిపేటల మీదుగా పెద్దపల్లి వరకు కొత్తగా రైలు మార్గాన్ని నిర్మించాలన్న డిమాండ్‌కు బడ్జెట్‌లో కనీస ప్రస్తావన కూడా లేకపోవడంతో ఈ డిమాండ్ మరోమారు మరుగునపడింది. రామచంద్రాపూర్ మండలం వట్టినాగులపల్లి వద్ద రైలు బోగిల తయారు ప్లాంటు సంగతిని కనీసం ప్రస్తావనకు కూడా తీసుకురాలేకపోయారు. ఈ విషయమై అధికార టిఆర్‌ఎస్ పార్టీలతో పాటుగా టిడిపి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలన్ని ఎన్డియే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసాయి. త్వరలోనే మెదక్ జిల్లా మూడు ముక్కలుగా విడిపోనుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విస్తరించనుండగా మూడు జిల్లా కేంద్రాల్లో కూడా రైల్వే స్టేషన్ లేకపోవడం శోచనీయమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం కేటాయించిన నిధులతో ఎక్కడి నుంచి పనులు ప్రారంభించాలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెబితే శంఖుస్థాపన పనులకు ఆయనే్న తీసుకువస్తామని పలువురు నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాగా మరోమారు ప్రవేశపెట్టే సప్లిమెంటరి బడ్జెట్‌లోనైనా మరిన్ని నిధులు కేటాయించి మెదక్ జిల్లా ప్రజలకు కనీస గుర్తింపును ఇవ్వాలని అన్ని వర్గాల వారు డిమాండ్ చేస్తున్నారు. నిరాశజనకమైన బడ్జెట్ వస్తుందని ఊహించలేదని పలువురు ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ప్రజలను నిరాశపర్చిన రైల్వే బడ్జెట్
* సప్లిమెంటరీ బడ్జెట్‌లోనైనా నిధుల కేటాయింపు పెంచాలి * మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 25: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు ప్రవేశ పెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్ మెదక్ జిల్లా ప్రజలను నిరాశపర్చిందని, బడ్జెట్‌లో కేటాయించిన నిధుల తీరు నిరాశాజనకమని మాజీ ఎమ్మెల్సీ, టిఆర్‌ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్.సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కన్నపేట -మెదక్ రైల్వేలైన్‌కు కేవలం రూ.5కోట్లు, కొత్తపల్లి - మనోహరాబాద్ లైన్‌కు రూ.20కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. ఇంత తక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ పోతే ఈ రైల్వేలైన్ పూర్తిచేసేందుకు ఎనే్నళ్లు పడుతుందో రైల్వే మంత్రి వివరణ ఇవ్వాలన్నారు. నూతనంగా బోధన్ నుండి నారాయణఖేడ్ మీదుగా బీదర్‌కు 138 కిలో మీటర్లు, సికింద్రాబాద్ నుండి సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు 64కిలో మీటర్ల రైలు మార్గం మంజూరు చేసినప్పటికి నిధులు మాత్రం కేటాయించలేదన్నారు.
లింగంపల్లి నుంటి సంగారెడ్డి, జోగిపేట, మెదక్, సిద్ధిపేట మీదుగా పెద్దపల్లి వరకు కొత్తలైన్ నిర్మించాలన్న జిల్లా ప్రజల చిరకాల డిమాండ్‌కు బడ్జెట్‌లో ప్రస్తావన రాకపోవడం విచారకరమన్నారు.
త్వరలో ప్రవేశపెట్టనున్న సప్లిమెంటరీ బడ్జెట్‌లోనైనా జిల్లాకు చెందిన ప్రతిపాదిత లైన్‌లకు ప్రాధాన్యం ఇచ్చి నిధుల కేటాయింపును పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుండాలి
ములుగు, ఫిబ్రవరి 25 : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని రంగాలలో ముందుండాలని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు.
గురువారం మర్కుక్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లయన్స్ క్లబ్‌ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన సూర్యరాజు పాఠశాలను దత్తత తీసుకొని లక్షల రూపాయలను వెచ్చించి విద్యార్ధులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించిన స్ఫూర్తిదాత అని ప్రశంసించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్యార్ధినీవిద్యార్ధులు ఈ పాఠశాలను జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతకుముందు పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించి చెట్లు నాటారు. ఈ పాఠశాలకు గడా నిదుల నుండి ల్యాబ్, లైబ్రరీకి డబ్బులను మంజూరీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా విద్యార్దులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గడా అధికారి హన్మంతరావు, తహశీల్దార్ శకుంతలారెడ్డి, ఎంపిడిఒ దిలీప్‌కుమార్, ఎంఇఒ వెంకటేశంగౌడ్, సర్పంచ్ నిర్సింలు, ఎంపిటిసి గీతారాంరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 25: విద్యారంగ సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ టిపిఇఆర్‌ఎం ఆధ్వర్యంలో ఈ నెల 28న సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని టిఎస్‌యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సాయిలు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.రవిలు పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డిలో సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యారంగ పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతుందన్నారు. పునాదిగా నిలవాల్సిన పాఠశాల విద్య ప్రభుత్వ పాఠశాలల్లో నానాటికి వనె్న తగ్గుతుంటే ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాపారం పెరుగుతుందన్నారు. ఈ పరిణామాలు పరిశీలించి పరిష్కార మార్గాలు చేపట్టి అందరికి సమానంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే జిల్లా సదస్సుకు ముఖ్య అతిధులుగా ప్రముఖ సామాజికవేత్త, ప్రోఫెసర్ కంచె ఐలయ్య, టిపిఇఆర్‌ఎం రాష్ట్ర వైస్ చైర్మన్ మురళీమోహన్, కార్యదర్శి మాణిక్‌రెడ్డి, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.

కరుణించని సురేష్ ప్రభు
* అరకొరగా 20 కోట్లు కేటాయింపు
* మనోహరాబాద్-సిద్దిపేట రైలు కూత పాత పాటే
సిద్దిపేట, ఫిబ్రవరి 25 : మనోహరబాద్- సిద్దిపేట- కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుకు ఈబడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురుచూసిన సిద్దిపేట వాసులకు మళ్లీ నిరాశే మిగిలింది. 151 మనోహరబాద్ నుండి సిద్దిపేట- కొత్తపల్లి వరకు 151 కి.మీ సుమారు వెయ్యి కోట్ల రూపాయలు వరకు అంచనా వేస్తే మొక్కుబడిగా కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. సిద్దిపేట ప్రజలకు చిరకాల వాంచయైన రైల్వే మార్గం కలగానే మిగిలిపోయే పరిస్థితులున్నాయి. ఈ రైల్వే మార్గం కోసం రాష్ట్రం ప్రభుత్వం భూ సేకరణ నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం అరకొరగా కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించటం వల్ల రైలు కూత పెట్టెందుకు మరికొంత కాలం వేచియుండక తప్పదు. ఈ దఫా బడ్జెట్‌లో సిఎం కెసిఆర్ కలల ప్రాజెక్టు అయిన మనోహరబాద్- సిద్దిపేట- కొత్త పల్లి రైలు మార్గానికి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వత్తిడీ తెచ్చిన నామ మాత్రంగా నిధులు కేటాయించటం పట్ల సిద్దిపేట ప్రాంతం తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2004 యుపిఏ హయాంలో ప్రస్తుత సిఎం, అప్పటి కేంద్ర మంత్రి కెసిఆర్ మనోహరబాద్- సిద్దిపేట- కొత్తపల్లి రైలు మార్గాన్ని 360 కోట్లతో ప్రతిపాధించి మంజూరు చేయించారు. ఈ రైలు మార్గం మంజూరై పుష్కర కాలం గడిచిన నిధులు మాత్రం అరకొరగానే విడుదల చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష గురైన తెలంగాణ ప్రాంతం, సొంత రాష్ట్రంలోనైన తెలంగాణకు అధికంగా నిధులు కేటాయింపులు జరుగుతాయని భావించినప్పటికి అరకొరగా నిధులు మంజూరు కావటంపై ఈప్రాంత ప్రజల తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మనోహర్‌బాద్- సిద్దిపేటకు వెయ్యికోట్లతో అంచనా వేస్తే మొక్కుబడిగా కేంద్రం కేటాయించిన 20 కోట్లు ఏ మూలకు సరిపోతయాని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికి గురువారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్‌పై ఏన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి బడ్జెట్ చూసాక ఈప్రాంత ప్రజల ఆశలు ఆడియాసాలు అయినాయని చెప్పక తప్పదు. మనోహరబాద్- సిద్దిపేట రైలు కూత వినేందుకు సిద్దిపేట ప్రాంత ప్రజలు మరి కొంతకాలం వేచియుండక తప్పదు.

నీటి కష్టాలు తీర్చేందుకే మిషన్ భగీరథ, కాకతీయ
అంచనాల కమిటీ రాష్ట్ర చైర్మన్ రామలింగారెడ్డి
తొగుట, ఫిబ్రవరి 25: తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో సాగు, త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మండలంలోని 2.38 కోట్లతో మంజూరైన లక్ష్మాపూర్-జప్తి లింగారెడ్డిపల్లి ఫీడర్ చానెల్ సిసిలైన్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో సాగు, తాగునీటి సమస్యలు నెలకొన్నాయని, వాటిని అధిగమించి ప్రజలకు సమస్యలు తలెత్తకుండా మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూడవెళ్లి వాగుపై నిర్మిస్తున్న ఫీడర్ చానెల్ వల్ల తొగుట, మిరుదొడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడం జరగుతుందన్నారు. ప్రజాహితం కాంక్షించి అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా టిఆర్‌ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడం గొప్ప విషయమన్నారు. మిషన్ భగీరథ పనులు రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతున్నాయని, ఆ పనులకు పార్టీలకు అతీతంగా అందరు సహకరించాలని కోరారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు.
మృతుల కుటుంబాల పరామర్శ
మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి, కాన్గల్ గ్రామానికి చెందిన ఆత్మహత్య చేసుకున్న రైతు శాతని నర్సింలు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి 5వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
ఈకార్యక్రమాల్లో ఎంపిపి గంట రేణుక, జడ్‌పిటిసి రూపా, ఎంపిడిఓ రాజిరెడ్డి, తహశీల్దార్ రాణాప్రతాప్‌సింగ్, మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు మల్లారెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ మల్లేశం, ఎంపిపి ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, సర్పంచ్‌లు పిట్ల శ్రీనివాస్, రాములు, అక్కం స్వామి, కవిత కొంరయ్య, సంతోష, నేతలు లక్ష్మారెడ్డి,శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రవిందర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

9 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు
* మైనారిటీ సంక్షేమ శాఖ ఇడి అహ్మదలీ
గజ్వేల్, ఫిబ్రవరి 25: మెదక్ జిల్లాకు 9 మైనారిటీ బాలుర, బాలిక రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరైనట్లు మైనారిటీ సంక్షేమ శాఖ ఎగ్జుక్యూటూవ్ డైరెక్టర్ అహ్మదలీ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లాకు 9మైనారిటీ గురుకుల పాఠశాలలు మంజూరవగా అందులో గజ్వేల్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రతి పాఠశాల భవన నిర్మాణానికి రూ.20కోట్లు వెచ్చిస్తుండగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలు సమకూర్చన్నుట్లు తెలిపారు. కాగా రెండు సంవత్సరాల వ్యవధిలో పక్కా భవనాలు ఏర్పాటు చేయనుండగా అప్పటి వరకు ప్రైవేటు భవనంలో గురుకుల పాఠశాలలు కొనసాగిస్తామన్నారు. 500మంది మైనారిటీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తుండగా ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో గజ్వేల్ మున్సిపల్ కౌన్సిలర్లు వసీంఖాన్, జకియొద్దీన్, నేతలు ఎక్భాల్, మైనారిటీ సంక్షేమ శాఖ మేనేజర్ ఎజాజ్ అహ్మద్‌లు పాల్గొన్నారు.

ఉద్యమాలతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం
దౌల్తాబాద్, ఫిబ్రవరి 25 : ఉత్యమాల ద్వారానే ఉపాద్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని టిటిఎఫ్ దౌల్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు పర్వతం నర్సయ్య పేర్కొన్నారు. గురువారం తెలంగాణా ఉపాద్యాయసంఘాల పోరాటసమితి ఆద్వర్యంలో చలో హైదరాబాద్ మహా దర్నా పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాద్యాయ సమస్యల సాదన కోసం ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహా దర్నాను ఉపాద్యాయులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు దర్నా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిటిఎఫ్, టిడిటిఎఫ్, టిటిటిఎఫ్, టిఎస్‌టియు, టిడబ్ల్యుటిఎఫ్, టిడబ్ల్యుటియు, టిటిఎ, ఎటిఎ తదితర సంఘీల నాయకులు సత్తయ్య, నర్సమ్మ, బాలకృష్ణయ్య, వినోద, కనకయ్య, కనకరాజు, శ్రీనివాస్, నాగరాజు, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.