తెలంగాణ

మంచినీటికి తండ్లాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 22: తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాలు ఎండిపోగా, భూగర్భ జలమట్టం సైతం వందల అడుగులకు పడిపోవడంతో పట్టణాలు, పల్లెలు, గిరిజన తండాల్లో తాగునీటి కోసం మహిళలు ప్రతినిత్యం పానిపట్టు యుద్ధాలకు దిగుతున్నారు. అధికార యంత్రాంగం సమకూర్చుతున్న అరకొర ట్యాంకర్ల వద్ద గొడవలకు దిగుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 145 గిరిజన తండాలు ఉండగా ఒక్కటంటే ఒక్క చేతిపంపు లేకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. ఎడారి ప్రాంతంగా ముద్రపడిన ఖేడ్ నియోజకవర్గంలో భూగర్భ జలమట్టం పూర్తిగా అడుగంటిపోయింది. సక్రునాయక్ తండాకు ఒకే ఒక్క బోరు ఉండగా ఆ బోరు నీటిని మొత్తం తండా ప్రజలు, పశువులకు ఉపయోగించుకుంటున్నారు. నీటి కటకట, పశుగ్రాసం కొరత కారణంగా తక్కువ ధరలకు విక్రయించుకుంటున్నారు. పశువుల పెంపకం ద్వారా లబ్ధిపొందుతున్న వారంతా గొర్రెలు, మేకలు, ఎడ్లు, గేదెలు, ఆవులను తీసుకుని నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. కరస్‌గుత్తి ఎస్సీ కాలనీలో ఒక్క చేతి పంపుకూడా లేకపోగా ఉన్న రెండు చేదబావులపైనే ఆధారపడ్డారు. నెల రోజుల్లో బావుల్లో నీరు ఎండిపోతుందని అప్పుడు తమకు దిక్కేదని దళిత కాలనీ వాసులు దీనంగా ప్రశ్నించుకుంటున్నారు. మనూర్ మండలం ఇరక్‌పల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యామతండాలో సుమారు 60 కుటుంబాలు ఉండగా ఒక్క చేతి పంపుకూడా లేదు. ట్యాంకర్లు వెళ్లడానికి రోడ్డు కూడా అనుకూలంగా లేకపోవడంతో గిరిజన ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నారు. ప్రత్యామ్నాయంగా తనకున్న వ్యవసాయ బోరు నుంచి కిలోమీటరున్నర పైపులైన్ వేసి ట్యాంకులోకి నీటిని నింపుతూ తండా ప్రజల పాలిట రైతు కీరానాయక్ రంతిదేవుడుగా అవతరించాడు. ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడంతో కిలోమీటర్‌కుపైగా సర్వీసువైరును ఏర్పాటు చేసి గిరిపుత్రుల దాహార్తిని తీర్చుతున్నాడు. మోహన్ నాయక్ తండాలో వేసిన బోరు ఎండిపోవడంతో ట్యాంకర్లే శరణ్యంగా మారాయి. కంగ్టి మండలం మున్నితండా, బీబాతండా, శంకర్ తండాల్లో కూడా ఇదే దుస్థితి నెలకొంది. రాత్రి, పగలు అనే తేడాలేకుండా చేతిపంపుల వద్ద పడిగాపులు కాస్తున్నామని తండాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా కలిసిమెలిసి జీవించే తాము నీటి కోసం కొట్లాడుకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. రూప్లానాయకణ తండాలో 60 కుటుంబాలు ఉండగ ఒక్క చేతిపంపు కూడా లేదు. బోర్గి గ్రామంలో కూడా పరిస్థితి మరీ దయనీయంగా నెలకొంది. ఏ గిరిజన తండాకు వెళ్లి ఎవరిని తట్టినా మంత్రి హరీష్‌రావుపైనే కోటి ఆశలు పెట్టుకున్నామని చెప్పడం విశేషం. తమ తండాకు కనీసం రోజుకు ఒక ట్యాంకర్‌ను పంపించినా కొంత ఊరటనిస్తుందని చిన్నిబాయి కోరుతోంది. తండాల పరిస్థితి ఒక ఎతె్తైతే పట్టణాల్లో దుస్థితి మరీ తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో నాలుగైదు రోజులకు ఒకసారి నల్లానీటిని వదులుతున్నారు. ఆ నీరు కూడా సరిపడా రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. జహీరాబాద్, సదాశివపేట, మెదక్ మున్సిపాలిటీల పరిస్థితి కూడా ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. సిద్దిపేట, గజ్వేల్‌లో నీటి సరఫరా కొంత మెరుగ్గా ఉన్నా జోగిపేట, దుబ్బాక నగర పంచాయతీల్లో ప్రజలు నీటి కష్టాలను నిత్యం ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎండల తీవ్రత అధికం కావడంతో జలం కోసం జనం భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.