మెదక్

టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 2: షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల్లోని పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించాలని, సాధించని సంక్షేమ వసతి గృహా అధికారులపై చర్యలు తప్పవని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు ఎంవి రెడ్డి హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ నుండి ఎస్సీ కార్పోరేషన్ డిడి, ఇడిలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండ ఎ-వన్ గ్రేడ్ సాధించేలా సంక్షేమాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్షిక పరీక్షలకు 3నెలల సమయం ఉన్నందున ట్యూటర్ల ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పదవ తరగతి విద్యార్థి భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని, అనంతరం పాలిటెక్నిక్, స్కిల్ డెవలప్‌మెంట్ పై వెళ్లే విధంగా అవగాహాన కల్పించాలన్నారు. గత యేడాది 0 ఫలితాలు సాధించిన వసతి గృహ సంక్షేమాధికారులపై చార్జేస్ ఫ్రేం చేశామని, ఈ యేడాది అలాంటి ఫలితాలు వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ కొనుగోలు పథకం పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ జిల్లాలో 720 మంది విద్యార్థులు వివిధ సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ట్యూటర్లను నియమించామని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పోరేషన్ ఇడి చరణ్‌దాస్, డిఎస్‌డబ్ల్యుఓ రామారావు, ఎస్‌డబ్ల్యుఓ, వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

‘త్వరితగతిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు’
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 2: జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఈ నెల చివరి నాటికి సమర్పించాలని నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్‌కె జోషి కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లా కలెక్టర్ వ్యక్తిగత బాధ్యత తీసుకొని ప్రాజెక్టుల నిర్మాణాల ప్రతిపాదనలు సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారిగా ప్రతిపాదనలను క్రోడికరించి రాష్ట్ర ప్రతిపాదనలు జనవరి 2వ వారంలో కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. జివో 123 ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ జరగాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత ఎజెన్సీల ద్వారా ప్రాజెక్టుల డిజెన్స్‌ను తయారు చేసి సమర్పించాలన్నారు.
మిషన్ కాకతీయ కింద మొదటి విడతగా చేపట్టిన పనులను మార్చి 2016నాటికి పూర్తి చేయాలన్నారు. చెరువుల పునఃరుద్దరణ పనులను ప్రజల భాగస్వామ్యంతోనే చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ వివరిస్తూ ఎజెన్సీల ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రణాళికలు సిద్ధం చేసి పంపనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో అవగాహాన సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జివో 123 కింద 154 ఎకరాల భూమిని సేకరించామని, మిగితా భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రాజెక్టుల డిజైన్‌లను పూర్తి చేసి అందజేస్తామన్నారు. మొదటి విడత కాకతీయ మిషన్‌లో 1869 చెరువుల పునఃరుద్దరణ పనులను పూర్తి చేస్తామని, రెండవ విడత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుండి నీటి పారుదల శాఖ ఇఎంసి మురళీధర్, విజయ్‌ప్రకాష్, నాగేందర్, జిల్లా నుండి ట్రైని అసిస్టేంట్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఇరిగేషన్ ఎస్‌ఈ సురేంద్ర, వ్యవసాయ శాఖ జెడి హుక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఐటి మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 2: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యునికేషన్ శాఖకు సంబంధించి జిల్లా మేనేజర్ పోస్టులు రెండు భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎదైన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఎన్‌ఐఇఎల్‌టి కంప్యూటర్స్‌లో ట్రిపుల్-సి స్థాయి సామర్ధ్యం కలిగి ఉండాలని, ఈ నెల 1 నాటికి 24నుండి 35 యేళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలని, కనీసం రెండు సంవత్సరాల అనుభవాన్ని ఐటి, ఈ-గవర్నమెంట్, ఐటి సంబంధిత ప్రాజెక్టులో పని చేయడం, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్ట్ఫికేట్లతో ఈ నెల 5లోపు సమీకృత కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 08455-276921 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

రూ.138 కోట్లతో గోదాముల నిర్మాణం
మార్కెటింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరత్
మెదక్, డిసెంబర్ 2: జిల్లాలోని 46 మండలాల్లో గోదాముల నిర్మాణం కోసం రూ.138 కోట్లు మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ,రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. బుధవారం మెదక్ మార్కెట్ కమిటీలో జరుగుతున్న నల్లబెల్లం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం 6 వేల క్వింటళ్లు మాత్రమే బెల్లం ఖరీదు చేయాలని డెడ్‌లైన్ ప్రకటించినప్పటికినీ అంతకు మించి నల్లబెల్లం వస్తే ప్రతిపాదిస్తే తాను మంజూరు చేస్తానని డాక్టర్ శరత్ తెలిపారు. 8 సంవత్సరాల తరువాత నల్లబెల్లం కొనుగోలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒక వెయ్యి 23 కోట్ల మెట్రిక్ టన్నుల గోదాములను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లాలో అత్యధిక గోధములను నిర్మించబోతున్నట్లు డాక్టర్ శరత్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మెంచు నగేష్, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జడ్పీటిసి లావణ్యరెడ్డి, మార్కెట్ యార్డు ఎడి, మెదక్ జిల్లా మార్క్‌ఫెడ్ జిల్లా ఇన్‌చార్జి మేనేజర్ రమేశ్, మెదక్ ఎఓ రెబల్‌సన్, తహశీల్దార్ విజయలక్ష్మీ, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపై
విజయం సంతృప్తినిచ్చింది
*ఏ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటను మల్చుకుంటేనే రాణిస్తారు * పట్టుదల, క్రమశిక్షణతోనే క్రికెటర్‌గా ఎదుగుతారు
* గ్రామీణ క్రీడాకారులకు సానపెడితే ఆశాకిరణాలు అవుతారు * భారత మాజీ క్రికెటర్, కోచ్ అబిద్ ఆలీ
సిద్దిపేట, డిసెంబర్ 2: విదేశీ పర్యటనలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై సాధించిన విజయాలు తనకెంతో సంతృప్తినిచ్చాయని భారత మాజీ క్రికెటర్, కోచ్ అబిద్ ఆలీ వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో బుధవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. 1967 నుంచి 76 వరకు 29 టెస్టులు, 5 వనే్డమ్యాచ్‌లు, 1975 తొలి వరల్డ్‌కప్‌లో తాను ఆడినట్లు తెలిపారు. క్రికెటర్‌గా తనకు జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. భారతజట్టులో ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందినట్లు పేర్కొన్నారు. తాను పటౌడి నాయకత్వంలో టెస్టుమ్యాచ్ ఆడినట్లు తెలిపారు. తాను టెస్టుల్లో న్యూజిలాండ్ మీద చేసిన 89 పరుగులు జట్టు విజయానికి ఎంతో దోహదం చేసిందని సంతృప్తి నిచ్చిందన్నారు. తాము ఆడిన క్రికెట్‌కు, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. తాము సీనియర్లు ఆడుతుంటే చూసి ఎంతో నేర్చుకున్నామని, సరైన గైడెన్స్ ఇచ్చేవారు కూడా లేరన్నారు. భారతజట్టు విదేశీ పర్యటకు వెళ్లినా క్రికెట్‌కు సంబంధంలేని వారు, నాన్‌ప్లేయింగ్ వారు మేనేజర్లుగా వచ్చేవారన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిజియోథెరపి ఎంతోమంది గైడెన్స్, సలహాలు, సూచనలతోపాటు ఆటలోని మెళకువలు నేర్పుతున్నారన్నారు. ఐపిఎల్ పుణ్యమా అని క్రికెట్ కోట్లాది రూపాయలకు పడగెత్తిందన్నారు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో మ్యాచ్ ఫీజు సైతం తక్కువగా ఉండేదని, ఇప్పుడు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారన్నారు. క్రికెట్ క్రీడకు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉందని, చాలా దేశాలు క్రికెట్ ఆడుతున్నాయన్నారు. తాను టెస్టు నుంచి రిటైర్మెంట్ ఇచ్చాక 1979లో ఇంగ్లాడ్‌లో కోచింగ్ సర్ట్ఫికెట్ పొంది కోచర్‌గా అవతారమెత్తానన్నారు. తాను కోచ్‌గా యుఎఇకి ఐదు సంవత్సరాలు, అమెరికాలో ఏడాది, మాల్దీవులకు ఏడాది, ఆంధ్రా జట్టుకు మూడేళ్లు కోచ్‌గా వ్యవహరించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరిస్తున్నానన్నారు. ప్రస్తుత క్రికెటర్లు పట్టుదల, క్రమశిక్షణ, నైపుణ్యం, ఫిట్‌నెస్ కలిగి ఉంటేనే రాణిస్తారన్నారు. టెస్టు, వన్‌డే, ట్వంటి 20 ఫార్మాట్లలో సైతం క్రికెటర్లు ఏ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటతీరును మలుచుకోవాలన్నారు. క్రికెటర్ మెంటల్‌గా ఫిట్‌గా ఉంటేనే ఆటకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరన్నారు. ప్రస్తుత క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. టెస్టుల్లో సైతం 5 రోజుల నుంచి 4 రోజులకు మార్చేందుకు చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ గ్రామీణ ఫ్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారన్నారు. వారి నైపుణ్యానికి సానపెడితే భవిష్యత్‌లో భారతజట్టుకు ఆశాకిరణాలు అవుతారన్నారు. క్రికెట్‌లో బెట్టింగ్, అవినీతి పనులకు క్రికెటర్లు దూరంగా ఉండాలని సూచించారు.

మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి
సదాశివపేట, డిసెంబర్ 2: వ్యాపార కోణంలో కాకుండా మానవతా దృక్పతంతో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలువాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు. బుధవారం పట్టణంలో నూతనంగా నిర్మించిన విజయా మల్టి స్పెషాలిటి ఆసుపత్రిని మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించని రోజుల్లో చెట్లతో తయారు చేసే ఔషదాలను అందించి ఆయా రుగ్మతలను నిర్మూలించే వారని, అలాంటి సమయంలో ప్రజలు వైద్యుడిని వైద్యో నారాయణ హరి అంటూ దేవుడితో సమానంగా భావించే వారన్నారు. పెట్టుబడులు పెట్టి నిర్మిస్తున్న వైద్యశాలల్లో ప్రజల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని, అలాంటి దృక్పతాన్ని విడనాడి సాధారణ రుసుముతో మేలైన వైద్యం అందించాలన్నారు. సదాశివపేట లాంటి పట్టణాలకు పల్లె సీమల నుంచి నిరుపేద ప్రజలు వస్తుంటారని వారికి మంచి సేవలు అందించి గుర్తింపు పొందాలన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణానికి చుట్టుప్రక్కల ఉన్న వంద గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారని,వ్యాపార పరంగా పట్టణం విస్తరించిందని, కార్పోరేట్ ఆసుపత్రులు లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఇలాంటి నేపథ్యంలో విజయా మల్టిస్పెషాలిటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో ప్రజలకు సత్వర వైద్య సేవలు అందనున్నాయని సంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్నం విజయలక్ష్ని, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తగొల్ల కృష్ణ, కౌన్సిలర్లు చింతా గోపాల్, కుద్దూస్, డాక్టర్లు భరత్‌గౌడ్, కల్యాణ్ చక్రవర్తి, భావన, సీనియర్ సివిల్ కాంట్రాక్టర్ పిల్లిగుండ్ల నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

* డ్రైవరుతో సహా ఎనిమిది మందికి గాయాలు
పటన్‌చెరు, డిసెంబర్ 2: బస్టాండు నుండి బయటికి వస్తున్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన సంఘటన పటన్‌చెరు పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరుతో సహా ఎనమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయ. పట్టణంలోని ఆసుపత్రికి తరలించి గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు అందించిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సు ఎపి 29 జెడ్ 1504 నంబరు గలది బుధవారం ఉదయం స్థానిక బస్‌స్టేషన్‌కు చేరకుంది. నారాయణఖేడ్ నుండి హైద్రాబాద్ వెళుతున్న బస్సు పటన్‌చెరులో ప్రయాణికులను ఎక్కించుకున్న తరువాత తిరిగి రాజధాని వెళ్లడానికి బస్టాండు ఔట్‌గేట్ నుండి బయటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన హైద్రాబాద్ నుండి సంగారెడ్డి వైపు వెలుతున్న కెఎ 56 0795 నంబరు గల లారీ అతివేగంగా వచ్చి బస్సు మధ్య భాగంలో కుడివైపు డీ కొట్టింది. దీనితో బస్సు కొద్ది దూరం వరకు వెనక్కి వెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్రమైన కుదుపుకు గురయ్యారు. బస్సులోని దాదాపు ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయ. జోగిపేట పట్టణానికి చెందిన చిన్నారి దేవీ ప్రియ (5), ఆమె సోదరుడు హర్షిద్ (8) గాయాల పాలయ్యారు. వీరితో పాటు అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సమ్మ (45), శ్రీనివాస్ (43), అక్షయ్ (13), విట్టమ్మ(34) తదితరులు గాయపడ్డారు. బస్సు డ్రైవరు రాజనర్సయ్య (49)కు తీవ్రమైన గాయాలు కాగా కండక్టర్ రాములు తలకు గాయమైంది. ప్రస్తుతం వీరందరూ పట్టణంలోని అంజయ్య స్మారక వందపడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పటన్‌చెరు సిఐ లింగేశ్వర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు.

క్రీడాకారులు ఆటపై ప్రత్యేక దృష్టి సారించాలి
* సమష్టి కృషితోనే విజయాలు దక్కుతాయి * భారత మాజీ క్రికెటర్ అబీద్‌అలీ
సిద్దిపేట, డిసెంబర్ 2 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని, గెలుపు, ఓటములను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్, కోచ్ అబీద్ అలీ అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట మినీస్టేడియంలో బుధవారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు ఆటపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్రీడాకారులు జట్టుగా, సమష్టిగా కృషిచేస్తేనే విజయాలు దరిచేరుతాయన్నారు. క్రీడలు స్నేహపూర్వకమైన వాతావరణంలో జరగాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషిచేస్తుండడం అభినందనీయమన్నారు. ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ షాబోద్దీన్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలను ఎప్పుడు మొక్కుబడిగా ఆడవద్దని, వందశాతం మనస్సును లగ్నం చేసి ఆడాలన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిస్తేనే రాష్ట స్థాయి పోటీలకు ఎంపికకు మార్గం సుగమం అవుతుందన్నారు. క్రీడల్లో ప్రతిభ వున్న వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు మంచి ఫిట్‌నెస్‌తో వుంటారని, వారి నైపుణ్యాన్ని వెలికితీస్తే భవిష్యత్తులో మంచి క్రీడకారులుగా ఎదుగుతారన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలాంటి క్రీడాకారులను వెలికితీయడమే టిసిఎస్ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను పదునుపెట్టేందుకు టిసిఎస్ పక్షాన పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చక్కని ప్రతిభ కనబర్చిన క్రీడారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో టిసిఎస్ పక్షాన పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లా జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.