మీ వ్యూస్

కంగనా ది గ్రేట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ని వివాదాస్పద వ్యక్తి అని చెబుతుంటారు. అది తప్పు. ఎవరేమనుకున్నా నేను నిజమే చెప్తాను. దాన్ని మీడియా వివాదాస్పదం చేస్తుంది అంటుందామె. మీరు మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారట అని సూటిగా అడిగిన విలేఖరికి సూటిగానే చెప్పింది. నేను పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నాకు గైడెన్స్ లేకపోయింది. సినిమా ఛాన్సులకోసం స్టూడియోల చుట్టూ తిరిగేటప్పుడు కొన్నిసార్లు మద్యం, డ్రగ్స్ తీసుకున్నా. వాటివల్ల ఆనందం కలిగేది కాదు. ఎప్పుడూ టెన్షన్‌గానే ఉండేది. వాటికి పూర్తిగా దూరం అయ్యాక ప్రశాంతంగా ఉంది అందామె. సినీ రంగంలో వాటికి బానిసైనవాళ్లు చాలామంది వున్నా కంగనా లాగ నిజం చెప్పేవాళ్లు మాత్రం లేరు. కంగనా ది గ్రేట్!

- భాస్కర్, అశోక్‌నగర్

అది గొప్పదనం!

దశాబ్దాల క్రితం ముడి ఫిలిం కరువువల్ల ఒక్కో చిత్రానికి 11వేల అడుగుల ఫిలిం మాత్రమే వాడాలన్న నింబంధన వచ్చింది. హిందీ సినిమాలకది సరిపోతుంది కాని దక్షిణాది చిత్రాలు పెద్దవి. ఎక్కువ ఫిలిం కావాలి అని అడగడానికి భారత చిత్ర నిర్మాతల సంఘాధ్యక్షుడు బి.నాగిరెడ్డి ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్ర్తీని కలిశారు. ఉత్తరాది వారు ఒప్పుకున్నారు. మీకేమిటి సమస్య అని అడిగారాయన. ‘సార్, మీరు కట్టుకున్న పంచె ఎన్ని గజాలు?’అని అడిగారు రెడ్డి. ఆరు గజాలని చెప్పారు శాస్ర్తీ. మరి దక్షిణాదివారు నాలుగు గజాల పంచె వాడుతారు. మీరుకూడా నాలుగు గజాలే వాడాలంటే కుదురుతుందా? అని రెడ్డి అడిగారు. శాస్ర్తీ నవ్వుకొని దక్షిణాది వారికి ఎక్కువ ఫిలిం కేటాయించారు.! అది శాస్ర్తీగారి గొప్పదనం!

- సత్య, కరప

దటీజ్.. ప్రకాష్‌రాజ్!

కన్నడ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ని దుండగులు హత్యచేసినప్పుడు మోదీ స్పందించలేదని ప్రకాశ్‌రాజ్ దుమ్మెత్తిపోశాడు. ఆమె మరణం తననెంతో బాధించిందని చెప్పుకున్నాడు. మరి రంజాన్ పవిత్ర మాసంలో కశ్మీర్‌లో ఉపవాసం పాటించి రాత్రి ఇఫ్తార్ ముగించుకున్న ‘రైజింగ్ కశ్మీర్’ పత్రిక సంపాదకుడు షుజత్ బుఖారీని ఉగ్రవాదులు హత్యచేస్తే ప్రకాశ్‌రాజ్‌కి ఇసుమంత బాధకూడా కలగలేదు. రాజకీయ నేతల్ని మించిపోయి గౌరీ లంకేశ్ హత్య గురించి ఎన్నో సమావేశాల్లో విమర్శించిన ఆయన గొంతు ఈసారి మూగపోయింది! రాజకీయ నేతలు అంతే. వారికి కొందరి హత్య ఖేదం, మరి కొందరి హత్య మోదం! దటీజ్.. ప్రకాష్‌రాజ్!

- గిరిధర్, కాకినాడ

బహిష్కరించారు

దక్షిణాది నాలుగు భాషల్లోని చిత్రాల ప్రముఖులకు అవార్డులిచ్చే ఒక సంస్థ వేడుకలు ఈమధ్య హైదరాబాద్‌లో జరిగాయి. అయితే పెద్దస్టార్లు చాలామంది రాకపోవడంతో వేడుక వెలతెలాపోయింది. దీనికి కారణం విశాల్! అతడు తమిళ నటీనట సంఘానికి అధ్యక్షుడు. ఆ సంఘానికొచ్చే విరాళాలను వృద్ధ నటీనటులకు నిజాయితీగా పంచుతాడు. అవార్డ్స్ వేడుక సందర్భంగా ఆ సంస్థను తన సంఘానికి విరాళం ఇమ్మని కోరితే ఆ సంస్థ నిరాకరించిందట. అందుకని అవార్డు తీసుకోవలసిన నయనతారతో సహా చాలామంది స్టార్స్ ఆ వేడుకని బహిష్కరించారు.

- మైథిలి, సర్పవరం

ప్లాపుల ఊబిలో హీరోలు

‘్ఫ్లపుల ఊబిలో హీరోలు’ వ్యాసం సముచితంగా వుంది. మొగమాటానికి పోకుండా తనకు తగిన పాత్ర ఉంటేనే అక్కినేని నటించే వాడని చెప్పారు. కానీ ఆయన అంచనాలుకూడా బెడిసికొట్టిన సందర్భాలున్నాయి. ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంలో విగ్గు, మేకప్ లేకుండా నటిస్తే అభిమానులు ఒప్పుకోరంటూ ఆయన సంశయించినప్పుడు దర్శకుడు ఒప్పించాడు. ఆ చిత్రంలో అక్కినేనికి మంచి పేరొచ్చింది. ఆయనకు నాగయ్య పాత్రలన్నీ చేయాలని కోరిక. కాని బీదలపాట్లు, మహాకవి క్షేత్రయ్య చిత్రాలు ఫ్లాప్‌అయ్యాయి. అలాగే ఆయన పోషించిన వాల్మీకి, కబీర్ పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి.
- హితీక్ష, రమణయ్యపేట

మహానటికి మరణం లేదు

మహానటి సావిత్రి నటన మరుపురాని, మరలిపోని నటనాచాతుర్యం ఆమెది. చిత్ర పరిశ్రమలో ఓ వెలుగువెలిగిన ధృవతార సావిత్రి. అత్యున్నత శిఖరాలను చూసిన ఆ ‘మహానటి’ జీవితం సినిమాకథకు మూలం అమూల్యం అయ్యింది అంటే, దానికి కారణం నాగఅశ్విన్ దర్శకత్వం. సృష్టికి, ప్రతిసృష్టిచేసిన ఈ మహానటికి మరణంలేదు. ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పుడు బ్రతికేఉంటారు. నాటి తరానికి, నేటి తరానికి ప్రేక్షకులను మెప్పించిన విధంగా మలిచిన నాగఅశ్విన్‌కు మా కృతజ్ఞతలు. సావిత్రిగా టైటిల్ పాత్రను పోషించిన కీర్తిసురేశ్ ఒక్కసారిగా కీర్తిశిఖరాలకు ఎదిగిపోయింది. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అతిరథులు, మహారథులు పోషించిన పాత్రలు, ఎవరికివారే వారి పాత్రలకు జీవం పోశారు. మహానటి చిత్రాన్ని వర్ణించడానికి మాటలు లేవు. మాటలు చాలవు. ఇటువంటి ఓ మహానటి జీవితాన్ని, నేటి తరానికి అందించిన నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్‌కు అభినందలు తెలుపుకుంటూ, ఇంకా మంచి మంచి చిత్రాలు తీయాలని మా అభిలాష.

- బి.నాగరాజు, చోడవరం, విశాఖ జిల్లా

ఆదర్శం కాబోలు!

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంఫల్, అతని భార్య మోడల్ మెహర్ జెస్సియా తమ 20 ఏళ్ల సంసార బంధం తెంచుకున్నారు. కారణం ఏమిటో స్పష్టంగా చెప్పకపోయినా అనివార్య కారణాలవల్ల విడిపోతున్నాం అన్నాడు అర్జున్. ఆర్థిక కారణాలు కావచ్చు. ఇద్దరికీ బాలీవుడ్‌లో చిత్రాలు లేవు. అయితే మేము విడిపోయినా స్నేహంగానే ఉంటాం. పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాం అన్నాడు. ఇదో కొత్తట్రెండ్ కాబోలు. గతంలో హృతిక్‌రోషన్ భార్యకు భారీగా మనోవర్తి ఇచ్చి భార్యనుంచి విడిపోయాడు. అయినా ఆమె ఇంటికి తరుచుగావెళ్తూ పిల్లలతో కాలక్షేపం చేసి వస్తూంటాడు. అర్జున్‌కి హృతిక్ ఆదర్శం కాబోలు!

- సాహిత్యదీప్తి, రమణయ్యపేట