మీ వ్యూస్

చెత్త సినిమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత రెండు నెలల్లో థియేటర్లకు వచ్చిన ఒక్క సినిమానూ గొప్ప చిత్రంగా చెప్పుకోడానికి లేదు. చిన్న చిత్రాలకు సరైన స్లాట్ దొరికినా -ఆడియన్స్‌ని రంజిప చేయగలిగే సనిమా ఒక్కటీ రాలేదు. నువ్వుతోపురా.. గీతా ఛలో.. అభినేత్రి-2.. ఏబీసీడీ.. ఎవ్వడూ తక్కువ కాదు.. సీత.. ఇలా వచ్చిన సినిమాల్లో ఇది బావుందని చెప్పడానికి ఒక్కటీ లేకపోవడం బాధాకరం. వైవిధ్యమైన సినిమా అంటూ చెబుతున్న మాటలేవీ విడుదల తరువాత ఉండటం లేదన్నది ఎవ్వరూ కాదని లేని వాస్తం.
-సోమంచి ఆరతి, భీమవరం
కథనం బావుంది
‘సతీసుకన్య’ (19-5-19 వెనె్నల) విశేషాలు బాగున్నాయి. అయతే చిన్న పొరపాటు దొర్లింది. ‘నేడే హాయి’ అన్న యుగళ గీతం ఘంటసాల, లీల పాడారు. ఘంటసాల, సుశీల కాదు. ‘టాలీవుడ్ ఎండ్‌గేమ్’ వ్యాసం అద్భుతంగా వుంది. ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్‌గేమ్ వసూళ్లను దూసేస్తోంటే, మనం మాత్రం రికార్డుల లెక్కలు చెప్పుకోవడం తప్ప వాస్తవాలను మాట్లాడుకోడానికి అంగీకరించం. అన్ని వసూళ్లు రాబట్టినా హాలీవుడ్ నుంచి ఎలాంటి హడావుడీ కనిపించలేదు. ఏదో, ఇద్దరు ముగ్గరు ప్రొడక్షన్ వాళ్ల ప్రశంసల స్టేట్‌మెంట్లు తప్ప. అలాగని బీభత్సమైన సక్సెస్‌మీట్‌లూ నిర్వహించలేదు. -మనం మాత్రం దీనికి భిన్నం. దెబ్బతిన్న చిత్రాలకూ సక్సెస్‌మీట్‌లు మనమే నిర్వహించుకుంటాం.. అంటూ రచయత వేసిన సెటైర్ చాలా బావుంది. మంచి వ్యాసాన్ని అందించిన రచయితకు అభినందనలు.
-గిరీశుడు, వక్కలంక
సామాజిక స్ఫూర్తి..
సామాజిక స్ఫూర్తితో రైతుల కష్టాలు కడగండ్లు చూపించి వారి అభ్యున్నతికి పాటుపడే వ్యక్తిగా మహేష్‌నటించిన మహర్షిని ఆదర్శంగా చెప్పవచ్చు. ఒక్క ఊరిని దత్తత తీసుకుని దాన్ని బాగుచేసి సామాజిక స్ఫూర్తిని నింపిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఫ్యాక్షనిస్టు కక్షలకు స్వస్తిపలికి కలిసిమెలిసి జీవించాలని చెప్పిన ‘మిర్చి’వంటివి. విదేశీ మోజులో తల్లిదండ్రులను విస్మరిస్తున్నారని వారి విలువలు గురించి చెప్పిన ‘శతమానం భవతి’, పిల్లల స్వతంత్ర భావాలకు తల్లిదండ్రులు ఏవిధంగా అడ్డుపడుతున్నారో, తల్లిదండ్రులు పిల్లలపై వారి భావాలను ఏ విధంగా రుద్దుతున్నారనేది చక్కగా చూపించిన ‘బొమ్మరిల్లు’, చిన్ననాటి ప్రేమ అనుబంధాలు తదనంతరం వాటి విలువల గురించి చాటిచెప్పిన ‘నా ఆటోగ్రాఫ్ మెమొరిస్’ (రవితేజ).. ఇలాంటి చిత్రాలు అప్పుడప్పుడూ వస్తాయ. జయాపజయాల మాటెలావున్నా -ఆయా చిత్రాలు మాత్రం తరువాతి కాలాలకు మంచి సందేశాన్ని అట్టేపెడతాయ.
-ఏ రఘురామారావు, ఖమ్మం
పోలికలెందుకు?
నిజానికి శోభన్‌ని మించినవాడు మురళీమోహన్ అంటూ రచయత ఇమంది రామారావు తన అభిప్రాయం చెప్పారు. కాని సామాన్య ప్రేక్షకులకు మాత్రం మురళి రాజకీయాల్లో చేరి పొరపాటు చేశాడనిపిస్తుంది. ఆయన పార్లమెంటులో పెద్దగా మాట్లాడింది లేదు. ఒకసారి మహిళలు పద్ధతిగా ఉండాలనటంతో మహిళా ఎంపీలు అతనిపై విరుచుకుపడటంతో ఆయన పార్లమెంటులో మాట్లాడటం మానేశాడు. రాజమండ్రిని ఆయనెంత ఉద్ధరించారో ప్రజలే చెప్పాలి. చంద్రబాబుతో కలిసి మోదీని తనవంతుగా తిట్టి చివరకు ఎన్నికల్లో పాల్గొనలేదు కాని తన కోడల్ని రాజమండ్రిలో నిలిపారు.
-పవన్‌పుత్ర, రామారావుపేట
కమర్షియల్ ఆదర్శాలు
టాలీవుడ్ ఎండ్‌గేమ్ సరైన సమయంలో వచ్చిన సరైన విశే్లషణ అని చెప్పాలి. మనవాళ్లు ఏవో ఆదర్శాలువల్లిస్తూ కథ అల్లుకుంటారు. కాని ఆ ఆదర్శాలవైపు నడిపించే సన్నివేశాలు బలంగా ఎంపిక చేసుకొని హృదయాలకు హత్తుకునేట్లుచేసే దమ్ము ఈనాటి దర్శకులకు లేదనే చెప్పాలి. క్లైమాక్స్ వైపు ఏదోవిధంగా లాక్కుపోవటంతో ఆ ఆదర్శాలు మనస్సులోకి ఎక్కవు. ఠాగూర్ చిత్రం వచ్చిన కొత్తలో చిరంజీవి అభిమానులు అవినీతి నిరోధక సంఘాలను హడావుడిగా ప్రారంభించేశారు. ఒక నెల తిరిగేసరికి సంఘాలు మాయమయ్యాయి. అలాగే దత్తత, వీకెండ్ వ్యవసాయం మూలపడ్డాయి. ఆదర్శాలు వల్లించటంవల్ల ప్రయోజనం ఏమిటి?
-హితీక్ష, రమణయ్యపేట
అంత ఈజీ కాదు
మీ వ్యూస్‌లో పాపగారి వ్యూని సమర్ధిస్తున్నాను. వీకెండ్ వ్యవసాయం కానె్సప్ట్ పైకి బాగున్నట్టు కనిపించినా లోతుగా ఆలోచిస్తే ఆచరణ సాధ్యంకాదు. వ్యవసాయం అనేది 24తి7 కార్యక్రమం. ప్రతిరోజు ప్రతిక్షణం పొలంవెళ్లి మొక్కలు ఎదుగుదల క్రమం పరీక్షిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలి. వీకెండ్స్‌లో సినిమాకు వెళ్లినట్టు పొలానికివెళ్లి వ్యవసాయం చేయటం కుదరదు. అమెరికాలో ఉద్యోగాలు మానేసి ఎందరో మన దేశం వచ్చేసి వ్యవసాయంలో దిగుతున్నారు. కాని ఉద్యోగాలు, వ్యవసాయం రెండూ చేయటం కుదరదు. వీళ్లుకూడా పూలు, పళ్లుమీద చూపే శ్రద్ధ వరిమీద చూపటం లేదు. ఇది మర్చిపోకూడదు.
-జిహెచ్ సునీల్, పిఠాపురం
రాళ్లపల్లికి నివాళి
వెర్సటైల్ ఆర్టిస్ట్ రాళ్లపల్లి మరణం సినిమా పరిశ్రమకు తీరనిలోటే. నాటకం బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చిన గొప్ప ఆర్టిస్టు ఆయన. ఒకసారి రాళ్లపల్లి ఒక్క పాత్ర పోషిస్తే, ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టం. అంత ప్రాణం పోస్తారు పాత్రకు అన్నది ఎవ్వరూ కాదనలేని విషయం. అటు విలన్‌గా, ఇటు కమెడియన్‌గా, భావోద్వేగాలను పండించగలిగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విప్లవకారుడిగా, కుట్రలు కుతంత్రాల రాజకీయ నేతగా.. ఒక్కటేమిటి ఏ పాత్రయినా రాళ్లపల్లికి దాసోహం అనాల్సిందే. ఆయన వాచకం, వ్యవహారం, ఆహార్యం, అభివ్యక్తీకరణ, టైమింగ్.. ఏ కోణంలో చూసినా నిండైన నటుడు రాళ్లపల్లి. ఇదిగో మా దగ్గర ఇంత గొప్ప ఆర్టిస్టులున్నారు అని టాలీవుడ్ సగర్వంగా చెప్పుకోగలిగే ఆర్టిస్టులంతా క్రమంగా కనుమరుగవుతున్నారు. ఇది విచారించదగ్గ విషయం. రాళ్లపల్లికి నా నివాళి.
-పల్లె బాబూరావు, కొత్తవలస