మీ వ్యూస్

సహజత్వానికి దగ్గరగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా బయోపిక్‌లు ప్రజాదరణ పొందిన వ్యక్తులపై తీస్తారు. కానీ చాలామందికి తెలీని అతి సామాన్య వ్యక్తిపై బయోపిక్ తీసి ‘వహ్వా’ అనిపించారు. అదే -చేనేతన్న చింతకింది మల్లేశం కథ. సినిమాగా వచ్చిన శ్రమజీవి మల్లేశం కథలో సహజత్వం ఉట్టిపడింది. నేతన్నలు వృత్తిలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించటంలో దర్శకుడు రాజ్ ఆర్ ప్రతిభ కనిపించింది. గ్రామీణ నేపథ్యంలో తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించుకొని సహజ సన్నివేశాలతో తీసిన సినిమా రక్తికట్టింది. ఆసు యంత్రం చుట్టూ కథను తిప్పుతూనే, మల్లేశం ప్రపంచాన్ని పరిచయం చేశారు.
-జి అశోక్, జగిత్యాల
ఆదుకుంటున్న హక్కులు
విధం చెడినా ఫలితం దక్కిందంటూ సంతోషపడిపోతున్నారు -దర్శక నిర్మాతలు. విషయమేంటంటే తెలుగులో అనేక ‘చిత్రాలు’ -చించుకున్నా ముందుకెళ్లలేకపోతుంటే.. హిందీవోళ్లు మాత్రం డబ్బింగ్ హక్కుల్ని డబ్బులెదజల్లి మరీ పట్టుకెళ్తున్నారట. అంటే -తెలుగులో సినిమా ఫ్లాపైనా.. డబ్బింగ్ రైట్స్‌తో ఒడ్డుకు చేరుతున్నారని. తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘సీత’ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు 12 కోట్లకు అమ్ముడుపోయాయట. ఇక ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న అల్లు శిరీష్ సినిమా ఎబిసిడీ హిందీ రైట్స్‌తో భారీగానే తెచ్చిపెట్టిందట. ‘హక్కుల రేటు’ మాటలు నిజమైతే కనుక -అంతా సంతోషించాలి మరి.
-్ధర్మతేజ, గొడారిగుంట
నేత బావుంది..
చింతకింది మల్లేశం కథను పట్టుచీర నేసినంత అద్భుతంగా నేశాడు -దర్శకుడు రాజ్ ఆర్. ఆసు యంత్రాన్ని కనిపెట్టి నేతన్నల పని సులువు చేసినా, ఆర్థికంగా ఎదగలేకపోయిన పరిస్థితిని సినిమాలో చూపించిన విధానం బావుంది. మల్లేశం పాత్రకు ప్రియదర్శి పూర్తిగా ప్రాణం పోస్తే, తల్లి లక్ష్మి పాత్రలో ఝాన్సీ, మల్లేశం భార్య పద్మగా అనన్య అద్భుతమైన నటననే చూపించారు. ‘నాకు నువ్వని నీకు నేనని’ అన్న పాట భార్యభర్తల బంధాన్ని అతి సున్నితంగా చెప్పినట్టు చూపించడం మరీ బావుంది. మంచి సినిమా కాదు, బతుకు చిత్రాన్ని నేతన్నలు ప్రతీ ఒక్కరూ చూడాలి.
-కె అమన్‌రాజీవ్, బోడుప్పల్
క్రాక్ గేమ్
తాప్సీ ‘గేమ్ ఓవర్’ ప్రచారంలో హిట్టుతప్ప, సినిమాపరంగా కాదు. ఒక సినిమా బలవంతంగా వారం నడిస్తే గొప్పా. అస్పష్టమైన కథా కథనాలతో క్లారిటీలేని సినిమాను చూడాల్సి రావడంతో ప్రేక్షకుల అసహనం పరాకాష్టకు చేరింది. సినిమాలో తాప్సీ, పనిమనిషి కల్లమ్మే పాత్రలు. ఓ కాఫీక్లబ్‌లో తాప్సీని చూచి గుసగుసలాడే మరో ఇద్దరు, మానసిక వైద్యుడు, టాటూ డిజైనర్.. అర్ధంకాని సూచనల డైలాగులు. అసలు సినిమాలో ఏం అట్రాక్షన్, థ్రిల్లింగ్ ఉందని? థ్రిల్లర్ అని చెప్పుకోడానికి వినిపించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తప్ప మరేం లేదు. దర్శకుడు అశ్విన్ శరవణన్ తీసిన అర్థంకాని కథ, కథనం -ఆడియన్స్‌కు పిచ్చెక్కేలా చేసింది. వినోదం కోసం వచ్చిన ఆడియన్స్‌కి కథ అర్థమైతే కదా, సినిమా ఎంజాయ్ చేసేది. ఇదొక్కటే కాదు, ఇటీవల వచ్చిన చాలా చిత్రాలు హిట్టు అని ప్రకటించుకుని ‘ఇగో’ని శాటిస్‌ఫై చేసుకోవడం తప్ప, సినిమా నిర్వచనానికి ఏమాత్రం సరితూగని సినిమాలే ఆడియన్స్ ముందుకొస్తున్నాయి అనిపిస్తోంది. అలాంటివాటిలో ‘గేమ్‌ఓవర్’ ఒకటి.
-పి లక్ష్మీసుజాత, అద్దంకి
భలే కీలుగుర్రం
గతవారం వెనె్నల కవర్ కథనంగా ఇచ్చిన ‘కాలాతీత కీలుగుర్రం’ రంజింపచేసింది. 70ఏళ్ల క్రితంనాటి ఓ గొప్ప చిత్రాన్ని గుర్తు చేస్తూనే -తెరవెనుక ముచ్చట్లను చెప్పిన విధానం ముచ్చటగొలిపింది. కొత్త అనుభవం కంటే -పాత జ్ఞాపకం మిన్న.. అంటూ రచయిత కథనాన్ని మొదలుపెట్టడంలోనే ఓ చమక్కు చూపించాడు. ఆసక్తికరమైన కథనాన్ని ఆనందదాయకంగా అందించిన రచయితకు అభినందనలు. ఇక చివరి పేజీలో -వెనె్నల అతిథులు చెప్తొన్న ముచ్చట్లు చక్కగా ఉంటున్నాయి. రచయిత సరయు శేఖర్ -అనాటి నటీనటుల జీవితపు దొంతర్లనుంచి ముఖ్యమైన జ్ఞాపకాలను బయటకు తీసి అందించటం అభినందనీయం. ఇలాంటి మరిన్ని కథనాలు, సినిమా సంగతులు పాఠకులకు మరింతగా అందిస్తారని ఆశిస్తూ..
-బిహెచ్ రమణారావు, తుని
ఏం సినిమాల్రా బాబూ
ఏ తెలుగు సినిమా చూసినా ఏమున్నది వినోదం.. ప్రతి సినిమాలోనూ ఒకటే బాగోతం -అనిపిస్తోంది ఇప్పటి చిత్రాలను చూస్తుంటే. ప్రతివారం నాలుగైదు చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నా -గుర్తుపెట్టుకోదగ్గ చిత్రం ఒక్కటీ ఉండటం లేదు. సినిమా హిట్టు, ఫ్లాపు అన్న సమీక్షకుల గోల కాసేపు పక్కనపెడితే -ఆడియన్స్ నిజాయితీగా ఎంజాయ్ చేయగల సినిమా ఈ ఏడాది మొత్తం పట్టుమని నాలుగైదు కూడా కనిపించవు. అప్పుడెప్పుడో ఏడాది ఆరంభంలో ఎఫ్-2, ఆ తరువాత మజిలీ, ఆపై జెర్సీ, ఈవారం మల్లేశం.. ఇలా వేళ్లపై లెక్కపెట్టతగ్గ చిత్రాలే తప్ప -ఔను ఇన్ని సినిమాలు బావున్నాయని చెప్పడానికే కష్టంగా ఉంది. ఇక్కడ చిత్రమేమంటే -విడుదలకు ముందు అన్ని లుక్కులు, అన్ని టీజర్లు, ట్రైలర్లూ మిలియన్ వ్యూస్‌లు దాటేస్తున్నాయి. సినిమా మాత్రం -బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లాపడుతుంది. సినిమాని కూడా మిలియన్ ఆడియన్స్ చూడాలంటే -ఫ్రీగా చూపించాలేమో.
-కెబి హారతి, సికింద్రాబాద్
వసూళ్ల గోలే
మహర్షి సినిమాలో దమ్ములేదంటూ వచ్చిన విమర్శనాత్మక లేఖాంశంతో ఏకీభవిస్తున్నా. నాగలి, ఎద్దుల వెనక నిలబడిన ప్రతివాడూ రైతు కాలేడు. ఎద్దుల వెనుక నాగలి పట్టుకు నిలబడిన మహేష్, చాక్లెట్ బోయ్‌లాగే అనిపించాడు తప్ప రైతు ఛాయ లేనే లేదు. సినిమాతో సందేశం ఇవ్వాలనుకుంటే -దాని లోతుపాతుల అవగాహనకు తగ్గట్టు పాత్ర స్వరూప స్వభావాలు ఉండాలి. మహర్షిలో అదే మిస్సైంది. వసూళ్ల పొగడ్తలు వినసొంపుగానే ఉన్నాయిగానీ, నష్టపోయాం బాబో అంటున్న కొన్ని ప్రాంతాల బయ్యర్ల గగ్గోలు బయటకు పొక్కడం లేదు.
-గిరిధర్, కాకినాడ