మీ వ్యూస్

‘మంచు’కొచ్చును.. జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణుకు కాలం కలిసిరావడం లేదు. ‘అదృష్టాన్ని’ టైటిల్‌కు తగిలించుకున్నా -సినిమా మాత్రం డిజాస్టర్‌గానే మిగిలింది. ‘లక్కున్నోడు’ సినిమా కథను ఎలా ఎంపిక చేసుకున్నాడన్న అనుమానం కలుగుతుంది. హీరోగా విష్ణు తన స్టామినా నిరూపించుకున్నవాడే. గతంలో హిట్టు చిత్రాలతో మెప్పించాడు. కానీ, ఇప్పుడొచ్చే సినిమాలన్నీ ‘్ఫట్’మంటున్నాయంటే -లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. తోటి హీరోలంతా మంచి కథలతో సినిమాలు చేస్తుంటే -అర్థంపర్థంలేని కథలతో ఆడియన్స్‌ని మెప్పించాలనుకోవడం విష్ణు చేస్తున్న పొరబాటు. ‘్ఢ’, ‘రెఢీ’లాంటి తన మార్క్ కథలను ఎంపిక చేసుకోకుంటే -కెరీర్ ముందుకెళ్లడం కష్టమే అనిపిస్తుంది.
-రాజ్యలక్ష్మి, పెనుగొండ.

ఏది పరిశోధన?
ఇటీవల వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణిని అందరూ ఎత్తేస్తున్నారు తప్ప, చరిత్రను వక్రీకరించారన్న విషయాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం. బయట ఒకటి చెప్పి -చిత్రంలో మాత్రం శాతకర్ణిని యుద్ధకాంక్ష కలిగిన చక్రవర్తిగా చూపించటం దారుణం. శాతకర్ణి బ్రహ్మాణ చక్రవర్తి. హిందూ మతవ్యాప్తికి ఎనలేకి కృషి చేశాడు. అనేక దేవాలయాలు పునరుద్ధరించాడు. లలిత కళలకు, విద్యాంసులకు గొప్ప ప్రోత్సాహం కల్పించాడు. ఇవన్నీ మామూలు చరిత్రలో దొరికేవే. అయితే, శాతకర్ణిపై గొప్ప పరిశోధనలు చేసిన బృందం ఈ విషయాలను లేశమాత్రం ప్రస్తావించకుండా -సినిమా మొత్తాన్ని నాలుగు యుద్ధాలకు పరిమితం చేయడాన్ని ఏమనుకోవాలి?
సి ప్రతాప్, శ్రీకాకుళం

బాలల చిత్రాలేవీ?
తెలుగు ఇండస్ట్రీలో బాలల చిత్రాలే కరవయ్యాయి. నీతిని, సందేశాన్ని అందించే కథలను సమకూర్చుని బాలలనే పాత్రధారులుగా చేసి సినిమాలు తీసే ప్రయత్నాలు ఎందుకు జరగడం లేదు. సినిమా అనగానే కేవలం హీరో హీరోయిన్ల డ్యూయెట్లు, ఫైట్లేనన్న మూసలోంచి బయటకు ఎందుకు రాలేకపోతున్నాం. హాలీవుడ్, బాలీవుడ్‌లో అప్పుడప్పుడైనా -సాహస కథలతోనూ, నైతిక విలువలు పెంచేవిధంగానో సినిమాలు చేస్తున్నారు. మన తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం పిల్లలు ప్రేక్షకులే కాదన్నట్టు, ఒకవేళ చూడాలనుకుంటే హీరోల సినిమాలే చూడాలన్నట్టు రుద్దడం దారుణం. వరుసగా సినిమాలు తీస్తున్న బ్యానర్లలోనైనా... ఇన్ని సినిమాల తరువాత కనీసం ఒక పిల్లల చిత్రం చేయాలన్న చట్టం తెస్తే బావుండునేమో.
ఎస్ శ్రీనివాస రాజు, వనస్థలిపురం

భలే ముచ్చట్లు
ఫ్లాష్‌బ్యాక్ కథనాలు బావుంటున్నాయి. అప్పటి విషయాలు ఇప్పటి తరానికి తెలియజేస్తూ, ఒకప్పటి గొప్ప చిత్రాలు, వాటిలోని కథా పాముఖ్యతను వివరిస్తూ తక్షణం చూసితీరాలన్న ఆతృత కలిగించేలా రచయిత మాణిక్యేశ్వరి అందిస్తున్న కథనాలకు ధన్యవాదాలు. గతవారం ‘వందేమాతరం’ చిత్రరాజం వివరాలు అందిస్తూ, తెరవెనుక సెన్సారుకు సంబంధించి విషయాల్లాంటికి కొన్ని ప్రత్యేకంగా వివరించటం బావుంది. వందేమాతరం చిత్రం ఏ ఏడాదిలో విడుదలైనదో కూడా తెలియజేసి ఉంటే మరింత బావుండేది. వెనె్నల ద్వారా పాత సంగతులు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్న సంపాదకులు, రచయితకు అభినందనలు.
-సుదర్శన్ ఎం, భువనగిరి

గ్యాస్ కబుర్లు....
కేవలం తెలుగు సినిమాల్లోనే కనిపిస్తున్న ఒక తరహా ధోరణి -సినిమాలోని కామెడీ సన్నివేశాల కంటే ఎక్కువ నవ్వు పుట్టిస్తున్నాయి. ఓపెనింగులు, ఆడియో ఫంక్షన్లలోనో, షూటింగ్ సమయంలో పెట్టే ప్రెస్‌మీట్లలోనో, విడుదలకు ముందు నిర్వహించే ప్రమోషన్ కార్యక్రమాలు, సక్సెస్ మీట్లలో తరచూ వినిపించే కొన్ని ‘శృతిమించే పొగడ్తలు’ కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ‘ఖైదీ.. 150 ప్రారంభం నుంచి సినిమా పూర్తయ్యే వరకూ అన్నయ్య (చిరు) అన్నమే ముట్టలేదు’ అంటాడు దర్శకుడు వినాయక్. ‘నాకు డబ్బు ముఖ్యం కాదు. అభిమానుల మనసు గెలుచుకోవడం ముఖ్యం’ అంటుంది ముక్కుపిండి పారితోషికం వసూలు చేసే హన్సిక. ‘్ఫలానా చిత్రంలో నటించడం నా అదృష్టం. నిర్మాత, దర్శకుడు నాపై కొండంత నమ్మకం పెట్టుకోవడం గ్రేట్’ అంటాడు మరో బుల్లి హీరో. ఈ కబుర్లన్నీ ఉత్త గ్యాస్ అని వాళ్లకూ తెలుసు. కానీ ఏం చేస్తారు.. -సినిమా మీద వ్యాపారం చేయాలంటే ఆ మాత్రం మాటలు తప్పదు కదా.
జ్ఞానబుద్ధ, తూ.గో. జిల్లా

ఏ తరహా విమర్శ?
రెండు వారాల క్రితం ‘మీవ్యూస్’ శీర్షికలో కథకుడు విజయేంద్ర ప్రసాద్‌ను విమర్శిస్తూ ప్రసన్న, పేర్రాజుపేట నుంచి ఉత్తరం రాశారు. నాకు తెలిసినంత వరకూ ‘బొబ్బిలిసింహం’, ‘సమరసింహారెడ్డి’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కథలు అందించారు ఆయన. ‘బజరంగీ భాయిజాన్’ కథను పసివాడి ప్రాణం కథకు కాపీ అని కూడా రాశారు ఉత్తరంలో. అసలు ‘పసివాడి ప్రాణం’ చిత్రం హిందీలో వచ్చిన ‘ఆఖ్రీ కత్’ చిత్రాన్ని పోలి ఉంటుందన్న విషయం తెలుసా. ఎదుటి తెలుగు వ్యక్తి ప్రతిభను గుర్తించకున్నా ఫరవాలేదుకానీ, తెలుగువాళ్లే తెలుగు వాళ్లను విమర్శించుకోవడం అవసరమంటారా? అలాంటి ఉత్తరాల్లో అసూయ కనిపించటం లేదూ?
హేమంత్‌కుమార్, యమ్మిగనూరు

అపహాస్యపు సీన్లు
రైలు సన్నివేశాలను ఉదాత్తంగా తీసిన సినిమాలు లేవనలేం. అంతమాత్రం చేత రైలు సన్నివేశాలున్న సినిమాలన్నీ హిట్టు అనడం సబబుకాదు. కొనే్నళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాను ఉదహరించుకుందాం. స్లీపర్ కొచ్‌లో అందరూ నిద్రిస్తున్నపుడు హీరో బృందం తప్పతాగి పాటలుపాడి అల్లరి చేస్తూ నిద్రపోతున్న హాస్యనటుడిని లేపి పాటలు పాడమని వేధిస్తాడు. దర్శకుని దృష్టిలో అది హాస్యం. పైగా బాగా నచ్చిన సీన్ అంటూ అప్పట్లో స్టేట్‌మెంట్లు. ప్రయాణికులకు నిద్రాభంగం కలిగించడం తగదని ఆ దర్శకునికి తెలియదు. రైలు సిబ్బందిని అవమానించటం ఆ దర్శకుడి దృష్టిలో గొప్ప హాస్యం. వెతికితీస్తే -ఇలాంటి సన్నివేశాలున్న సినిమాలు చాలానే మన దృష్టికి వస్తాయి. ఇలాంటి అపహాస్యాలు ఎన్నో కనిపిస్తాయి. నిజానికి ఓ కథనమే రాయొచ్చు.
సి మైథిలి, సర్పవరం