మీ వ్యూస్

ఈ మణికి ఏమైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించగల దర్శక దిట్ట మణిరత్నం. ఆ నమ్మకంతోనే థియేటర్లకు పరిగెత్తిన వాళ్లకు నిరాశ మిగిలింది. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేమ కథలను పండించటంలో ఓ స్టయిల్ వున్న దర్శకుడు మణిరత్నం నుంచి చెలియా వస్తుందని ఆశపడిన ప్రేక్షకులకు ఆయన నిరాశ మిగిల్చారు. మణిరత్నం సినిమాల్లో అత్యంత ఫ్లాప్ చిత్రం ఇదే అనుకోవాలి, అలావుంది సినిమా. పోస్టర్ నుంచి సినిమా వరకూ అన్నింటా ప్రత్యేకత చూపించే మణిరత్నం, చెలియాను చెత్తగా డీల్ చేశారనిపించింది. వరుస ఫ్లాప్‌లు ఎదురైనా ‘ఓకే బంగారం’తో ట్రాక్‌మీదకు వచ్చేశాడనుకున్న మణిరత్నం చెలియాతో మళ్లీ వెనక్కి వెళ్లిపోయనట్టే. ఏదేమైనా చెలియా మణిరత్నం సినిమా కాదనిపించింది.
-రఘునందన్, అల్లవరం
అనువాదం పెనుభూతమే
‘అనువాదం పెనుభూతమా’ వ్యాసం చదివాక కలిగిన ఆలోచన- పక్కింటావిడ ఇచ్చిన సాంబారు రుచి చూసిన ఇల్లాలు తమ వాళ్లందరికీ అలాంటిదే చేయాలని అనుకుందట. మామగారికిష్టమని మునగకాడ ముక్కలు వేసింది. భర్తకు ఇష్టమని కారెట్లు, అత్త్తగారికోసం చిన్న బెల్లంముక్క, కూతురుకిష్టమని ఒకింత ఇంగువ చేర్చి ఉడకపెట్టింది. మంచి వాసన వస్తోంది, అంతా మెచ్చుకుంటారనుకుంటూ వడ్డించింది. సాంబారు కాస్తా కషాయం అయింది! పరాయి కథను నేటివిటీకి అనుగుణంగా మారిస్తే అంతేమరి. అలాగని అన్నింటినీ అలా చూడలేం. ఆమధ్య వచ్చిన ఊపిరి, మొన్నీమధ్యే వచ్చిన గురు చిత్రాలా అనువాదమే. కానీ, బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు సంపాదించాయ. అంత మాత్రం చేత, పరాయ భాషలో హిట్టయన చిత్రాలనే సినిమాలు చేసేద్దామనుకుంటే పైన చెప్పిన సాంబార్ అవ్వడం ఖాయం.
-చంపక్, మాధవనగర్
అదే బాధాకరం
ఈమధ్య వచ్చిన చిత్రాల్లో ‘శతమానం భవతి’కి మంచి పేరొచ్చింది. చిన్న సినిమాగా వచ్చి కాసుల వర్షం కురిపించింది. ఈమధ్యే చానెల్‌లోనూ ప్రసారమైంది. క్రిస్ప్ డైలాగులతో, సున్నితమైన కామెడీతో, నేత్రపర్వమైన పచ్చని పొలాల గ్రామీణ వాతావరణంలో తీసిన చిత్రంగా ఆకట్టుకుంది. కాకపోతే, చిత్రంలో అసలు వాళ్లకు రావాల్సిన పేరు, హీరో హీరోయన్లకు రావడమే బాధాకరం. అనుపమా పరమేశ్వరన్‌ని అందరూ పొగుడుతున్నారు కానీ చిత్రంలో నిరాశపర్చింది. కొన్ని సీనుల్లో ప్రతిస్పందన లేకుండా అలా నిలబడిపోయింది. శర్వానంద్‌కి కోనసీమ యాస కుదరలేదు. సహజ నటన ప్రదర్శించిన జయసుధ, ప్రకాశ్‌రాజ్, నరేష్‌లకు ఆ స్థాయ పేరు ఇవ్వడపోవడం బాధాకరం.
-రుద్ర, భీమవరం
చిత్రాల చిత్రపటం
పర్చా శరత్‌కుమార్ రాసిన సమీక్ష-63 అపురూప చిత్రాల దిక్సూచి చాలా సంగతులను సెలవిచ్చింది. చిత్ర సమీక్షలన్నీ చక్కని చిత్తరువుల్లా చదువుతున్నంతసేపు మనో చిత్తంపై అలనాటి మధుర చిత్రాలను వీక్షిస్తున్నట్టే వుండేది. చిత్రాల నిర్మాణంలో దర్శక నిర్మాతలు, నటీనటుల మనోభావాలు కూడా విశదంగా వివరించడం వల్ల కూడా కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకున్నాం. వంద చిత్రాలు పూర్తి చేసిన తరువాత పుస్తక రూపం దాలిస్తే బాగుండేది. ఏమైనా మాణిక్యేశ్వరి సమీక్షలన్నీ మాణిక్యాల్లా, ముత్యాల హారాల్లా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. ఈతరం వచ్చే అడ్డదిడమైన సినిమాల వలయంలోంచి బయటపడితే ముందు తరాలవారు తప్పకుండా కీర్తి గడించిన అజరామర చిత్రాలవైపు దృష్టి మళ్లుతుందనడంలో అనుమానం లేదు.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
ఆ ప్రయోగాలు కష్టమే
వెనె్నల్లో ‘ఏది ప్రయోగం?’లో చెప్పినవన్నీ వాస్తవాలే. నిజమే ప్రయోగాలు చేస్తున్నామనే హీరోలు చేసేవన్నీ కమర్షియల్ మాటల ప్రయోగాలే! దీనికితోడు పత్రికలు, టీవీ చానల్స్, మీడియా అంతా ప్రయోగాలు చేస్తున్నారని ఎక్కడలేని ఉచిత ప్రచారాలు చేస్తున్నాయి. ఆరోజుల్లోనే ఎన్టీఆర్ శభాష్‌రాముడులో అనాకారిగా, రిక్షావానిగా చేయడం, భీష్మ చిత్రంలో వృద్ధ భీష్మ పాత్ర, బడిపంతులులో రిటైర్డ్ టీచర్ పాత్ర ప్రయోగాలే. కమలహాసన్ చేసిన స్వాతిముత్యంలోని అమాయక పాత్ర, భామనే సత్యభామనేలో వృద్ధ ఆడపాత్ర, విచిత్ర సోదరులులో మరగుజ్జు పాత్రల కంటే ఇప్పుడు హీరోలు చేస్తున్నవి గొప్ప ప్రయోగాలా? అలాంటి పాత్రలు చేసే దమ్ము, గట్స్ ఇప్పటి హీరోలకు లేనేలేవు. ఒక్క సినిమా కోసం నానా హైరానా పడేవారు ఏం ప్రయోగాలు చేస్తారు. చేస్తే పిచ్చి, వెర్రి అభిమానులు చేయనిస్తారా? ఎప్పటికి అయ్యేది?
-పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
అంత సమర్ధవంతులేరీ!
నేడు పౌరాణిక జానపద చిత్రాలు చూసే నాథుడెవరు? అనే అపోహ పోయింది కానీ ఆ పాత్రల నిర్వహణ ఖలేజా ఎవరికుంది? అన్న ఆలోచన కొంతమందిలో మెదులుతుంది. ఆనాడు నాటక రంగంలో బహుముఖ ప్రజ్ఞులు పీసపాటి షణ్ముఖ, అద్దంకి సూరిబాబు, రఘురామయ్య మొదలగు వారు రాణించి నాటక మహాప్రస్థానం విలువ తెలియపరిచారు. కానీ ఇప్పుడు ఆ సంగీత లయ శ్రుతి వాచక అర్ధగుణములు ప్రాధాన్యత తెలిసినవారు బహుతక్కువ! సమర్ధత లేక విమర్శ చేయడం సంస్కారం కాదు కదా! ఆనాటి మేటి నటరత్నాలను ఆద్రవం కళా వైభవం కోసం ఏర్పాటు చేసారు. ఇప్పుడు అంతా కుక్కమూతి పిందెలు ఏర్పడ్డాక ఆ పాత్రలను పోషించు కళాత్మక రూపు రేఖలు ఉన్నాయా?
-కెవి ప్రసాదరావు, కందుకూరు
ప్రోగ్రామే ఫట్టు
తొమ్మిదేళ్ల విరామం తరువాత చిరు నటించిన చిత్రం సూపర్ హిట్. అయతే, అదంతా ఆయన స్టామినా అనుకుంటే పొరబాటే. చిరుకి అంత స్టామినా ఉండివుంటే, టీవీలో ఆయన తొలి కార్యక్రమం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కూడా సూపర్ హిట్టవ్వాలిగా. కానీ, ఆ ప్రోగ్రాం ఫ్లాప్ అయింది. ఒక ఎపిసోడ్‌కి 30 లక్షలు ఖర్చుతో నిర్మిస్తున్న కార్యక్రమంనుంచి తగిన రాబడిలేదని స్పాన్సర్సే వాపోతున్నారట. నాగ్ నిర్వహణలో తాజాదనం, కొత్తదనం ఉండేవి. చిరు నిర్వహణలో అవేం లేవు. పైగా పరీక్షల సీజన్. అటుపై ఐపీఎల్ క్రికెట్ దాపురిస్తోంది. అందువల్ల కోటీశ్వరుడు పేదవాడిగానే ఉండిపోతున్నాడు. ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేదన్నది ఎవ్వరూ కాదనలేని విషయం.
-జివి వేగెశ్న, పార్వతీపురం