మీ వ్యూస్

తెలుగు సినిమా మారదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా కథ ఏమిటంటే చిన్నపిల్లవాడు కూడా చెబుతాడు. పాత చింతకాయ పచ్చడికి కొత్త తాళింపు అని. భారీ హీరో, కోట్లకు కోట్లు ఖర్చులు, అత్యాధునిక హంగులు అన్నింటిమీద ఎంతో శ్రద్ధపెడుతూ కీలకమైన కథ, కథనాలనే గాలికి వదిలేస్తున్నారు. భారీ అంచనాలు పెరుగుతూ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయికళ్ళతో ఎదురుచూసే అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఏ యేడు చూసినా విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా ఉంటున్నాయి. తీసిన కథలే మళ్లీ మళ్లీ తీయాలా? కథ కథనాలలో నవ్యతకు తావులేదా? బాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ తరచూ వినూత్నమైన కథలతో సినిమాలు వస్తున్నాయి. మరి మన తెలుగు సినిమాలు మారేదెన్నడు? అయితే రీమేక్‌లూ కాదంటే పాత కథలేనా? తెలుగు సినిమాలకు అర్జెంటుగా కావలసింది కథా రచయితలు. .
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
ఆ తరువాతే..
ఏ మహానుభావుడైనా మరణిస్తే ఆ లోటు తీరనిది అని యథాలాపంగా అనేస్తాం. కాని చాలా సందర్భాల్లో లోటు తీరినా మనం గుర్తించం. సినీ కవులనే తీసుకోండి- మనసు కవి ఆత్రేయ లేని లోటు తీరదన్నాం. వేటూరి తీర్చగలిగాడు. వేటూరి లేని లోటు సినారె తీర్చాడు. ఇపుడు సినారె లేని లోటు సిరివెనె్నల సీతారామశాస్ర్తీ తీర్చగలడు. పాపం శమించాలి. ఆయన తర్వాత ఎవరన్నది సమాధానం లేని ప్రశ్న. ఆయన తర్వాత అంతా అంధకారమే. నేనున్నా అనేవారెవరూ కనిపించడంలేదు. ఇప్పటి కవులందరూ ఇంగ్లీషు, హిందీ, గతిలేని తెలుగు కలగలిపి మిక్చర్ పొట్లం పాటలే రాస్తున్నారు.
-శాండీ, కాకినాడ
అపహాస్యం
హాసము లేని ఉపన్యాసము పరిహాసముతో సమానమన్నారు. అన్ని రంగాల్లోనూ కాస్తంత నవ్వులు విరజల్లకపోతే కళకు రాణింపు ఉండదనేది కవుల ఉవాచ. గత సినిమాలలో హాస్యం శరీరపు కదలికలతో, సంభాషణల విరుపులతో నవ్వు పుట్టించాయి. రాజబాబు- రమాప్రభ గొప్ప హాస్య జంటలాగే, రేలంగి- గిరిజ, పద్మనాభం- గీతాంజలి లాంటి కొందరు హాస్యాన్ని ఏ అపహాస్యము, వికృతచేష్టలు, నికృష్టపు సంభాషణలు లేకుండా పండించారు. ఈనాటి హాస్యం ద్వందార్థాలతో వెకిలిగా తయారైంది. పాత సినిమాలు కొత్తవారికి మార్గదర్శకంగా తీసుకోకపోవడం, నేటి తరానికి పాతతరం హాస్యనటులు తెలియకపవోడం, పాత సినిమాలు దూరదర్శన్‌లో వేస్తున్నా పాత చింతకాయ పచ్చడని చూడకపోవడం ఇందుకు కారణం. మార్పు వస్తుందని ఆశించడం దురాశే అవుతుందేమో!
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
దులిపేశాడు
బన్ని దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ అన్నపూర్ణ క్యాటరింగ్ శాస్ర్తీ ఓ పక్క వంటవాడిగా, పులిహోరలో ఇంగువలా, పులుసు, కూరల్లో పోపులా, ప్రేమలో పారిజాత పరిమళంలా, వికృత సమాజాన్ని సరిచేసే సవ్యసాచిలా, గోదావరి జిల్లా భాషతో బ్రాహ్మణత్వం పాటిస్తూ, పంచెకట్టు, చక్కటి విభూతిరేకలు, నుదుట కుంకుమతో మొత్తం చిత్రం అంతా తానై చిత్ర విజయానికి కారకుడయ్యాడు. కథను నడపించిన తీరు బాగానే వుంది. బాగు చేయడానికి వీలులేకుండా ముక్కలైన స్కూటరు తరువాత సీనులో ఎలా బాగుపడిపోయిందో దర్శకుడికే తెలియాలి. ఇక సాహిత్యం బాగున్నా హోరు సంగీతం గీతాలను విననివ్వలేదు. నేరస్తులకు వేసిన శిక్షలు మన నిత్య వాస్తవ సమాజంలో కూడా ఈ డీజీయే వచ్చి సరిదిద్దితే అంతకన్నా కావాల్సిందేమిటి? ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం సూత్రం ఓ కోణంగా తీసుకున్న సినిమాలో మంచితనం కనిపించాలని కాని మనిషి కాదు అన్న సంభాషణ చిత్రానికి హైలెట్. ఈ మాట సమాజానికిచ్చే సముచితమైన మెసేజ్.
-ఎన్‌ఆర్‌ఎల్, హైదరాబాద్
కథనం బావుంది
‘ఏది హాలీవుడ్ రేంజ్’ ఆలోచింపజేసింది. దేశవాళి చిత్రాల్ని హాలీవుడ్ రేంజ్ అని పొగడడం ఆత్మవంచన. మన కౌబాయ్‌లు, గ్రీకువీరులే కాదు ఆంధ్ర జేమ్స్‌బాండ్‌లు కూడా కేవలం పగటి వేషాలేసినట్టు కనిపించి నవ్విస్తారు! బాహుబలి కలెక్షన్లు చూసి హాలీవుడ్ షేక్ అయిపోయిందనడం అమాయకత్వమే. బాహుబలి ప్రపంచ వ్యాప్త కలెక్షన్లు 2000 కోట్లు అనుకుంటే అది 30 కోట్ల డాలర్లే. హలీవుడ్ చెత్తచిత్రం కూడా ఆ మాత్రం కలెక్షన్లు సాధిస్తుంది. అయినా హాలీవుడ్‌తో కంపేరిజన్ ఏల?
పి.శుభ, కాకినాడ
అలనాటి సంగతి
‘్ఛలెంజ్ రాముడు’ చిత్రంలో ‘చల్లగాలేస్తోంది మెల్లగా రమ్మంది’ పాట రికార్డింగ్ అయిపోయి పిక్చరైజేషన్ కూడా అయ్యింది. కాని సెన్సారు ఆ పాట మొదలు ‘చల్లగాలేస్తోంది’ వాక్యాన్ని ‘చల్లగాలి వేస్తుంది’ అని పాడాలన్నారు. నిర్మాతలు ఆ పాటను ‘చల్లగాలి వేస్తోంది’ అని తిరిగి బాలసుబ్రహ్మణ్యంతో పాడించి విడుదల చేశారు. అలనాటి సెన్సార్‌వారు కఠినంగా ప్రవర్తించారు. కాని ఇప్పుడో?
‘రోజులు మారాయి’ చిత్రంలో షావుకారు జానకి గారు కాలువలో నీళ్లుంటే చీరను కాస్త మోకాళ్ల కింద ఎత్తిపెట్టి దాటుతుంటే సెన్సారువారు కాళ్లు నగ్నంగా చూపించకూడదని సీన్ కట్ చేశారు. సెన్సారు వారు దీనికే ఇంత కఠినంగా వ్యవహరిస్తే ప్రస్తుత హీరోయిన్లు తొడలు చూపిస్తున్నారు నగ్నంగా! ఏమనాలి సెన్సార్‌వారిని?
-ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
విషాదమే కానీ..
రవితేజ తమ్ముడు భరత్ దుర్మరణం విషాదకరమే గాని ఊహాతీతం కాదు. కుటుంబంలో ఒకరు పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఆర్జిస్తూ ఉంటే ఆ కుటుంబంలోని ఒకరిద్దరిపైన విచ్చలవిడిగా ప్రవర్తించి జీవితం నాశనం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. భరత్ ఒక ఉదాహరణ. అతడింతకుముందే మద్యానికి, మత్తుమందులకు అలవాటుపడ్డాడు. అరెస్ట్ అయినా ఎలా తప్పించుకున్నాడు. తనని తాను సరిదిద్దుకోలేక మరింత దిగజారాడు. పెళ్లి చేసకున్నా విడిపోయేటంతగా దిగజారాడు. మద్యం మత్తు గొంతులో పడితే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకా వేగంగా, ఇంకా వేగంగా అంటూ అవి ప్రేరేపిస్తాయి. దానితో.. ఢాం.. అంతా స్వయంకృతం! మారాలన్న దృఢసంకల్పం లేకపోతే ఇంతే.
-ఆర్.మరుదకాశి, కరప