మీ వ్యూస్

సమీక్ష బావుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసుకి చిత్రసమీక్ష బాగుంది. అయితే చట్టాలన్నీ తెలిసిన లాయర్ భర్త ఆధ్వర్యంలో చట్టవిరుద్ధంగా ఆత్మహత్యకు ప్రేరేపించి విలన్‌లను చంపే తీవ్ర న్యాయ ప్రతిపాదన సమాజానికి ఎంతో చేటు చేస్తుందని చెప్పడం సరే. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విలన్‌లను హీరో చంపడం చూస్తున్నాం. అపరిచితుడు, భారతీయుడు, ఠాగూర్ లాంటి చిత్రాలే కాక హత్యచేసి తెలివిగా తప్పించుకునే దృశ్యం లాంటి చిత్రాలూ వచ్చాయి. ఇలాంటివి హిట్ అయాయి. పోలీసులు అనేక కారణాలవల్ల నేరస్తుల్ని పట్టుకోలేకపోవడం, కోర్టుల్లో సత్వర న్యాయం లభించకపవోడం వల్లనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హీరో విలన్‌లను చంపడం ఆమోదనీయ విజయసూత్రమైంది. ఇలాంటి చిత్రాలవల్ల థాంక్ గాడ్, క్రైమ్ రేటు పెరిగిందీ లేదు. అందువల్ల ఈ ఫార్ములా కొనసాగుతూనే వుంది.
-సత్య, కరప
ఎవరి కోసం?
ఇటీవలి కొత్త సినిమాల్లో కొన్ని పాటలు వింటుంటే పిచ్చెక్కిపోతుంది. పదాలు అర్థంకావు. వేగాన్ని అందుకోలేము. దానికితోడు కర్ణకఠోరమైన శబ్ద కాలుష్యం. ఇలాంటి పాటల్ని ఎందుకు సృష్టిస్తున్నారో, ఎందుకు పెడుతున్నారో దర్శకులు, సంగీత దర్శకులకే తెలియాలి. హీరో వేగంగా డాన్స్ చేయడానికి వీలుగా పగలకొట్టే సంగీతంలోకి పదాల్ని కూర్చి, కుక్కి, తొక్కిపెట్టి పిచ్చెక్కేలా చేస్తున్నారు. ఎవరు వినడానికి ఆ పాటలు. ఏ లక్ష్యంతో ‘కాలుష్యాన్ని’ సృష్టిస్తున్నారు. మా పాట, మా సినిమా, మా ఇష్టం అని వాళ్లనుకోవచ్చు. జనరేషన్ కోరుకుంటున్న పాటలని ఇంకొందరు వాదించొచ్చు. కానీ, తెలుగు సాహిత్యం, దాని విలువను కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా. మలయమారుతం లాంటి పాటల్ని సృష్టించిన తెలుగు స్క్రీన్‌మీద, ప్రళయభీకరమైన గీతాలను ఆవిష్కరించటం అవసరమా.
-ప్రఫుల్ల చంద్ర, ధర్మవరం
ఏం టైటిళ్లో..
‘ఏం టైటిళ్లో ఏమిటో’ వ్యాసం చాలా బాగుంది. అర్థం తెలియని పదాలే టైటిల్సై వెగటు పుట్టిస్తున్నాయి. గ్రీకువీరుడంటే అలెగ్జాండరు ఒక్కడే కాదు, కండలు తిరిగిన శరీరాకృతి (నేటి సిక్స్‌ప్యాక్)తో ఠీవిగా పొడవుగా ఉండేవాడిని గ్రీకువీరుడంటారు. మన హీరోల్లో ఎవరూ గ్రీకువీరులు కాదు. సమురాయ్ అంటే జపాన్ సైన్యంలో అధికారి. కాని అన్యాయానికి గురి అయిన అభాగ్యుల తరఫున పోరాడి న్యాయం కలగజేసేవాడిని సమురాయ్ అనడం వాడుకైంది. సినిమాకు ఇలాంటి పేర్లు పెట్టేవారు ఏదో ఒక సన్నివేశంలో పాత్రల చేత టైటిల్‌కి అర్థం చెప్పించాలి.
-పవన్‌పుత్ర, రామారావుపేట
భలే ఫిదా..
శేఖర్ కమ్ముల సినిమా చూస్తే నిజామాబాద్ జిల్లాలోని బంధువుల ఊరికి వెళ్లొచ్చినట్టు అనిపించింది. మంచి కథలు దొరకడం లేదని చెప్పే దర్శకులు, నిర్మాతలు దీన్ని తప్పక చూడాలి. కథాబలం లేకున్నా మంచి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేశారు. నిజామాబాద్ జిల్లా యాస, మాట తీరు, ప్రజల పద్ధతులు, అలవాట్లు చక్కగా చూపించారు. సినిమా తొలి సగం సరదాగా, వినోదాత్మకంగా సాగితే, రెండో భాగం హీరో హీరోయిన్ల మధ్య అలకలు, భావోద్వేగాలతో సాగడం బావుంది. విమానాశ్రయంలో హీరోయిన్ ఇండియా బయలుదేరే సమయంలో ఇద్దరిమధ్య ఎమోషన్స్ ఇంకా బాగా పండించాల్సింది. చిత్రమేమంటే ఆరడుగుల ఎత్తున్న వరుణ్‌తేజ్‌కు హీరోయిన్ సాయిపల్లవి ఎత్తులో జోడీ కుదరకున్నా, అదే ఓ అందమైంది. ఫక్తు కమర్షియల్ సినిమాలకు భిన్నమైన కమర్షియల్ సినిమా ఇది.
-జి.అశోక్, గోధూర్
పాపులర్ కాదనా?
చిరు నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా పేరు మార్చాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. మార్పు ఎందుకంటే ఆ దేశ భక్తుని పేరు హిందీ, తమిళ ప్రేక్షకులకు తెలియదు కాబట్టి. మహావీర అన్న పేరు పరిశీలిస్తున్నారట. అయితే మహావీర అంటే దేశ భక్తుడు జ్ఞాపకం రాడు. జానపద హీరో జ్ఞాపకం వస్తాడు. అప్పుడు సినిమా లక్ష్యమే దెబ్బతింటుంది. అల్లూరి సీతారామరాజు చిత్రానికి అడవి వీరుడు అని పేరు పెడితే అసహ్యంగా ఉండదూ. హిందీ, తమిళంలో ఏ పేరు పెట్టుకున్నా తెలుగులో మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరే ఉంచాలి.
-ప్రవల్లిక, నల్గొండ
నమ్మాలా?
డ్రగ్స్ విచారణ సందర్భంగా విచారణకు పిలవబడ్డ వారి తల్లిదండ్రుల ప్రతిస్పందన- ఇలా చెప్తున్నందుకు సారీ- కాని నవ్విస్తున్నది. మా అమ్మాయి అమాయకురాలు. 13వ సంవత్సరం నుంచి కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె అలాంటి పని చేయదు అని ఒక తండ్రి, మావాడికి సిగరెట్ పొగ కూడా పడదు, డ్రగ్స్ సేవిస్తాడా? అని ఒక తల్లి చెప్పడం హాస్యాస్పదం. చాలామంది ఇంటిలో బుద్ధిగా ఉంటూ బయట చెలరేగిపోతుంటారు. తల్లిదండ్రులు అలా తమ బిడ్డల్ని వెనకేసుకొస్తే నవ్వులపాలు కావచ్చు. గుంభనంగా ఊరుకొని విచారణ పూర్తయ్యేవరకూ నిరీక్షించాలి.
-ప్రసన్న, పేర్రాజుపేట
దేశభక్తి సినిమాలు రావాలి
ప్రతి సంవత్సరం స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీ పండుగలు వస్తుంటాయి. ఇలాంటి పండుగల సందర్భంగానైనా దేశభక్తి చిత్రాలు వస్తే బాగుంటుంది. ప్రతిఒక్కరిలో దేశాభిమానాన్ని, భక్తిని పెంపొందించేలా వినూత్నమైన కథా కథనాలతో సినిమాలు రావాలి.
స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకుల జీవిత చరిత్రలతోనూ సినిమాలు తీయవచ్చు. గతంలో వచ్చిన దేశభక్తి చిత్రాలు ఎన్నో విజయవంతం అయినాయి. రాను రాను అవి బాగా తగ్గినాయి. స్వాతంత్య్ర దినోత్సవ శుభకాంక్షలతో అంటూ కమర్షియల్ చిత్రాలు వస్తే ఏం బాగుంటుంది. ఇకనుండైనా సంవత్సరానికి కనీసం మూడు, నాలుగు దేశభక్తి చిత్రాలు నిర్మించి జాతీయ పర్వదినాల సందర్భంగా విడుదలచేయాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం