మీ వ్యూస్

మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూస్తూనే ఉన్నాం
ప్రతి కామెడీ సినిమాకి, మరో హారర్ సినిమాకి -ఇప్పటి వరకూ రానటువంటి కథ అంటూ చెప్పే కబుర్లు బూటకమేనని ఎన్నిసార్లు రుజువవుతున్నా ప్రేక్షకులుగా సినిమా చూస్తూనే ఉన్నాం. మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నాం. ఆనందోబ్రహ్మ చిత్రం చూసినపుడూ అదే ఫీలింగ్. టీవీ చానెల్స్‌లో వస్తున్న కామెడీ కార్యక్రమాల్లోనైనా ఒకింత హాస్యం కనిపిస్తుందేమోకానీ, కామెడీ చిత్రాలంటూ వస్తున్న వాటిలో ఒక్క సన్నివేశమూ మెచ్చుకోదగ్గదిగా ఉండటం లేదు. ఇలాంటి చిత్రాలను ఇంకెన్నాళ్లు భరించాలి. ఇంకెంతకాలం భరించాలి?
-జెట్టి పవన్, సామర్లకోట
ఫ్లాష్ బ్యాక్
వెనె్నలలో అద్భుతమైన శీర్షికగా నడిచిన ఫ్లాష్‌బ్యాక్ శీర్షికను అకస్మాత్తుగా ఎందుకు ఆపేసినట్టు. సర్వోన్నతమైన తెలుగు సినిమాల విషయాలు, అప్పటి సంగతులు, తెరవెనుక ముచ్చట్లను తెలియజెప్పే ఆ శీర్షికను మళ్లీ మొదలుపెట్టాలని విజ్ఞప్తి. కొద్ది వారాలుగా ఆ శీర్షిక లేకపోవడం వెనె్నలలో వెలితిగా ఉంది. ఆ శీర్షికను మళ్లీ ప్రచురించాలని మనవి. గతవారం ‘వీళ్లూ మన దర్శకులు’ కథనం చాలా చాలా బావుంది. రచయితకు అభినందనలు.
-జె రత్నంశెట్టి, తాడిపత్రి
వాళ్ల వారసులేరీ?
తెలుగు దర్శకు త్రిమూర్తులు ఎవరూ అంటే -కెవి రెడ్డి, కమలాకర కామేశ్వర రావు, ఆదుర్తి సుబ్బారావుల పేర్లు చెప్పుకోవాలి. ఈ ముగ్గురూ తెలుగు సినిమా పరిశ్రమకు మార్గదర్శకులు కూడా. కెవిఆర్, కెకెఆర్‌లు అటు పౌరాణిక, ఇటు సాంఘిక చిత్రాలకు ఏకకాలంలో దర్శకత్వం వహించిన సవ్యసాచులు. ఆదుర్తివారు సాంఘిక చిత్రాలకే ఎక్కువ దర్శకత్వం వహించారు. -‘ఆత్మకు చావులేదంటూనే, పునర్జన్మ అంశాన్ని కథనంగా చూపిస్తూ రూపొందించిన ‘మూగ మనసులు’ చిత్రం ఒక్కటి చాలు -ఆదుర్తివారి ప్రతిభను పట్టి చూడటానికి. ఆ సినీ ఘనాపాటీల పాండిత్యంలోని పావువంతునైనా ప్రదర్శించగలిగే సృజనాత్మక దర్శకులు తెలుగులో మళ్లీ రాకపోవడం నిజంగా పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. భవిష్యత్‌లోనైనా అంతటి గొప్ప దర్శకులు పుట్టుకొచ్చి, తెలుగు సినిమా కథను జీవిత కథనానికి దగ్గర చేయాలని ఆశిద్దాం.
-కెవిపి రావు, కందుకూరు
మరీ దారుణం..
ఈమధ్య తెలుగులో ప్రసారం అవుతున్న ఉత్తరాదివారి సీరియళ్లలో దోషాలు ఉంటున్నాయి. ఇది కేవలం కల్పిత కథ. ఎవరి మనోభావాలనూ కించపర్చడం మా ఉద్దేశం కాదు అని ప్రకటించుకుంటూనే, కించపరుస్తున్నారు. శనిదేవుని దివ్యచరిత్ర సీరియల్‌లో సూర్యుడు, ఇంద్రుడు సాంఘిక చిత్రాల్లోని విలన్ల మాదిరిగా మాట్లాడుతూ వ్యవహరిస్తున్నట్టు చూపడం దారుణం. దేవతలు నిత్య యవ్వనులు. వారికి ఆకలి దప్పికలు ఉండవు. కాని సీరియల్‌లో సూర్యుడు, ఇంద్రులు వయసుమళ్లిన వాళ్లలా కనిపిస్తున్నారు. పిల్లల్ని భోజనానికి రమ్మంటుంది ఛాయాదేవి. శని నల్లగా వికృతంగా కనిపించగానే, వీడు నా బిడ్డ కాదు, నీ బిడ్డ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సూర్యుడు, అచ్చంగా సాంఘిక చిత్రాల్లోని దుష్ట భర్తలాగ. కల్పిత అథ అంటూనే పురాణ పురుషులపై గౌరవం పోయేల సీరియళ్లను రూపొందించడం దారుణాతిదారుణం.
-పి శాండిల్య, కాకినాడ
ఆపాత మధురాలేవీ?
నాటి సినిమా పాటలు మంచి సాహిత్య విలువలతో కలకాలం గర్తుండిపోయేవి. వినేకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించేవి. మ్యూజిక్ ఆల్బమ్‌లో భద్రపర్చుకునేంత స్థాయి సాహితీ విలువలు పాటల్లో కనిపించేవి, వినిపించేవి. భక్తి, దేశభక్తి, నైతిక విలువలు ప్రభోధించే చైతన్యస్ఫోరక గీతాలుగా ఉండేవి. అంతెందుకు -యుగళ గీతాలు, ప్రణయ గీతాల్లోనూ ఉత్తమ సాహిత్య విలువలు గుభాళించేవి. కానీ, నేటి చిత్రాల్లో వస్తున్న పాటలు వినసొంపువే అయినా, అర్థంకాని సాహిత్యం, అర్థంపర్థంలేని సాహిత్యంతో వస్తుండటం బాధాకరం. కొన్ని పాటలు పిల్లల నోటిలో నానుతుంటే, ఆ సాహిత్యాన్ని వినలేకపోతున్నాం. ముఖ్యంగా సినిమా కథకు, సందర్భానికి సంబంధం లేకుండా పాట వెళ్లిపోతుండటం కనిపిస్తుంది. ఇది మరీ సిగ్గుచేటు.
-ఎస్‌ఎస్ రాజు, వనస్థలిపురం.
ఎందుకలా చేశారో
తెలంగాణ తెరమీద కొత్త బొమ్మ ఫిదా గురించి చెప్పిన దాన్లో ‘‘సినిమాని హఠాత్తుగా ముగించి హీరోయిన్ వ్యక్తిత్వాన్ని తగ్గించారు’’ అన్నారు. నిర్మాత దిల్‌రాజుకి ఒక అలవాటుంది. ఎడిటర్, సెన్సార్‌లు కట్ చేసి తొలగించిన సన్నివేశాలు, మాటలే కాక తాను ప్రత్యేకంగా సినిమా చూసి మరికొన్ని కట్స్ చేయడం ఆయన తత్వం అని ఒక పత్రికలో సినిమా బిట్ వచ్చింది. అందువల్ల ఫిదా ముగింపుపై కత్తెర వీరుడు దిల్‌రాజు చేయి పడి ఉంటుందనుకోవాలి. మరో ముఖ్యమైన విషయం తెలంగాణ తెరమీదనే కాక ఆంధ్ర తెరమీద కూడా ఫిదా కొత్త కొత్తగా ఉండి అలరించింది. ప్రేక్షకుల్లో ప్రాంతీయతత్వం లేదని నిరూపించింది.
-కె.ప్రవీణ్, కాకినాడ
వదలని మత్తు
ఈనాటి హీరో హీరోయినే్ల కాదు, కొంచెం పేరు తెచ్చుకున్న దర్శకులు కోట్లలో పారితోషికాలు అందుతున్నా వాటితో సుఖంగా జీవనం సాగించక మరేదో కొత్త సుఖం కావాలని మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. ఇవాళ డ్రగ్స్ మాఫియా బహిర్గతమయింది కానీ, ఈ దురలవాట్లు ఎప్పటినుంచో రాజ్యమేలుతున్నాయి. ఏమంటే రోజంతా బాగా కష్టపడి రిలాక్సేషన్ కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇది ఒక్క సినిమా వారికి అంటిన జబ్బు మాత్రమే కాదు, ఐటి ఉద్యోగులు, కాలేజీ విద్యార్థుల వరకు పాకింది. పూర్వం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, అంజలి, జమున, కృష్ణకుమారి లాంటి ప్రముఖ నటులు రోజుకు పద్ధెనిమిది గంటలు శ్రమపడినవారే. వారేమీ ఇలా డ్రగ్స్ వాడినట్లు లేదే. కానీ, ఈనాడు ఇదొక ప్యాషనైపోయింది. డ్రగ్స్ మాఫియా హైదరాబాద్‌లో ఎక్కువగా బయటపడింది కాని ముంబై, ఇతర నగరాలలోనూ లేకపోలేదు. దీనికి సంబంధించిన సూత్రధారులను కఠినంగా శిక్షించాలి.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్