మీకు మీరే డాక్టర్

కాయగూరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దురదగొండి కాయల కూర
దురదగొండి లేదా దూలగొండి ఆకుపైన నూగు ఉంటుంది. అది తగిలితే దురద పుడుతుంది. దాని కాయలు, విత్తులు ఔషధ గుణాలు కలిగినవి.
లైంగిక శక్తిని ఆసక్తిని పెంచే ద్రవ్యాలను ఆధునిక వైద్య శాస్త్రంలో అఫ్రొడిజియాక్స్ అనీ, ఆయుర్వేద శాస్త్రంలో వాజీకరణ ఔషధాలు అనీ పిలుస్తారు. వాజీ అంటే గుర్రం. జీవుల్లో సంభోగ సమర్థత అత్యధికంగా ఉన్నది గుర్రానికే! అశ్వశక్తి హార్స్ పవర్ అనటంలో అసలు అంతరార్థం ఇదే! ఈ దూలగొండి కాయలు, గింజలు అలాంటి అశ్వశక్తినిచ్చే ద్రవ్యాలు. ఇంతకన్నా వివరంగా వివరించాల్సిన అవసరం లేనివి. రోడ్డు పక్కన పెరిగే ఈ మొక్క కనిపిస్తే ఈ విషయం తెలిసిన ఏ ఒక్కరూ వదిలిపెట్టరు.
దూలగొండి లేత కాయలతో కూర వండుకుని తినవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. ముదిరినవి దొరికితే ఎండించి నీళ్లలో వేసి టీ కాచుకుని తాగవచ్చు. ఆకుల జోలికి వెళ్లకపోతే అది పెట్టే దురద గురించి మనకు చింతే లేదు.
లేత పుచ్చకాయల కూర, పచ్చడి, పప్పు
ఇంకా లోపల ఎర్రగుజ్జు పట్టని లేత పుచ్చకాయని సొరకాయ మాదిరిగా అన్ని రకాల వంటకాలూ చేసుకోవచ్చు. కూర, పప్పు, పచ్చడి, పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. రుచికరంగా ఉంటుంది. సొరకాయని ఇష్టపడే వారికి ఈ కూర కూడా ఇష్టంగానే ఉంటుంది. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. అల్సర్లు త్వరగా తగ్గుతాయి. జీర్ణశక్తిని పెంచుతుంది.
వేడి ఎక్కువగా ఉండటం చేత వీర్యకణాలు నశించిపోయి సంతాన ప్రాప్తి కలగకుండా ఉన్నవారికి ఇది వీర్యానికి చలవ నిస్తుంది. బీజకణాలు పెరుగుతాయి. అరికాళ్లు అరిచేతులు మంటలు, చెమటలు ఎక్కువగా పట్టేవారికి ఇది మేలు చేస్తుంది.
నిజానికి సొరకాయ చాలా తేలికగా అరిగే ద్రవ్యం. కానీ, పుచ్చకాయ కష్టంగా అరుగుతుంది. అందుకని జీర్ణశక్తి మందంగా ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. వాత వ్యాధులను పెంచే అవకాశం ఉంది.
బుడమ కాయలతో వడియాలు, ఒరుగులు
తోటల కంపల మీద బుడందోస తీగ పాకుతూ పెరుగుతుంది. ఉచితంగా పెరిగే మొక్కే! ఎప్పుడో తప్ప మార్కెట్లో కనిపించవీ కాయలు. దొరికినప్పుడు వదలకుండా కొనండి. రుచికరంగా ఉంటుంది.
కడుపులో పెరిగే నులి పురుగుల్ని చంపి బయటకు వెళ్లగొట్టే శక్తి వీటికుంది. వస్తుగుణ మహోదధి అనే వైద్య గ్రంథంలో ఈ కాయల్ని ఆముదంలో వేయించి ఇస్తే, గుర్రానికైనా కడుపులో అజీర్తి కుట్టును విరేచనం ద్వారా బయటకు వెళ్లగొట్టి, జీర్ణాశయాన్ని శక్తిమంతం చేసే గుణం ఉందని వ్రాశారు. ఇంతటి దివ్య ఔషధం ఆహార ద్రవ్యం కూడా కావటం ప్రకృతి మనకు ప్రసాదించిన వరం.
బుడం దోసకాయలు దొరికినప్పుడు వాటిని తరిగి ఉప్పు రాసి ఎండబెట్టండి. ఇలా ఎండిన బుడంకాయల ముక్కల్ని ఒరుగులు అంటారు. లేదా బియ్యం లేదా మినప్పప్పుతో కలిపి రుబ్బి వడియాలు పెట్టుకోవచ్చు. దొరకని కాలంలో కూడా ఆ కూరల్ని తినటం కోసం ఇలా ఒరుగులు పెట్టుకుని భద్రపరచుకునేవారు పూర్వం. వాటిని నీళ్లలో నానబెట్టి కూరగానో దోరగా వేయించి వడియాల మాదిరో అన్నంలో నంజుకుంటూ తినవచ్చు.
బొప్పాయి కాయల కూర
బొప్పాయి కూడా వౌలికంగా కాయగూరే! దాన్ని పండ్ల జాతి మొక్కగా భావిస్తున్నాం. లేత బొప్పాయి కాయలను కూరగా వండుకునే అలవాటు చాలామందికుంది. ఈ కాయల కూర పప్పు లేదా పచ్చడి రుచికరంగా ఉంటాయి. కానీ వేడి చేసే స్వభావం ఉంది. అందుకని నెలసరి ఇబ్బందులున్న స్ర్తిలూ, రక్తస్రావం అవుతున్న వ్యాధులతో బాధపడేవారు బొప్పాయిని తినటానికి భయపడతారు. కానీ బాలెంతలు లేత బొప్పాయి కాయల కూరని తింటే తల్లిపాలు పెరుగుతాయి.
నెలసరి సక్రమంగా రానివారు, ఋతుస్రావం సరిగా కానివారూ నిర్భయంగా వీటిని తినవచ్చు. తక్కిన అందరూ ఈ కాయలను తినవచ్చు. ఇందులో పపైన్ అనే ఎంజైము ఉంది. అది జీర్ణశక్తిని పెంపు చేసే ఔషధం. జీర్ణకోశ వ్యాధులు ఉన్నవారికి ఈ కూర మేలు చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది.
వెలక్కాయల పప్పు, పెరుగు పచ్చడి
వెలక్కాయల పేరు చెప్పగానే అమీబియాసిస్ వ్యాధికి దివ్యౌషధం అనే సంగతి గుర్తు రావాలి. పులుపు వగరు కలిసిన వెలక్కాయ షుగరు వ్యాధిలో ఔషధం. పేగుల్లో వచ్చే వ్యాధులన్నింటిలోనూ ఇది మంచి చేస్తుంది. ముఖ్యంగా అమీబియాసిస్ వ్యాధి ఉన్నవారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడేవారు వెలక్కాయలు దొరికినప్పుడు తప్పనిసరిగా తింటూ ఉండటం మంచిది. నిప్పుల మీద గానీ, గ్యాస్ పొయ్యి మంట మీద గానీ ఈ కాయని ఉంచి కాల్చి, పగలగొట్టి, లోపలి గుజ్జుతో పప్పు, పచ్చడి, పెరుగు పచ్చడి వగైరా చేసుకుంటారు. జీర్ణకోశ వ్యాధుల్లో పెరుగుతో కలిపి తినటమే మంచిది. ప్రోబయటిక్‌గా ఉపయోగపడుతుంది.
వాక కాయల కూర, పప్పు, పచ్చడి, ఊరగాయలు, స్వీట్లు
పులుపు వగరు కలిగిన కూరగాయ వాక్కాయ. విడిగా వాక్కాయపండు తింటారు కూడా! వేడి శరీర తత్త్వం ఉన్నవారికి, వేడిని వాత శరీర తత్వం ఉన్నవారికి వాతాన్ని పెంచుతాయని వీటిని తినటానికి కొందరు భయపడతారు. జీర్ణశక్తి బలంగా ఉన్నవారికి ఏ అపకారం చేయవు. పురుషుల వీర్యంలో బీజ కణాలను పెంచే శక్తి వీటికుంది.
మంచి పోషకాలు కలిగిన కూరగాయే ఇది. పప్పు, పచ్చడి, కూర తయారుచేసుకుంటారు. కొందరు ఊరుగాయ కూడా పెట్టుకుంటారు. దోసావకాయ రుచిలో ఇది ఉంటుంది. హల్వా, జామ్ లాంటి స్వీట్లు కూడా చేసుకుంటారు. సరదాగా ఎప్పుడో ఒకసారి తినదగిన ఆహార ద్రవ్యం ఇది.
వీటిని సున్నపు తేటలో నానించి ఎర్రరంగు వేసి ఐస్‌క్రీముల్లోనూ, డ్రైఫ్రూట్స్‌లోనూ చెర్రీస్ పేరుతో కల్తీ కలుపుతుంటారు.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com