సంజీవని

అమీబియాసిస్‌కి మజ్జిగే మందు -- మీకు మీరే డాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: అమీబియాసిస్ వ్యాధితో పదేళ్ళకుపైగా బాధపడుతున్నాను. జిగురు పడుతూనే ఉంది. ఆకలి పూర్తిగా పోయింది. ఏ విధంగా తగ్గించుకోవాలో చెప్పగలరు?
-కె.ఎస్.ప్రకాశరావు, ఘంటసాల
జ: మనం జీవించే విధానంలో ఆహారం పట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుంది. శుచి, శుభ్రత, నాణ్యతలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలపట్ల మోజు ఎక్కువౌతోంది. రోడ్డుప్రక్కన ఆహార పదార్థాల కోసం జనం క్యూలు కడుతున్నారు. పెళ్లిళ్ళు, పేరంటాలు, ఇంకా ఇతర సాకుల పేరుతో విందు భోజనాల తాకిడి ఎక్కువ. అమీబియాసిస్ వ్యాధికి ఇవన్నీ కారణాలే! భోజనంలో పెరుగు మజ్జిగల్ని కూడా సక్రమంగా తీసుకోకపోవటంవలన ఉపయోగపడే బాక్టీరియా కడుపులోకి చేరటం లేదు. ఈ ఉపయోగపడే బాక్టీరియా పెరుగు మజ్జిగల్లో మాత్రమే ఉంటుంది. అతి చల్లని పెరుగు తినే అలవాటు ఉంటే అమీబియాసిస్ కంట్రోల్‌లోకి రాకుండా పోతుంది.
ఒకసారి అమిబీయాసిస్‌ని తెచ్చిన కారణాలు జీవితం అంతా అమీబియాసిస్‌కు కారణం అవుతూనే వుంటాయి. ఆ కారణాలను ఆపకుండా అమీబాలను చంపే మందుల్ని ఎన్ని మింగినా ఫలితం ఉండదు.
అమీబియాసిస్ రావటానికైనా, వచ్చింది తగ్గకపోవటానికైనా శుభ్రమైన నీరు, ఆహారాలు తీసుకోకపోవటమే కారణం.
సూర్యోదయం సమయంలో మజ్జిగ తేటని రెండు మూడు గ్లాసులు రోజూ తాగుతూ ఉంటే అమీబియాసిస్ వ్యాధి త్వరగా తగ్గుతుంది. ఫ్రిజ్ చల్లదనం లేని మజ్జిగపైన తేరుకున్న తేటను మాత్రమే తాగండి..
ధనియాలు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క వీటిని మెత్తగా దంచి సీసాలలో భద్రపరచుకోండి. ప్రతిరోజూ మీకు త్రాగటానికి ఎన్ని అవసరమో అన్ని నీళ్ళు తీసుకుని వీటిలో ఏదైనా ఒక పొడిని తగినంత కలిపి బాగా పొంగులొచ్చేవరకూ మరిగించండి. పచ్చి మంచినీళ్ళకు బదులుగా ఈ నీటినే తాగండి. వీటిలో మీకు నచ్చిన పొడిని రోజూ వాడుకోండి.
ఇంగువ (1 చెంచా), అల్లం (2 చెంచాలు), మిరియాలు (4 చెంచాలు), జీలకఱ్ఱ (8 చెంచాలు), కొమ్ములు దంచిన పసుపు (16 చెంచాలు), ధనియాలు (32 చెంచాలు) సరిగ్గా ఇదే మోతాదులో తీసుకుని అన్నింటినీ కలిపి తగినంత ఉప్పు కలుపుకుని ఈ పొడిని కూర కారంగానూ, రసం పొడిగానూ, సాంబారు పొడిగానూ కలుపుకుని, రుచికరంగా వంటకాలు చేసుకొని తినండి. అమీబియాసిస్ మీ అదుపులో వుంటుంది. మీ జీర్ణశక్తి బలంగా ఉంటుంది.
వెలగపండు గుజ్జుతో వంటకాలు అమీబియాసిస్‌ని జయించేందుకు తోడ్పడతాయి. దానిమ్మ గింజలు, ఉసిరికాయ, నల్లపచ్చడి ఎక్కువ ఉపయోగపడతాయి.
రోజూ ఎక్కువ మోతాదులో మజ్జిగ తాగండి. పెరుగు, మజ్జిగలతో పెరుగుపచ్చడి, మజ్జిగచారు లాంటి వంటకాలు ఎక్కువగా తీసుకోండి. ఉదయం పూట ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా లాంటి టిఫిన్లకన్నా మజ్జిగ అన్నం తినటం అలవాటు చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు అన్నంలో పాలు పోసి తోడుపెట్టి ఉదయానే్న ఆ పెరుగు అన్నాన్ని తింటూ ఉంటే అమీబియాసిస్, దానివలన వచ్చే ఉపద్రవాలు తప్పకుండా తగ్గుతాయి.
బయట వండిన ఆహార పదార్థాలు తినకుండా, పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగుతూ వుంటే అమీబియాసిస్ రాదు. వచ్చినా త్వరగా తగ్గుతుంది.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com