మీకు తెలుసా ?

వేలెడంత ఉన్నా...దూకిందంటే... (మీకు తెలుసా?)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అతి చిన్నకోతిగా చెప్పుకునే ‘పిగ్మీ మంకీ’ మహా అయితే నాలుగు అంగుళాలు పెరుగుతుంది. మన అరచేతిలో ఇమిడిపోయే అంత సైజులో ఉండే ఇవి చెట్ల శిఖరాన ఉండటానికి ఇష్టపడతాయి. అవసరమైతే ఒక్కగెంతులో 15 అడుగుల దూరాన్ని దూకే శక్తి వీటికి ఉంది. చెట్ల బెరడును నోటితో తొలిచి, రసాన్ని ఇష్టంగా చప్పరిస్తాయి. మగవాటికన్నా ఆడవి కాస్త ఒకటిరెండు సెంటీమీటర్లు పెద్దవిగా ఉంటాయి. బ్రెజిల్, పెరు, కొలంబియాల్లో ఇవి కన్పిస్తాయి.

తోడేళ్లతో ఆడుకుంటాయ్...
కాకిజాతి పక్షుల్లో ఒకటైన ‘రావెన్’కు మిగతా పక్షులకన్నా పరిమాణ నిష్పత్తిలో మెదడు పెద్దదిగా ఉంటుంది. అందుకే మిగతా పక్షులకన్నా ఇవి తెలివైనవిగా చెబుతారు. ఆహారానే్వషణలో, ఉచ్చులో చిక్కుకుపోకుండా ఉండటంలో, ఎదురుదాడిలో, ఆహారం చోరీ చేయడంలో, ఆహారాన్ని దాచడంలో, మనుషుల స్వరం, వాహనాల శబ్దాలను అనుకరించడంలో ఇవి దిట్ట. మన కాకులకన్నా కాస్త పెద్దసైజులో కన్పిస్తాయి. అతిచురుకుగా వ్యవహరించే వీటిని ‘వోల్ఫ్ బర్డ్స్’ అని పిలుస్తారు. తోడేళ్లకు ఆహారం ఎక్కడుందో ఇవి ఎగురుతూ చూపిస్తాయి. అవి తినగా మిగిలిన ఆహారాన్ని ఈ పక్షులు తింటాయి. ఇవి తినడానికి వీలైన విధంగా ఆహారాన్ని వదిలేయడం తోడేళ్లకూ తెలుసు. ఒక్కోసారి అవి తోడేళ్లతో పరాచికాలాడతాయి. వాటిపైనుంచి ఎగరడం, గీరడం, తోకను పట్టి లాగడం వంటి అల్లరి చేస్తాయి. జీవితాంతం ఒకే జత, ఒకే గూటిలో గుడ్లు పెట్టి పొదగడం వీటి ప్రత్యేకత.

ఎముకలనూ నమిలేస్తాయి..
ఎలుగుబంటిలా కన్పిస్తున్నా..వాటితో ఏమాత్రం సంబంధంలేని జంతువు ‘వోల్వరిన్’. వీసిల్స్ జాతికి చెందిన ఈ జీవి భయమన్నదే ఎరుగదు. అవసరమైతే తనకన్నా పెద్దవైన మృగాలనూ ఎదిరించి పోరాడుతుంది. అందుకే దీనిని ‘గులోగులో’ (దూకుడు స్వభావం) అనికూడా పిలుస్తారు. పూర్తిగా మంచువాతావరణంలో బతకడం దీనికి ఇష్టం. మంచుశిబిరాల్లో ఉండటం, మంచుదిబ్బల లోపల డెన్ కట్టుకుని పిల్లల్ని కని, సాకడం వీటికి అలవాటు. మంచులో 20 అడుగుల లోతున కూరుకుపోయిన ఆహారాన్ని ఇట్టే వాసనతో పసిగట్టడం వీటి ప్రత్యేకత. ఆహారంకోసం రోజుకు కనీసం 25 మైళ్ల దూరం నడుస్తాయి. చూపు తక్కువగా ఉన్నా సునిశితమైన ఘ్రాణశక్తి, వినికిడి శక్తి వీటి ఆయుధాలు. వీటి దంతాలు ఎంత బలమైనవంటే...ఇతర జంతువుకళేబరాల్లోని ఎముకలు, దంతాలను కూడా నమిలి తినేస్తాయి.

నీలికళ్లు.. పసుపువర్ణంలోకి మారతాయి
తోడేళ్ల కళ్లు పుట్టినపుడు నీలిరంగులో ఉంటాయి. అవి ఎదుగుతున్నకొద్దీ...దాదాపు ఎనిమిది నెలల వయసు వచ్చేసరికి పసుపువర్ణంలోకి మారతాయి. కుక్క జాతికి చెందిన జంతువుల్లో తోడేళ్ల మెదడు (కపాలం) కాస్త పెద్దదిగా ఉంటుంది. అందుకే వీటికి తెలివితేటలు అధికం. తోడేలు పిల్లకు, పూర్తిగా ఎదిగిన కుక్కకు ఉన్నంతస్థాయిలో తెలివితేటలుంటాయని చెబుతారు. మనిషికి 5 మిలియన్ల ‘సెంట్‌సెల్స్’ ఉంటే తోడేళ్లకు 200 మిలియన్లు ఉంటాయి. అందుకే వాసన పసిగట్టడంలో వీటికి మించినవి లేవు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని ఆహారాన్ని అవి ఇట్టే గుర్తిస్తాయి. ముఖ కవళికలు మార్చడం ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఇవి ఆరితేరినవి. వీటి భాష దాదాపు ఇదే. తోడేళ్లు ఊళవేయడంపై చాలామందికి మూఢ నమ్మకాలుంటాయి. కానీ తమ పరిథిలోకి మరో తోడేళ్ల బృందం రాకుండా హెచ్చరించేందుకే అవి ఇలా ఊళపెడతాయి.

-ఎస్.కె.కె.రవళి