దక్షిన తెలంగాణ

కొసమెరుపు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లని మబ్బు ఆకాశాన్ని కమ్మేయ్యాలని చూస్తోంది. ఇద్దరు అమ్మాయిలు దానినే తదేకంగా చూస్తున్నారు. ఒకటే దృశ్యమైనా వారిద్దరి భావాలు మాత్రం విభిన్నంగా ఉండటమే విచిత్రం.
అత్యాచారానికి ప్రయత్నిస్తున్న అబ్బాయిలా మబ్బు, అందమైన, అమ్మాయిలా ఆకాశం మాధవికి కనిపిస్తే, అరాచికాలను అధిగమించే ధీరవనితలా మబ్బు, అందుకు కారకులైన అబ్బాయిలా ఆకాశం కనిపిస్తోంది ధైర్యకు.
‘మధూ! ఏమాలోచిస్తున్నావ్?’
‘ఏముంది ఆలోచించటానికి? ఈ సమాజమనే అడవిలో ఏ పులి ఎప్పుడు మీద పడుతుందో, ఎలా బలి అయిపోతామో అని అనుకుంటున్నాను.
‘అలా ఎందుకనుకుంటావ్? స్వారీ చేసే దుర్గలము మనమని ఎందుకు అనుకోవు?’
‘అంత ధైర్యం ఉంటే అలానే అనుకనేదాన్ని. అది లేకే కదా ఇలా భయపడేది’
‘ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనం చెయ్యాల్సింది భయపడటం కాదు. ఎదురు తిరగటం ఎలా? వాళ్లకి బుద్ధి ఎలా చెప్పాలి అని’
‘్ధర్యా! నీ అంత ధైర్యం నా ఆలోచనలకు కూడా ఉండలే. ఇంక నేనేం చెబుతాను’
‘అదే! నేననేది. అలా పిరికి పందలా మాట్లాడతావేం? నాలాంటి స్నేహితురాలిని ప్రక్కన పెట్టుకుని కూడా’
‘ఎల్లవేళలా నువ్వు నా దగ్గరే ఉండవుగా’
‘అందుకే ధైర్యాన్ని నీకు వీడని స్నేహితురాలిని చేసుకోమంటున్నాను’.
‘ప్రయత్నిస్తున్నాను. నేనూ నీ లాగా మారాలనే అనుకుంటున్నాను’
‘దట్స్ గుడ్ మైడియర్ మధూ! ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు’
‘నాకు నేనే నచ్చాను. బయట వాళ్లకి నచ్చాలని నేనెలా అనుకుంటాను?’ అనుకుంది మనసులోనే మాధవి.
‘ఇక వెల్దామా?’ వేరుశనగ కాయలు తిన్న పేపరును డస్ట్‌బిన్‌లో పడేస్తూ అడిగింది ధైర్య, మాధవి ‘ఊ!’ అనటంతో గాంధీ పార్కు నుంచీ బయటకు వచ్చేసారు.
అర్జంటుగా పెళ్లి చూపులని ఇంటి నుంచీ కబురు రావటంతో బయలుదేరింది ఎక్కడివి అక్కడే వదిలేసి మాధవి.
మధ్యలో రైలుకి ప్రమాదం జరగటంతో రెండు గంటలకు చేరవల్సినది రాత్రి పది గంటలకు ఊరు చేరింది. స్టేషన్ అంతా నిర్మానుష్యంగా ఉంది. చేతిలో సెల్ తప్ప మరో తోడు లేదు. భయంతో శరీరమంతా వణుకుతోంది. ఇలాంటి సమయంలో ధైర్య ప్రక్కనుంటే ధైర్యంగా ఉంటుంది అనుకుంది అనుకోకుండానే.
ఇంతలో ఎక్కడి నుంచో వచ్చాడో ఒకడు వెంటపడటం ప్రారంభించాడు. అది గమనించింది మాధవి. ఎందుకో ఈ సారి ఆమెకు భయం కలుగలేదు. ధైర్య తనతో నిన్న అన్న మాటలే మనసులో మెదిలాయి.
‘రానీ! వెధవని. ఏదైనా చెయ్యాలని చూసాడా నా చేతిలో అయిపోతాడు’ అనుకుంది.
మాధవికి తనని చూస్తే తనకే ఆశ్ఛర్యమేసింది. తనేనా ఇలా ఆలోచిస్తోందని.
ఎదురుగా దారి, చుట్టూ తుప్పలు తప్ప మరేమీ కనిపించటం లేదు. ఇంతలో అతను ఆమె భుజం మీద చెయ్యివేసాడు.
అంతే! అపరకాళిలా వెనక్కు తిరిగింది. సెల్‌లో బటన్ నొక్కటం, పెప్పర్ స్ప్రే స్ప్రే చెయ్యటం ఒకేసారి జరిగిపోయింది.
అతను దెబ్బకు పారిపోయాడు.
మాధవి ధైర్యంగా ఇంటికి చేరింది.
వెంటనే ధైర్యకు ఫోన్ చెయ్యాలని చేతిలోకి సెల్ తీసుకుంది. ఇంతలో ధైర్య దగ్గర నుంచే ‘కాల్’ వస్తోంది.
‘హాయ్! ధైర్యా! నేనే నీకు చేసి నా ధైర్య సాహసాల గురించి చెబుతామనుకుంటున్నాను’
‘తెలుసులేవే! ‘సాహస్’నే సాహసంతో అదరగొట్టేసావుగా’
‘నీకెలా తెలుసే?’
‘అతన్ని పంపింది నేనేగా! కాకపోతే అలర్ట్‌గా ఉండు బాబూ అని చెప్పటంతో కర్చ్ఫీ ముఖానికి అడ్డుపెట్టుకొని బయటపడ్డాడు. లేకపోతే వాడి పని ఇంతే సంగతులు. అవునా? ఏమైనా నా మధూ ధైర్యవంతురాలయి పోయింది. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది’
‘ఆ! కొసమెరుపు నాది కాదు. నీదా!?! అంది ఆశ్చర్యపోతూ మాధవి.

- యలమర్తి అనురాధ
సెల్.నం. 9247260206

****

పుస్తక సమీక్ష

అభ్యుదయ భావాలతో..
‘కొన్ని ప్రశ్నలు కొన్ని జ్ఞాపకాలు’!
పేజీలు: 132, వెల : 100/-
ప్రతులకు: బిల్ల సరిత
ఇం.నం.35-7-674
టి.ఎన్.జి.ఓస్ కాలనీ
ఫేజ్-2, వడ్డేపల్లి
హన్మకొండ
వరంగల్ జిల్లా
సెల్.నం.9177604430

తన గత గ్రంథాలతో పోరుగానం వినిపించి బలిదానాలు మరుద్దామని ‘పిడికిలి’ బిగించి..‘కాలాన్ని గెలుస్తూ’ చివరికి ‘గెలుపు చిరునామాను కనుగొన్న కవి బిల్ల మహేందర్ ఇప్పుడు’ ‘కొన్ని ప్రశ్నలు కొన్ని జ్ఞాపకాలు’తో మనముందుకొస్తున్నారు..అణువణువున తెలంగాణ వాదాన్ని పుణికిపుచ్చుకున్న కవి మహేందర్ ‘కొన్ని ప్రశ్నలు..కొన్ని జ్ఞాపకాలు’ గ్రంథంలో.. ఆయన జ్ఞాపకాలు.. ప్రశ్నలు.. స్పందనలు.. ఆలోచనలు.. భావాలతో కలగలిపి విభిన్న అంశాలతో కవిత్వాన్ని పండించయత్నించారు. ఉద్యమానంతర కవిత్వంతో ముస్తాబై వచ్చిన ఈ గ్రంథంలో ఆయన భావోద్వేగం కొట్టవచ్చినట్లు కానవస్తుంది. సామాజిక చింతనతో సాగే ఆయన రచనల్లో ఆయన సంస్కారం ఉట్టిపడుతుంది. రాజ్యంపై నిర్భయంగా తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఇందులో గ్రంథం యొక్క టైటిల్‌కు అనుగుణంగా కొడవళ్లవంటి ప్రశ్నలున్నాయి..చెలిమెల వంటి జ్ఞాపకాలూ చోటు చేసుకున్నాయి! కవిత్వం ద్వారా సామాజిక చైతన్యానికి పాటుపడాలన్న ఆరాటం..అకృత్యాలపై తమ నిరసన గళం ఎత్తాలన్న తపన, ఆయన కవితా పంక్తుల్లో మనం గమనిస్తాం..గ్రంథానికి ముందు మాటలు శోభను కూర్చినప్పటికీ..కవి, రచయిత డాక్టర్ పసునూరి గారు తమ పీఠిక చివరన పేర్కొన్న పంక్తులతో అందరూ ఏకీభవించకపోవచ్చు..
‘గడిచిన జ్ఞాపకాల కోసం..
పేజీ మొదలు పెట్టాను’ అంటూ ‘కన్నీటి ముద్దలు’ కవితను ఎత్తుకున్న తీరు బాగుంది. ‘నేనలా..సాగిపోతూ ఉంటాను నా వెనుకాలే జ్ఞాపకాలు..నాతో పయనమై సాగుతుంటాయంటూ ‘చెదరని జ్ఞాపకాలను’ నెమరు వేసుకున్నారు. ‘నా ప్రశ్న’ కవితలో కవి మహేందర్ సంధించిన ప్రశ్నలు.. లోచనాత్మకంగా వున్నాయి! ఆయన సామాజిక బాధ్యతను ప్రతిబింభించే విధంగా ఉన్నాయి! ఆయన సామాజిక బాధ్యతను ప్రతిబింభించే విధంగా ఉన్నాయి! ఆకలి మీద దాడి..అక్షరాలపై దాడి.. ఆలోచనలపై దాడి..అడుగడుగునా హక్కులపై దాడి అంటూ వాపోయారు. గాజా పసి పిల్లలపై రాసిన కవిత ఆర్ధ్రంగా మలచబడింది. ‘అతడు ఒక్కడు కాదు’ కవితలో ప్రశ్నించే గొంతులు..్ధక్కరించే గొంతులు..పోరాడే గొంతులు..పీడితుల పక్షాన నిలిచే గొంతులు ఎన్నటికీ అలసిపోవు..ఓడిపోవని డాక్టర్ జి.ఎస్.సాయిబాబాను అక్రమ కేసు కింద అరెస్ట్ చేశారని కవి మహేందర్ తమ కలాన్ని ఎక్కుపెట్టారు. ‘ఆమె’ ఉదయించింది’ కవితలో కవి యొక్క సృజనాత్మకత కానవస్తుంది. ‘ఎన్నటి నుంచి ఎన్నో బతుకుల్ని చూసింది..మరెన్నో బతుకుల్ని ఎలిగించిన ‘దీపం బుడ్డీ’పై కవిత రాస్తూ..‘ఇప్పుడది..పేదోళ్ల ఇండ్లల్ల షోకేజి..పేదోళ్ల ఇండ్లల్ల టార్చిలైటు’ అని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మాక్కావల్సింది..మా బతుకులకు సాఫీగా బాటలు వేసే తెలంగాణ..ఎండిన డొక్కల్లో..గుప్పెడు మెతుకులు నింపే తెలంగాణ..మాడిన మా జీవితాల్లో..ఇన్ని చల్లని చిరుజల్లులు కురిపించే తెలంగాణ కావాలని ‘పోరాటం మాకు కొత్తేమి కాదు’ కవితలో కాంక్షించారు. తాను ఓ తొవ్వ..ఓ మట్టి పరిమళం..ఓ మంజీరనాదం..ఈ ‘తెలంగాణ విరబూసిన పుష్పం’గా డాక్టర్ నందిని సిధారెడ్డి గారిని అభివర్ణించారు. ‘అరుగు’ కవితలో ఒకనాటి పల్లె జ్ఞాపకాలను ఏకరువుపెట్టారు. ఈనాడు కూర్చోవడానికి అరుగులు లేవు..మనసారా ముచ్చటిద్దామంటే ఆ పలకరింపుల జాడలే కనబడటం లేదని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. సంచార జాతుల జీవన విధానాలకు స్పందనగా ‘సంస్కృతి వారధులు’ కవిత రాశారు. సంచార జాతుల వారు కళకు రూపాలు..రేపటి మన బతుకులకు సజీవ కళానిలయాలని కొనియాడారు. మేడలు.. మిద్దెలు.. ఆకాశహర్మ్యాలు కాదు.. కొందరు మనసున్న మనుషులు కావాలని కవి మహేందర్ ఇంకో కవితలో అభిలషించిన తీరు బాగుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో..ఆధునిక ముసుగులో..ఒకనాటి తీపి జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయని తమ విచారాన్ని వ్యక్తపరుస్తూ చిన్ననాటి ‘దుగుడు’తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నా చుట్టూ అన్నీ ఉన్నప్పటికీ..దాచుకోవడానికి ‘దుగుడు’ లేదు..్భద్రపరుచుకోవడానికి ఏ తీపి గుర్తులు మిగిలి లేవని వాపోయారు.
నువ్వు నా గాయాల్ని మానే్ప గేయమైతే..నేను నీ కన్నీళ్లను తూడ్చే కవితనై కదిలి వస్తానన్న పంక్తులు ‘నువ్వు-నేను’ కవితకు నిండు దనాన్నిచ్చాయి! ‘్ధర్యం వీడొద్దు’ కవిత తెలంగాణ భాషలో రూపుదిద్దుకుంది. రైతు బతుకులకు భరోసానివ్వాలన్న ఆయన ఆకాంక్షను అక్షరబద్ధం చేశారు. ‘సమీక్ష’ కవితలో..కూలిపోతున్న మనుషుల అగాధాల మధ్య మానవత్వపు వంతెనను నిర్మించి మాయమవుతున్న మనిషి తనాన్ని కాపాడాలన్న ఆయన ఆలోచనను అభినందించకుండా ఉండలేము!
‘మేరా భారత్ మహాన్’ కవితలో..తరం తరం మారడమంటే..అంతరాలు మారడమేనా? మానవత్వం మరిచి పోవడమేనా? అని ప్రశ్నించారు. కన్న తల్లి లాంటి మన చెరువులను మనమే కంటికి రెప్పలా కాపాడుకుందాం..పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని చాటుదామని ‘చెరువు’ కవితలో పిలుపునిచ్చారు. బ్రెయిన్ డెడ్‌తో మరణించిన విశాఖకు చెందిన ‘సాయి మనోహర కృష్ణ’పై రాసిన కవితలో అవయవదానం ప్రాశస్త్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. ‘మహిసరి’ కవితలో తన సతీమణి సరితపై కవి ప్రేమతో రాసిన పంక్తులు వారి అన్యోన్న దాంపత్యానికి అద్దం పట్టేలా ఉన్నాయి! ఇలా అభ్యుదయ భావాలతో వున్న ఎన్నో కవితలు ఈ గ్రంథంలో ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి!
వస్తు ఎంపికలో వైవిధ్యం..అభివ్యక్తిలో నవ్యత పాటించేందుకు కవి మరిన్ని మెలకువలు తెలుసుకుంటారని ఆశిద్ధాం..అధ్యయనంపై దృష్టి సారించి తమ కలానికి పదును పెట్టుకుంటారని విశ్వసిద్ధాం..ఆయన సామాజిక చింతనకు అభినందనలు తెలుపుదాం..కలం ఆగిపోయేదాకా..కలలు తీరి పోయేదాకా..కాలం ఒడిలో రాలిపోయేదాకా రాస్తూనే ఉంటానన్న ఆయన కోరిక నెరవేరాలనీ..ఆయన రాస్తూనే సాగిపోవాలని కోరుకుందాం! ఆయన అక్షరం కార్మికుల చేతుల్లో ఖడ్గమై నిలిచేదాకా..శ్రామిక యెదల్లో ఎర్రని పూలై వికసించే దాకా ఆయన కవిత్వం సాగిపోవాలని కోరుకుందాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

***
మనోగీతికలు

రేపటి గూర్చి...

కాలం కన్నీటి చుక్కల మీద నడుస్తున్నప్పుడు
సూర్యుడు కొండను కౌగిలించుకోవటం
నేను చూశాను
ఇక్కడంతా చీకటి
పెరిగిన ధరల మీద ఒట్టు
నేను చీకట్లోనే కవిత్వం వ్రాస్తున్నాను
అక్షరాలు కనిపించటం లేదనే గోల నాకు లేదు
అంతరాత్మ దుఃఖం అక్షరాలుగా మారుతున్నపుడు
కవిత్వం కదనరంగాన్ని సృష్టిస్తుంది
పెరిగిన కందిపప్పు మీద ఒట్టు
నేను వెలుగు కొరకే కవిత్వం వ్రాస్తున్నాను
ఎక్కడ వెలుగును వెదుక్కోవాలి నేను!
కన్నీటిలో వెలుగెందుకుంటుంది
ఉరి పెట్టుకొన్న రైతు శవం
సూర్యున్ని విసిరి కొట్టినపుడు
వెలుగెక్కడిది?
వాడి శవం కాలుతున్నపుడు
స్మశానం మంటలో నుండి వెలుగు ఏరుకోవాలని
ప్రయత్నించాను కానీ
నాకు నిప్పు కణికలు దొరికాయి
ఇప్పటికైతే అవి నాగుండెల్లో జాగ్రత్తపర్చాను
మండుతున్న శ్రమజీవి గుండెమీద ఒట్టు
రేపు
యుద్ధ రంగంలో ఆయుధాలుగా వెలిగేవి
ఆ నిప్పు కణికలే!

- సిహెచ్.మధు సెల్.నం. 9949486122

కాస్త వెతకండి ప్లీజ్!

వెతికి వేగిపోయాను
అలిసి సొలసి ఆగిపోయాను
దయచేసి ఎవరికైనా
మనిషి జాడ కనిపిస్తే..
కాస్త కబురుచేయండి!
పోనీ పొరబాటునైనా..
మనిషిలా అనిపిస్తే
అడ్రస్ చెప్పండి!
ఈలోపల నాలోపల
మానవత్వం జాడ ఇంకా
ఎంత మిగిలి ఉందో
కనుక్కుంటాను!
స్పందించే గుండె
సత్తుబండలా మారకుండా
ఏదైనా సూది మందు
కొనుక్కుంటాను!
మీరు మాత్రం
కాస్త వెతకండి ఫ్లీజ్!!

- పెనుగొండ బసవేశ్వర్
కరీంనగర్
సెల్.నం.9059568432

మనిద్దరం!

నువ్వు - నేను కలిసి..
ఒకటయ్యాం మనిద్దరం!
నిన్నటి నుంచి..
పాఠం నేర్చుకుని
కఠినమైన నేటిని మోశాం!
రేపటి కోసం..
ఒకరికొకరం తోడుంటూ
అడుగులు ముందుకేస్తున్నాం!
నన్ను వెన్నంటి నువ్వు
నిన్ను వీడని నేను..
నిశ్వబ్ధంగా మనిద్దరం
ఎన్ని క్షణాలు యుగాలుగా
గడిపాయో మనకు తెలుసు!
ఎన్ని రాత్రులు నక్షత్రాలను
రంగవల్లులుగా తీర్చిదిద్దిన సంగతీ తెలుసు!
నా విశ్వాసమే నీవై..
నీ ఆశయమే నేనై..
రేపటి అద్భుతం కోసం
మనిద్దరం ఆత్రంగా వీక్షిస్తన్నాం!
నువ్వేమో..
గుండె నిండిన గెలుపువై...
నేనేమో ఓటములెరుగని సాధనకై
గమ్యం వైపు..
విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం!
ఇక త్వరలోనే..
మనిద్దరం ఫలించిన సంకల్పాలకు
ప్రతీకలవుదాం!
నువ్వు - నేను - వెరశి
మనిద్దరమని జగతికి చాటి చెబుదాం!
- రామానుజం సుజాత
కరీంనగర్
సెల్.నం.9701149302

పిడకలు

పల్లెటూళ్లలో..
మట్టి గోడలకు చరిచిన
పేడ పిడకల కళకళలు!
ఆనాడు ఇంటింట
పిడకల పొయ్యి వంట
ఇంటి నిండా ఆ పొయ్యి పొగ
క్రిమికీటకాదుల పాలిట సెగ
కాలిన పిడకల బూడిద
వంట పాత్రలకు ‘డిటర్జెంటు’
పళ్లు తోమడానికి ‘ఫేస్టూ’
అగ్ని పునీతం..ఆరోగ్యకరం!
‘పిడకల పేట’..‘ఎవర్ గ్రీన్’
నాడు..రామాయణంలో
నేడు..ప్రపంచీకరణ నేపథ్యంలో!
నవనాగరీకులు వేసుకునే భోగి మంటలకు
‘కౌడంగ్’ కేకులు ఈ పిడకలే!
గ్రామీణ సాంప్రదాయ కళా సంస్కృతులకు
అవి ఓ గీటు రాయి!
విలువ..అతీతం
ఉపయోగం..వర్ణనాతీతం!
ఉన్నతమైనదైనా..
ఉన్నదాన్ని వదులుకోవడం
కొత్తదానికై ఆశించడం
పరుగులెత్తే నాగరికతల ప్రహసనం!

- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్
సెల్.నం.7893366363

తెల్ల కాగితం

రోడ్డు పొడవునా ఆగిన రైలు డబ్బాల్లా
ఆ ప్రహరీ గోడ
సీతాకోక రంగులు పూయించిన
అక్షరాల పూలకుండీ
చీరలు ఆరబెట్టుకున్న దండెంలా
వస్త్ర వ్యాపార ప్రకటనల మట్టితెర
రెపరెప లాడుతూ వుండే
సినీ ప్రియుల వినోద చిరునామా సూచిక!
ఆ గోడ
పరాయి పెత్తనం కుప్పకూల్చిన యుద్ధ్ఫిరంగి
పిడికిలెత్తి జైకొట్టి
నినాదాల గళమెత్తిన
నవ తెలంగాణ ఉద్యమ వారధి
ఇప్పుడా హిందీ గుర్రం
వాళ్లంతా సున్నం పూసుకున్నది
ఏ అర్ధరాత్రి వేళకో
ఏ ఉద్యమ చిత్రకారుడో వస్తాడని
రక్తంతో తడిపినట్టు
నాలుగు అక్షర సూర్యుల్ని
దించిపోతాడని
ఎదురు చూస్తున్నా తెల్ల కాగితం!!

- గజ్జెల రామకృష్ణ
భూదాన్ పోచంపల్లి, నల్లగొండ జిల్లా
సెల్.నం.8977412795

గుణదీపం

ఉత్తేజం లేని పలుకు
ఉల్లాసం లేని బ్రతుకు
ఎన్ని ఉన్నా నిష్ఫలమే
మంచి మాటల మూటను
ఎంచి చూసే పని లేదు
అది నిలువెల్లా బంగారమే
జీవనం అంటే మధురభావనమే
వ్యర్థమైన తామసం
అర్థం లేని రాక్షసం
జీవితాన్ని నాశనం చేస్తుంది
ఏది చేసినా సార్థకంగా
ఏది రాసినా పరమార్థకంగా
మనిషి మనుగడ కొనసాగాలి!
మనిషి ఎప్పుడూ మహిమగలవాడే
అతనిలోని వివేకం
అనుక్షణం ఉదయించినప్పుడు!
మానవత్వం నినదించినప్పుడు!!
- డా. అయాచితం నటేశ్వరశర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557

ప్రవహించే నదిలా..

కనిపించని దారం ఆధారంతోనే కదా
గాలిపటం ఆకాశంలో కనువిందు చేసేది
ఆందోళనపాలైన మనిషికి
కనిపించని ధైర్యమే కదా ఊరడించేది
సంఘటితంగా ముందుకు కదిలినప్పుడు
ఎంతటి విజయమైనా
ముంగిట వాలాల్సిందే!
సాహసమే ఊపిరిగా పోరాడినప్పుడు
రంగమేదైనా గెలుపు మన సొంతమే కదా!
కనిపించే దారులన్నీ
సమస్యల ముళ్లతో స్వాగతించినపుడు
సహనమే సాధనంతో అడుగుముందుకు వేస్తే
చేరవలసిన గమ్యం
చేరువలోనే దర్శనమిస్తుంది!
చంచలమైన మనస్సును
నియంత్రింలేనప్పుడు
చిన్న లక్ష్యమైనా
చేదించలేవని భయపెడుతుంది
నిత్య చైతన్యవంతమైన జీవన సరళి
ప్రవహించే నదిలా పవిత్రమైనదే కదా..!

- పొద్దుటూరి మాధవీలత
ఎడపల్లి గ్రామం
నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9030573354

నా మాతృభూమి

ఓ నా భరత ఖండమా
కాకినైనా కాకపోతిని
నీపై కథలెన్నో అల్లడానికి..
కోకిలనైనా కాకపోతిని
నీపై పాటలెన్నో పాడడానికి..
పక్షినైనా కాకపోతిని
నీ గొప్పలెన్నో చెప్పడానికి..
లేగనైనా కాకపోతిని
నిను అమ్మా అని పిలువడానికి..
తల్లీ నీ రుణమెలా తీర్చుకోనూ
నేనెచట ఉన్నా ఏమి చేసినా..
నీవే కదా నా మాతృభూమివి!
నా భరత భూమివి!
నా కన్న తల్లివి
నా భాషవు, నా తనువును
నా శ్వాసవు నా ధ్యాసవు
నీవే కదా నా ప్రాణం!!

- అనభేరి విప్లవకుమారి
కరీంనగర్
సెల్.నం.9000282372
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ఎస్.ఎస్.గుట్ట, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, మహబూబ్‌నగర్ - 509 001. merupumbn@andhrabhoomi.net