విజయవాడ

వందనాలు! వందనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వందనాలు! వందనాలు!
వందనాలు! వందనాలు! గురులకూ!
అభివందన హరిచందనాలు గురులకూ!
మా గురులకూ! బుధవరులకూ!! వందనాలు!!
చిట్టి చిట్టి కథలెన్నో చెప్పీ
పొట్టి పొట్టి పాటలెన్నో నేర్పీ
చైతన్యాన్నందించే గురులకూ!
మా చీకటి తొలగించే దినకరులకూ! వందనాలు!!
బుజ్జి బుజ్జి బుద్ధులు మేల్కొలిపే
గుజ్జెనగూళ్లుగ సుద్దులు తెలిపే
బుజ్జగించు నేటి మేటి ఒజ్జలకూ
గుణ పరిమళాలు చల్లు పూలసెజ్జలకూ!! వందనాలు!!
దేశభక్తి, జీవయుక్తి కూర్చీ
ధైర్యసాహసైక శక్తి పేర్చీ
కుదురుగ చదువును చెప్పే గురులకూ
విజ్ఞాన ఫలాలిచ్చే సురతరులకూ!! వందనాలు!!
- ‘విశాఖ’, గుంటూరు.

***

బోధతరువు.. గురువు (శ్రీగురవేనమః)
‘కురవబోయే వర్షమేఘం వంటివాడు - ఉపన్యాసకుడు’ అన్నారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు ఒకప్పుడు. నిజమే. ఉపన్యాసకుడంటే ఇక్కడ ఉత్తమగురువని కూడా చెప్పుకోవచ్చు.
‘చోద్యంబయ్యెడు నింతకాలమరిగెన్ శోధించి యేమేమి సం
వేద్యాంశంబులు చెప్పిరో? గురువులేవెంటం బఠింపించిరో? విద్యాసారమెఱుంగ గోరెద-్భవద్విజ్ఞాత శాస్త్రంబులో;
పద్యంబొక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా!’
అనే పద్యం ద్వారా ఉత్తమ గురువుల లక్షణాన్ని రాక్షసరాజైన హిరణ్యకశిపునిచే కుమారుడైన ప్రహ్లాదునితో ప్రశ్నారూపంలో పలికించారు- పోతనగారు భాగవతంలో. ఉత్తమ గురువైనవాడు తాను శిష్యులకు చెప్పదలచుకున్న అంశాన్ని కూలంకషంగా పరిశోధించాలి. తనకు తెలిసిందల్లా బలవంతంగా రుద్దినట్లుగా శిష్యులకు చెప్పేయగూడదు గురువు. ఆ విష్యుల స్థాయి, తరగతిని బట్టి వారు తెలుసుకోదగిన అంశాలనే ఆసక్తికరంగా బోధించాలి. కేవలం పాఠాలను చెప్పి, ఒళ్లు దులిపేసుకొని వెళ్లిపోగూడదు గురువు. వెంట ఉండి మరీ చదివించాలి. వల్లె వేయించాలి. అంటే ‘ట్యుటోరియల్ మెథడ్’ అన్నమాట. ఈ పద్ధతిని పాటిస్తే శిష్యులందరూ ప్రహ్లాదులే అవుతారని చెబుతోంది భాగవతం. గురువులు కేవలం చండామార్కులు కాకూడదు. అపరకీచకులు అసలు కాకూడదు. సాందీపనులూ, వసిష్ఠులూ, విశ్వామిత్రులు కావాలి. అప్పుడే సమాజంలో శిష్యులు బలరామకృష్ణరామచంద్రులుగా తయారవుతారు. ఉత్తమగురువు అర్హత కలిగిన శిష్యుణ్ణి అనే్వషిస్తాడు. రామకృష్ణ పరమహంస అటువంటి గురువు. కాబట్టే స్వామి వివేకానంద వంటి శిష్యుణ్ణి లోకానికి అందించగలిగాడు. కేవలం మార్కులపై ఇష్టము కలిగిన ‘మార్క్సిష్టులు’గా విద్యార్థుల్ని తయారు చేయరాదు గురువు. జీవితాన్ని చెప్పాలి గురువు.
మరో విశేషమేమంటే, వ్యక్తి ఏ ఉద్యోగ పదవిలో ఉన్నా రిటైర్డు కానంతవరకే అడతు గౌరవం పొందుతాడు. కానీ గురువృత్తి అటువంటిది కాదు. గురువు రిటైర్డ్ అయినాసరే కనిపిస్తే చాలు శిష్యులెవరైనా తప్పక నమస్కరిస్తారు. అటువంటి గౌరవాన్ని పొందేవాడు గురువొక్కడే. అలాగని ఉపాధ్యాయ వృత్తి నిర్వహణం అంత తేలికైనదని అనుకోకండి. అందులోనూ శ్రమ ఉంది. బరువూ బాధ్యతలున్నాయి. అసలు సంఘంలో గురువుకున్న స్థానం ఎటువంటిదో సాధారణ పాఠకులు కూడా అర్థం చేసుకునేలా కవి నలిమెల భాస్కర్ ‘బోధివృక్షం’ అనే వచన కవితలో ఇలా తెలియజేశారు.
‘పిల్లలకు పాఠాలు చెప్పిచెప్పి
పెళ్లలు పెళ్లలుగా రాలిపోతావు
ఏ పుట్టలో ఏ శేషుడున్నాడో
అన్న అచంచల విశ్వాసంతో
అదేపనిగా అజ్ఞాన వస్త్రాలు ఉతికిన
నీగొంతు సబ్బుబిళ్ల
క్షణక్షీణమానమై హరించుకుపోతుంది
ఎత్తి నమస్కరించిన రెండు చిన్న చేతులు
రీచార్జి చేసి నిన్ను మళ్లీ
నిటారుగా నిలబెడతాయి
నీ చేతి పొత్తిళ్లలో సుద్దముక్క
పసిపాపై ఒదిగి కొవ్వొత్తిలా కరిగిపోతుంది
రాత్రి ఆలుబిడ్డల్ని వదిలివెళ్లిన గౌతముని
బుద్ధుణ్ణి చేసినట్టు
పగలు తల్లిదండ్రుల్ని
విడిచి వచ్చిన విద్యార్థిని
సిద్ధార్థుని చేసిన నువ్వు
బోధివృక్షానివి
నువ్వొక బోధవృక్షానివి’!
ఈ కవితలోని ‘అదేపనిగా అజ్ఞాన వస్త్రాలు ఉతికిన నీ గొంతు సబ్బుబిళ్ల’ అనే వాక్యంలో గురువు గొంతును సబ్బుబిళ్లతో అభేదంగా పోల్చిచెప్పడం వినూతనాంశం. ఆ గొంతు అనే సబ్బుబిళ్లతో శిష్యుల అజ్ఞాన వస్త్రాలను అదేపనిగా గురువు ఉతుకుతాడట. అదేపనిగా ఉతకడం వల్ల ఆ గొంతు అనే సబ్బుబిళ్ల క్షణక్షణ క్షీణమానమై హరించుకుపోతుందని అనడంలో ఆ గురుని ఆర్ద్రస్థితిపరమైన అనుభూతిని కళ్లకు కట్టించారు కవి. అలాగే ‘నీ చేతి పొత్తిళ్లలో సుద్దముక్క పసిపాపై ఒదిగి కొవ్వొత్తిలా కరిగిపోతుంది’ అనే పోలిక భావన అమోఘంగా, వినూతనంగా ఉంది. బోధకుడు తన బోధనతో విద్యార్థిని సిద్ధార్థుణ్ణి చేస్తాడు గదా! ఆనాడు గౌతముని బోధివృక్షం బుద్ధుణ్ణి చేసింది. కాబట్టి గురువును ‘నువ్వు బోధివృక్షానివి, నువ్వొక బోధవృక్షానివి’ అంటాడీ కవి. ఆనాడు గౌతముడు ఆలుబిడ్డల్ని విడిచి వచ్చాడు. ఈనాడు విద్యార్థి పగటిపూట తన తల్లదండ్రుల్ని విడిచి వస్తాడు పాఠశాలకు. చూశారా! ఎంతటి సమగ్ర సమన్వయాత్మక వినూతనమైన పోలిక కలిగిన కవితా వాక్యమో ఇది! ఇటువంటి రూపకాలంకార రూపమైన పోలిక- గురువర్ణన పరంగా మరెక్కడా కానం.
ఇలా అంకితభావంతో పాఠ్యబోధన చేసి శిష్యుల బతుకుల్ని తీర్చిదిద్దిన గురువులెందరో ఉన్నారు. సాహిత్యరంగంలో ఆ గురువుల గొప్పదనాన్ని కీర్తిస్తూ అక్షర దక్షిణల్ని సమర్పించిన శిష్యులు కూడా ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణగారొకరు. తమ రామాయణ కల్పవృక్షంలో..
‘అలనన్నయ్యకు లేదు, తిక్కనకు లేదాభాగ్యమస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాఁడట్టి దావ్యోమపే
శల చాంద్రీమృదుకీర్తి చెళ్లపిళవంశ స్వామికున్నట్లుగన్’
అని తమ గురువైన చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తీగారిని ప్రశంసించారు. ఇది మామూలు ప్రశంసకాదు. తమవంటి సరస్వతీమూర్తి శిష్యుడైనాడన్న అదృష్టం- చెళ్లపిళ్లవారికి కలిగినట్లుగా అలనాటి నన్నయకు గానీ, తిక్కనకు గానీ కలుగలేదన్నారు. ఈ పద్యంలో ఎక్కువ భాగం తమ గొప్పతనాన్ని తాము పొగడుకున్నట్లుగా పైకి కనిపిస్తుంది. కానీ ఈ గొప్పదనాన్ని అంతా గురువైన చెళ్లపిళ్ల వారికి ఆపాదించారు. తమ గురువుగారికి దక్కిన ఇటువంటి అదృష్టం- నన్నయ, తిక్కనలకు గూడా లేదుపొమ్మన్నారు. అభివక్తీకరణలో ఇదొక గడుసుదనంతో గూడిన చమత్కారం. పైకి తమ గొప్పదనాన్ని తామే చాటుకొని విశ్వనాథవారు అహంకారాన్ని ప్రదర్శించారని అనుకుంటారు. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాస ప్రకటనం! అలాగే పింగళి లక్ష్మీకాంతం - కాటూరి వేంకటేశ్వరరావు అనే జంటకవులు తమ ‘సౌందరనందం’ పద్యకావ్యాన్ని చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తీగారికే అంకితమిచ్చి, అక్షర గురుదక్షిణ ప్రభను చాటారు. పింగళి వారికి శిష్యుడైన డా.నండూరి రామకృష్ణమాచార్యులుగారు కూడా ‘ఉత్తమోత్తమ గురుల శిష్యుండనైతి’నని తమ సంతుష్టిని తేటతెల్లం చేశారు.
చివరగా ఒకమాట! ఏ యుగంలో ఎప్పుడు చూసినా శిష్యునికంటే గురవే గొప్పవాడు. ఎలాగంటారా? పోరెడ్డి రంగయ్యగారు చమత్కారంగా చెప్పినట్లుగా.. ‘గురువు’కు మూడు కొమ్ములు. ‘శిష్యుడు’కు రెండే కొమ్ములు - అక్షరాల్లో. ఇక్కడ ‘కొమ్ములు’- ‘కొమ్ములొచ్చాయ్’ అనే అర్థంలో వాడలేదండోయ్! శబ్ద స్వరూపంలో వున్న కొమ్ములవి! అవి వాళ్ల గొప్పదనానికి గుర్తులనుకోవచ్చు. అందుకే ‘శ్రీగురవేనమః’ అని అందరం అనాలి. ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి’ గణపతి చవితి పండుగనాడే ఈసారి ఉపాధ్యాయ దినోత్సవం. ఆ వినాయకుని కృపతో గురువులందరూ బోధతరువులు కావాలి. అప్పుడే డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆత్మ నిజంగా ఆనందాన్ని పొందుతుంది.

***
మనోగీతికలు
***
జీవచ్ఛవం!
కావాలని నువ్వు పుట్టలేదు
కావాలని గిట్టలేదు
కానీ..,
కావాలనే నన్ను ప్రేమించావు
మట్టిముద్దను మహరాణిలా
మలిచావు
చక్కని కాపురపు
కిరీటాన్ని తొడిగావు
రత్నాల బిడ్డల రాజ్యాన్నిచ్చావు
అత్తమామల సేవలకు
అంతరంగ సింహాసనమిచ్చావు
బంధుజనం బాగోగుల భాగ్యమిచ్చావు
ఇరుగుపొరుగు హితాన్ని కోరే
ఇంగితాన్నిచ్చావు
అన్నీ ఇచ్చిఇచ్చి
హఠాత్తుగా అంతర్థానమయ్యావు
జీవచ్ఛవంలా
ననె్నందుకు మిగిల్చావు?

కోపూరి పుష్పాదేవి,
విజయవాడ.
చరవాణి : 9440766375
***
నువ్వూ మానుగా
మారాల్సిందే..
కోటికి పైగా వసంతాశలతో
కొమ్మరెమ్మలు పారాల్సిందే
దాగి మాగిన కాయ కోసం
శిలకైనా నోరూరాల్సిందే
తెల్లబోయే తారలకంటే
రంగులమయ పూవుల కోసం
పడిచస్తూ ఆకాశమైనా
పచ్చదనాన్ని కోరాల్సిందే
నెత్తిపై వేసంగి సూరీడు
నిప్పులు చెరిగే రోజున
ఏసీల్లోని శ్రీమంతుడైనా
చెట్టునీడకు చేరాల్సిందే
మెరుపు ఉరుములతోటి
వాన నిన్ను తరుముతుంటే
ఏ చెట్టు కిందికో ఉరికి
కాసేపు ఆగితీరాల్సిందే
బతికి బట్టకట్టే కాంక్ష
బలీయమైతే; బండల్లోనూ
వేళ్లూనుకునే పట్టులకు
కోట బీటలువారాల్సిందే
మనుగడ కోసం
ఎవరైనా పోరాడాల్సిందే!

ఫైజ్, ఖమ్మం. చరవాణి : 9581219058
***

తూ మేరీ అజాఁన్ హై!
నాలా ఇలా జగమంతా
గాలించేవాడు ఎవడూ లేడు
ఆకాశ వీధులన్నీ అందంగా మెరిపించే
నీవంటి తారక మరొకటి లేదు
వర్ష ఋతువుతో పాటు
పుట్టుకొచ్చే పచ్చదనానివి నువ్వు
హేమంతంలోని మంచుతెరల పైని
లేత వెండి మెరుపువి నీవు
నడిరేయి హాయివి నీవు
వేకువజామున సుప్రభాత గీతానివి
కోరికల దుప్పట్లలో నేనాదమరిచిన వేళ
నన్ను తట్టిలేపే స్పృహవు నీవుకాదా!
నువ్విప్పుడు ఎలా ఉన్నావో
ఎప్పుడూ అలాగే ఉంటావు కదా!
ఇప్పుడు నాతో ఏమి చెపుతున్నావో
అది మాత్రమే చేస్తావులే!
ఒక్కోసారి చెలీ
నువ్వు అగ్గిలా చుట్టేస్తావు
మరోసారి జోరువానలా తడిపేస్తావు
ఉదయాన నీ గుండె భరిణెకు తాళం వేస్తావు
సందె వేళకు నీదంటూ ఉన్న
ప్రతిదానినీ చాపలా పరుస్తావు!
సఖీ.. నువ్వు అలాగే ఉండు
నిత్యం ఆశలు చెరిగిపోతూ ఉండే
మన తలరాతల రచనల్లో..
అంతలోనే సుఖదుఃఖాలు మొలిచే
ఎగుడుదిగుడుల జీవితపు రాస్తాల్లో
ప్రియా! నీ సాంగత్యం నాకుండాలి
నీ స్నేహ సౌభాగ్యం నాలో పండాలి
ఈ కొద్దిపాటి జీవితపు కాగితంపై
నా ఈ భావావేశాల దర్పణాలపై
నీ జ్ఞాపకాలు సంతకాలై మెరవాలి!
బంగారం! నీకు బాగా తెలుసు కదా
ఈ ఊపిరి ఆవిరవుతున్న వేళ కూడా
నీపై ఆశువుగా కవితలల్లగలనని!

(‘సుల్తాన్’ సినిమాలోని ‘జగ్ ఘూమే ఆతారె జైసా న కోరుూ’ పాట ప్రేరణతో)
(* అజాన్: వేకువజామున నమాజు కోసం పిలిచే పిలుపు)

వేణు మరీదు,
పెనుబల్లి, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9848622624