ఉత్తర తెలంగాణ

చినిగిన నోటు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి పది గంటలు యశోదమ్మ ఒంట్లో కాస్తా నలతగా ఉండడం వల్ల త్వరగా భోజనం చేసి పక్కలోకి చేరింది. అలసిన దేహం నిద్రలోకి జారుకుంది.
‘అమ్మా! ఫోన్ నీకే’ చిన్న కూతురు నిద్ర లేపి సెల్‌ఫోన్ చేతికందించింది.
‘అమ్మా... భోజనం అయ్యిందా... పడుకున్నావా?’ ఫోన్ చేసింది పెద్ద కూతురు వందన.
‘కాస్త తలనొప్పిగా ఉంటేనూ, త్వరగా పడుకున్నాను’
‘అమ్మా! రేపు ఆఫీసులో చాలా పనుంది. నేను అక్కడికి రావడం లేదు. నీవే పిల్లల్ని తీసుకుని హైదరాబాద్‌కురా!’
‘అలాగే... వస్తాలే!’
‘నీవు హైదరాబాద్ రాగానే ఫోన్ చేస్తే నేను గానీ, మీ అల్లుడు గారు కానీ వచ్చి రిసీవ్ చేసుకుంటాం.’
‘సరే... అలాగే’ అని ఫోన్ పెట్టేసి నిద్రకుపక్రమించింది యశోదమ్మ.
***
ఉదయం తొమ్మిదింటికే పెద్ద కొడుకు రమణ బస్టాండు వరకు వచ్చి పిల్లల్ని, లగేజిని బస్సులోకి అందించి సీట్లలో కూచోబెట్టాడు. పిల్లలకు టిఫిన్, పాలు రమణతో తెప్పించి తయారుగా ఉంచుకుంది. ప్రయాణం మధ్యలో ఆకలి తీర్చడానికి, అల్లరి మాన్పించడానికి.
కూతురు ఉద్యోగం కారణంగా పిల్లలిద్దరినీ తన దగ్గరే ఉంచుకుంది యశోదమ్మ. కొడుకు, కూతురు చిట్టి కూడా వస్తానని మారాం చేయడంతో ముగ్గురు పిల్లలు, మూడు బ్యాగులతో ప్రయాణమయ్యింది.
బస్సు బయలుదేరింది. పిల్లలు వాళ్ల ఆటలో పడిపోగా, యశోదమ్మ కిటికీలోంచి కనబడుతున్న దృశ్యాల్ని చూడటంలో లీనమైంది.
ఏమిటో! ఈ కాలం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సి వస్తోంది. పిల్లల్ని చిన్నతనంలోనే అమ్మమ్మ, నానమ్మల దగ్గరో ఆయాల దగ్గరో ఉంచాల్సి వస్తోంది. పిల్లల ముద్దూ ముచ్చట్లు చూడగల భాగ్యం ఏ కొద్ది మంది తల్లిదండ్రులకో అంటూ నిట్టూర్చింది యశోదమ్మ.
‘అమ్మమ్మా... ఆకలేస్తోంది, టిఫిన్ పెట్టవూ! నానమ్మా! నాకూ ఆకలేస్తోంది’ మనుమలు, మనుమరాలి మాటలతో ఈ లోకంలోకి వచ్చిన యశోదమ్మ టిఫిన్ తినిపించి, పాలు తాగించింది, ముగ్గురు పిల్లలు మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. యశోదమ్మకు మాత్రం బస్సు కుదుపులకు నిద్ర రావటం లేదు.
సిద్ధిపేటలో బస్సు ఆగింది. దిగేవాళ్లు దిగుతున్నారు. ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు.
ప్రయాణికుల్ని తోసుకుంటూ చిరుతిండ్లు అమ్మే పిల్లలిద్దరూ బస్సు ఎక్కారు. వాళ్ల అరుపులకు నిద్రలేచిన పిల్లలు చిప్స్ కావాలంటూ, బిస్కట్లు కావాలంటూ మారాం చేయడం ప్రారంభించారు. పిల్లలడిగినవన్నీ కొని పెట్టి అవి అమ్మేవాడి చేతికి వంద రూపాయల నోటు ఇచ్చింది యశోదమ్మ.
అవి అమ్ముకునేవాడు ఏవో లెక్కలు చెప్పి ఆమె చేతిలో ఇరవై రూపాయల నోటు పెట్టి, బస్సు దిగి కనబడకుండా పోయాడు. ఓ పక్క ముగ్గురు పిల్లల అల్లరి మరో పక్క అమ్ముకునేవాడి హడావిడి యశోదమ్మ సరిగా లెక్క చూసుకోలేకపోయింది. వందలో మిగిలింది ఇరవయ్యేనా! అని ఆలోచిస్తూ ఆ నోటును పరిశీలనగా చూసింది. అది పూర్తిగా చినిగిపోయిననోటు. అందులోనూ సగం ముక్క మాత్రమే తన చేతిలో పెట్టి తన మోసం తెలుసుకునేలోగా బస్సు దిగి కనిపించకుండా పోయాడు వాడు.
‘ఏయ్.. బాబూ.. ఇలారా’ అంటూ అరుస్తూనే ఉంది యశోదమ్మ, వాడక్కడ వుంటే కదా, ఆమె మాటలు పట్టించుకోడానికి.
ఇంతలో బస్సు కదలింది. యశోదమ్మ కోపం కట్టలుతెంచుకుంది వీడేనా! ఈ దేశ భావి భారత పౌరుడు! ఇప్పటి నుండే ఇలా మోసం చేసి బతకడం ప్రారంభిస్తే వీడు ముందు ముందు సమాజానికి సమస్యగా పరిణమిస్తాడు.
చేసేదేమీ లేక వౌనంగా ఉండిపోయింది యశోదమ్మ.
***
రాత్రి భోజనాల దగ్గర చినిగిన నోటు కథ, ఆ అమ్ముకునే వాడి ప్రవర్తన కథలు, కథలుగా చెప్పింది యశోదమ్మ.
మరిచిపో అమ్మా! ఇలాంటి సంఘటనలు ఈ రోజుల్లో మామూలే అనునయించింది కూతురు.

- గరిశకుర్తి శ్యామల
కామారెడ్డి
సెల్.నం.9493702652

---
పుస్తక సమీక్ష
---
చమక్కులు...
చెణుకుల ‘మిర్చీలు’!
బత్తుల వీవీ అప్పారావుగారు తన ఏడో గ్రంథంగా ‘‘మనుషులు మరియు పక్షులపై మిర్చీలు’’ను వెలువరించి మినీ కవితల ఘాటును పది మందికి పంచారు. మినీ కవితలు కొత్త ప్రక్రియ కాదు.. మినీ కవితలకే తన బ్రాండ్‌నేమ్‌గా ‘మిర్చీలు’ అని నామకరణం చేసి భావబలంతో ఈ గ్రంథంలో సమాజంలోని రుగ్మతలపై అప్పారావుగారు తన కలాన్ని సంధించారు.. పెద్దూరు వెంకట దాసుగారి సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న ఈ పుస్తకానికి పలువురు ప్రముఖుల ముందు మాటలు నిండు శోభను కూర్చాయి. నిజాన్ని నిర్మొహమాటంగా ప్రకటించడానికి ‘మిర్చీ’లను ఎన్నుకున్న కవి అప్పారావుగారు ఆధునిక నాగరిక జీవితంలోని ధోరణులను తమ మినీ కవితల ద్వారా తూర్పారపట్టారు. వీటిలో కవిత్వాంశ కోసం వెతికే పాఠకులు నిరాశకు గురైనప్పటికీ.. ఆయన సామాజిక బాధ్యతను మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ మిర్చీల్లో చిన్నచిన్న వాక్యాలు రెండు లేదా మొడు కన్పిస్తాయి! క్లుప్తత, స్పష్టతతో అక్షర క్రమంలో.. రూపుదిద్దుకున్న మిర్చీలు సూటిగా, ధాటిగా పాఠకులకు చేరేలా వున్నాయి.
ఇవన్నీ అంత్య ప్రాసలతో అలరిస్తాయి. సామెతలను పోలిన బిగితో రూపుదిద్దుకున్న ఈ మిర్చీలు చమక్కులతో.. చెణుకులతో.. చమత్కారంతో.. జోకుల్లా పేలి... గుండెలోతుల్లోకి వెళ్తాయి! నాదాలు, నినాదాలుగా అగుపించే మినీ కవితలు సామాజిక చైతన్యానికి దోహదపడతాయి.. జీవన శైలిని తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడతాయి. పిల్లలు, పెద్దలు ఇష్టపడేలా ఇందలి రచన కొనసాగింది. వ్యంగ్యాస్త్రాలతో సాగే ఇందలి మిర్చీలు... తప్పులను సరిచేసుకునేలా నర్మగర్భ భావాలతో.. పాఠకుల్ని వెంటాడుతాయి! మనుషులపై రాసిన మిర్చీలు పరిశీలిస్తే... కవి అప్పారావు ప్రయోగించిన పదబంధాలు ఆయా కవితల్లో చక్కగా ఒదిగిపోయాయి! అత్త ‘‘హై’’కమాండ్, కోడలు ‘‘లో’’కమాండ్. మధ్యలో మనవాడు, మగవాడు’’ అని చమత్కరించారు.
అత్త సుత్తి, కోడలు కత్తి.. ఇల్లు అసెంబ్లీ అంటూ మూడు ముక్కల్లో అత్తాకోడళ్ళ అనుబంధాన్ని సుతిమెత్తగా చెప్పారు.
ఇంట్లో ఓడినవాడు బయట సక్సెస్. బయట ఓడినవాడు ఇంట్లో సక్సెస్, ఇక్కడా, అక్కడా ఓడినవాడు వల్లకాడులో సక్సెస్ అని వ్యాఖ్యానించారు. నాటి ‘లో దుస్తులే’ నేటి ‘పై దుస్తులు’... రేపు ‘నో దుస్తులు’? మళ్ళీ మొదటికేనా మానవజాతి? అని ప్రశ్నించారు. హాస్యమే జీవితం.. హాస్యం లేని జీవితం అపహాస్యమని భావించే అప్పారావుగారు మనుషులపై చమత్కారంగా ప్రకటించిన మిర్చీల్లో కావలసినంత మసాల ఘాటుంది.. జీవితానికి చూపించే రూటుంది... అయితే దేన్ని పడితే దాన్ని కవిత్వీకరించాలన్న తపనలో... అయిందాన్ని.. కాని కాన్ని మిర్చీగా పేర్చి... గ్రంథంలో చేర్చారు.. వందలాది మిర్చీలు రాసినప్పటికీ. వాటిలో కొన్ని మాత్రమే మినీ కవితకు వుండాల్సిన లక్షణాలు కలిగి వున్నాయి.. ఇక.. పక్షులపై రాసిన మిర్చీలు సైతం కవి యొక్క పరిశీలనా పటిమకు అద్దంపట్టేలా వున్నాయి. దోమలకు అభిమానులు ఎక్కువ.. అవి చచ్చేంతవరకూ చప్పట్లే అని చమత్కరించారు. కోడి అయినా, కోడలు అయినా ఒకటే... వేపుకు తింటుంది అత్త అని వ్యాఖ్యానించారు. ఇలా ఎన్నో మినీ కవితలు ఉదహరించవచ్చు... పక్షులపై అంటూనే పశువులన్నింటి పై మిర్చీలు రాశారు...
ఒకే పుస్తకంలో రెండు భాగాలను చేర్చి.. ధర మాత్రం రెండింటికీ విడివిడిగా నిర్ణయించి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.. కవి అప్పారావు గారివద్ద సృజనాత్మక ప్రతిభ ఉందని చెప్పడానికి ఇందలి మిర్చీలే నిదర్శనం.. ఎంతో అమూల్య సమయాన్ని వెచ్చించి కవి మిర్చీలు రాశారు.. అదే సమయంలో ఓ మంచి వచన కవితా సంపుటిని ప్రకటించి ఉంటే బాగుండునన్న అభిప్రాయం పాఠకుల్లో కలిగే అవకాశముంది. మున్ముందైనా ఓ మంచి కవితా సంపుటితో అప్పారావుగారు మన ముందుకు రావాలని కోరుకుందాం!

- సాన్వి, కరీంనగర్, 9440525544

--
ఆడపిల్ల

‘ఏంట్రా... ఏం తేలింది?’ ఆత్రంగా అడిగింది మల్లమ్మ.
‘డాక్టర్ అస్సలు చెప్పనన్నారు. రూల్స్ ఒప్పుకోవన్నారు. కేవలం మా సంతోషానికి అంటూ ఎన్నో రకాలుగా అడిగిన మీదట చెప్పారు. మళ్లీ ఆడపిల్లేనట.’
‘అవునా... మరి అట్టాగే పట్టుకొచ్చావ్. కడుపు తీసేయించక...’
‘ఆడపిల్లనగానే తీసేయమంటే ఇంకేమైనా ఉందా.. అబార్షన్‌ని గవర్నమెంట్ నిషేధించింది కూడానూ...’
‘మరి అలాగని ఆ శనిగ్రహాన్ని ఉంచుకుంటానంటావా...’
‘లేదులే... వేరే హాస్పిటల్‌లో తెల్సిన డాక్టరున్నారు.. ఎలాగో నచ్చజెప్పి చేయిస్తాలే... ఏం చేస్తాం?’
‘అసలే మైనసు అంటే మళ్లీ ఇదో బొక్క...’ ఈసడించింది మల్లమ్మ.
వింటున్న భారతి కళ్లల్లో నీళ్లు ఆగకుండా కారిపోతూనే ఉన్నాయి. నిన్ను రక్షించుకోలేని అభాగ్యురాలిని... మన్నించు తల్లీ...’ వౌనంగా రోదించింది.
***
2030 సంవత్సరం... పేపర్ తీసింది భారతి.
‘ఆడపిల్లల కొరత... పెళ్లికూతుళ్ల కోసం పెళ్లికొడుకుల వలస...’
‘మళ్లీ వచ్చిన కన్యాశుల్కం...’
‘ముప్పై లక్షలకు ఆశపడి ఐదఏళ్ల అమ్మాయిని అమ్మేసిన తండ్రి...’
‘వావి వరసలు మరిచి...’
‘మంటగలిసిన మానవత్వం...’
‘అరవై లక్షలకు అమ్ముడుపోయిన మగువ...’
‘ఊపందుకున్న ఆడశిశు విక్రయాలు’
‘ఎటుచూసినా ఏముంది గర్వకారణం... ఆడజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...’
దిగ్గున లేచి కూర్చుంది భారతి. బెడ్‌లాంప్ వెలుతురులో కూతురు, భర్త మంచంపై ఆదమరచి నిద్రపోతున్నారు. అంటే ఇదంతా కలా... ఎంత పీడకల? నిజంగా అందరూ తనలా భ్రూణ హత్యలకు పాల్పడితే తను కన్న కల నిజమవుతుంది. ఆడ మగ నిష్పత్తిలో వ్యత్యాసం వల్ల అసమతుల్యత ఏర్పడి అది ఎంత అరాచకానికి దారితీస్తుంది. ఇక తాను వౌనంగా ఉండకూడదు.
ఇప్పుడు ఆడపిల్ల భారం కాదు. వరం! వారికి ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించిందో... ఆడపిల్లలెలా దూసుకుపోతున్నారో ఇంట్లో వాళ్లకి తెలియజేయాలి. అన్ని రంగాల్లో పరిణతి సాధించిన వారి గురించి వారికి తెలియజెప్పాలి. తనను పరీక్ష చేసిన డాక్టర్లు మాత్రం ఆడవాళ్లు కారా? ఇవన్నీ తాను చెబితే వినకపోతే ఆ డాక్టర్లతోనే చెప్పించాలి. తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబార్షన్ చేయించుకోకూడదు. రాబోయే పరిణామాలను కళ్లకు కట్టినట్లు చెప్పాలి. అబార్షన్‌ని తీవ్రంగా వ్యతిరేకించాలని దృఢంగా నిశ్చయించుకుంది భారతి.
తెల్లవారి వాదోపవాదాలు జరిగాయి. భర్తతో రాత్రే తన బాధను, భవిష్యత్ స్వరూపాన్ని పంచుకోవడంతో రాబోయే కాలంలో ఆడవారికి పెద్దపీట వేస్తున్నారన్న సంగతి చదువుకున్న అతనికి త్వరగానే అర్థమయ్యింది. దానితో తల్లిని ఒప్పించడంలో అతను తన పాత్ర తాను పోషించాడు. దానితో మొత్తానికి ఆ ఆడపిల్లకి ఈ లోకంలో చోటు వచ్చింది.
పెరిగి పెద్దదై శాస్తవ్రేత్తగా మారి నానమ్మ మోకాళ్ల నొప్పులను దూరం చేసే మందు కనిపెట్టిన ఆమెను ముద్దాడుతూ సంబరపడిపోయింది మల్లమ్మ. ఈ బిడ్డనేనా తాను ఆ రోజు వద్దని గొడవ పెట్టుకుంది? వాళ్ల మాట వినకపోతే ఎంత పనయ్యేది? ఒక ఆణిముత్యాన్ని కోల్పోయేవాళ్లం... అనుకుంటూ అప్పటి తన ప్రవర్తనకు తానే సిగ్గుపడింది.
- నామని సుజనాదేవి
వరంగల్, 7799305575
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ఎస్.ఎస్.గుట్ట, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, మహబూబ్‌నగర్ - 509 001. merupumbn@andhrabhoomi.net

---
మనోగీతికలు
---

స్పర్శ

స్పర్శ వర్షించే అనుభూతి
భిన్న హృదయాల ఆవిష్కరణ
అనిర్వచనీయ గీతిక!
ప్రేమ శ్వాసల వెచ్చదనం
ఆర్ద్రత నిండిన అనురాగ వీచిక!
తలనిండ ఆశీర్వాదాల పారిజాతాల చందనం
ఎద నిండ ఎనలేని ఉపశమనం
చీకటి చింతలను చీల్చే
వెలుతురు బాణం!
ధైర్యం నూరిపోసి ప్రహసనం
అనునయించే ముక్తాయింపు
ఉద్రేకాలకు ఉజ్జగింపు
మనోరుగ్మతలకు ఔషధం
‘హీలింగ్ టచ్’..రోగ నిరోధకం!
కల్లోలిత మనఃసముద్రంలో లంగరు
సేద దీర్చే హాయి
జోకొట్టే మాతృ స్పర్శ
సమాంతరం లేని తన్మయత్వం!
పాద స్పర్శ, పెదవి స్పర్శ
హద్దులు దాటకుంటేనే ముద్దు!
- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్, సెల్.నం.7893366363
తుప్పు బతుకులు
వసంతం లేని తడకల బతుకు
శిశిరం ఇడువని గతుకుల బతుకు
మెతుకులు లేక ఎడారి బతుకు
పచ్చని పల్లె పలుగురాళ్ళతో
మిలమిల మెరిసిపోతున్నది
నీళ్ళు లేక భూతల్లి నోరు తెరిసినది
నాగలి కర్రు సిలుముతో ముస్తాబైనది
నీల్లు వోసుకున్న సేను
కాన్పుకు ముందే కనుమూసినది
రైతన్నలవి తుంపర్లు లేని
తుప్పు బతుకులు
కంచం నింపెటోనిది
కన్నీళ్ళ బతుకు!
- కె.పి.లక్ష్మీనరసింహ
తిమ్మాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా
సెల్: 9010645470

హరిత

హారతితో...
వరుణుడి కరుణ కరువై...
పల్లె గొంతులెండుతున్నాయి
పట్టుకునేందుకు...
కుళాయిల్లో నీళ్లు లేక
పట్టణాలు తల్లడిల్లుతున్నాయి!
కుంటలు, చెరువులు వట్టిపోయి
క్రికెట్ మైదానాలను తలపిస్తున్నాయి!
గ్రాసం లేక... పశువులకు
చిత్తు కాగితాలే దిక్కయ్యాయి!
గంగమ్మ తల్లి అలిగి
గగనాన కూర్చుంది!
గలగలలతో
కనువిందు చేసే గోదారమ్మ
నీరు లేక...
విలవిలలాడుతోంది!
ప్రస్తుత పరిస్థితికి...
మన నిర్లక్ష్యమే కారణం!
ఇకనైనా...
విరివిగా చెట్లను పెంచి
కాపాడుకుందాం పర్యావరణం!
పలుకుదాం...
హరిత హారతితో
వరుణుడికి స్వాగతం పలుకుదాం!
- గంప ఉమాపతి,
కరీంనగర్
9849467551

రాట్నం

సుకుమారంగా,
పడుగూ, పేకలు అల్లుకునే
సన్నని దారం చూపుల
నేత కవిత్వం!
పేగు మాడుతున్నా
తెగని పోగుబంధం
అటూ ఇటూ ఆడుతూ
బ్రతుకునీ ఆడిస్తున్న మగ్గం
నాన్న ఇచ్చిన వారసత్వపు
ఉద్యోగం
మహాత్ముడు తిప్పినందుకు కాబోలు
ఇంకా తిరుగుతూనే ఉన్నది
అమ్మ చేతిలో రాట్నం
- గజ్జెల రామకృష్ణ
భూదాన్ పోచంపల్లి, నల్లగొండ జిల్లా
సెల్.నం.8977412795

రోదన

అన్నదాత శవం చూసి
రోదించని రాజ్యముంటదా
అన్నదాత బాధ చూసి
బోరున విలపించని ప్రాణమున్నదా

అన్నదాత శవం చూసి
జోడెద్దులు ఏడుస్తాయి
మా యజమాని ఎక్కడని
అన్నదాత శవం చూసి
తాళితెగిన ఆలి ఇల
తలచి-తలచి ఏడుస్తుంది

అన్నదాత శవం చూసే
ఆసరా కోల్పోయిన అవ్వ కూడా
అనుక్షణం రోదిస్తది
అన్నదాత శవం చూసి
దిక్కును కోల్పోయిన పిల్లంత
దిక్కులన్ని పిక్కటిల్ల మా దిక్కెవరంటూ
వెక్కి వెక్కి ఏడుస్తారు

అన్నదాత శవం చూసి
రాజ్యమేలే రాజు సైతం
రాత్రి-పగలు తేడా లేక
గుండె పగిలి రోదిస్తడు
అన్నదాత శవం చూసి
రాజ్యమంతా రక్తకన్నీరుతో
కుమిలి కుమిలి ఏడుస్తుంది

ఎందుకంటే
ఈ ప్రకృతికి స్పందించే
గుణమున్నది
నా సమాజం మానవత్వమున్న
మనుషులందరి సమూహం

- గంభీరావుపేట యాదగిరి, సిద్దిపేట, 9440617611

పలుకు దివ్వెలు

అక్షరాలను వెదికే కళ్లకు
అవని అంతా వెలుగులే కనబడుతాయి
అక్షరం వెలిగే దీపం
దాని నీడలో తొలగిపోతుంది తాపం
దాని వెలుగులో మాయవౌతుంది పాపం
చూపులు నాటే ప్రతిచోట
అక్షరాలు మొలకెత్తుతూనే ఉంటాయి
అక్షరాలు బీజాలు
అక్షరాలు మొక్కలు, అక్షరాలు తీగలు
అక్షరాలు చెట్లు, అక్షరాలు కాయలు
అక్షరాలు పూలు, అక్షరాలు పండ్లు
‘ఎందెందు వెదకి చూచినా
అందందే’ అక్షరాలు కనబడతాయి
ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాయి
అవీ వెలిగిపోతుంటాయి!!

- డా. అయాచితం నటేశ్వరశర్మ
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా
9440468557